స్ట్రెయిట్, బే, గల్ఫ్: సముద్రాలలో ఇవన్నీ ఏమిటి? వీటి మధ్య తేడాలేంటి?

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • చదివే సమయం: 6 నిమిషాలు

స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్, బే ఆఫ్ బెంగాల్, పర్షియన్ గల్ఫ్ వంటి పేర్లు వినే ఉంటారు, వాటిని ప్రపంచపటంలో చూసే ఉంటారు.

వీటిలో ఇటీవల వార్తల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్.

అక్కడ ఉద్రిక్తత పెరిగినప్పుడల్లా ప్రపంచ చమురు సరఫరా గురించి చర్చ మొదలవుతుంది. గల్ఫ్, బే కూడా తరచుగా వినిపిస్తూనే ఉంటాయి.

అసలు ఏమిటీ స్ట్రెయిట్? గల్ఫ్ అని దేనిని అంటారు? బే అంటే అర్థమేంటి? వీటి మధ్య తేడాలేంటి?

ఈ పేర్లు ఎలా వచ్చాయి?

ప్రపంచపటం చూస్తే సముద్రం, బే(అఖాతం), గల్ఫ్(సింధుశాఖ), స్ట్రెయిట్(జలసంధి) అన్నీ ఒకేలా కనిపిస్తాయి.

కానీ, భౌగోళిక శాస్త్ర ప్రకారం అవన్నీ ఒకటి కాదు. నీటి భాగం ఆకారం ఎలా ఉంది? దాని చుట్టూ భూభాగం ఎంతవరకు ఉంది? సముద్రంతో అది ఎలా కలుస్తోంది? వంటి లక్షణాల ఆధారంగా పేర్లు మారుతాయి.

అందుకే ఒక చోట బే, మరో చోట గల్ఫ్, ఇంకొక చోట స్ట్రెయిట్ అనే పేర్లు కనిపిస్తాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ మాజీ డైరెక్టర్ డాక్టర్ కేఎస్ఆర్ మూర్తి తెలిపారు.

ఈ విషయాలపై బీబీసీతో మాట్లాడారు డాక్టర్ మూర్తి. ఆయన అందించిన సమాచారం ప్రకారం..

"ఈ పేర్ల వెనుక కోట్ల ఏళ్ల భౌగోళిక చరిత్ర ఉంది. ఒకప్పుడు భూమిపై ఖండాలన్నీ దగ్గరగా కలిసిన ఒకే భూభాగంలా ఉండేవి. తరువాత భూమి అంతర్భాగంలో జరిగిన మార్పుల వల్ల పగుళ్లు ఏర్పడ్డాయి. భూమి పైపొర పెద్ద పెద్ద భూఫలకాలుగా ఉంటుంది. ఇవి కదులుతూ ఉండే ప్రక్రియనే ప్లేట్ టెక్టానిక్స్ అంటారు. ఈ భూఫలకాల కదలికల వల్ల ఖండాలుగా విడిపోయాయి."

"భూమి లోపల ఒత్తిడి పెరిగిన చోట పైపొరలో చీలికలు ఏర్పడతాయి. వీటినే ఫాల్ట్ జోన్స్ అంటారు. ఈ చీలికల మధ్య సముద్రపు నీరు చేరి గల్ఫ్‌, బే, స్ట్రెయిట్స్ ఏర్పడ్డాయి’ అని డాక్టర్ మూర్తి తెలిపారు.

స్ట్రెయిట్ - ఇరుకైన దారి

ఇటీవల కాలంలో నిత్యం చర్చల్లో ఉంటున్న హార్ముజ్ జలసంధి ( స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్) కూడా ఇలా ఏర్పడిందే.

ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఒక ఇరుకైన సముద్ర మార్గం హార్ముజ్ జలసంధి. అక్కడ ఉద్రిక్తత పెరిగినప్పుడల్లా ప్రపంచ మార్కెట్లపై ప్రభావం కనిపిస్తుంది.

స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనేది ఇరాన్, యూఏఈ, ఒమెన్ దేశాల మధ్యలో ఉన్న సన్నని సముద్ర మార్గం.

ఒక వైపు పర్షియన్ గల్ఫ్ , మరో వైపు గల్ఫ్ ఆఫ్ ఒమెన్ ఉంటాయి.

