మంట లేకుండా వంట: ప్రతిరోజూ 1500 మంది విద్యార్థులకు ఆహారం అందిస్తున్న 'ఫ్లేమ్‌లెస్ కిచెన్' ఇది..

చదివే సమయం: 5 నిమిషాలు

ఇరాన్‌‌తో అమెరికా - ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా ఎల్‌పీజీ సిలిండర్ల కొరత ఏర్పడింది. చాలాచోట్ల ప్రజలు సిలిండర్ల క్యూ కడుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్రలోని అకోలాకు చెందిన 'ప్రభాత్ స్కూల్' నిర్వహిస్తున్న ఫ్లేమ్‌లెస్ కిచెన్ (మంట లేని వంటగది) ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎందుకంటే, గ్యాస్ సిలిండర్ల కొరత ప్రభావం ఈ పాఠశాలపై అస్సలు పడలేదు.

ప్రభాత్ డే బోర్డింగ్ స్కూల్‌లో ఉన్న సుమారు 1500 మంది విద్యార్థులకు ఈ 'ఫ్లేమ్‌లెస్ కిచెన్'లో కేవలం రెండు గంటల్లోనే వంట పూర్తి చేస్తారు.

విశేషమేంటంటే, పొలాల్లోని వ్యర్థాలే ఇంధనంగా ఉపయోగించి ఈ కిచెన్‌ను నిర్వహిస్తున్నారు.

గ్యాస్ సిలిండర్ల కొరత, పెరుగుతున్న ధరల కారణంగా ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రజలలో చర్చ జరుగుతున్న తరుణంలో, ఈ కిచెన్ ఎలా పనిచేస్తుందో చూడటానికి బీబీసీ అక్కడికి వెళ్లింది.

పదేళ్లుగా పనిచేస్తున్న ‘ఫ్లేమ్‌లెస్ కిచెన్’

ఇది ఒక ప్రైవేట్ బోర్డింగ్ స్కూల్. ఇక్కడ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు ఉన్నారు. ఇది ఒక ప్రైవేట్ పాఠశాల, పాఠశాలలో ప్రవేశం కోసం విద్యార్థులు ఫీజు చెల్లించాలి.

ఈ స్కూల్‌లో విద్యార్థులకు ఉదయం 10.20 గంటలకు భోజనం, ఆ తర్వాత మధ్యాహ్నం అల్పాహారం అందిస్తారు.

పిల్లలకు పప్పు, అన్నం, కూర, చపాతీ, సలాడ్ వంటి రకాలతో భోజనం అందిస్తారు. ఏ కూర వండినా తినే అలవాటు పిల్లలకు కలగాలనే ఉద్దేశంతో పాఠశాలలోనే భోజనం పెట్టడం ప్రారంభించినట్లు పాఠశాల వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ గజానన్ నారే తెలిపారు.

''నేను బోధించే కాలంలో ఎనిమిదో తరగతి వరకు కేవలం ఆవకాయ-చపాతీ మాత్రమే తినే పిల్లలను చూశాను. కానీ, పిల్లలకు అన్ని రకాల ఆహార పదార్థాలను తినే అలవాటు ఉండాలి. పాఠశాల విద్య పూర్తి చేసుకున్న తర్వాత వారు మరే ఇతర ప్రాంతానికి వెళ్లినా, అక్కడ దొరికే ఆహారాన్ని తినగలిగేలా ఉండాలనే ఉద్దేశంతో మా పాఠశాలలోనే భోజన సౌకర్యం కల్పించాలని నిర్ణయించుకున్నాం" అని గజానన్ చెప్పారు.

పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచి విద్యార్థులకు భోజనం అందిస్తున్నారు. మొదట్లో వంట కోసం ఎల్‌పీజీ సిలిండర్లను వాడేవారు. రోజుకు 4 సిలిండర్లు అవసరమయ్యేవి, దానివల్ల ఖర్చు కూడా ఎక్కువగా ఉండేది.

అయితే, 'ఫ్లేమ్‌లెస్ కిచెన్' ప్రారంభమైన తర్వాత గత పదేళ్లలో గ్యాస్ సిలిండర్ల ఖర్చు లేకుండా ఆదా అయ్యింది.

ఈ ఫ్లేమ్‌లెస్ కిచెన్ ఎలా పనిచేస్తుందంటే...

