‘‘క్షిపణి దాడికి మా ఓడ మునిగిపోయింది, 24 గంటల తర్వాత ఎలా బతికి బయట పడ్డామంటే..’’- భయానక అనుభవాన్ని వెల్లడించిన నావికుడు

చదివే సమయం: 6 నిమిషాలు

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన రోజు హసన్‌ ప్రయాణించాల్సిన నౌక దక్షిణ ఇరాన్‌లోని ఒక ఓడరేవులో సిమెంట్‌ నింపుకుని సిద్ధంగా ఉంది.

‘‘ఈ దాడుల వల్ల భయంకరమైన పేలుళ్లు సంభవించాయి. ఓడరేవు అంతటా మంటలు, శిథిలాలు కనిపించాయి’’ అని పాకిస్తానీ నావికుడు హసన్ ( భద్రతా కారణాల దృష్ట్యా పేరు మార్చాం) చెప్పారు.

‘‘అది ఏదో సినిమాలోని సన్నివేశంలా అనిపించింది. అప్పుడు దాడులు మాకు చాలా దగ్గర్లో జరుగుతున్నాయి’’ అని ఆయన వివరించారు.

కొన్ని రోజుల తర్వాత నావికులు సముద్ర ప్రయాణానికి బయలుదేరారు. కానీ వారి ఓడపై క్షిపణుల దాడి జరగగడంతో అది మునిగిపోయింది

సముద్రం నుంచి లైఫ్ జాకెట్లు, నీటిపై తేలే కొన్ని పైపుల సహాయంతో ప్రాణాలతో బయటపడ్డామని హసన్ వివరించారు.

"నీళ్లు చాలా చల్లగా, ప్రమాదకరంగా ఉన్నాయి" అని 22 ఏళ్ల హసన్ చెప్పారు.

మొదట తమకు సహాయం అందుతుదని వారంతా అనుకున్నారు. అది జరగదని కొన్ని క్షణాల తర్వాత వారికి అర్ధమైంది. వాళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కనీసం ఒకరినొకరు చూసుకోలేకపోయారు.

"మేం సముద్రంలోకి కొట్టుకుపోతామేమో, ఎవరూ గమనించరేమో అనిపించింది. సమయం ఆగిపోయినట్టు, ఏ క్షణంలోనైనా మేం చనిపోవచ్చని భయంవేసింది" అని హసన్ గుర్తుచేసుకున్నారు.

‘కొత్త జీవితం అనిపించింది’

సముద్రంలో 24 గంటలు గడిపిన తర్వాత హసన్‌ను, ఐదుగురు సిబ్బందిని(ఒక పాకిస్తానీ, నలుగురు ఇరానియన్లు) ఒక ఇరాన్ నౌక రక్షించింది.

"నేను బతుకుతాననే ఆశే లేదు. మమ్మల్ని రక్షించి, ఆహారం, నీరు ఇచ్చినప్పుడు, ఏదో అద్భుతం జరిగిందని, కొత్త జీవితం లభించిందని నాకు అనిపించింది" అని హసన్ తెలిపారు.

‘సరైన తిండి, నీళ్లు లేకుండా కష్టతరమైన ప్రయాణం’

గల్ఫ్‌లో చిక్కుకుపోయిన దాదాపు 3,000 చిన్న, పెద్ద నౌకలకు చెందిన 40,000 మంది నావికులలో హసన్ ఒకరు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో అనేక నౌకలు చిక్కుకుపోయాయి.

చిక్కుకుపోయిన నౌకలు దాదాపు మూడువేలు ఉంటాయని బంగ్లాదేశ్ మర్చంట్ మెరైన్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు చెందిన కెప్టెన్ అనం చౌధురి అంచనావేశారు.

ఇప్పుడు కచ్చితమైన సంఖ్యను అంచనా వేయవచ్చు కాబట్టి ఆ మొత్తం ఇంకా ఎక్కువగా ఉండవచ్చని అంటున్నారు.

ఇరాన్‌పై దాడుల తర్వాత ఇంటికి చేరుకోగలిగిన కొద్దిమంది నావికుల్లో హసన్ ఒకరు.

