You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రాకాస మూవీ రివ్యూ: ‘కోటలోని రాక్షసుడు’ భయపెట్టాడా.. బోర్ కొట్టించాడా?
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
- చదివే సమయం: 4 నిమిషాలు
నిహారిక కొణిదెల తొలి సినిమా కమిటీ కుర్రాళ్లు హిట్. రాకాస రెండో సినిమా. నిహారిక ఈ సినిమాకు భారీగా ప్రమోషన్లు చేశారు.
మ్యాడ్ సిరీస్‌తో కామెడీ పండించిన సంగీత్ శోభన్ హీరో. దర్శకురాలిగా మానస శర్మకు మొదటి సినిమా. మరి.. ఈ హారర్ కామెడీ వర్కవుట్ అయిందా?
ఇది చందమామ కథలాంటిది. ఒక గ్రామంలో పురాతన కోట. అక్కడ ఒక రాక్షసుడు వేల ఏళ్ల నుంచి ఉంటాడు. అతను బలి కోరుతాడు.
మూడు హెచ్చరికలు అందినప్పుడు ఒక మనిషిని పంపాలి. ఇది గతం.
ప్రస్తుతానికి వస్తే ఈరబాబు (సంగీత్ శోభన్) తన ప్రియురాలు సుకన్యని పెళ్లి చేసుకుందామని అమెరికా నుంచి సొంత ఊరికి వస్తాడు. అయితే అదే రోజు ఆమె పెళ్లి.. ఆపడానికి ప్రయత్నించి విఫలమవుతాడు.
ఎలా ఉందంటే...
ఆ తర్వాత హీరో సుబ్బలక్ష్మి (నయన్‌సారిక) ప్రేమలో పడతాడు. అయితే ఊళ్లో నుంచి సోము (వెన్నెల కిషోర్) మాయమవడంతో అతన్ని ఈరబాబే చంపాడని అంటారు. ఈ లోగా మూడు హెచ్చరికలు వస్తాయి.
బలికి ఈరబాబు వెళ్లాల్సి వస్తుంది. కోటలోకి వెళ్లిన అతను ఏమయ్యాడు? రాక్షసుడు ఏం చేసాడు? ఇది మిగతా కథ.
హిందీలో స్త్రీ లాంటి సినిమాలు బ్లాక్ బ్లస్టర్ అయిన తర్వాత తెలుగులో ఈ జానర్ పెరిగింది. ఈ మధ్య వచ్చిన శంబాల ఇలాంటిదే. కోటలో రాక్షసుడు భయపెట్టడం రాజాసాబ్.
భయపడడాన్ని ఇష్టపడేవాళ్లు హారర్ సినిమాలు చూస్తారు. భయంతో పాటు నవ్వుకూడా వస్తే హారర్ కామెడీ. హిందీలో రామ్‌సే బ్రదర్స్ (ఏడుగురు అన్నదమ్ములు) జీవితమంతా ప్రేక్షకుల్ని భయపెట్టే సినిమాలు 34 తీశారు. అంతటితో ఆగకుండా టీవీ సిరీస్ కూడా చేశారు.
రాకాస సినిమా భయపెడుతూ నవ్వించడానికి తీశారు. లాజిక్‌లు అడక్కుండా చూడాలి. అయితే చెప్పే కథలో కొంచెమైనా స్పష్టత, సూటిదనం ఉండాలి. సినిమా నాన్ సింక్‌లో ఉంటుంది. పాత్రలన్నీ తలాతోకా లేకుండా వ్యవహరిస్తూంటాయి. అదంతా కామెడీ కోసమే అనుకున్నా ఫస్ట్‌హాఫ్‌లో కథ కొంచెం కూడా కదలదు.
కోటలోని రాక్షసుడు ఈరబాబును ఏం చేశాడు?
ట్రైలర్ చూడగానే కథ అర్థమైపోతుంది. సినిమా బిగినింగ్‌లోనే కోటలోని రాక్షసుడు సీన్‌తో తర్వాత జరిగేది తెలుస్తుంది.
కోటలోకి హీరో మిత్ర బృందంతో ఎంటరైన తర్వాత వచ్చే కామెడీ కోసం ఆడియన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఎంతకీ కథలోకి అసలు పాయింట్ రాదు.
హీరో భగ్న ప్రేమ , కొత్త ప్రేమ, సోము మిస్సింగ్ ఇలా ఏవేవో జరిగి ఇంటర్వెల్ వరకు లాక్కొస్తారు. సెకెండాఫ్‌లో కోట కామెడీ. అనేక సినిమాల్లో చూసిందే. కొత్తగా ఏమీలేదు. 1981లో వచ్చిన రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ సీన్స్ ఇప్పుడు చూపించడం ఆశ్చర్యం.
సంగీత్ శోభన్ , గెటప్ శీను, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ మంచి టైమింగ్ ఉన్న నటులు. సరైన సీన్స్ పడితే కామెడీ ఉండేది. ఫస్టాఫ్ ల్యాగ్ పక్కన పెడితే సెకెండాఫ్ కొంచెం బాగానే నవ్విస్తుంది. ఆఖరి ట్విస్ట్ డిఫరెంట్‌గా వుంది.
చిన్న సినిమా అయినా నిహారిక బాగానే ఖర్చు పెట్టినట్లు. గ్రాఫిక్స్‌కి ఎక్కడా తగ్గలేదు. పాటలు చెప్పుకోడానికి ఏం లేదు. బీజీఎం ఓకే. ఎడిటింగ్ షార్ప్‌గా ఉండి నిడివి విషయంలో జాగ్రత్త పడ్డారు.
హీరోయిన్ నయన్‌సారికకు నటించడానికి స్కోప్ లేదు. తనికెళ్ల భరణికి పురోహితుడి పాత్రలు కొట్టిన పిండి.
సంగీత్ శోభన్ ఎక్స్‌ప్రెషన్స్‌తో , కామెడీతో సినిమా మొత్తం మోయగలడు. అతను హీరోగా ఫుల్ లెంగ్త్ కామెడీలు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.
నత్తనడకని భరిస్తూ , అక్కడక్కడ నవ్వుకోడానికి , ఈ జానర్‌ని ఇఫ్టపడేవాళ్లు చూడొచ్చు.
ప్లస్ పాయింట్స్:
1.సెకెండాఫ్ కామెడీ
2.కెమెరా
3.నిడివి
మైనస్ పాయింట్స్:
1.తలాతోకా లేని కథనం
2.కొత్తదనం లేకపోవడం
రాక్షసుడు పెద్దగా భయపెట్టడు, నవ్వించడు, బట్ ఓకే.
(గమనిక: అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)