‘‘నా మాజీ భర్తే నా డీప్‌ఫేక్ అశ్లీల వీడియోలను ఆన్‌లైన్‌లో పెట్టాడు’’-ఆరోపించిన టీవీ స్టార్

    • రచయిత, జెసికా పార్కర్, క్రిస్టినా వోల్క్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • చదివే సమయం: 5 నిమిషాలు

జర్మనీని కుదిపేస్తోన్న స్టోరీ ఇది. దీనివల్ల, ప్రముఖ టీవీ నటి ఒకరు హామ్‌బర్గ్‌లో వేలాది మంది నిరసనకారుల ఎదుట వేదికపై నిల్చుని, తనకు వస్తోన్న ప్రాణహాని బెదిరింపులతో బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ను ఎలా ధరించాల్సి వచ్చిందో చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

కొలియన్ ఫెర్నాండెజ్(44) తన మాజీ భర్త క్రిస్టియన్ ఉల్మెన్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన వీడియోలను డీప్‌ఫేక్‌ ద్వారా అశ్లీలంగా మార్చి ఆన్‌లైన్‌లో వ్యాప్తి చేస్తున్నారని అన్నారు.

జర్మన్ న్యూస్ మేగజీన్ డెర్ స్పీగల్ ఈ సంచలనాత్మక ఆరోపణలను ప్రచురించింది. ఆమె చేసిన ఈ ఆరోపణలు నిరసనలకు, చట్టాన్ని కఠినతరం చేస్తామని వాగ్దానాలను నిలబెట్టుకోవాలనే డిమాండ్లకు తెరతీసింది.

అలాగే, చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ దీనిపై స్పందించిన తీరు కూడా తీవ్ర విమర్శలకు గురైంది. ఫెర్నాండెజ్ మాజీ భర్త క్రిస్టియన్ ఉల్మెన్ ఈ ఆరోపణలను ఖండించారు.

ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదు.

ఈ సంచలనాత్మక ఆరోపణలను తెరమీదకు తీసుకొచ్చిన మేగజీన్‌పై ఆయన న్యాయ పోరాటానికి కూడా దిగారు.

ఫెర్నాండెజ్ లేదా మరే ఇతర వ్యక్తులకు చెందిన డీప్‌ఫేక్ వీడియోలను ఉల్మెన్ రూపొందించలేదని, వ్యాప్తి చేయలేదని ఆయన తరఫున వాదించే ఉన్నత స్థాయి మీడియా లాయర్లు క్రిస్టియన్ షెర్ట్జ్, సిమోన్ బెర్గ్‌మాన్‌లు బీబీసీకి చెప్పారు.

ఈ ఆరోపణలన్నీ కూడా అబద్ధమని అన్నారు.ఫెర్నాండెజ్, ఉల్మెన్ మధ్య ఏం జరిగిందో దానికి, డీప్‌ఫేక్ అశ్లీల చిత్రాలకు సంబంధించిన క్రిమినల్ చట్టంలోని చట్టపరమైన లొసుగుల చుట్టూ జరుగుతున్న చర్చకు పూర్తిగా సంబంధం లేదని వారు వాదిస్తున్నారు.

ఉల్మెన్, ఫెర్నాండెజ్‌లు ఎన్నో ఏళ్లుగా ప్రముఖ, టీవీ సెలబ్రిటీ కపుల్‌గా పేరు పొందారు. టీవీ వ్యాఖ్యాతలుగా వ్యవహరించేవారు, ప్రొడక్షన్ చేపట్టారు. రచనలు చేశారు. ఇద్దరు కలిసి నటించారు.

ఈ జంట ప్రజాదరణ ఉన్న నటీనటులు కావడం వల్లనే.. ఈ వ్యవహారం జర్మనీని అంతలా ఆకర్షించిందని కొంతమేర చెప్పొచ్చు.