వారు ఇరాన్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఓడ యజమానులు హసన్‌కు, ఆయన తోటి పాకిస్తానీ సిబ్బందికి వారి పాస్‌పోర్ట్‌లను తిరిగి ఇచ్చి, వారి ప్రయాణం కోసం డబ్బు ఇచ్చారు. అయితే వారికి ఐదు నెలల భత్యం అందలేదు. దాని విలువ సుమారు 2,50,000 పాకిస్తానీ రూపాయలు.

ఇరాన్ నో-ఫ్లై జోన్‌ను కఠినంగా అమలు చేస్తుండటంతో హసన్ మోటార్‌వే ద్వారా పాకిస్తాన్‌కు ప్రయాణించాల్సి వచ్చింది. ఇందుకోసం ఆయనకు 24 గంటల సమయం పట్టింది.

నగరంపై మరిన్ని క్షిపణి దాడులు జరగవచ్చని ప్రజలు కొందరు భయపడి అక్కడినుంచి వెళ్లిపోతుండడంతో తెహ్రాన్ రోడ్లపై కూడా భారీగా ట్రాఫిక్ నెలకొంది.

ప్రతిచోటా పోలీసు చెక్‌పోస్టులు ఉన్నాయని, అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ప్రయాణికులను వెళ్లనిస్తున్నారని వారు చెప్పారు. ఆహారం, నీళ్లు అంతగా అందుబాటులో లేకపోవడంతో తమ దగ్గర ఉన్న మూడు చిప్స్ ప్యాకెట్లు, రెండు వాటిర్ బాటిల్స్‌‌తోనే ప్రయాణం పొడవునా సరిపెట్టుకోవాల్సివచ్చిందని తెలిపారు.

మరో కుటుంబంలో తీవ్ర విషాదం

ఇరాన్ నుంచి అందరు నావికులూ ప్రాణాలతో బయటపడలేకపోయారు. మార్చి 24న అదే ఓడరేవుపై జరిగిన క్షిపణి దాడిలో పాకిస్తానీ నావికుడు యాసిర్ ఖాన్ మరణించారు.

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఓడలపై జరిగిన దాడుల్లో పదులసంఖ్యలో నావికులు మరణించారని చౌధురి తెలిపారు.

కొన్నిరోజులుగా కరాచీలోని మనోరా ద్వీపంలో ఉన్న యాసిర్ ఇంటికి వచ్చి అనేకమంది తమ సంతాపం తెలియజేస్తున్నారు. ఆహారం తెచ్చి ఇస్తున్నారు. పాకిస్తాన్‌లో సంప్రదాయాల ప్రకారం దుఃఖంలో ఉన్న కుటుంబంలో వంట చేయరు.

యాసిర్‌ ఎప్పుడూ సంతోషంగా ఉండే, ఇతరులతో మంచిగా ప్రవర్తించే వ్యక్తని ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు చెబుతున్నారు.

"మా నాన్న ధైర్యంగా ఉన్నారు. కానీ మా అమ్మ, వదిన పరిస్థితి చాలా దారుణంగా ఉంది" అని యాసిర్ సోదరుడు వాజిద్ చెప్పారు.

''యాసిర్ మృతదేహం ఎప్పుడు వస్తుంది? ఎందుకిన్ని రోజులు పడుతోంది?' అని వాళ్లు అడిగేవారు. నా శక్తికొద్దీ మా అమ్మ తినేలా చేయగలిగా. కానీ యాసిర్ భార్య ఏమీ తినడం లేదు'' అని వాజిద్ ఆవేదన వ్యక్తంచేశారు.

24 ఏళ్ల యాసిర్‌ ఒక టగ్‌బోట్‌లో నావికునిగా ఉద్యోగం సంపాదించి గత సెప్టెంబర్‌లో తొలిసారి ఇరాన్‌కు వెళ్లారని, ఆయనకు పెద్దపెద్ద కలలు ఉండేవని వాజిద్ చెప్పారు.

తన భార్య, బిడ్డను పోషించడానికి, వారికి మంచి జీవితాన్ని ఇవ్వడానికి కెరీర్‌లో ఎదగాలని ఆయన అనుకున్నారు. అందుకే ఇరాన్ వెళ్లారు.

