'గినీ ఆంటీ': లండన్ సబ్‌వేలో పరిచయమైన వ్యక్తికి అండాలు దానం చేసిన మహిళ, ఈ కథలో మలుపులు ఏంటంటే..

    • రచయిత, విక్టోరియా కుక్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 6 నిమిషాలు

లండన్‌లోని అండర్‌గ్రౌండ్ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా గినీ భోగాల్ ముఖంపై చిరునవ్వులు విరుస్తాయి. ఎందుకంటే ఆ ప్రయాణమే ఆమె జీవితాన్ని మార్చేసింది.

అది 1990ల ప్రారంభం. ఆ రోజు గినీ తన స్నేహితులతో కలిసి, పికడిలీ లైన్‌లో కిక్కిరిసి ఉన్న సబ్‌వేలోకి రైలు ఎక్కేందుకు వెళ్లారు.

ఓ అబ్బాయి చేస్తున్న అల్లరితో అక్కడున్నవారంతా నవ్వుతున్నారు. ఆ నవ్వులే గినీ తన పక్కనున్న మహిళతో మాటలు కలిపేందుకు దారి తీశాయి. ఆమె పేరు అనిత.

కొద్దిసేపటి తర్వాత… వాళ్ల ముచ్చట పిల్లలవైపు మళ్లింది. గినీ తన రెండేళ్ల కుమారుడి గురించి చెప్పారు. ఆ సందర్భంలోనే, తన అండాల్లో ఉన్న సమస్య వల్ల పిల్లలు కలగడం లేదని, దాత కోసం ఎదురుచూస్తున్నానని గినీకి చెప్పారు అనిత. అది విన్న గినీ, ఆమెకు సాయం చేయాలనుకున్నారు.

"ఎవరికో ఒకరికి సాయం చేయాలని నేను ఎప్పుడూ అనుకునేదాన్ని" అని గినీ అన్నారు.

'నాకు ఎలాంటి సందేహాలు లేవు'

ఆ ఇద్దరు మహిళలు తర్వాతి స్టేషన్‌లో రైలు దిగారు. ఎవరి దారినవారు వెళ్లే ముందు తమ ఫోన్ నంబర్లను ఇచ్చిపుచ్చుకున్నారు.

"నువ్వు నిజంగా సాయం చేస్తావా?" అని అనిత అడిగిన క్షణాన్ని గినీ గుర్తు చేసుకున్నారు.

గినీ చేయబోయే సాయం గురించి అనితకు అప్పుడు నమ్మశక్యంగా అనిపించలేదు. అయితే గినీ మాత్రం ఈ విషయంలో చాలా క్లారిటీతో ఉన్నారు.

"నా అండాలను ఇవ్వాలనే ఆలోచన మనుసులో స్పష్టంగా ఉంది. ఆమె స్థానంలో ఇంకే మహిళ ఉన్నా నేను ఇచ్చేసేదాన్నే" అని గినీ అన్నారు.

గినీ ఆలోచన విని, ఆమెను మొదట సందేహించిన వ్యక్తి ఆమె భర్తే.

"నాకు పిచ్చెక్కిందని ఆయన అనుకున్నారు" అని గినీ చెప్పారు.

" 13 ఏళ్ల తర్వాత ఆ బిడ్డ మన ఇంటి తలుపులు తడితే ఏంటి పరిస్థితి? అప్పుడు నువ్వేం చేస్తావు. అప్పుడు నీ పిల్లలు ఎలా స్పందిస్తారనుకుంటున్నావు’ అని ఆయన నన్ను ప్రశ్నించారు" అని గినీ గుర్తు చేసుకున్నారు.

ఈ విషయంలో గినీ భర్తకు ఆందోళనలు ఉన్నప్పటికీ "నాకు ఎలాంటి సందేహాలు లేవు" అని గినీ అన్నారు. అయితే తర్వాత తన భర్త మనసు మార్చుకుని, తన నిర్ణయానికి అంగీకరించారని ఆమె చెప్పారు.

ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా..

తను తీసుకున్న ఆ నిర్ణయం ఓ ప్రత్యేకమైన వైద్య ప్రక్రియ ద్వారా సాగిందని గినీ వివరించారు.

గినీ చికిత్స తీసుకోవడం ప్రారంభించి, తన 17 అండాలను దానం చేసేందుకు సిద్ధమయ్యారు. వాటి ద్వారా 10 ఎంబ్రియోలను అభివృద్ధి చేశారు. అయితే మొదటి తొమ్మిది ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరగా 10వ అండం విజయవంతమైంది. అనిత గర్భం దాల్చారు. తొమ్మిది నెలల తర్వాత అనిత, ఆమె భర్త కలిసి 'క్రిస్టోఫర్‌'కు స్వాగతం పలికారు.

