You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'అమెరికా మిలటరీ ఫోర్స్ అన్‌స్టాపబుల్.. అమెరికా చిన్నారులు, భవిష్యత్ తరాల కోసం యుద్ధం ఒక అసలైన పెట్టుబడి' - ట్రంప్
అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్ నుంచి చేసిన ప్రసంగంలో ఇరాన్‌తో యుద్ధంపై మాట్లాడారు. అమెరికా మునుపెన్నడూ లేనంత స్థాయిలో భారీ విజయం సాధించిందని.. త్వరలోనే పని పూర్తిచేస్తామని అన్నారు.
ఇరాన్ యుద్ధం లక్ష్యాలు నెరవేరడానికి దగ్గరలో ఉన్నామని ట్రంప్ వ్యాఖ్యానించారు.
20, 21వ శతాబ్దాల్లో ఏళ్ల తరబడి సుదీర్ఘకాలం యుద్ధాలు జరిగాయని, ఈ సంక్షోభం కేవలం 32 రోజులు మాత్రమేనని ట్రంప్ అన్నారు.
నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 ప్రయోగం విజయవంతం కావడంపై వ్యోమగాముల బృందానికి అభినందనలు తెలుపుతూ ఆయన తన ప్రసంగం ప్రారంభించారు.
ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ప్రారంభమై నెల రోజులు పూర్తయిన సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ‘‘రాత్రి ఇరాన్ నేవీ తుడిచిపెట్టుకుపోయింది, వారి వైమానిక దళం నాశనమైంది, వారి నాయకులలో చాలా మంది మరణించారు’’ అని అన్నారు.
ఇరాన్ క్షిపణి, డ్రోన్ సామర్థ్యం కూడా భారీగా తగ్గిందని ట్రంప్ అన్నారు.
‘అమెరికా మిలటరీ ఫోర్స్ అన్‌స్టాపబుల్’
సైనిక శక్తిగా అమెరికాను ఎవరూ అడ్డుకోలేరని ట్రంప్ అన్నారు. అమెరికా పిల్లలు, భవిష్యత్ తరాల కోసం చేసిన ‘‘నిజమైన పెట్టుబడి’’ యుద్ధమని ట్రంప్ వ్యాఖ్యానించారు.
వెనిజ్వెలా నాయకుడు నికోలస్ మదురోను పట్టుకోవడానికి అమెరికా సైన్యం చేపట్టిన ఆపరేషన్‌ను ప్రశంసించిన ఆయన తమ చర్యను ప్రపంచమంతా మెచ్చుకుందంటూ ధన్యవాదాలు తెలిపారు.
అమెరికా, వెనెజ్వెలా మధ్య ఇప్పుడు మంచి సంబంధాలున్నాయని.. రెండు దేశాలూ ఇప్పుడు వెంచర్ పార్టనర్స్ అని తెలిపారు. మిడిల్‌ఈస్ట్ చమురుపై ఇకపై తాము ఆధారపడటం లేదని, కానీ తమ మిత్ర దేశాల కోసం అవసరం ఉందని చెప్పారు.
ట్రంప్ తన తొలి పదవీకాలంలో ఇరాన్ సైనిక కమాండర్ ఖాసిం సులేమానీ హత్యను గుర్తు చేస్తూ, సులేమానీని 'రోడ్‌సైడ్ బాంబుల పితామహుడు' అంటూ అభివర్ణించారు.
ఒకవేళ సులేమానీ ఇప్పటికీ బతికే ఉంటే ఇప్పుడు వేరే విషయం మాట్లాడుకునే వాళ్లమని.. ఆయన ఉన్నా తామే విజయం సాధించి ఉండేవాళ్లమని ట్రంప్ పేర్కొన్నారు.
మొత్తం 19 నిమిషాల పాటు ట్రంప్ ప్రసంగం సాగింది.
‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఎందుకు అవసరమంటే..’
అమెరికా, ప్రపంచ భద్రత కోసం ఎపిక్ ఫ్యూరీ ఎందుకు అవసరమో వివరించడానికి తాను ఈ ప్రసంగం చేస్తున్నట్టు ట్రంప్ తెలిపారు.
గత 47 ఏళ్లలో ఇరాన్ లేదా దాని ప్రతినిధులు చేసిన 'ఉగ్రవాద దాడులను', ఇతర చర్యలను ఆయన చెప్పుకొచ్చారు. ఆ దేశాన్ని నడుపుతున్న పాలనను దుర్మార్గమైనదిగా, హంతక పాలనగా ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌లో ఇటీవలి కాలంలో నిరసనల అణచివేతలో వేలాది మంది పౌరులు మరణించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
ఇలాంటి నాయకులను అణ్వాయుధాలు పొందేందుకు అనుమతించకూడదని.. అది ఎప్పటికీ జరగనివ్వనని ట్రంప్ అన్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో ఇరాన్‌తో కుదుర్చుకున్న అణుఒప్పందం తప్పు అని, తాను దాన్ని రద్దుచేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానని ట్రంప్ తెలిపారు.
అణ్వాయుధ కార్యక్రమాన్ని ఇరాన్ కొనసాగించిందని, దీర్ఘశ్రేణి క్షిపణులను వేగంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేసిందని ట్రంప్ ఆరోపించారు.
అణ్వాయుధం తయారీ వరకు వచ్చిందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
‘హార్మూజ్‌ను తెరిపించే బాధ్యత మీదే’
2025 జూన్‌లో జరిగిన ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్ గురించి ట్రంప్ ప్రస్తావించారు.
ఇరాన్ అణుస్థావరాలను పూర్తిగా తుడిచిపెట్టామని ట్రంప్ తెలిపారు.
ఇజ్రాయెల్‌కు, గల్ఫ్ దేశాలకు ట్రంప్ కృతజ్ఞతలు చెప్పారు.
ఆ దేశాలు చాలా గొప్ప సహకారం అందించాయని, వాటికి ఏ రూపంలోనూ నష్టం జరగనివ్వబోమని ట్రంప్ అన్నారు.
ఇరాన్ ఆ దేశాలపై గతంలో దాడులు చేసిందని, ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికాను బెదిరించడంలో, సరిహద్దుల బయట తమ శక్తిని ప్రదర్శించడంలో ఇరాన్ ప్రభుత్వ సామర్థ్యాన్ని వ్యవస్థీకృతంగా తొలగిస్తున్నామని ట్రంప్ చెప్పారు.
మిడిల్ ఈస్ట్ నుంచి చమురు కావాల్సిన దేశాలు హార్మూజ్ జలసంధిని తెరిపించడానికి బాధ్యత తీసుకోవాలని ట్రంప్ పిలుపునిచ్చారు.
యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా మరింత సురక్షితంగా, బలంగా, సంపన్నంగా, ఇంతకుముందెన్నడూ లేనంత గొప్ప దేశంగా మారుతుందని హామీ ఇచ్చారు.
కాగా.. ట్రంప్ ప్రసంగం తర్వాత ఇరాన్ యుద్ధంపై అమెరికన్లకు గందరగోళం మరింత పెరిగిందని మాజీ విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్‌కు సీనియర్ సలహాదారుగా పనిచేసిన మెలిసా టుఫానియన్ బీబీసీతో చెప్పారు.
అమెరికన్లు సురక్షితంగా, భద్రంగా ఉండే స్పష్టమైన ప్రణాళిక, టైమ్ లైన్ ట్రంప్ ప్రసంగంలో లేవని ఆమె వ్యాఖ్యానించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)