You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చెడు వాసన వల్ల శరీరంలో ఏం జరుగుతుంది? వాసన చూసే శక్తి తగ్గిపోవడం ప్రాణాపాయమా?
- రచయిత, క్రిస్ మార్షల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 5 నిమిషాలు
దారిలో ఎదురయ్యే కొన్ని వాసనలు కేవలం అసహ్యానికి గురిచేయడమే కాదు, అవి మీ శరీరాన్ని, మనస్సును కూడా ప్రభావితం చేస్తాయి.
ఇంగ్లండ్‌లోని వెస్ట్‌బరీ నివాసి, రిటైర్డ్ టీచర్ ఎలైన్ కార్నర్ అనుభవం దీనికి ఒక ఉదాహరణ. వేసవిలో తన తోటలో నడవడం భరించలేనట్లుగా ఉంటుందని ఆమె అంటున్నారు. అక్కడ "తెరిచి ఉన్న చెత్త లారీ వెనుక నడుస్తున్నట్లు" ఉంటుందని కార్నర్ చెప్పారు.
ఇంట్లోని కిటికీలన్నీ మూసివేసినా, సమీపంలోని వ్యర్థాల శుద్ధి ప్లాంట్ నుంచి వచ్చే ఆ భయంకరమైన వాసన నుంచి తప్పించుకోలేకపోతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"మేం మా తోటను వాడుకోలేం, కనీసం వాకింగ్‌కు వెళ్లలేం, వాంతి వచ్చేలా అనిపిస్తుంది" అని కార్నర్ అంటారు.
మనమందరం ఎప్పుడో ఒకప్పుడు చెత్తను పారవేసేటప్పుడు లేదా ఫ్యాక్టరీల పక్కన వెళ్లేటప్పుడు ఇటువంటి వాసనను అనుభవించే ఉంటాం. కానీ, అటువంటి దుర్వాసన మధ్య నిరంతరం జీవించాల్సి వస్తే.. పరిస్థితిని ఒక్కసారి ఊహించుకోండి.
వాయు కాలుష్యం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై మనం పెద్దగా శ్రద్ధ చూపం. చెడు వాసనలను తరచుగా చిన్నవిగా కొట్టిపారేస్తుంటాం. చూపు, వినికిడి, స్పర్శ, రుచితో పోలిస్తే ప్రజలు వాసన చూసే శక్తికి తక్కువ ప్రాధాన్యత ఇస్తారని పరిశోధనలు చెబుతున్నాయి. తమ ఫోన్ కంటే వాసన చూసే శక్తిని కోల్పోవడానికే ఇష్టపడతామని కొంతమంది అమెరికన్ కాలేజీ విద్యార్థులు చెప్పారు.
అయితే, ఇది కేవలం అసౌకర్యం మాత్రమే కాదు, పట్టణ ప్రాంతాల్లోని దుర్వాసనలు తలనొప్పి, వికారం, శ్వాస ఇబ్బందులు, నిద్రాభంగం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవి దీర్ఘకాలిక మానసిక, శారీరక ప్రభావాలను కూడా చూపుతాయి.
ప్రమాదాన్ని సూచించే హెచ్చరిక
అనారోగ్యం లేదా ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడే ముందస్తు హెచ్చరిక సంకేతంగా వాసన చూసే శక్తి పరిణామం చెందింది. ఏదైనా కుళ్లిన వాసన వస్తుందంటే, అది మనకు హాని చేసే బ్యాక్టీరియాతో నిండి ఉందని అర్థం.
ఇది మన రోగనిరోధక వ్యవస్థలో ఒక భాగమని స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో వాసన శాస్త్రంలో ప్రొఫెసర్ జోహన్ లండ్‌స్ట్రోమ్ అన్నారు.
"పర్యావరణంలోని ప్రమాదాల గురించి మనల్ని హెచ్చరించడానికి ఒల్‌ఫ్యాక్టరీ సిస్టం (వాసనను గుర్తించే ఇంద్రియ వ్యవస్థ) ప్రాథమికంగా పనిచేస్తుంది" అని ఆయన చెప్పారు.
మనం పీల్చుకున్న వాసన సంకేతాలు కేవలం 300 మిల్లీ సెకన్లలోనే మెదడుకు చేరుతాయని ఆయన పరిశోధనలో వెల్లడైంది.
ఏదైనా ఒక వాసన వల్ల మనకు ప్రమాదం ఉందని తెలిసినప్పుడు, ఆ వాసనను పసిగట్టే శక్తి మనకు అమాంతం పెరిగిపోతుంది. ఉదాహరణకు, మురుగునీటి శుద్ధిలో వెలువడే 'హైడ్రోజన్ సల్ఫైడ్' అనే గ్యాస్‌కు కుళ్ళిన గుడ్ల వాసన ఉంటుంది. ఇది ప్రాణాంతకమైన గ్యాస్ కావడంతో, అతి తక్కువ పరిమాణంలో ఉన్నా మన ముక్కు దాన్ని వెంటనే పసిగట్టగలదు.