"మా మధ్య ఎలాంటి ఒప్పందం లేదు. బిడ్డకు జన్మనివ్వగానే తను వెళ్లిపోయి ఉండవచ్చు" అని గినీ అన్నారు. అయితే, అనిత మాత్రం గినీతో అనుబంధాన్ని కొనసాగించారు. గినీ కాస్తా క్రిస్టోఫర్‌కు ‘గినీ ఆంటీ’ అయ్యారు. క్రిస్టోఫర్‌ కుటుంబం.. పని కోసం ప్రపంచమంతా ప్రయాణించినా కూడా ఈ సంబంధాన్ని కొనసాగించారు.

"వాళ్లు నాకు క్రమం తప్పకుండా ఈమెయిల్స్ పంపుతుండేవారు. క్రిస్టోఫర్ మొదటి పుట్టినరోజుకు నేను తన కోసం ఓ గిఫ్ట్ కూడా పంపాను" అని గినీ చెప్పారు.

"అప్పటి నుంచి అనిత నాకు ఎప్పుడు ఈమెయిల్స్, ఫోటోలతో కూడిన ఉత్తరాలను పంపుతుండేది" అని ఆమె గుర్తు చేసుకున్నారు.

"ఎప్పుడైనా అనిత, ఆమె కుటుంబం లండన్‌కు వస్తే.. వాళ్లు ప్రతిసారి నన్ను చూసేందుకు వచ్చేవారు. వారు ఎక్కడికైనా వెళ్తూ ఒకరాత్రి ఎయిర్‌పోర్ట్‌లో ఆగాల్సి వచ్చినా వాళ్లు నన్ను కలిసేవారు" అని గినీ చెప్పారు.

వాళ్లు చూపిన ఆప్యాయతకు, అనుబంధానికి తాను కృతజ్ఞతతో ఉంటానని గినీ అన్నారు. అయితే… క్రిస్టోఫర్‌కు మాత్రం నిజంగా గినీ ఎవరో తెలియదు.

కానీ, మూడేళ్ల కిందట ఓరోజు గినీ ఫోన్ మోగింది. అది అనిత నుంచి వచ్చిన ఫోన్ కాల్. తాను క్రిస్టోఫర్‌కు నిజం చెప్పాలనుకుంటున్నానని గినీతో అన్నారు అనిత.

'నన్ను మిరాకిల్ బేబీ అనుకుంటుండేవారు'

తనకు నిజం తెలిసిన క్షణాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా క్రిస్టోఫర్ ముఖం నవ్వుతో వెలిగిపోతుంది. అప్పుడు తాను పని చేస్తున్న మయామీలో ఆఫీస్‌లోని కిటికీ నుంచి నులివెచ్చని సూర్యకిరణాలు ఆయన ముఖాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఎల్ సాల్వడార్‌లో ఉంటున్నారు.

"నా చిన్నప్పుడు నాకేం డౌట్ అనిపించలేదు" అని క్రిస్టోఫర్ అన్నారు.

"మా ఇద్దరి తల్లులూ భారత మూలాలు ఉన్నవారే కావడం వల్ల నాకు తేడా తెలియలేదు. అనిత గోవా మూలాలు, గినీ పంజాబీ మూలాలు ఉన్నవారు కావడంతో ఇద్దరి చర్మపు రంగు ఒకేలా ఉండేది" అని ఆయన అన్నారు.

తన తల్లిదండ్రులు తనకు నిజం చెప్పిన రోజును క్రిస్టోఫర్ గుర్తు చేసుకున్నారు.

‘‘వీడియో కాల్‌లో, గినీ ఆంటీ సమక్షంలో వాళ్లు నాకు ఈ విషయాన్ని చెప్పారు’’ అని క్రిస్టోఫర్ అన్నారు.

అప్పుడు ఉన్న కోవిడ్-19 మహమ్మారి భయాలు, అలాగే తన మెడికల్ హిస్టరీ గురించి చెప్పాలని తన తల్లిదండ్రులకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక…అదే చివరికి తనకు నిజం చెప్పేందుకు దారి తీసిందని ఆయన వివరించారు.

"అదో అసాధారణ అనుభూతి. ఆ నిజం చెప్పడం మా అందరికీ చాలా భావోద్వేగమైన సందర్భం" అన్నారు.

ఓ పెద్ద కుటుంబం సహా తనకు ‘రెండో తల్లి’ ఉండడం అనేది… క్రిస్టోఫర్‌‌ జీవితానికి కొత్త బాటలు వేసింది.

"వాళ్లు నన్ను మిరాకిల్ బేబీ అని అనుకుంటుండేవాళ్లు. ఎందుకంటే.. ముఖ్యంగా 90లలో ఈ ప్రక్రియ చాలా కష్టమైనది, చాలా క్లిష్టమైనది" అని క్రిస్టోఫర్ అన్నారు.

"అది నిజంగా అద్భుత ప్రక్రియ. ఒక్క బిడ్డకు జన్మనివ్వడానికి ముగ్గురు సహకరించారు" అని ఆయన అన్నారు.

'మా మధ్య చాలా పోలికలున్నాయి'

ఆ తర్వాత క్రిస్టోఫర్ తన కొత్త కుటుంబంతో సమయాన్ని గడిపేందుకు యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్లారు. వాళ్లతో కలిసి ఆయన వెకేషన్‌‌కు కూడా వెళ్లారు.

