లోక్‌సభలో 'అమరావతి రాజధాని' బిల్లు ఆమోదం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని పెట్టాలన్న జగన్

    • రచయిత, బళ్ళ సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 7 నిమిషాలు

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. ఏప్రిల్ 2న ఇది రాజ్యసభకు రానుంది. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చేరుస్తూ పునర్వ్యవస్థీకరణ చట్టానికి చేసిన సవరణ ఇది.

రాష్ట్ర శాసన సభ చేసిన తీర్మానానికి అనుగుణంగా కేంద్రం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును ప్రవేశ పెట్టారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్ప అన్ని పార్టీలూ ఈ బిల్లుకు మద్దతిచ్చాయి. వైఎస్సార్సీపీ వాకౌట్ చేయడంతో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.

బిల్లుపై చర్చ సందర్భంగా లోక్‌సభ లోపల, బయట నాయకులు ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించారు. మరోవైపు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విలేఖరుల సమావేశం నిర్వహించారు.

అమరావతికి వ్యతిరేకం కాదంటూనే, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఉండాలని, దానికి ‘మావిగన్’ అనే పేరు పెట్టాలని సూచించారు. కూటమి నేతలు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌లు కూడా అమరావతిలో ఉండటం లేదని విమర్శించారు.

‘విశాఖపట్నం రాజధాని అయ్యుండాల్సింది’ అని లోక్‌సభలో సమాజ్‌వాది పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ అన్నారు.

తమ రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీల గురించి తెలంగాణ ఎంపీలు చర్చ సందర్భంగా ప్రశ్నించారు.

కొందరు ఇతర రాష్ట్రాల ఎంపీలు అమరావతి బిల్లుకు మద్దతిస్తూనే, రైతులకు న్యాయం చేయాలంటూ కొన్ని సూచనలు చేశారు. కొందరు ఎంపీలు తెలుగులో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది

మా ప్లాన్ బీ – మావిగన్: వై.ఎస్. జగన్

వై.ఎస్. జగన్ మాట్లాడుతూ.. ''ఇప్పటికీ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేశ్ కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి? ఇప్పుడు కూడా విమానాల్లో షటిల్‌ సర్వీసు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అమరావతి ప్రాంతానికే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ వ్యతిరేకం కాదు. ⁠అమరావతిపై శాసనసభలో చేసిన తీర్మానం, రాజధాని పేరిట చేస్తున్న దోపిడీ నుంచి, ప్రజలను పక్కదోవ పట్టించడానికే చేశారు.⁠ ⁠రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టం అని, కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్రా లేదని కేంద్రమే అధికారికంగా హైకోర్టులో చెప్పింది'' అన్నారు.

''మొదట తీసుకున్న 50 వేల ఎకరాలకే దిక్కు లేదు.⁠ ⁠ఇప్పుడు సడన్‌గా మరో 50 వేల ఎకరాలు ఎందుకు పెంచారు? సడన్‌గా మాస్టర్‌ ప్లాన్‌ ఎందుకు మారుస్తున్నారు? ఈ డబ్బు వెచ్చించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? లక్ష ఎకరాల్లో వసతులకు రెండు లక్షల కోట్లు కావాలి. దానికి ఎన్నేళ్లు పడుతుందో తెలియదు. మళ్లీ ఆ 2 లక్షల కోట్లు ఎంతకు పెరుగుతుందో తెలియదు.⁠ ⁠అమరావతిలో భయంకరమైన అవినీతి, దోపిడీ జరుగుతోంది'' అని ఆరోపించారు వై.ఎస్. జగన్.

తమ మూడు రాజధానుల ప్రతిపాదన వెనుక స్వార్థం లేదని జగన్ అన్నారు.

''⁠హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీపడాలంటే, మనకు కూడా ఒక గ్రోత్‌ ఇంజిన్‌ ఉండాలని ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖపట్నం పెట్టాలనుకున్నాం. ఆ ప్రణాళిక ముందుకు సాగలేదు. అమరావతి రైతులకు మరో ఐదేళ్లపాటు కౌలును పెంచాం. రాజధానిలో పెన్షన్లను 5 వేలకు పెంచాం. కేవలం 10వేల కోట్లు పెడితే చాలని, విశాఖ నగరం ఇవాళ ఉన్న ఈ స్థాయి నుంచి గొప్ప స్థాయికి ఎదుగుతుందని చెప్పాం.