అయితే, ఈ కేసు ఫలితాన్ని పక్కన పెడితే.. క్రిమినల్ చట్టంలో లోపాలు ఉన్నాయని నిరసనకారుల నుంచి వస్తోన్న ఆగ్రహం కూడా దీని ద్వారా బయటపడింది.

అంగీకారం లేకుండా లైంగిక డీప్‌ఫేక్‌లను రూపొందించడం, వ్యాప్తిచేయడం కూడా స్పష్టమైన నేరంగా పరిగణించాలని కోరుతూ 250 మంది సభ్యులున్న మహిళల బృందం ఒకటి 10 రకాల డిమాండ్లను విడుదల చేసింది.

ఈ మహిళా బృందంలో రాజకీయ, వ్యాపార, సాంస్కృతిక రంగాలకు చెందిన వారున్నారు.

ఈ గ్రూప్‌లో మితవాద వామపక్ష ఎస్‌డీపీ పార్టీకి చెందిన కార్మిక మంత్రి బార్బెల్ బాస్, ర్యాపర్ ఇక్కిమెల్, పర్యావరణ కార్యకర్త లూయిసా న్యూబౌర్ వంటివారున్నారు.

అశ్లీల డీప్‌ఫేక్‌లను రూపొందించడం, వ్యాప్తి చేయడం తీవ్రమైన నేరంగా పరిగణించేలా.. చట్టంలో మార్పులు చేపడతామని కేంద్ర న్యాయ మంత్రి స్టెఫానీ హుబిగ్ ప్రకటించారు.

జర్మన్ మీడియా విడుదల చేసిన డ్రాఫ్ట్ ప్రణాళికలో ఈ నేరానికి రెండేళ్ల పాటు జైలు శిక్షలు విధించనున్నారు.

ప్రస్తుతం జర్మన్ చట్టాల ప్రకారం.. ఎవరైనా తమ సొంత ఇమేజ్‌ను పెంచుకునేందుకు వేరేవారి హక్కులను ఉల్లంఘించినట్లు గుర్తిస్తేనే.. అలాంటి చిత్రాలను వ్యాప్తి చేయడం శిక్షార్హమైన నేరంగా పరిగణించేవారు.

గురువారం రాత్రి తన స్వస్థలమైన హామ్‌బర్గ్‌లో గుమిగూడిన వేలాది మంది నిరసనకారుల ఎదుట ఫెర్నాండెజ్ మాట్లాడుతూ.. తన ఆరోపణలు బహిరంగమైనప్పటి నుంచి తాను ఎదుర్కొన్న వేధింపులను వివరించారు.

''నేను ఇక్కడకు పోలీసుల సంరక్షణలో బుల్లెట్‌ప్రూప్ జాకెట్‌తో రావాల్సి వచ్చింది. ఎందుకంటే, నన్ను వారు చంపాలనుకుంటున్నారు'' అని చెప్పారు.

తన నకిలీ, అశ్లీల చిత్రాలను ఆన్‌లైన్‌లో వ్యాప్తి చేశానని తన మాజీ భర్త 2024 క్రిస్మస్ రోజు ఒప్పుకున్నారని ఆమె ఆరోపించారు.

''ఒక మరణవార్త విన్నట్లుగా అనిపించింది'' అని డెర్ స్పీగల్‌తో చెప్పారు. ''నేను మాట్లాడలేకపోయాను, ఏడవలేకపోయాను'' అని తెలిపారు.

ఈ ఆరోపణలను ఉల్మెన్ న్యాయవాది షెర్ట్జ్ కొట్టివేశారు. ఉల్మెన్ గురించి చెప్పినవి పూర్తిగా అసంపూర్ణమైనవి, తప్పుడువని అన్నారు. న్యాయపరమైన చర్యలకు లోబడి ఉన్నాయని పేర్కొన్నారు.

