You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘‘రాత్రంతా మా చుట్టూ మిసైల్స్ పడుతూనే ఉన్నాయి, చావు అంచున ఉన్నట్టనిపించింది’’
- రచయిత, మొహమ్మద్ సర్తరాజ్ ఆలమ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 4 నిమిషాలు
కిందటేడాది డిసెంబరులో ఇరాన్ అదుపులోకి తీసుకున్న ఎనిమిదిమంది భారతీయ నావికులు స్వదేశానికి తిరిగి వచ్చారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా వారు భారత్‌కు తిరిగి రావడం ఆలస్యమైంది.
ఇంధనం అక్రమ రవాణా చేస్తున్నారనే ఆరోపణలపై ఇరాన్ అధికారులు సీజ్ చేసిన ఓడలో 18మంది సిబ్బంది ఉన్నారు.
వారిలో 16మంది భారతీయులుకాగా మిగిలిన ఇద్దరిలో ఒకరు శ్రీలంక, మరొకరు బంగ్లాదేశ్‌కు చెందినవారు. ఇంధనం అక్రమరవాణా ఆరోపణను షిప్ నిర్వహణా కంపెనీ ఖండించింది.
అయితే 16 మందిలో ఫిబ్రవరి 10న ఎనిమిది మంది సిబ్బంది భారత్‌కు తిరిగివచ్చారు. మిగిలిన ఎనిమిదిమంది ఆదివారం (మార్చి 30) భారత్ చేరుకున్నారు.
ఈ క్రమంలో వారి తిరుగు ప్రయాణం అత్యంత కష్టంగా సాగింది. వీరు అర్మేనియా నుంచి దుబయి మీదుగా విమానంలో ప్రయాణించారు.
శ్రీలంక, బంగ్లాదేశ్‌కు చెందిన వారు అర్మేనియా నుంచి స్వదేశాలకు చేరుకున్నారు.
‘విడుదల ఆదేశాలందిన మరుసటిరోజే...’
దుబయికు చెందిన ప్రైమ్ ట్యాంకర్స్ ఎల్ఎల్‌సీ యాజమాన్యంలోని ఎంటీ వాలియంట్ రోర్ షిప్‌ను అంతర్జాతీయ జలాల్లో ఉండగా డిసెంబరు 8న సీజ్ చేశారు.
సిబ్బందిలో కొందరిని ఇరాన్‌లోని బండార్ అబ్బాస్ పోర్ట్ సిటీలో జైలుకు తరలించారు. మిగిలిన వారిని నౌకలోనే నిర్బంధించారు.
ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ జనవరిలో వారి కుటుంబాలు భారత్‌లో కోర్టును ఆశ్రయించాయి. భారత విదేశంగా శాఖ వారికి సాయం అందించింది.
ఫిబ్రవరి 10న ఎనిమిదిమంది భారత్‌కు తిరిగి వచ్చారు. జైలులో ఉన్న ఐదుగురు భారతీయులు సహా మిగిలినవారి విడుదలకు సంబంధించి ఫిబ్రవరి 27న ఆదేశాలొచ్చాయి.
ఆ తర్వాతి రోజు అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై మిలటరీ దాడులు ప్రారంభించాయి. ఇరాన్ ప్రతిదాడులు చేసింది. విమానాలు, ఈ ప్రాంతంలో సరిహద్దుల వెంట రాకపోకలకు అంతరాయమేర్పడింది.
''విడుదల ఆదేశాలందాయన్న సంతోషం కనీసం కొన్ని గంటలపాటు కూడా ఉండలేదు'' అని షిప్ కెప్టెన్ విజయ్ కుమార్ అప్పటి పరిస్థితులను గుర్తుతెచ్చుకున్నారు.
‘మిసైళ్ల దాడుల మధ్య భయంభయంగా’
ఇరాన్ అధికారులు వారి పాస్‌పోర్టులు ఇచ్చినప్పటికీ భద్రతాపరిస్థితుల దృష్ట్యా నావికులు బండార్ అబ్బాస్‌లోని ఓడలోనే ఉండిపోవాల్సివచ్చింది.
ఆ నౌక ఇరాన్ నావికా దళస్థావరానికి దగ్గరగా ఉంది. లక్ష్యాలకు దగ్గరగా ఉంది.
