You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'డేరింగ్' ఆపరేషన్ చేసి ఇరాన్ బలగాల నుంచి పైలట్‌ను రక్షించామన్న ట్రంప్, తెహ్రాన్ ఏమందంటే..
ఎఫ్-15 ఈగిల్ విమానాన్ని కూల్చివేసిన తర్వాత ఇరాన్‌లో అదృశ్యమైన సైనిక అధికారిని గుర్తించినట్టు అమెరికా ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు.
ఆ అధికారిని అమెరికా ఎలా గుర్తించిందనేదానిపై పూర్తి వివరాలు లేవు.
అయితే ఈ ఆపరేషన్‌ను దగ్గరగా చూసిన ఒక వ్యక్తి దక్షిణ ఇరాన్‌లో ఒక "భారీ" గాలింపు, సహాయక చర్య నిర్వహించారని బీబీసీతో చెప్పారు.
రెస్క్యూ ఆపరేషన్ సమయంలో అమెరికా, ఇరాన్ బలగాల మధ్య కాల్పులు జరిగాయని బీబీసీ భావిస్తోంది. అలాగే విమానం నుంచి బయటకు దూకుతున్నప్పుడు పైలట్ గాయపడ్డారని కూడా భావిస్తున్నారు.
ట్రంప్ ఏం చెప్పారు?
"అమెరికా సైన్యం చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన గాలింపు, సహాయక చర్యల్లో ఒకదాన్ని నిర్వహించింది. ఇది మన అత్యుత్తమ అధికారి కోసం జరిగింది. ఆయన అనేక పురస్కారాలు పొందిన కల్నల్ కూడా. ఆయన ఇప్పుడు క్షేమంగా ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను.
ఈ ధైర్యవంతుడైన యోధుడు ఇరాన్‌లోని ప్రమాదకరమైన పర్వతాల్లో శత్రువుల చేతిలో చిక్కుకున్నారు. ప్రతి గంటకూ ఇరాన్ సైన్యం తనను సమీపిస్తుండటాన్ని ఆయన చూశారు. కానీ ఆయనెప్పుడూ ఒంటరిగా లేరు. ఎందుకంటే ఆయన కమాండర్-ఇన్-చీఫ్, వార్ సెక్రటరీ, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్, తోటి సైనికులు 24 గంటలూ ఆయన ఆచూకీని పర్యవేక్షిస్తూ రక్షణ ప్రణాళికను రూపొందించారు.
ఆయన్ను తిరిగి తీసుకురావడానికి నా ఆదేశాల మేరకు అమెరికా సైన్యం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధాలు కలిగిన విమానాలను పదుల సంఖ్యలో పంపించింది. ఆయన గాయపడ్డారు. కానీ కోలుకుంటారు. నిన్న మేం విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్‌కు కొనసాగింపుగా ఈ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. కానీ ఇతర అధికారుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లకుండా ఉండాలని మేం దీనిని బయటకు వెల్లడించలేదు.
"విభిన్న ప్రాంతాల్లోని శత్రు భూభాగం నుంచి ఇద్దరు అమెరికా పైలట్లను రక్షించడం ఇదే మొదటిసారి. మేం ప్రతి సైనికుణ్ని రక్షిస్తాం. ఈ రెండు ఆపరేషన్లలోనూ అమెరికా సైనికులెవరూ మరణించలేదు, గాయపడలేదు. ఇరాన్ గగనతలంపై మేం పూర్తి నియంత్రణను సాధించామనడానికి ఇది నిదర్శనం" అని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ రాశారు.
"ఎవరినీ వదిలేసి రాకూడదనేదే సైన్యం నియమం''
అమెరికాలోని ప్రస్తుత, మాజీ అధికారులు సహాయక చర్యల విజయాన్ని సంబరాలు చేసుకుంటున్నారు.
"ఎవరినీ వదిలేసి రాకూడదు అనేది అమెరికా సైన్యం సిద్ధాంతం" అని మిడిల్ ఈస్ట్ రక్షణ శాఖ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ మిక్ ముల్రాయ్ అన్నారు.
"ఆ ప్రధాన నిబద్ధతకు ఈ ఘటన ఒక బలమైన నిదర్శనంగా నిలిచింది" అని ఆయన చెప్పారు.
"అమెరికా సైన్యం, గూఢచార సంస్థలు, ముఖ్యంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించినవారు అమెరికా ప్రజల కృతజ్ఞతకు అర్హులు" అని ఆయన అన్నారు.
అమెరికా ఆపరేషన్‌పై ఇరాన్ ఏమంది?
సెర్చ్ ఆపరేషన్ సమయంలో అమెరికా డ్రోన్‌ను కూల్చివేశామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్‌జీసీ) ప్రతినిధి చెప్పినట్టు ఇరాన్ మీడియా తెలిపింది.
ఫార్స్ న్యూస్ ఏజెన్సీ, ఐఆర్‌జీసీ అనుబంధ తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ కథనాల ప్రకారం ఐఆర్‌జీసీ ప్రజా సంబంధాల కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, ఆ డ్రోన్ ఇరాన్‌లోని దక్షిణ ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లో కూలిపోయింది.
అయితే ఈ రిపోర్టులపై అమెరికా నుంచి ఇంకా ఎలాంటి ధ్రువీకరణ రాలేదు.
బందీల విడుదల కోసం గతంలో అమెరికా రాజీమార్గాలు
తప్పిపోయిన అధికారి ఇరాన్‌కు చిక్కి ఉంటే అది యుద్ధంలో తీవ్ర పరిణామాలకు దారితీసి ఉండేదని భావిస్తున్నారు.
ఇది గతంలో జరిగింది. 1979లో అమెరికా దౌత్యవేత్తలను ఇరాన్ 444 రోజుల పాటు బందీలుగా పట్టుకుంది.
అప్పుడు బందీల విడుదలకు ప్రతిగా అమెరికా ఇరాన్‌పై కొన్ని ఆంక్షలను ఎత్తివేసి, ఎనిమిది బిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ ఆస్తుల జప్తును ఎత్తివేసింది.
2014లో బరాక్ ఒబామా ప్రభుత్వం కూడా తమ సైనికుల్లో ఒకరిని కాపాడటానికి ఒక ఒప్పందం చేసుకుంది.
2009లో అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు బందీగా పట్టుకున్న తమ సైనికుడు బోవ్ బెర్గ్‌డాల్ విడుదలకు బదులుగా అమెరికా ఐదుగురు తాలిబన్ ఖైదీలను విడుదల చేసింది.
ఎఫ్-15 విమానం కూలిపోవడం అమెరికాకు పెద్ద దెబ్బగా భావిస్తారు.
‘‘ఇరాన్ వైమానిక భద్రత ఎంతగా బలహీనమైందంటే, అది అమెరికా విమానాలకు వ్యతిరేకంగా ఏమీ చేయలేదు’’ అని డోనల్డ్ ట్రంప్ అన్నారు.
అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా ఇరాన్‌పై అమెరికా 'గగనతల ఆధిపత్యం' సాధించిందని పేర్కొన్నారు.
అయితే ఎఫ్-15 ఈగిల్ ఘటన పరిమిత స్థాయిలోనైనా ఇరాన్ తన గగనతలాన్ని కాపాడుకోగల శక్తిమంతురాలు అన్నది స్పష్టం చేస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)