సూయజ్ కాలువ సమీపంలోని జలసంధినీ మూసేస్తామంటూ ఇరాన్ హెచ్చరికలు.. మరిన్ని కష్టాలు తప్పవా?

చదివే సమయం: 6 నిమిషాలు

ఎర్రసముద్రంలోని అత్యంత కీలకమైన రవాణా మార్గానికి సంబంధించి ఇరాన్ చేస్తున్న హెచ్చరికలతో ప్రపంచ వాణిజ్యానికి మరిన్ని సమస్యలు తలెత్తవచ్చన్న ఆందోళన పెరుగుతోంది.

ఇరాన్ ఇప్పటికే హార్ముజ్ జలసంధిని తీవ్రంగా ప్రభావితం చేసి, పర్షియన్ గల్ఫ్‌లో సముద్ర రవాణాను దాదాపు స్తంభింపజేసింది.

ఇప్పుడది గల్ఫ్ ఆఫ్ ఏడెన్ - ఎర్ర సముద్రం మధ్యన ఉండే బాబ్ అల్ మందేబ్ స్ట్రెయిట్‌ (సూయజ్ కాలువకు వెళ్లే మార్గం) మీదుగా జరిగే వాణిజ్య కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తామని హెచ్చరికలు చేస్తోంది.

అమెరికా సైనికులను రంగంలోకి దించితే యుద్ధంలో "సెకండ్ ఫ్రంట్‌కి సిద్ధమవుతాం" అని ఇరాన్ స్పష్టం చేసింది.

"ప్రపంచంలోని వ్యూహాత్మక జలసంధులలో బాల్ అల్ మందేబ్ స్ట్రెయిట్ ఒకటిగా పరిగణిస్తారు. కేవలం హెచ్చరికలకే పరిమితం కావడం ఇరాన్ ఉద్దేశం కాదు, దానిని చేసి చూపించే సామర్థ్యం కూడా ఉంది" అని ఇరాన్ సైనిక వర్గాలను ఉటంకిస్తూ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్‌ అనుబంధ మీడియా సంస్థ తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

అమెరికా ఖార్గ్ ఐలాండ్‌పై దాడి చేస్తే ఆ జలసంధిని దిగ్బంధిస్తామని ఇరాన్ హెచ్చరికలు చేసింది.

ఖార్గ్ ద్వీపం ప్రధాన చమురు కేంద్రంగా ఉంది. ఇరాన్ చమురును స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటున్నానని, అలాగే ఆ ద్వీపాన్ని విలీనం చేసుకునే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.

బాబ్ అల్ మందేబ్ ఎందుకంత కీలకం?

బాబ్ అల్ మందేబ్ జలసంధి ఎర్ర సముద్రానికి అరబ్ ప్రాంతం వైపు యెమెన్‌కు, ఆఫ్రికా వైపు జిబౌటి, ఎరిట్రియాకు మధ్యన ఉంటుంది. హిందూ మహాసముద్రం, ఏడెన్ గల్ఫ్ వైపు నుంచి వచ్చే సముద్ర ట్రాఫిక్ సూయజ్ కాలువను దాటేందుకు ఈ జలసంధి మీదుగానే ప్రయాణించాలి.

1869లో సూయజ్ కాలువ ప్రారంభం తర్వాత, దాదాపు 115 కిలోమీటర్ల పొడవు, 36 కిలోమీటర్ల వెడల్పైన ఈ జలసంధి ప్రపంచ వాణిజ్యంలో కీలకంగా మారింది. ఇది యూరప్, ఆసియా మధ్య దూరాన్ని తగ్గించింది.

ప్రపంచవ్యాప్తంగా, మొత్తం సముద్ర రవాణాలో దాదాపు నాలుగో వంతు రవాణా ఈ ఎర్ర సముద్ర మార్గంమీదుగానే జరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత రద్దీ సముద్ర మార్గాల్లో ఇది కూడా ఒకటి.

ప్రపంచ మొత్తం చమురు రవాణాలో 20 శాతం హార్ముజ్ జలసంధి మీదుగానే జరుగుతుంది, అయితే యుద్ధం కారణంగా ఇది దాదాపు మూతపడింది. ఒకవేళ బాబ్ అల్ మందేబ్‌ జలసంధి కూడా మూతపడితే, ప్రపంచ చమురు సరఫరాలో మరో 12 శాతం ప్రభావితమవుతుంది.

యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. మిడిల్ ఈస్ట్ నుంచి ఆసియాతో పాటు పశ్చిమ దేశాలకు ఈ మార్గంమీదుగానే రోజుకు సుమారు 50 లక్షల బ్యారెళ్ల చమురు సరఫరా అవుతోంది.

దానితో పాటు మొత్తం లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) రవాణాలో సుమారు 8 శాతం ఈ స్ట్రెయిట్ మీదుగానే వెళ్తుంది. కాబట్టి, ప్రపంచ ఇంధన సరఫరాలో ఇదొక కీలకమార్గం.

వాస్తవానికి, హార్ముజ్ జలసంధి తీవ్రంగా ప్రభావితమైనప్పటి నుంచి ప్రపంచ వాణిజ్యపరంగా ఎర్ర సముద్రం ప్రాముఖ్యం పెరిగింది. యన్బు పోర్టు నుంచి సౌదీ ఆయిల్ రవాణా చేసేందుకు సౌదీ అరేబియా బాబ్ అల్ మందేబ్‌ను రవాణా కేంద్రంగా వాడుకోవడం మొదలుపెట్టింది. తమ తూర్పు చమురు క్షేత్రాల నుంచి పైప్‌లైన్ ద్వారా రోజూ లక్షలాది బ్యారెళ్ల ముడిచమురును తరలిస్తోంది.

ముడిచమురు, గ్యాస్ మాత్రమే కాకుండా తూర్పు, పశ్చిమ దేశాల మధ్య ప్రధాన సముద్ర వాణిజ్య మార్గాల్లో బాబ్ అల్ మందేబ్ చాలా కీలకం. ఈ మార్గంమీదుగా ప్రతిరోజూ డజన్ల కొద్దీ సరకు రవాణా నౌకలు రాకపోకలు సాగిస్తాయి.

ఒకవేళ ఈ జలసంధి మూతపడితే, 2021 నాటి ఘటనల తరహాలోనే ఆ ప్రభావం ఉంటుంది. ఆ సమయంలో పనామా జెండా కలిగిన ఎవర్ గివెన్ అనే భారీ సరకు రవాణా నౌక సూయజ్ కాలువలో చిక్కుకుపోయింది. దీంతో ప్రపంచ సరఫరా గొలుసుకు అంతరాయం కలిగింది. చమురు, పలురకాల నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయి. వాటి లభ్యతలో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి.

హూతీ రెబల్స్ పాత్ర

బాబ్ అల్ మందేబ్‌ జలసంధిపై ఎలాంటి దాడి జరిగినా, యెమెన్‌లో ఇరాన్ మద్దతున్న రాజకీయ, సాయుధ గ్రూపు అయిన హూతీ రెబల్స్ నుంచే జరిగే అవకాశముంది.

పేరు వెల్లడించకూడదన్న షరతుతో హూతీ నాయకుడొకరు వార్తా సంస్థ రాయిటర్స్‌తో మాట్లాడుతూ, ఇరాన్‌కు మద్దతుగా బాబ్ అల్ మందేబ్‌ జలసంధిని టార్గెట్ చేసేందుకు తమ గ్రూప్ "మిలిటరీపరంగా సిద్ధం"గా ఉందని చెప్పారు.

మార్చి 28న ఇజ్రాయెల్‌పై హూతీలు దాడుడు చేశారు. ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలో హూతీల తొలిదాడి ఇది. యెమెన్ నుంచి వచ్చిన రెండు మిసైల్స్‌ను కూల్చివేసినట్లు ఇజ్రాయెల్ కూడా పేర్కొంది.

ఈ మిలిటరీ గ్రూపు ఎర్ర సముద్ర తీరప్రాంతాన్ని నియంత్రిస్తోంది. గాజా యుద్ధ సమయంలోనూ బాబ్ అల్ మందేబ్ జలసంధిని లక్ష్యంగా చేసుకుంది. హూతీలు మిసైల్స్, డ్రోన్లతో 100కు పైగా వాణిజ్య నౌకలపై దాడులు చేసి, రెండు నౌకలను ముంచేశారు. నలుగురు నావికులను హతమార్చారు.

ఈ గ్రూపు 2023 నవంబర్‌లో జపాన్ నిర్వహణలో ఉన్న, బ్రిటన్‌ యాజమాన్యానికి చెందిన ఒక సరకు రవాణా నౌకను హెలికాప్టర్‌ ఉపయోగించి హైజాక్ చేసింది.

