చైనా మ్యాక్సింగ్: ఉదయాన్నే వేడి నీళ్లు తాగడం మంచిదేనా?

    • రచయిత, కేట్ బోయి
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
  • చదివే సమయం: 6 నిమిషాలు

''అది నా సోషల్ మీడియా ఫీడ్‌లో కనిపించింది. ఒకదాని తర్వాత ఒకటి అవే వీడియోలు కనిపించాయి. దీంతో నేను కూడా ఎందుకు ప్రయత్నించకూడదనిపించింది'' అని 21 ఏళ్ల మర్యమ్ ఖాన్ చెప్పారు.

ఇదేమీ వర్కవుట్ ప్లాన్ లేదా ఖరీదైన స్కిన్ కేర్ రొటీన్‌ వ్యవహారమో కాదు. మర్యమ్ ఖాన్‌, ఇంకా చాలామంది ప్రయత్నిస్తున్న ఈ సింపుల్ ట్రెండ్ ఏంటంటే.. పొద్దున్నే వేడినీళ్లు తాగడం.

ఉదయాన్నే గోరువెచ్చని లేదా వేడి నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వేల ఏళ్లుగా చైనా సంప్రదాయ వైద్యం, ఆయుర్వేదం వంటివి చెబుతూ వస్తున్నాయి.

లేవగానే వేడినీళ్లు తాగే ట్రెండ్ ఈ ఏడాది మొదట్లో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు విపరీతంగా ప్రాచుర్యం పొందింది.

టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో 'న్యూలీ చైనీస్', 'చైనా మ్యాక్సింగ్' అనే ట్యాగ్‌లతో లక్షల వ్యూస్ ఉన్న వీడియోస్ కనిపిస్తున్నాయి. ఈ వీడియోలలో ఎక్కువగా యువతే కనిపిస్తోంది. వారంతా తమ రోజును వేడినీరు తాగుతూ, వేడివేడి బ్రేక్‌ఫాస్ట్ తింటూ, స్ట్రెచింగ్ వంటి వ్యాయామాలతో మొదలుపెడుతున్నట్లుగా ఆ వీడియోల్లో కనిపిస్తున్నారు.

కానీ, ఈ సాధారణ అలవాట్లు నిజంగానే మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయా?

శక్తిని కాపాడుకోవడం

చైనా సంప్రదాయ వైద్యంలో ఒక బలమైన నమ్మకం ఉంది. మన శరీరంలో 'ఖీ' (Qi) అనే శక్తి నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ శక్తి ప్రవాహానికి ఎక్కడైనా అడ్డంకులు ఏర్పడినా లేదా దాని సమతుల్యత దెబ్బతిన్నా మనకు అనారోగ్యం కలుగుతుందని వారు నమ్ముతారు.

వెచ్చని నీటిని తాగడం వల్ల వల్ల 'ఖీ' శక్తి పెరుగుతుందని, దానివల్ల ఆరోగ్యం మెరుగుపడి, ఆయుష్షు పెరుగుతుందని వారి నమ్మకం.

టిక్‌టాక్‌లో ఈ ట్రెండ్ చూశాకే చైనా వైద్య పద్ధతులపై ఆసక్తి పెంచుకున్నట్లు మర్యమ్ ఖాన్ చెప్పారు. ఆమె లండన్‌లో ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు.

తన రోజును తాయ్-చీ విధానంతో మొదలుపెట్టడం, కాఫీకి బదులుగా వేడినీటిని తాగడం వల్ల తాను ఎంతో ప్రయోజనం పొందుతున్నానని ఆమె చెప్పారు. తాయ్-చీ విధానం అంటే నెమ్మదిగా చేసే వ్యాయామాలు, దీర్ఘ శ్వాస, ధ్యానం కలిసిన పద్ధతి.