అంతకుముందు తనకు బెదిరింపులు, వేధింపులు వస్తున్నట్లు ఈ జంట సహజీవనం చేసిన స్పెయిన్‌లో ఫెర్నాండెజ్ ఫిర్యాదు చేశారు.

మరోవైపు ఫెర్నాండెజ్ పరిస్థితిని వివరించిన తీరును ఉల్మెన్ న్యాయవాదులు తిరస్కరించారు. తమ క్లయింట్‌ను ఏకపక్షంగా నిందించడం సరైందని కాదన్నారు.

జర్మనీతో పోలిస్తే స్పెయిన్‌లో జెండర్ ఆధారిత హింసకు కఠినమైన చట్టాలు ఉండటంతో అక్కడ ఫిర్యాదు చేసినట్లు జర్మన్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ఏఆర్‌డీకి ఈ టీవీ ప్రజెంటర్ చెప్పారు. జర్మనీని ఆమె నేరస్తులకు స్వర్గధామంగా పేర్కొన్నారు.

ఏఐ జనరేట్ చేసిన పోర్న్‌కు ఆమె బాధితురాలనే విషయంలో ఎలాంటి వివాదం లేదు. ఆన్‌లైన్ వేధింపులకు గురయ్యానంటూ ఆమె చేసిన ఆరోపణలు కొత్తవేమీ కావు.

అంతకుముందు డీప్‌ఫేక్ పోర్న్: డిజిటల్ అబ్యూస్ పేరుతో విడుదల చేసిన 2024 జెడ్‌డీఎఫ్ డాక్యుమెంటరీలో ఆమె దీని గురించి మాట్లాడారు.

ఉల్మెన్ ఒప్పుకున్నట్లు ఆమె ఆరోపించడానికి నెల ముందు అంటే 2024 నవంబర్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై ఫెర్నాండెజ్ జర్మనీలో క్రిమినల్ కంప్లైంట్ దాఖలు చేశారు.

స్పీగల్ రిపోర్టు నేపథ్యంలో జర్మనీలో దర్యాప్తును తిరిగి ప్రారంభించినట్లు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

ఫెర్నాండెజ్ పేరుతో నకిలీ అకౌంట్లు ఎలా సృష్టిస్తున్నారన్న విషయంలో ఎలాంటి ఆధారాలు దొరకపోవడంతో గత జూన్‌లో మునపటి విచారణను ఆపివేసినట్లు హామ్‌బర్గ్‌కు సమీపంలోని చిన్న పట్టణం ఇట్జెహోకు చెందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫీస్ తెలిపింది.

ఫెర్నాండెజ్ చేసిన ఆరోపణలు చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌పై తీవ్ర రాజకీయ ఒత్తిడి తెచ్చాయి. యువ, మహిళా ఓటర్ల విషయానికి వచ్చే సరికి మెర్జ్ పట్టించుకోవడం లేదని చాలాకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు ఆయన్ను స్త్రీలకు పెద్ద సమస్యగా కూడా విమర్శకులు ఆరోపించారు.

మహిళలపై జరుగుతున్న హింస గురించి బుధవారం మెర్జ్‌ను పార్లమెంట్‌లో ప్రశ్నించగా.. ఫిజికల్‌గా, డిజిటల్ రూపాల్లో హింస తీవ్రంగా పెరిగిపోయిందని అన్నారు. వలస గ్రూప్‌ల నుంచి ఈ హింస ఎక్కువగా వస్తుందని చెప్పారు.

అయితే, ఆయన వ్యాఖ్యలు సరికాదని కొందరు అంటున్నారు. లెఫ్ట్ పార్టీ క్లారా బంగర్‌ జర్మన్ టీవీతో మాట్లాడుతూ.. ''మహిళలపై హింసకు వలసలే కారణమని ఎవరైతే అంటారో, వారు నిర్మాణాత్మక హింసను ఎదుర్కోవడానికి బదులుగా దాని తీవ్రతను తగ్గించి చూస్తున్నారు" అని అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)