సంకుచితమైన ఆలోచన ఉండి ఉంటే, రాయలసీమలో రాజధాని ఆలోచన చేసేవాడిని. కానీ నేను అలా చేయలేదు. రాష్ట్రానికి మంచి చేయాలన్న ఆలోచన చేశాను. అమరావతిలో భూములు అమ్మి డబ్బులు తెస్తానని చెప్పారు చంద్రబాబు. మరి ఇన్ని వేల కోట్ల అప్పులు ప్రభుత్వ ఖజానాపై ఎందుకు వేస్తున్నావు?'' అని ప్రశ్నించారు జగన్.

అదే సమయంలో తమ ప్లాన్ బి కింద మావిగన్ అనే కొత్త రాజధాని ప్రతిపాదన తెచ్చారాయన.

''ప్లాన్‌ - బి కింద అయినా మేం చెప్పిన ప్లాన్ గురించి చంద్రబాబు ఆలోచించలేదు. మచిలీపట్నం నుంచి విజయవాడ, విజయవాడ నుంచి గుంటూరు. ఈ మొత్తం 110 కి.మీ. ఇప్పటికే హైవే ఉంది. ఈ 110 కి.మీ. హైవేకి అటు, ఇటు క్యాపిటల్ కారిడార్ కింద ప్రకటిస్తే గ్రోత్‌ ఇంజిన్‌ తయారవుతుందని చెప్పాం.

మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరు నుంచి GUN తీసుకోండి. MAVIGUN అని పేరుపెట్టి క్యాపిటల్‌ ఏరియాగా డిక్లేర్‌ చేయండి. స్కాంలు చేసే బదులు, కట్టే ఆ బిల్డింగులు ఇక్కడ కట్టండని సలహా ఇచ్చాం. అమరావతిలో పెట్టాలనుకుంటున్న డబ్బులో 10% ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అని సూచించాం.

ఈ సలహా ఇస్తే దాన్ని కూడా పట్టించుకోలేదు. విజయవాడ, దాని చుట్టుపక్కల ఇప్పటికే 20 లక్షల జనాభా ఉంది. గుంటూరులో మరో 10 లక్షల జనాభా ఉంది, మచిలీపట్నంలో మరో 3-4 లక్షల జనాభా ఉంది. అదొక మహానగరంగా, గ్రోత్‌ ఇంజిన్‌గా ఎదుగుతుంది కదా అని చెప్తే.. అది కూడా చంద్రబాబుకు నచ్చలేదు.

అమరావతి అసాధ్యమని తెలిసి కూడా, తన స్కాములు కోసం, తన బినామీల భూముల రేట్లు కోసం పోతానంటున్నాడు. రాజధాని విషయంలోనే కాదు, ఏ విషయంలో కూడా చంద్రబాబులో ఆచరణాత్మక ధోరణి, ప్రాక్టికాలిటీ అనేది కనిపించదు'' అన్నారు జగన్.

తప్పుదోవ పట్టించాలన్న ఉద్దేశమే : టీడీపీ

అయితే అమరావతిపై వై.యస్. జగన్ వ్యాఖ్యలను తెలుగుదేశం తప్పు పట్టింది. ''జగన్ కి అమరావతిపై కక్ష తగ్గలేదు. ఏదో విధంగా డీవియేట్ చేయాలన్న ఉద్దేశమే ఆయనది. అమరావతి బిల్లుకు సపోర్ట్ చేయకుండా, అదే సమయంలో మేం వ్యతిరేకం కాదు అంటున్నారు. ఇది ద్వంద్వ వైఖరి. జగన్ ఇంకా ఓల్డ్ ట్రాక్‌లో ఉన్నాడు. అందుకే చంద్రబాబు ఈ బిల్లు పెట్టించాల్సి వచ్చింది. ఆయన నష్టం చేయాలనుకుంటున్నాడు. కానీ, నష్టం జరగకుండా మేం చర్యలు తీసుకుంటున్నాం. మేం ఒక ప్రణాళికతో వెళ్తున్నాం. ఎవరూ ఆపలేరు. ఇలాంటి వరుస కొత్త ప్రతిపాదనలతో అయినా వైయస్సార్సీపీ ఎక్స్‌పోజ్ కావాలి. అవినీతి ఆరోపణలు కూడా ఆ క్రమంలో చేస్తున్నవే'' అన్నారు ఆ పార్టీ నాయకులు దీపక్ రెడ్డి.

చంద్రబాబు అమరావతిలో ఉండడం లేదన్న జగన్ వ్యాఖ్యలను కూడా తెలుగుదేశం తప్పు బట్టింది.