'నిద్ర లేవగానే నేరుగా కెఫిన్ తీసుకోవడం వల్ల, ఆ తర్వాత నాకు వికారంగా అనిపించేది. అలా ఎందుకు జరుగుతుందో అప్పుడు నాకు అర్థమయ్యేదికాదు. తర్వాత నేను కేవలం వేడి నీరు తాగడం మొదలుపెట్టాను. అప్పుడప్పుడు అందులో పుదీనా, నిమ్మరసం చేర్చుతాను. ఇలా చేయడం వల్ల చాలా ఉత్సాహంగా ఉంటున్నా’ అని మర్యమ్ ఖాన్ తన అనుభవాన్ని పంచుకున్నారు.

సంప్రదాయ వైద్యం వైపు ప్రజలు ఎందుకు మళ్లుతున్నారు?

చైనా సంప్రదాయ జీవనశైలి చిట్కాలపై యువతకు ఆన్‌లైన్‌లో ఆసక్తి పెరగడం ఒక సామాజిక మార్పుకు సంకేతం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ తాత్కాలిక డైరెక్టర్ డాక్టర్ శ్యామ కురువిల్లా చెబుతున్నారు.

'జర్మనీలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, అక్కడి జనాభాలో దాదాపు 70 శాతం మంది ఏదో ఒక రకమైన సంప్రదాయ వైద్య పద్ధతులను పాటిస్తున్నారు. ఇక భారత్, చైనా వంటి దేశాల్లో ఈ సంఖ్య 90 శాతం కంటే ఎక్కువగా ఉండొచ్చు' అని ఆమె వివరించారు.

కోవిడ్ మహమ్మారి తర్వాత ఆధునిక వైద్యంపై కొందరికి నమ్మకం తగ్గింది. ప్రజలకు వైద్యులు, ఆసుపత్రులపై ఉన్న నమ్మకం 2020లో 70 శాతం ఉండగా, 2024 నాటికి అది 40 శాతానికి పడిపోయిందని అమెరికాలో జరిగిన ఒక అధ్యయనం సూచిస్తోంది.

చాలామందికి ఆధునిక వైద్యం అందుబాటులో లేకపోవడం, సంప్రదాయ వైద్యం తక్కువ ధరలో అందుబాటులో ఉండటం కూడా మరో కారణం.

అలాగే ఈ పద్ధతులు వేల ఏళ్లుగా చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికత వంటి అంశాలతో ముడిపడి ఉన్నాయి.

'మేం వేల ఏళ్లుగా ఈ విధానాలనే అనుసరిస్తున్నామని చాలామంది సంప్రదాయ వైద్యులు చెబుతుంటారు. ఈ విధానాలు ప్రజలకు మేలు చేస్తున్నాయని వారు అంటుంటారు' అని శ్యామ కురువిల్లా తెలిపారు.

వివిధ దేశాలలోని ప్రభుత్వాలకు, రోగులకు మార్గదర్శకాల జారీకి డబ్ల్యూహెచ్‌వో గ్లోబల్ ట్రెడిషనల్ సెంటర్ ఇలాంటి పద్ధతులపై తగిన ఆధారాలను సేకరిస్తుంది.

'అయితే ఇది చాలా పెద్దపని. ప్రపంచ ఆరోగ్య రంగంలో పరిశోధనల కోసం ఖర్చు చేసే నిధుల్లో సంప్రదాయ వైద్యం కోసం ఖర్చు చేసేది 1 శాతం కంటే తక్కువే ఉంది. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది' అని ఆమె భావించారు.

ఏదైనా సంప్రదాయ వైద్య పద్ధతిని పాటించే ముందు అది ఆరోగ్యానికి సురక్షితమేనా అని వైద్యులను అడిగి తెలుసుకోవడం మంచిదని ఆమె సూచించారు.

కానీ, వేడి నీళ్లు తాగడానికి సంబంధించి డబ్ల్యూహెచ్‌వో వద్ద ప్రత్యేక మార్గదర్శకాలేమీ లేవు.

తాగే నీరు ఎంత వేడిగా ఉంది? ఎంత పరిమాణంలో వేడినీళ్లు తాగుతున్నారు? ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అనే అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని శ్యామ కురువిల్లా చెప్పారు.

'ప్రతిదీ సరైన రుజువులు, సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది' అని ఆమె అన్నారు.

సైన్స్ ఏం చెబుతోంది?