ఈ మంటలేని కిచెన్‌లో భోజనం సిద్ధం చేయడానికి గ్యాస్‌కు బదులుగా పొలాల్లోని వ్యర్థాలను ఉపయోగిస్తున్నారు. ఇది 'థర్మిక్ ఫ్లూయిడ్ హీటర్ సిస్టమ్' వల్ల సాధ్యమైంది.

ఈ 'థర్మిక్ ఫ్లూయిడ్ హీటర్ సిస్టమ్' అంటే..

కిచెన్ బయట ఒక ఆయిల్ కంటైనర్‌లో 'ఫుడ్ గ్రేడ్ ఆయిల్' నిల్వ చేస్తారు. ఆ ఆయిల్ కంప్రెసర్ ద్వారా బాయిలర్‌లోకి చేరుతుంది. అక్కడ వేడెక్కి పైపుల ద్వారా వంట పాత్రల వరకు చేరుతుంది. ఈ బాయిలర్‌ను వంటగదికి బయట అమర్చారు.

పొలాల్లో వ్యర్థాలు అంటే కంది కట్టెలు, సోయాబీన్ వంటి ఇతర పంటల వ్యర్థాలను తగులబెట్టకుండా, వాటిని మెషిన్ ద్వారా 'పెల్లెట్లు ' (చిన్న ఉండలు లేదా బిళ్లలు)గా మారుస్తారు.

బాయిలర్‌లోని నూనెను వేడి చేయడానికి ఈ పెల్లెట్లను ఇంధనంగా ఉపయోగిస్తారు. వేడెక్కిన ఫుడ్ గ్రేడ్ ఆయిల్ కంప్రెసర్ ద్వారా కిచెన్‌లోని పొయ్యిపై కడాయిల వరకు వెళ్తుంది.

కిచెన్‌లోని ప్రతి పాత్రకు బయటి వైపు పైపులైన్ అమర్చి ఉంటుంది. ఆ పైపుల్లో ఈ వేడి ఆయిల్ తిరుగుతూ ఉంటుంది. దానివల్ల పాత్ర వేడెక్కి, అందులో వంట చేయడం సాధ్యమవుతుంది. చాలా చోట్ల చపాతీలు, అప్పడాలను కాల్చడానికి మంటను ఉపయోగిస్తారు. కానీ, ఇక్కడ ఎలాంటి మంట లేకుండానే వాటిని కాలుస్తారు.

వంట పూర్తయిన తర్వాత, ఈ ఆయిల్ మరొక కంప్రెసర్ ద్వారా తిరిగి సిస్టమ్‌లోకి వెళ్తుంది. ఏడాదిలో ఎక్కడైనా లీకేజీ జరిగితే తప్ప, అంతవరకు మాత్రమే నూనె వృథా అవుతుంది. అప్పుడు మాత్రమే తిరిగి నూనెను నింపుతారు.

అందువల్ల, ఈ ఫ్లేమ్‌లెస్ కిచెన్ నిర్వహణకు ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. పొలంలోని వ్యర్థాల నుంచి తయారయ్యే పెల్లెట్స్ కోసం రూ.1500 - రూ.2000 మాత్రమే ఖర్చవుతుందని ఈ పాఠశాల కిచెన్ ఇన్‌చార్జ్ నీరజ్ ఆవండేకర్ చెబుతున్నారు.

అయితే, పాత్రల కింద ఈ ఆయిల్ తిరుగుతున్న సమయంలో అది ఆహారంలో కలిసే ప్రమాదం ఉందా? అన్న ప్రశ్నకు నీరజ్ స్పందిస్తూ, ఈ సిస్టమ్‌లో ఉపయోగించే నూనె 'ఫుడ్ గ్రేడ్' రకానికి చెందినదని చెప్పారు.

"ఒక క్లోజ్డ్ పైప్‌లైన్ ద్వారా ప్రవహిస్తూ పాత్రలను కింద నుంచి వేడి చేస్తుంది. కాబట్టి ఆహారంలో నూనె కలిసే అవకాశమే లేదు. పైప్‌లైన్‌లో ఏదైనా కార్బన్ పేరుకుపోతే, దానిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉంటాం" అని ఆయన చెప్పారు.

ఫ్లేమ్‌లెస్ కిచెన్ ఎలా తయారైంది?