''రాత్రంతా మా చుట్టూ మిసైళ్లు పడుతుంటే ఏం చేయలేక నిస్సహాయంగా చూస్తుండిపోయాం''అని ఆయన చెప్పారు.
షిప్ సీజ్ చేసినప్పుడు ఇరాన్ అధికారులు కీలకమైన నావిగేషన్, ఇతర భద్రతాసామాగ్రిని తొలగించారని ఆయన చెప్పారు. దీంతో సురక్షితమైప్రాంతానికి ప్రయాణించలేక పోయామన్నారు. దీనిపై స్పందించాల్సిందిగా బీబీసీ దిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది.
మార్చి 3న భారత రాయబార కార్యాలయం ఓడ నుంచి సిబ్బందిని ఖాళీ చేయించి నగరంలోని హోటల్‌లో వారికి వసతి సౌకర్యం కల్పించింది.
శ్రీలంక, బంగ్లాదేశ్‌కు చెందిన సిబ్బందికి కూడా తమతో పాటు వసతి కల్పించారని విజయ్ కుమార్ చెప్పారు.
దీనిపై స్పందించాల్సిదిగా దిల్లీలోని శ్రీలంక, బంగ్లాదేశ్ రాయబార కార్యాలయాలను బీబీసీ సంప్రదించింది.
‘నిద్రలేని రాత్రులు’
తెహ్రాన్‌లో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది.
క్షిపణిదాడుల భయంతో సిబ్బంది పగలూ, రాత్రీ నిద్రలేకుండా గడిపారని షిప్ ఇంజినీర్లలో ఒకరైన కేతన్ మెహతా చెప్పారు.
''ప్రతి క్షణం చావుకు దగ్గరగా ఉన్నట్టు అనిపించింది'' అని షిప్ చీఫ్ ఇంజినీర్ అనిల్ కుమార్ సింగ్ చెప్పారు.
రాత్రంతా హోటల్‌కు దగ్గరగా జరిగిన పేలుళ్ల వల్ల తామున్న హోటల్ గోడలు కూడా కంపించాయని సిబ్బంది చెప్పారు.
ఇరాన్ నుంచి భూతల మార్గంలో ప్రయాణాల పునరుద్ధరణ జరిగేంతవరకు తాము తెహ్రాన్‌లోని హోటల్‌లోనే ఉన్నామని సిబ్బంది చెప్పారు. మార్చి 15న వారు ఇరాన్ సరిహద్దుల్లోని అర్మేనియావైపు ప్రయాణం ప్రారంభించారు. బాంబులు పడుతున్న ప్రాంతాలమీదుగానే కొన్నిసార్లు వారి ప్రయాణం సాగింది.
తర్వాత వారు అర్మేనియా సరిహద్దుకు 60కిలోమీటర్ల దూరంలోఉన్న జోల్ఫా అనే ఇరాన్ నగరంలో షెల్టర్ తీసుకున్నారు. వీసాలు పొందేందుకు అక్కడ వారు మూడురోజుల పాటు ఎదురుచూశారు.
మార్చి 27న ఆర్మేనియా చేరుకున్నవారు రాజధాని యెరెవన్‌లోని హోటల్‌లో ఓ రాత్రి ఉన్నారు. తర్వాత వారు విమానంలో దుబయ్ చేరుకుని అక్కడి నుంచి మార్చి 29 ఉదయానికి వారు ముంబయి చేరుకున్నారు.
ఆ అనుభవం ఇప్పటికీ తనను భయకంపితుణ్ని చేస్తుందని సిబ్బందిలో ఒకరైన మసూద్ ఆలమ్ చెప్పారు.
గత వారం ఈద్ తర్వాత అలామ్ పెళ్లి జరగల్సి ఉంది. కానీ ఆ కార్యక్రమం వాయిదా పడింది. ఇప్పుడు ఆయన కుటుంబం తొందరలో మరో తేదీని నిర్ణయించి ఆయన వివాహం జరిపించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
తమకు చాలా నెలల నుంచి జీతాలు చెల్లించలేదని కొందరు సిబ్బంది ఆరోపించారు. ప్రైమ్ ట్యాంకర్స్ కంపెనీలో పనిచేస్తామా లేదా అనేది చెప్పలేమన్నారు.
ఫోన్లకు, మెసేజ్‌లకు కంపెనీ యజమాని జుగ్వీందర్ బ్రార్ స్పందించలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)