1970ల నాటి చమురు సంక్షోభం ఏంటి? అంతకంటే దారుణ పరిస్థితులను ఎదుర్కోబోతున్నామా?

    • రచయిత, రేచల్ క్లున్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 5 నిమిషాలు

చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధిని నెల రోజులుగా మూసివేయడంతో ప్రపంచ దేశాలు 1970ల నాటి చమురు సంక్షోభం కన్నా తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే దిశలో ఉన్నాయనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల ప్రభావం 1970ల నాటి ఆర్థిక గందరగోళం కంటే చాలా తీవ్రంగా ఉండొచ్చని, నౌకా రవాణా నిపుణుడు, మేర్స్క్ మాజీ డైరెక్టర్ లార్స్ జెన్సెన్ బీబీసీతో చెప్పారు.

"చరిత్రలోనే అత్యంత పెద్దదైన ఇంధన భద్రతా ముప్పును ప్రపంచం ఎదుర్కోనుంది" అని అంతర్జాతీయ ఇంధన సంస్థ డైరెక్టర్ ఫతి బిరోల్ హెచ్చరికల నేపథ్యంలో జెన్సెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘1970లలో మనం ఎదుర్కొన్న చమురు ధరల పెరుగుదలకంటే ఇది చాలా పెద్దది. యుక్రెయిన్ మీద రష్యా దాడి తర్వాత పెరిగిన సహజవాయువు ధర కంటే కూడా ఇది పెద్దది" అని ఆయన బీబీసీతో చెప్పారు.

హార్ముజ్ జలసంధి మూసివేత వల్ల చమురు రవాణాకు అంతరాయం ఏర్పడినప్పటికీ, ప్రస్తుత ప్రపంచానికి ఆ ప్రభావాన్ని తట్టుకునే శక్తి ఉందనేది కొందరి అభిప్రాయం.

1970లలో ఏం జరిగింది?

1970ల నాటి చమురు సంక్షోభం ఉద్దేశపూర్వక విధాన నిర్ణయాల ఫలితమని బీబీసీతో ఆర్థికవేత్త డాక్టర్ కరోల్ నఖ్లే చెప్పారు. అందుకే ఇది ఇప్పటి సంక్షోభంకన్నా భిన్నమైనది.

యోమ్‌ కిప్పూర్ యుద్ధసమయంలో ఇజ్రాయెల్‌కు అండగా నిలిచినందుకు అమెరికా నేతృత్వంలోని కూటమిలో భాగస్వాములైన దేశాలపై అరబ్ చమురు ఉత్పత్తిదారులు 1973 అక్టోబరులో నిషేధం విధించారు. దీంతోపాటుగా చమురు ఉత్పత్తిలోనూ కోతలు అమల్లోకి వచ్చాయి.

"దీని ఫలితంగా కొన్ని నెలల్లోనే చమురు ధరలు నాలుగు రెట్లు పెరిగాయి" అని నఖ్లే చెప్పారు. ఇది చమురు భారీగా వినియోగించే దేశాలలో రేషనింగ్‌కు దారితీసింది. దీనివల్ల ప్రపంచ ఆర్థిక, ద్రవ్య వ్యవస్థలు కుప్పకూలాయని నఖ్లే అన్నారు.

"చమురు ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం పెరిగింది. దీని వల్ల వ్యాపారాలు తగ్గి నిరుద్యోగం మరింతగా పెరిగింది" అని బెల్‌ఫాస్ట్‌లోని క్వీన్స్ యూనివర్సిటీలో పరిశోధకుడు డాక్టర్ టియర్నాన్ హీనీ చెప్పారు.

"దీనివల్ల అనేక దేశాల్లో సామాజిక నిర్మాణం దెబ్బతింది. సమ్మెలు, అశాంతి, పేదరికం పెరిగింది. అనేక కుటుంబాలకు రోజు గడవటం కష్టంగా మారింది. సంక్షోభం వల్ల ఏర్పడిన సమస్యలు తీవ్రం అయ్యాయి" అని ఆయన వివరించారు.

అమెరికా, బ్రిటన్‌లలో 1973లో ఏర్పడిన మాంద్యం 1975 వరకు కొనసాగింది. సంక్షోభం కారణంగా 1974లో టెడ్ హీత్ నాయకత్వంలోని కన్సర్వేటివ్ ప్రభుత్వం కూలిపోయింది.

మిడిల్ ఈస్ట్‌లో ఏం జరుగుతోంది?

ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా దాడి చేసిన తర్వాత హార్ముజ్ జలసంధిని మూసివేశారు.

దీంతో గల్ఫ్ దేశాల నుంచి వచ్చే చమురు, సహజవాయువు రవాణాకు అంతరాయం ఏర్పడింది.