ఈ రెండింటిని కలిపే సన్నటి ఇరుకైన దారి ఇదే. అందుకే దీనిని "స్ట్రెయిట్ " అంటారు.

రెండు పెద్ద నీటి భాగాలను కలిపే సన్నని సహజ జల మార్గమే స్ట్రెయిట్ లేదా జలసంధి అని డాక్టర్ మూర్తి చెప్పారు.

బే అంటే ఏమిటి?

మూడు వైపులా భూభాగం కొంతవరకు చుట్టుముట్టి, ఒక వైపు సముద్రానికి విస్తారంగా తెరుచుకుని ఉండే నీటి భాగాన్ని బే అంటారు. సముద్రం భూమిలోకి కొంతవరకు లోపలికి వచ్చినట్టుగా దీని ఆకారం కనిపిస్తుంది.

బంగాళాఖాతం (బే ఆఫ్ బెంగాల్), అమెరికాలోని శాన్ ప్రాన్సిస్కో బే అందుకు ఉదాహరణలు.

బే సాధారణంగా వెడల్పుగా ఉంటుంది. ఇరుకుగా ఉండవు. కొన్ని బేల్లో పెద్ద నదులు చేరుతాయి కాబట్టి అక్కడ మట్టి ఎక్కువగా పేరుకుపోతుంది. ఉదాహరణకు బే ఆఫ్ బెంగాల్‌లోకి గోదావరి, కృష్ణా వంటి నదులు కలుస్తాయి.

బే కూడా సముద్రపు భాగమే. బంగాళాఖాతం ఉదాహరణగా తీసుకుంటే ఇది భారత్, బంగ్లాదేశ్, మియన్మార్ మధ్య విస్తరించిన భారీ సముద్ర భాగం.

గల్ఫ్ అంటే..

గల్ఫ్ సాధారణంగా బేతో పోలిస్తే లోతుగా ఉంటుంది. చుట్టూ భూభాగం ఎక్కువగా ఉండి, సముద్రంతో కలిసే భాగం సన్నగా ఉండొచ్చు. పర్షియన్ గల్ఫ్ దీనికి ఉదాహరణ.

కొన్ని గల్ఫ్‌లు ఫాల్ట్ లైన్స్ వెంట ఏర్పడటంతో అవి పొడవుగా కనిపిస్తాయి.

సాధారణంగా బేలో సముద్రం భూమిలోకి వచ్చినట్లైతే, గల్ఫ్‌లో భూమే సముద్రాన్ని తనలోకి తీసుకున్నట్లుంటుంది.

చానల్, కెనాల్ మధ్య తేడా ఏమిటి?

చానల్ అనేది నీటి ప్రవాహానికి సహజంగా ఉన్న దారి లేదా నౌకలు సులభంగా ప్రయాణించే మానవ నిర్మిత మార్గం. కొన్ని చానళ్లు నదులు, సముద్రాలు, దీవుల మధ్య సహజంగా ఏర్పడతాయి. మరికొన్ని చోట్ల నీటి లోతు పెంచి, వెడల్పు చేసి నౌకాయానానికి అనుకూలంగా మారుస్తారు.

ఉదాహరణకు ఇంగ్లిష్ చానల్ సహజంగా ఏర్పడిన చానల్.

సూయజ్ కెనాల్ పూర్తిగా మానవ నిర్మితం. ఇది ఎర్ర సముద్రాన్ని (రెడ్ సీ) మధ్యదరా సముద్రం( మెడిటేరేనియన్ సీ)తో నేరుగా కలుపుతుంది. దీని వల్ల ఆఫ్రికా ఖండం చుట్టూ తిరగకుండా యూరప్-ఆసియా మధ్య నౌకాయానం చాలా వేగంగా మారింది. ప్రపంచ వాణిజ్యంలో దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

లాగూన్ అంటే సముద్రంతో స్వల్ప సంబంధం మాత్రమే ఉన్న, ఎక్కువ భాగం భూభాగం లేదా ఇసుక తిన్నెలతో వేరుపడిన నీటి భాగం. పూర్తిగా సముద్రం కాదు, పూర్తిగా సరస్సు కూడా కాదు.