నీరజ్ ఆవండేకర్ చొరవతోనే ఈ పాఠశాలలో ఫ్లేమ్‌లెస్ కిచెన్ ప్రారంభమైంది. ఒక హోటల్‌లో ఈ రకమైన వంటగదిని చూసిన ఆయనకు ఆ ప్రయోగం బాగా నచ్చింది.

ఎల్‌పీజీ సిలిండర్ల కంటే పాఠశాలలో ఫ్లేమ్‌లెస్ కిచెన్ చాలా సురక్షితమైనదని నీరజ్ భావించారు. అందుకే ఈ పాఠశాలలో కూడా ఫ్లేమ్‌లెస్ కిచెన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.

ఇందుకోసం ఇండస్ట్రియల్ బాయిలర్ సిస్టమ్స్ తయారు చేసే ఒక ఇంజనీర్ ద్వారా ఈ వ్యవస్థను రూపొందించారు.

దీన్ని ఏర్పాటు చేయడానికి రూ.35 లక్షలు ఖర్చు చేశారు. ఇక ఆ తర్వాత గ్యాస్ కోసమో, మరే ఇంధనం కోసమో ప్రత్యేకంగా ఖర్చు చేయాల్సిన అవసరం రాలేదు.

అంతకుముందు రోజుకు కనీసం నాలుగు సిలిండర్లు అవసరమయ్యేవని, ఇప్పుడు ఆ ఖర్చు పూర్తిగా తగ్గిపోయిందని ఆవండేకర్ చెప్పారు.

ఈ సిస్టమ్‌కు ఎటువంటి మెయింటెనెన్స్ ఖర్చు కూడా ఉండదని ఆవండేకర్ చెబుతున్నారు.

''నేను అకోలాలోని ఒక ఇంజనీర్‌ను సంప్రదించి, మాకు ఎంత సురక్షితమైన కిచెన్ కావాలో వివరించాను. ఆయన అంతకుముందు స్టీమ్ బాయిలర్లలో పనిచేశారు. కానీ, థర్మిక్ ఫ్లూయిడ్ హీటర్ అనేది ఆయనకు కూడా ఇదే మొదటి ప్రయోగం. అయినప్పటికీ, ఆయన ఈ సిస్టమ్‌ను రూపొందించడంలో సఫలమయ్యారు. గత 10 ఏళ్లుగా ఇందులో ఇప్పటివరకు ఎటువంటి సాంకేతిక లోపం తలెత్తలేదు."

ఈ కిచెన్ ఎలా పనిచేస్తుంది?

ఈ ఫ్లేమ్‌లెస్ కిచెన్ ఎలా పనిచేస్తుందో చూడటానికి, వంట పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నాను. సాధారణంగా వంటగదిలో ఉండే వేడి ఇక్కడ అస్సలు లేదు, ఉష్ణోగ్రత సాధారణంగానే ఉంది.

ఇక్కడ చపాతీలు చేసే శాలూ కదమ్ మాట్లాడుతూ, ''మేం ఇక్కడ రెండు గంటల పాటు చపాతీలు చేస్తాం. సాధారణంగా గ్యాస్ పొయ్యి దగ్గర చపాతీలు చేస్తున్నప్పుడు విపరీతంగా చెమటలు పడతాయి, వేడిగా ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటిదేమీ లేదు'' అని చెప్పారు.

వేసవి కాలంలో కూడా తాము చపాతీలు చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగదని అన్నారు.

ఈ ఫ్లేమ్‌లెస్ కిచెన్‌లోని బాయిలర్‌ను వేడి చేయడానికి, పొలాల్లోని వ్యర్థాల నుంచి తయారైన 400 కిలోల పెల్లెట్స్‌ను ప్రతిరోజూ ఉపయోగిస్తారు. వీటిని మండించడం వల్ల వచ్చే పొగను పైపుల ద్వారా వాతావరణంలోకి చాలా ఎత్తులో వదులుతారు.

పొలంలో వ్యర్థాలను తగులబెట్టినప్పుడు ఎంత పొగ వస్తుందో, ఇక్కడ కూడా అంతే వస్తుంది. అందువల్ల దీనిని భారీ పారిశ్రామిక కాలుష్యంతో పోల్చలేమని ఆవండేకర్ అంటున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)