వాస్తవ ఆరోగ్య ప్రభావాలు
మంచి వాసనలు, ఉదాహరణకు అడవిలోని పరిమళం, మన మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎందుకంటే అవి మెదడులోని భావోద్వేగ, జ్ఞాపకశక్తి కేంద్రాలను ప్రేరేపిస్తాయి. దీనికి విరుద్ధంగా, దుర్వాసనలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
2021 నాటి ఒక సమీక్షా అధ్యయనం ప్రకారం, చెడు వాసనల వల్ల తలనొప్పి లేదా వాంతులు రావడం వెనుక బలమైన జీవశాస్త్ర కారణాలు ఉన్నాయి. దుర్వాసనలు మెదడును, పేగులను కలిపే వేగస్ నరాన్ని ప్రేరేపించడం ద్వారా వికారం కలిగిస్తాయి.
ఒక వాసన పట్ల మనకు ఉండే భయం లేదా ఆందోళన దాని ప్రభావాన్ని పెంచుతుందని అమెరికాలోని మోనెల్ కెమికల్ సెన్సెస్ సెంటర్‌లో కాగ్నిటివ్ సైకాలజిస్ట్ అయిన పామెలా డాల్టన్ అన్నారు. మానవ ఆరోగ్యంపై వాసనలు చూపే ప్రభావాల మీద డాల్టన్ గత 32 ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు.
కాగా, మీరు ఒక వాసన గురించి ఎంత ఎక్కువగా ఆందోళన చెందుతారో, అది మీ ఆరోగ్యంపై అంత ఎక్కువ ప్రభావం చూపుతుంది.
జీవనశైలి మార్పులు
నిరంతర దుర్వాసన జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. దీనివల్ల ప్రజలు తమ అలవాట్లను మార్చుకోవాల్సి వస్తుంది. ఎండగా ఉన్నా కిటికీలు మూసి ఉంచడం, వ్యాయామం కోసం బయటకు వెళ్లకపోవడం, స్నేహితులతో సమయం గడపడం మానేయడం వంటివి చేస్తారు.
"ఇది సామాజిక జీవితాన్ని దెబ్బతీస్తుంది'' అని కార్నర్ అన్నారు.
అయితే, ఒకే వాసనను ఒకరు భరించలేకపోవచ్చు, మరొకరు అసలు గమనించకపోవచ్చు. వయస్సు, లింగం, అలర్జీలు, ధూమపానం వంటి అలవాట్లు మనం వాసనలను గ్రహించే విధానాన్ని మారుస్తాయి. సాధారణంగా ఆహ్లాదకరమైన వాసనలకు మనం అలవాటు పడతాం, కానీ పదేపదే వచ్చే దుర్వాసనలను భరించడం సాధ్యం కాదు.
దుర్వాసన అనేది గాలి దిశను బట్టి మారుతూ ఉండవచ్చు. ఇది కొన్నిసార్లు ఒక వీధిలో ఉండి, పక్క వీధిలో ఉండకపోవచ్చు. అయితే, దుర్వాసనల ప్రభావం అందరిపై సమానంగా ఉండదు. తక్కువ ఆదాయం ఉన్న వారు నివసించే ప్రాంతాలు తరచుగా చెత్త కుప్పలకు లేదా భారీ పరిశ్రమలకు దగ్గరగా ఉంటున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
వాసన శక్తితో ప్రయోజనాలు
దుర్వాసనల మధ్య జీవించడం కష్టమైనప్పటికీ, వాసన చూసే శక్తి బలంగా ఉండటం మంచి ఆరోగ్యానికి సంకేతం. వాసన చూసే శక్తి ఎక్కువగా ఉన్నవారు ఆహారాన్ని, లైంగిక జీవితాన్ని మెరుగ్గా ఆస్వాదిస్తారని పరిశోధనలు చెబుతున్నాయి.
ఇక, వాసన చూసే శక్తి లేని వారు ఆహారంపై ఆసక్తిని కోల్పోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఆశ్చర్యకరంగా, వృద్ధులలో వాసన చూసే శక్తి తగ్గడం అనేది రాబోయే 10 ఏళ్లలో మరణించే ప్రమాదాన్ని (46 శాతం ఎక్కువ) సూచిస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇది అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులతో కూడా సంబంధం కలిగి ఉంటుంది.
"దశాబ్దాలుగా వాసనల మీద పరిశోధన చేస్తున్నాను కాబట్టి, నాకు ఏదైనా దుర్వాసన తగిలినా నేను పెద్దగా బాధపడను. ఎందుకంటే, నేను వాసనను బాగా పసిగట్టగలుగుతున్నానని దానర్థం" అని డాల్టన్ చెప్పారు.
కానీ, వెస్ట్‌బరీలోని కార్నర్ వంటి వారికి అది అంత సులభం కాదు. అక్కడి వేస్ట్ ప్లాంట్ నిర్వాహకులు ఈ సమస్యను పరిష్కరించడానికి పర్యావరణ సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)