గోరు వెచ్చని నీటితో రోజును ప్రారంభించడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని జనరల్ ఫిజీషియన్, లాంగ్విటీ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర రోజీ బ్రూక్స్ చెప్పారు.

'జీర్ణక్రియ మెరుగుపడటం, మలబద్ధకం సమస్య తగ్గించడంలో కొంత ప్రయోజనం ఉంటుంది' అని ఆమె అన్నారు.

ఆహార వాహికలో ఏర్పడే అసౌకర్యాన్ని తగ్గించడానికి వేడి నీరు సహాయపడుతుందని చెప్పడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయని ఆమె తెలిపారు.

'చల్లటి నీరు తాగినా, వేడి నీరు తాగినా ఆరోగ్యానికి ప్రయోజనమే. ఎందుకంటే నీళ్లు తాగడం వల్ల శరీరం తేమ (హైడ్రేషన్)ను పొందుతుంది' అని ఆమె వివరించారు.

అయితే, చల్లటి నీళ్ల వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని చెప్పడానికి కూడా ఆధారాల్లేవని యూకేలోని డాక్టర్ హెలెన్ మెడికల్ సెంటర్‌ వైద్యురాలు, లైఫ్ స్టైల్ ఫిజీషియన్ డాక్టర్ సెలీనా గ్రే చెప్పారు.

వేడి నీళ్లు తాగడం వల్ల కొవ్వు కరుగుతుందని, మెటబాలిజం మెరుగుపడుతుందని, శరీరం డిటాక్స్ అవుతుందని సోషల్ మీడియాలో కొన్ని ప్రచారాలు ఉన్నప్పటికీ, అలాంటి ఫలితాలు కలుగుతాయని నిరూపించే ఆధారాల్లేవని ఆమె నొక్కి చెప్పారు.

పరుగులు తీసే బుర్రకు బ్రేకులు

గోరు వెచ్చని నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలపై శాస్త్రీయ ఆధారాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఇతర సంప్రదాయ పద్ధతులు మేలు చేస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.

ముడి పదార్థాలతో వండిన వేడి అల్పాహారం తినడం వల్ల ప్యాక్ చేసిన చల్లటి సెరియల్ తిన్నదాని కంటే శరీరానికి ఎక్కువ పోషకాలు అందుతాయి.

పాదాలు చల్లగా ఉండటం వ్యాధులకు కారణమవుతుందని చెప్పడానికి రుజువులు లేవు. కానీ, శరీరం వెచ్చగా ఉంటే ఒత్తిడి తగ్గి మీకు చక్కగా నిద్ర పడుతుంది.

చైనీస్ తాయ్ చీ, ఖీగాంగ్ వ్యాయామాలు శరీర బలాన్ని, కదలికలను మెరుగుపరుస్తాయని, ఒత్తిడిని తగ్గిస్తాయని కొన్ని అధ్యయనాలు గుర్తించాయి.

'దైనందిన జీవితంలో మన మెదడు ఎప్పుడూ పరుగులు తీస్తూనే ఉంటుంది. మన శరీరం, ఆలోచనలు వేర్వేరు చోట్ల ఉంటాయి. ధ్యానం, ఖీగాంగ్, తాయ్-చీ వంటి పద్ధతుల ప్రధాన ఉద్దేశం ఈ వేగాన్ని తగ్గించడమే ' అని చైనీస్ మెడిసిన్ ఎక్స్‌పర్ట్, ప్రొఫెసర్ షున్ ఔ అన్నారు.

వేడి నీళ్లు తాగడం వల్ల శారీరకంగా పెద్దగా ప్రయోజనం ఉండదని, మానసిక ప్రయోజనాన్ని కలిగిస్తుందని డాక్టర్ బ్రూక్స్ అభిప్రాయపడ్డారు.

'ఇదొక దినచర్యలా మారి, బిజీగా ఉండే ఈ లోకంలో మన కోసం మనం కొంత సమయం కేటాయించుకునేలా చేస్తుంది' అని ఆమె వివరించారు.

ఈ అలవాటు తన మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపిందని మర్యమ్ ఖాన్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)