దీన్ని పునరుద్ధరించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చమురు రవాణా నౌకలను రక్షణ కోసం ముందుకు రావాలని మిత్రదేశాలను కోరడంతో పాటు అనేక రకాల వ్యూహాలను ప్రయత్నించారు. హార్ముజ్ గుండా వెళ్లే నౌకలను సజావుగా సాగనీయకుండా చేస్తే ఇరాన్‌పై తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

నెలరోజుల కంటే ముందు బయల్దేరిన చమురులో ఎక్కువ భాగం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిఫైనరీలకు చేరుతోంది. ఇది త్వరలోనే ఆగిపోతుందని జెన్సెన్ అన్నారు.

"ఏదో అద్భుతం జరిగి రేపే హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచినా, మనం ఎదుర్కొంటున్న చమురు కొరత మరింత తీవ్రం అవుతుంది" అని ఆయన చెప్పారు.

"ఈ సంక్షోభం కొనసాగుతున్నప్పుడే కాదు. ఇది ముగిసిన ఏడాది వరకు మనం పెట్రోల్, డీజిల్, గ్యాస్ కోసం భారీగా చెల్లించాల్సి రావచ్చు" అని జెన్సెన్ అన్నారు.

ఈ సంక్షోభం 1970ల కన్నా పెద్దదవుతుందా?

చమురు మార్కెట్‌ ప్రస్తుతం 1970లతో పోలిస్తే చాలా వైవిధ్యంగా ఉంది. అదే సమయంలో అప్పటితో పోలిస్తే ఇప్పుడు చమురు వినియోగం కూడా గణనీయంగా తగ్గిందని అరబ్ ఎనర్జీ క్లబ్‌కు ప్రధాన కార్యదర్శిగా ఉన్న నఖ్లే చెప్పారు.

ప్రస్తుతం ముడి చమురు ధర బాగా ఎక్కువగా ఉందని, కానీ ఇప్పటి సంక్షోభం అంత తీవ్రమైనది కాదని ఆమె అన్నారు.

"ఇప్పుడు మనం చూస్తున్న అంతరాయాలు పెద్దవే కావచ్చు. బహుశా ఇటీవలి చరిత్రలో ఇది అత్యంత భారీదని అనుకోవచ్చు. అయినప్పటికీ 1970లతో పోలిస్తే ఇప్పుడు మార్కెట్‌కు కఠిన పరిస్థితుల్ని తట్టుకుని నిలబడే శక్తి ఉంది" అని ఆమె చెప్పారు.

"ఇది మరింత వైవిధ్యభరితమైనది. చమురుపై తక్కువ ఆధారపడేది. అత్యవసర పరిస్థితుల కోసం అవసరమైనన్ని నిల్వలు ఉన్నాయి" అని నఖ్లే అన్నారు.

నాటిక్సిస్ కార్పోరేట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లో డైరెక్టర్ ఆఫ్ కమోడిటీస్ రీసర్చ్ డైరెక్టర్‌గా ఉన్న జోయెల్ హాన్‌కాక్ మరో ముఖ్యమైన వ్యత్యాసం గురించి చెబుతున్నారు.1970ల నాటి సంక్షోభం అభివృద్ధి చెందిన దేశాలను లక్ష్యంగా చేసుకుంది. దీన్నితట్టుకునేందుకు వాటి వద్ద రాజకీయ శక్తి, డబ్బు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

‘‘ప్రస్తుత సంక్షోభం అభివృద్ధి చెందుతున్న దేశాలను ప్రభావితం చేస్తుంది. వాటి దగ్గర సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సరైన వ్యవస్థలు, నిధులులేవు" అని ఆయన అన్నారు.

ఇప్పటిలా 1970లో ఇంధనరంగంలో మౌలిక వసతులకు నష్టమేమీ జరగలేదు.

యుద్ధం ఆగిపోతేనే ఈ సంక్షోభం సమసిపోతుందని హాన్‌కాక్ చెప్పారు.

మన ఆర్థిక వ్యవస్థలపై అవగాహన, చమురు నిల్వలున్న దేశాల సంఖ్య పెరగడం లాంటి అంశాలు ప్రస్తుతం అనుకూలంగా ఉన్నాయని హీనీ అన్నారు.

"పెద్ద సమస్య ఏంటంటే ఈ సంక్షోభం దీర్ఘకాలం కొనసాగితే భవిష్యత్ అంచనాలు తలకిందులవుతాయి" అని ఆయన చెప్పారు.

"ఈ యుద్ధాన్ని త్వరగా ముగించి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడమే అత్యుత్తమ పరిష్కారం" అని హీనీ అభిప్రాయ పడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)