ఈద్ మొదటి రోజు మార్చి 21న యాసిర్ ఎప్పటిలాగే తన కుటుంబానికి ఫోన్ చేశారుగానీ యుద్ధం గురించి మాట్లాడలేదు. ఆ తర్వాత ఆయన వాజిద్‌తో ఏకాంతంగా మాట్లాడారు. తనను అక్కడి నుంచి బయటకు తీసుకురావడానికి ఏదైనా మార్గం చూడాలని యాసిర్ అడిగినట్టు వాజిద్ తెలిపారు.

ఆ తర్వాత రోజుల్లో యాసిర్ నుంచి ఫోన్ రాకపోవడంతో ఏదో జరిగిందని వాజిద్ గ్రహించారు. "మాకు సాధ్యమైన ప్రతిచోట నుంచి సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాం" అని ఆయన చెప్పారు.

''యాసిర్ బతికి ఉంటారని అంటే ఒడ్డుకుగానీ, మరో ఓడ దగ్గరకుగానీ చేరుకుంటారని, లేదా గాయపడి ఉంటారని అనుకున్నా. కానీ వారి బోటుపై ఒక క్షిపణి పడడంతో యాసిర్ నిద్రలోనే మరణించాడని తర్వాత తెలిసింది'' అని వాజిద్ తెలిపారు.

నిమిషాల వ్యవధిలోనే ఓడ మొత్తం మునిగిపోయింది. అందులో ఉన్నవారందరూ నీళ్లల్లో మునిగిపోయారు. ఈ దుర్ఘటన నుంచి ఇంకోక పాకిస్తానీ నావికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

‘ఓడ మునిగిపోవడం వల్ల మంచే జరిగింది’

తన ఓడ మునిగిపోవడం వల్ల ఒక రకంగా మంచే జరిగిందని హసన్‌కు ఇప్పుడనిపిస్తోంది. ఒకవేళ అలా జరగకపోయి ఉంటే తాను ఇప్పటికీ ఇరాన్‌లోనే చిక్కుకుపోయి ఉండేవాణ్నని ఆయన భావిస్తున్నారు.

సరిహద్దు నుంచి తన ఇంటికి చేరుకోవడానికి హసన్‌కు మరో ఐదు రోజులు పట్టింది. అక్కడ ఆయన తల్లి, అత్తయ్య ఆనందబాష్పాలతో గుమ్మం దగ్గర ఎదురుచూస్తున్నారు.

"నేను మా అమ్మను ఎంతసేపు పట్టుకుని ఉన్నానో నాకు తెలియదు. ఇక నన్ను ఎవరూ బాధపెట్టలేరని నాకు అనిపించింది" అని హసన్ చెప్పారు.

దుబాయ్‌లో పనిచేస్తున్న తండ్రి నుంచి హసన్‌కు అప్పుడే ఫోన్ వచ్చింది. తన తండ్రి కూడా ఫోన్‌లో ఏడ్చారని హసన్ చెప్పారు.

‘‘ఆయన నాకు సర్దిచెప్పారు. ఆందోళన పడొద్దని, తనకు నైపుణ్యం ఉందని చెప్పారు. పాకిస్తాన్‌కు తిరిగి రావాలని నేను నాన్నను కోరాను. అయితే తాను వచ్చి తిరిగి దుబాయ్‌కి వెళ్లలేకపోతే డబ్బుల విషయంలో బాగా నష్టపోవాల్సివస్తుందని నాన్న చెప్పారు'' అని హసన్ తెలిపారు.

నావికుడిగా మారినందుకు హసన్‌కు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. కానీ తాను మళ్లీ ఇరాన్‌లో పని చేయడానికి వెళ్లనని ఆయన అంటున్నారు.

వాజిద్ కుటుంబం యాసిర్ మృతదేహాన్ని ఖననం చేసింది. కానీ ఆయన మరణం కలిగించిన షాక్ నుంచి కోలుకోవడానికి వారికి చాలా కాలం పడుతుంది.

యాసిర్ కొడుకు వయసు కేవలం మూడేళ్లు.

"నేను వాడినే చూస్తుండిపోతుంటాను. అసలు ఏం జరిగిందో అర్థంకాని వయసు వాడిది" అని వాజిద్ ఆవేదన వ్యక్తంచేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)