తాము ఇజ్రాయెల్‌కు సంబంధించిన నౌకలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లు హూతీలు చెప్పినప్పటికీ, విచక్షణారహితంగా దాడులు చేశారన్న వాదనలున్నాయి. ఆ తర్వాత ప్రపంచంలోని అనేక అతిపెద్ద షిప్పింగ్, చమురు కంపెనీలు ఆ ప్రాంతం మీదుగా తమ నౌకల రాకపోకలను నిలిపివేశాయి.

హూతీలు లొంగిపోయారంటూ అమెరికా, అమెరికాయే వెనక్కి తగ్గిందంటూ హూతీల ప్రతిస్పందనలతో, ఎట్టకేలకు దాడులు సద్దుమణిగాయి. కానీ, అవి మళ్లీ మొదలు కావొచ్చంటూ అనలిస్టులు ఆందోళన చెందుతున్నారు.

"యుద్ధం ఎక్కువకాలం కొనసాగితే, యెమెన్ హూతీలు కూడా జోక్యం చేసుకుంటారని ఎప్పటినుంచో అనుకుంటున్నదే" అని బీబీసీ చీఫ్ ఇంటర్నేషనల్ కరస్పాండెంట్ లైస్ డూసెట్ అన్నారు.

"వాయువ్య యెమెన్‌లో హూతీలకు గట్టి పట్టుంది. తమ శక్తివంతమైన ఆయుధాన్ని వాళ్లింకా ప్రయోగించలేదు, అదేంటంటే.. ఎర్ర సముద్రాన్ని ప్రపంచ వాణిజ్య మార్గాలతో అనుసంధానం చేసే కీలక సముద్ర మార్గమైన బాబ్ అల్ మందేబ్‌ మీదుగా రాకపోకలకు అంతరాయం కలిగించడం" అని ఆమె అన్నారు.

"ఇజ్రాయెల్, గాజా మధ్య 2025 అక్టోబర్‌లో ఒప్పందం కుదిరినప్పటి నుంచి హూతీ టెర్రరిస్ట్ గ్రూప్ వాణిజ్య నౌకలపై ఎలాంటి దాడులు చేయనప్పటికీ, ఈ ప్రాంతంలోని వాణిజ్య నౌకలతోపాటు అమెరికా ఆస్తులకు హూతీల నుంచి ముప్పు పొంచి ఉంది" అని అమెరికన్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ ఫిబ్రవరి 26న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

సముద్ర రవాణాపై ఒత్తిడి

బాబ్ అల్ మందేబ్ అంటే "కన్నీటి ద్వారం" లేదా "దు:ఖ ద్వారం" అనర్థం. అక్కడ నెలకొని ఉన్న ప్రమాదాలను ఈ పేరు ప్రతిబింబిస్తుంది. అక్కడి బలమైన ప్రవాహాలు, అనూహ్యంగా వీచే గాలుల దగ్గరి నుంచి దొంగతనాలు, ఘర్షణల వరకు అనేక ప్రమాదాలున్నాయి.

2008 నుంచి 2012 మధ్య బాబ్ అల్ మందేబ్ జలసంధి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో సముద్ర దొంగతనాలు జరిగాయి. వీటిలో ఎక్కువ భాగం సోమాలియా గ్రూపులు ఆధ్వర్యంలో జరిగినవే. డబ్బుల కోసం నౌకలోని సిబ్బందిని కిడ్నాప్ చేసేవారు. ఈ ఘటనల తర్వాత దేశాలు, షిప్పింగ్ కంపెనీలు ఈ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశాయి.

ఇప్పుడు ఈ మార్గాన్ని కూడా మూసేస్తే, హార్ముజ్ కారణంగా ఇప్పటికే ఇంధన మార్కెట్‌లో నెలకొన్న సంక్షోభం మరింత ముదురుతుంది.

గల్ఫ్ ప్రాంతంలో షిప్పింగ్ అంతరాయాల కారణంగా బ్రెంట్ ముడిచమురు ధరలు 115 డాలర్లకు పెరిగాయి. ఈ సంక్షోభానికి ముందు 70 డాలర్ల వద్ద ఉండేవి.

ఎన్నో రకాల వస్తువుల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల వరకు ప్రపంచవ్యాప్తంగా సరకు రవాణాపై కూడా ఈ ప్రభావం పడింది. మరో సముద్ర మార్గం కూడా మూతపడితే ధరలు మరింత పెరగడంతో పాటు ఇరాన్ ఘర్షణ మూలంగా తలెత్తిన సంక్షోభం మరింత తీవ్రమవుతుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)