You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆర్టెమిస్ II: చంద్రుడిని చుట్టిరావడానికి నలుగురు ఆస్ట్రోనాట్స్‌తో నింగిలోకి దూసుకెళ్లిన వ్యోమనౌక
కెన్నడీ అంతరిక్ష కేంద్రం, ఫ్లోరిడా
లాంచ్ ప్యాడ్ : 39B
సమయం : 2026, ఏప్రిల్ 1, బుధవారం సాయంత్రం 6:35 గంటలకు (భారత కాలమాన ప్రకారం ఏప్రిల్ 2, తెల్లవారుజామున సుమారు 4 గంటలకు )
కౌంట్ డౌన్ స్టార్ట్..
10,9,8,7,6,5,4,3,2,1
నలుగురు వ్యోమగాములతో నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకిదూసుకుపోయింది ఆర్టెమిస్ II
అయిదు దశాబ్దాల తరువాత
చంద్రుడిని చుట్టి వచ్చేందుకు నాసా ప్రయోగించిన మానవసహిత ఆర్టెమిస్ II విజయవంతంగా అంతరిక్షంలోకి బయల్దేరింది.
అయిదు దశాబ్దాల తరువాత మొదలైన ఈ నాసా ఆర్టెమిస్ II అంతరిక్ష నౌక ఇప్పుడు భూ కక్ష్యలో ఉంది. ఇది రాబోయే 24 గంటల పాటు కక్ష్యలోనే ఉంటుంది. అంతా సవ్యంగా సాగితే, చంద్రుడి వైపు పయనిస్తుంది.
ప్రయోగం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో నాసా అధికారి ఒకరు మాట్లాడుతూ, సిబ్బంది "సురక్షితంగా, క్షేమంగా, ఉత్సాహంతో ఉన్నారు’’ అని చెప్పారు.
"టేక్-ఆఫ్ అయిన కొద్దిసేపటికే వ్యోమగామి రీడ్ వైస్‌మాన్ , 'అద్భుతమైన దృశ్యం, మనకు అద్భుతమైన చంద్రోదయం కనిపించింది' అన్నారు."
తొలుత కొంత సాంకేతిక సమస్య ఏర్పడటంతో ఈ మిషన్ ప్రయోగం కొద్దిసేపు ఆలస్యమైంది.
లాంచ్ అబార్ట్ సిస్టమ్ బ్యాటరీపై ఇంజనీర్లు "ఊహించిన కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను" గుర్తించారని, అయితే "ఇది పరికరాలకు సంబంధించిన సమస్య అని భావిస్తున్నారని, దీనివల్ల ఈ ప్రయోగానికి ఎలాంటి ఆటంకం కలగదని" నాసా అధికారులు తెలిపారు.
కానీ ఇంజనీర్లు సమస్యను పరిష్కరిచండంతో ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది.
కౌంట్‌డౌన్ ప్రారంభం కావడానికి కొద్ది క్షణాల ముందు
"మేం మా కుటుంబాల కోసం వెళ్తున్నాం" అని పైలట్ విక్టర్ గ్లోవర్ అన్నారు.
"మేం మా సహచరుల కోసం వెళ్తున్నాం" అని మిషన్ స్పెషలిస్ట్ క్రిస్టినా కోచ్ అన్నారు.
"మేం మానవాళి మొత్తం కోసం వెళ్తున్నాం" అని మిషన్ స్పెషలిస్ట్ జెరెమీ హాన్సెన్ అన్నారు.
కౌంట్‌డౌన్ ముగియడానికి ఐదు నిమిషాల కంటే తక్కువ సమయం మిగిలి ఉండగా, క్రూ యాక్సెస్ ఆర్మ్ వెనక్కి తీసుకున్నారు. అంటే, ఇంతకుముందు బ్యాటరీ సమస్య తలెత్తినట్లుగా పేర్కొన్న లాంచ్ అబార్ట్ సిస్టమ్ పూర్తిగా సిద్ధమైనట్లు.
ఈసారి భూమ్మీద నివసించిన ఎవరూ కూడా చంద్రుడి మీద ప్రయాణించలేని ప్రాంతాలకు ఈ కొత్త మిషన్ తీసుకెళ్లనుంది.
నలుగురు వ్యోమగాములు సుమారు 8 లక్షల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి, చంద్రుడి చుట్టూ తిరిగి భూమికి చేరుకుంటారు.
ఇది భవిష్యత్తులో చంద్రుడిపై దిగడం, అక్కడే స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం వంటి వాటికి మార్గం సుగమం చేసే మిషన్..
మరో గ్రహంపై ఎలా జీవించాలో మనిషి నేర్చుకునే తొలి అడుగుగా దీనిని అభివర్ణిస్తున్నారు.
అయితే.. వ్యోమగాములకు ఇందులో అనేక సవాళ్లు ఉన్నాయి. మినీబస్ పరిమాణంలో ఉన్న వ్యోమ నౌకలో 10 రోజులపాటు ఆ నలుగురు వ్యోమగాములు గడపాల్సి ఉంటుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)