సాధారణంగా సముద్ర అలలతో ఏర్పడిన ఇసుక బార్లు లేదా తీర భూభాగం వల్ల నీరు ఒక ప్రాంతంలో ఆగిపోతుంది. ఒడిశాలోని చిల్కా లేక్ ఇందుకు ఉదాహరణ.

సముద్రంతో చిన్న మార్గం ద్వారా సంబంధం ఉండటం వల్ల ఇక్కడి నీటిలో ఉప్పుతనం కాలానుగుణంగా మారుతూ ఉంటుంది.

ఓషన్, సీ రెండూ ఒకటేనా?

మహాసముద్రం(ఓషన్), సముద్రం(సీ) రెండూ ఉప్పునీటి భాగాలే అయినప్పటికీ, వాటి పరిమాణం, విస్తీర్ణం, చుట్టూ ఉన్న భూభాగం ఆధారంగా వేరవుతాయి.

సాధారణంగా మహాసముద్రం అంటే, భూగ్రహంపై అత్యంత భారీస్థాయిలో విస్తరించిన పెద్ద నీటి భాగం. ఇవి ఖండాల మధ్య విస్తరించి ఉంటాయి. ప్రపంచ వాతావరణం, సముద్ర ప్రవాహాలు, ఉష్ణోగ్రతలపై భారీ ప్రభావం చూపుతాయి.

ఉదాహరణకు పసిఫిక్ ప్రపంచంలోనే అతి పెద్ద మహాసముద్రం. అలాగే హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం కూడా ఖండాలను వేరుచేసే భారీ నీటి వ్యవస్థలే.

ఇక సముద్రం అంటే, సాధారణంగా మహాసముద్రం కంటే పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. ఇవి చాలా సందర్భాల్లో ఖండాలకు దగ్గరగా, కొంతవరకు భూభాగంతో చుట్టుముట్టబడి ఉంటాయి. ఉదాహరణకు అరేబియన్ సముద్రం, బంగాళాఖాతం రెండూ హిందూ మహాసముద్రంలో భాగాలే.

ఇదే మాదిరిగా ఎర్ర సముద్రం, నల్ల సముద్రం కూడా ప్రత్యేక పేర్లు ఉన్నప్పటికీ చివరికి మహాసముద్రాలతో అనుసంధానమై ఉంటాయి.

పేర్ల వెనుక చరిత్ర..

‘వేర్వేరు పేర్లతో ప్రపంచ పటంలో నీటి భాగమంతా ఒకే నీలం రంగులో కనిపించినా, ప్రతి నీటి భాగం వెనుక కోట్ల ఏళ్ల భూమి చరిత్ర ఉంటుంది.

భూమి కోట్ల సంవత్సరాలుగా మారుతూ వచ్చిన క్రమంలో సముద్రపు ఆకారాలు, భూభాగపు ఒత్తిళ్లు, టెక్టానిక్ మార్పులు కలిపి ఇవి ఏర్పడ్డాయి.

బే, గల్ఫ్‌, స్ట్రెయిట్‌ వంటి నీటి భాగాలు లక్షల నుంచి కోట్ల ఏళ్ల పాటు జరిగిన సహజ భౌగోళిక మార్పుల ఫలితం. భూమి పైపొర కదలికలు, ఖండాలుగా వేరవడం, సముద్ర మట్టాల్లో మార్పులు, నదులు తెచ్చే మట్టి ఇవన్నీ కలిసి వాటి ఆకారాన్ని రూపొందిస్తాయి.

అందుకే మనుషులు బేను లేదా గల్ఫ్‌ను కొత్తగా సృష్టించలేరు.

అవసరమైతే నీటి మార్గాలను మనుషులు తవ్వి రూపొందించగలరు. వాటినే కెనాల్స్ అంటారు. సూయజ్ కెనాల్, పనామా కెనాల్ వంటివి. ఇవి ప్రపంచ వాణిజ్యంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి’ డాక్టర్ కేఎస్ఆర్ మూర్తి తెలిపారు.

"సహజ నీటి భాగాలు కూడా శాశ్వతంగా ఒకేలా ఉండవు. గాలి, తీరం కోత, సముద్ర మట్టం పెరగడం, నదులు తెచ్చే మట్టి పేరుకుపోవడం వల్ల వాటి ఆకారాలు నెమ్మదిగా మారుతుంటాయి" అని డాక్టర్ కేఎస్ఆర్ మూర్తి బీబీసీతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)