''వారంతా ఏ రోజు ఎక్కడున్నారో కూడా చెప్పగలను. మాకు నిత్యం అందుబాటులో ఉన్నారు. ఇక్కడే (అమరావతిలో) ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే బహుశా జగన్ బెంగళూరుకు ఆధార్ మార్చుకున్నట్టున్నారు. ఆయన ఇక్కడ అందుబాటులో ఉండరు'' అన్నారు దీపక్ రెడ్డి.

లోక్‌సభలో ఎవరేమన్నారంటే..

అమరావతి రాజధాని అంశంపై లోక్‌సభలో చర్చ జరిగింది.

ప్రభుత్వాలు మారినా విధానాలు ఏకపక్షంగా మారకూడదంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లోక్‌సభలో తెలుగులో మాట్లాడారు.

''2014 లో రాజధాని ప్రాంత పేరు పేర్కొనకపోవడం వల్ల చట్టపరమైన అనిశ్చితి, రాజకీయ అస్థిరతకు దారి తీసింది. హైకోర్టు 2022లో రాష్ట్ర రాజధాని నిర్ణయించడం, మార్చడం వంటి అధికారాలు రాష్ట్ర అసెంబ్లీ పరిధిలోకి రావని, పార్లమెంటువేననీ తీర్పు ఇచ్చింది. గందరగోళంలో పెట్టుబడులు రావు. బ్యాంకులు, అంతర్జాతీయ సంస్థలు రాజకీయ అస్థిరత్వానికి రుణాలు ఇవ్వవు. ఎన్ని పనులు జరుగుతున్నా, అందరి మనసులో ఒకే ఒక ప్రశ్న. అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందా అని. ఈ చట్ట సవరణతో ఆ అనిశ్చితి తగ్గి అభివృద్ధి వేగంగా జరగబోతుంది'' అని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.

అన్నీ ఆలస్యమే: కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును సమర్థించింది. ఆ పార్టీ తరపున తమిళనాడుకు చెందిన ఎంపీ మాణిక్కం ఠాకూర్ సభలో మాట్లాడారు.

''ఓపిక, గౌరవం, ఆశతో ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి కాంగ్రెస్ తరపున మాట్లాడతాను. వారికి న్యాయం జరగాల్సిన సమయం మించిపోయింది. స్థిరమైన కేంద్రం లేకుండా పరిపాలన సాగదు, స్పష్టత లేకుండా పెట్టుబడులు రావు. రాజధానికి కేంద్రం ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తుంది, పారిశ్రామికీకరణకు పన్ను ప్రోత్సాహకాలను అందిస్తుంది అని 2014లో చట్టంలో పెట్టాం. అప్పు కాదు, సహాయం. ఇవి రాజకీయ ప్రకటనలు కావు, చట్టపరమైన బాధ్యతలు.

అప్పుడు కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఆ బాధ్యతలకు కట్టుబడి ఉంటామని ఒప్పుకున్నాయి. దశాబ్దం దాటిన తర్వాత ఇవాళ అమరావతికి పూర్తి నిధులు ఎక్కడ ఉన్నాయి? పన్ను ప్రోత్సాహకాలు ఎక్కడ ఉన్నాయి? పారిశ్రామిక ప్రోత్సాహం ఎక్కడ ఉంది? అన్నీ ఆలస్యమే'' అన్నారు మాణిక్కం ఠాకూర్.

''రైతులు భూమి ఇచ్చారు, ప్రజలు వ్యవస్థను నమ్మారు, రాష్ట్రం పార్లమెంటును నమ్మింది. మౌలిక సదుపాయాలలో పెట్టుబడి పెట్టండి, ప్రజలకు సాధికారత కల్పించండి. ప్రత్యేక హోదా డిమాండ్ ఇంకా పెండింగ్‌లో ఉంది. పార్లమెంట్‌లో వాగ్దానం చేసిన, అప్పటి ప్రధాని సభలో హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాను తిరస్కరించడమే అతిపెద్ద అన్యాయం''

''ఆంధ్రప్రదేశ్ ఈ పార్లమెంటును నమ్మింది. అది తన రాజధాని (హైదరాబాద్)ని వదులుకుంది, విభజనను అంగీకరించింది, వాగ్దానాలను నమ్మింది. ఇప్పుడు అది న్యాయం కోరుకుంటోంది. అమరావతిని విశాఖ లేదా హైదరాబాద్‌లా ఎదగనివ్వండి. అభివృద్ధిని బెంగళూరులా ప్రవహించనివ్వండి, వర్ధిల్లనివ్వండి. వృద్ధి తిరుపతి, విజయవాడ, విశాఖలకు విస్తరించనివ్వండి'' అన్నారు మాణిక్కం ఠాకూర్.