గినీ గురించి మరింత క్షుణ్నంగా తెలుసుకున్నాక ఆయన… తమలో ఉన్న పోలికలు తెలుసుకుని మురిసిపోయారు.

"మా ఇద్దరికీ సేడ్ అనే ఆర్టిస్టు అంటే ఇష్టం. మేమిద్దరం బ్లాక్ కాఫీయే తాగుతాం. మా సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఒకే విధంగా ఉంటుంది. డార్క్ హ్యూమర్‌ను మేం ఇష్టపడతాం" అని క్రిస్టోఫర్ అన్నారు.

"నా జీవితం, నేను పెరిగిన విధానం.. ప్రకృతికి, అలాగే దాన్ని సంరంక్షించడంతో చాలా మటుకు పోలి ఉంటుందనుకుంటాను. మా అమ్మ అనిత నన్ను పెంచారు. నేను గినీకి పుట్టాను" అన్నారు.

క్రిస్టోఫర్ ఈ విషయాన్ని సానుకూలంగా భావిస్తారు. అలాగే ఇరు కుటుంబాల్లోని వారు ఇన్నాళ్లు దాచిన నిజాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్లు క్రిస్టోఫర్‌ను ఆత్మీయంగా స్వాగతించారు.

"గినీ కుటుంబీకులు దీన్ని ఎలా స్వీకరిస్తారో నేనేం ఊహించలేదు. కానీ, చివరకు వాళ్లు మాత్రం ఎలాంటి సంకోచం లేకుండా తమతో కలుపుకున్నారు" అని క్రిస్టోఫర్ అన్నారు.

గినీ విషయానికి వస్తే… సిక్కు సంప్రదాయాలను కఠినంగా పాటించే తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పడం ఆమెకు అతిపెద్ద సవాలు.

వాళ్లకు ఆమె క్రిస్టోఫర్‌ను మొదట ఫ్యామిలీ ఫ్రెండ్‌గా పరిచయం చేశారు. కానీ, ఆ తర్వాత తన ఆరుగురు తోబుట్టువుల మద్దతుతో… గినీ తన తల్లిదండ్రులతో కూర్చుని, జరిగినదంతా చెప్పారు.

"మా నాన్న నా కథ విన్నారు. అప్పుడు ఆయన క్రిస్టోఫర్ వైపు చూసి, బిడ్డా నేను నీ తాతను అన్నారు. మా అమ్మ క్రిస్టోఫర్‌ను కౌగిలించుకుని, 'నా బిడ్డ' అంది" అని గినీ అన్నారు.

'నాకు దొరికిన మరో కుటుంబం'

గినీ, క్రిస్టోఫర్ ఇద్దరూ తమ బంధాన్ని కొనసాగించారు. గినీ కుటుంబాన్ని తనకు దొరికిన "మరో కుటుంబం" అని క్రిస్టోఫర్ అంటుంటారు.

అనిత, ఆమె కుటుంబ సభ్యుల అండతో ఇక తమ కథను ప్రపంచంతో పంచుకోవాలనే సమయం ఆసన్నమైందని వాళ్లు నిర్ణయించుకున్నారు.

దాదాపు మూడు దశాబ్దాల కిందట తాను చేసిన పని గురించి చెప్పడంతో… చాలా మంది ముఖ్యంగా దక్షిణా ఆసియా నుంచి అనేక మంది మహిళలు తనను సంప్రదించి, వాళ్ల అనుభవాలను తమతో పంచుకోవాలనుకున్నారని గినీ చెప్పారు.

"పిల్లలు పుట్టకపోవడం గురించి ఎవరూ మాట్లాడట్లేదు. అండాల దానం గురించి కూడా ఎవరూ మాట్లాడడం లేదు. ఎందుకంటే.. అది రక్త సంబంధంతో ముడిపడినది కాదు" అని ఆమె అన్నారు.

ఈ విషయం తెలిసినప్పటి నుంచి క్రిస్టోఫర్‌ పికడిలీ లైన్‌లో ప్రయాణించిన ప్రతిసారీ.. లండన్‌లోని అండర్ గ్రౌండ్‌లో సాగిన ఓ సాధారణ సంభాషణ.. తనను ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చిందనే విషయాన్ని నమ్మలేకపోతుంటారు.

"నా జీవితాన్ని మార్చేసిన ఆ క్షణం గురించి ఆలోచించినప్పుడల్లా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది" అన్నారు క్రిస్టోఫర్‌.

"అప్పటి నుంచి నేను చాలా మందికి సాయం చేస్తున్నాను. ఇప్పుడు నాకో బిడ్డ ఉన్నారు. ఆ చక్రం అలా తిరుగుతోంది" అని అన్నారు

"మనమంతా ఇతరులకు మంచి చేయడానికి, ప్రేమను పంచడానికే పుట్టామని నమ్ముతాను. అందుకే, నేను ఈ రోజు ఇలా ఉన్నాను" అన్నారు క్రిస్టోఫర్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)