రాజధాని లేకుండా వదిలేశారు: పురంధేశ్వరి

ఏ రాష్ట్రమూ రెండోసారి తన రాజధానిని కోల్పోకూడదంటూ బిల్లుకు అనుకూలంగా బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రసంగించారు.

''ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేదు, దానికి సచివాలయం, అసెంబ్లీ లేదా పరిపాలనా వ్యవస్థ కూడా లేదు. 2014 ఫిబ్రవరి 8న భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక చీకటి దినం. ఆ రోజు తలుపులు మూసి, కెమెరా లేకుండా, చర్చ లేకుండా రాష్ట్ర విభజన జరిగింది. ఆంధ్రా తీవ్ర అవమానానికి గురైంది. బహుశా మొత్తం చరిత్రలో మొదటిసారి ఒక రాష్ట్రం ఏర్పాటు చేసి రాజధాని లేకుండా వదిలేశారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయడానికి అంగీకరించి, అందమైన రాజధానిని సృష్టించడానికి 34,000 ఎకరాలు కాకపోతే 50,000 ఎకరాలు తీసుకోవాలని చెప్పి, తరువాత మాట మార్చారు'' అన్నారు పురంధేశ్వరి.

రాజధాని మార్చి గత ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టిందని జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. కేంద్రం విభజన హామీలు అమలు చేస్తూ, ఇన్సెంటివ్‌లిచ్చి సహకారం అందించాలని కోరారు.

ప్రస్తుత రూపంలోని బిల్లుకు వ్యతిరేకం: వైసీపీ

ఈ బిల్లును సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. పేరు వల్ల ప్రయోజనం ఉండదనీ, రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో చెప్పాలనీ ఆ పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి ప్రశ్నించారు. అమరావతి రెండో దశపై కూడా ఆయన మాట్లాడారు.

''అమరావతి నిర్మాణానికి ఎంత విస్తీర్ణం అవసరమో కూడా మేం తెలుసుకోవాలనుకుంటున్నాం. ప్రస్తుతం వారు 34,000 ఎకరాలు తీసుకున్నారు. ప్రభుత్వ భూమి 20,000 ఎకరాలు ఉంది. మొత్తం 54,000 ఎకరాలున్నాయి. మళ్లీ రెండవ దశ కోసం వెళ్తున్నారు. ఈ డబ్బు మీరు ఎక్కడి నుండి తీసుకురాబోతున్నారు? చంద్రబాబు గారు మా దగ్గర డబ్బు లేదు, అప్పు చేసి పథకాలు ఇస్తున్నాం అన్నారు. ఒకవైపు జీతాలకు డబ్బు లేక, మరోవైపు రైతులకు ప్లాట్లు ఇవ్వక, మళ్లీ రెండో విడత ఎంత వరకూ సమంజసం? భవన నిర్మాణాలకు దిల్లీ కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ప్రజాధనం దోపిడీ చేస్తున్నారు'' అన్నారు మిథున్ రెడ్డి.

అమరావతికి తాము వ్యతిరేకం కాదు కానీ ప్రస్తుత రూపంలోని ఈ బిల్లుకు వ్యతిరేకంగా తాము వాకౌట్ చేస్తున్నామంటూ సభ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ వాకౌట్ చేసింది.

విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసి ఉంటే బహుశా ఇంత డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండేది కాదు అంటూ బిల్లుకు అనుకూలంగా సమాజ్‌వాదీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ మాట్లాడారు.

"ఆ సహజ రాజధానిని మీరు అంగీకరించి ఉంటే, ఈరోజు ఇంత భూమి అవసరమని, ఇంత ఖర్చు అవసరమని, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని జరుగుతున్న చాలా చర్చలు ఉండేవి కావు. ఆంధ్ర మిత్రులు, అక్కడి ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుని ఉంటే, ఈరోజు ఇంత రైతుల భూమి అవసరం పడేది కాదు, మీరు అప్పు చేసి తీసుకోవాల్సి వస్తున్నంత డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం పడేది కాదు. కానీ శాశ్వత రాజధాని లేకుండా రాష్ట్ర వ్యవస్థను నడపలేం. అయితే రైతులకు ఇస్తామన్నవి ఇవ్వాలి'' అన్నారు ధర్మేంద్ర యాదవ్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)