నడిరోడ్డుపై ఒక కారును వెంబడిస్తూ మరో కారులో నుంచి కాల్పులు, మధ్యలో రిటైర్డ్ బ్రిగేడియర్ మృతి.. అసలేం జరిగింది?

    • రచయిత, ఆసిఫ్ అలీ
    • హోదా, బీబీసీ కోసం
  • చదివే సమయం: 6 నిమిషాలు

మార్నింగ్ వాక్‌కు వెళ్లిన 74 ఏళ్ల రిటైర్డ్ బ్రిగేడియర్ ముఖేష్ జోషి తుపాకీ కాల్పుల్లో మరణించారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని దెహ్రాదూన్‌లో మార్చి 30న జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రోెడ్డుపై వేగంగా వెళ్తున్న రెండు కార్లలో నుంచి పరస్పరం కాల్పులు జరుగుతున్న సమయంలో ఆయన మధ్యలో చిక్కుకుపోయారు.

అంతకుముందు రోజు రాత్రి నగరంలోని ఒక నైట్‌క్లబ్‌లో జరిగిన వివాదంతో ఈ గొడవ మొదలైందని, అది మరుసటి రోజు నడిరోడ్డుపై కాల్పులకు దారితీసిందని పోలీసులు తెలిపారు.

ఈ కేసులో ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేశారు.

క్లబ్‌ను సీజ్ చేసి, లైసెన్స్‌ను రద్దు ప్రక్రియ మొదలుపెట్టారు. అయితే, ఈ ఘటన నగరంలో భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది.

అసలేం జరిగింది?

ఈ సంఘటన దెహ్రాదూన్‌లోని సినోలా, జోహ్రి గ్రామాల మధ్య రాజ్‌పూర్ రోడ్డుకు సమీపంలో జరిగింది.

ముఖేష్ జోషి ఎప్పటిలాగే ఉదయం ఆరున్నర గంటల సమయంలో వాకింగ్‌కు వెళ్లారు.

ఆ సమయంలో స్కార్పియో కారులో వెళ్తున్న యువకులు ఫార్చ్యూనర్ కారును ఆపడానికి దాని టైర్లపై 8 నుంచి 9 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కాల్పుల్లో రిటైర్డ్ బ్రిగేడియర్ ముఖేష్ జోషి ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లిందని పోలీసులు చెప్పారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

తీవ్రంగా గాయపడిన జోషిని వెంటనే మ్యాక్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన మరణించారు.

అంతకుముందు రోజు రాత్రి గొడవ కారణంగా ఈ కాల్పులు జరిగినట్లు దెహ్రాదూన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రమోద్ దోభాల్ బీబీసీతో చెప్పారు.

"మార్చి 29వ తేదీ రాత్రి, మసూరీ రోడ్డులోని ఒక క్లబ్‌లో బిల్లు విషయంలో కొంతమంది యువకుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ మరుసటి రోజు హింసాత్మకంగా మారింది. మరుసటిరోజు ఉదయం ఇరువర్గాలు ఒకరినొకరు తరుముకుంటూ రోడ్డుపై కాల్పులు జరిపారు" అని ఆయన చెప్పారు.

పోలీసులు ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేయగా, మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.

సమయం దాటిపోయాక కూడా ఆ క్లబ్ తెరిచి ఉన్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. దానిని సీజ్ చేయడంతో పాటు, లైసెన్సు రద్దు చేయాలని సిఫార్సు చేశారు.

ఈ కేసులో కుఠాల్‌గేట్ పోలీస్ పోస్ట్ ఇన్‌చార్జిని కూడా సస్పెండ్ చేసినట్లు ఎస్‌ఎస్పీ తెలిపారు.

ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారు?

ఆ ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన ఎస్పీ శర్మ, ఆరోజు జరిగిన ఘటనను గుర్తుచేసుకుంటూ.. అంతా క్షణాల్లో మారిపోయిందని అన్నారు.

"రోజూలాగే ఉదయం ఆరున్నరకి మేం వాకింగ్‌కు వెళ్లాం. ముగ్గురం ఉన్నాం. నేను, బ్రిగేడియర్ జోషి, ఆయన బావగారు. సుమారు 200 మీటర్ల దూరం వెళ్లాక, ఎదురుగా రెండు వాహనాలు వేగంగా వచ్చాయి. ఆ వాహనం మమ్మల్ని ఢీకొంటుందేమోనని పక్కకు తప్పుకుంటుండగా టపాసులు పేలినట్టుగా పెద్ద శబ్దం వినిపించింది. ఆ తర్వాత జరిగింది చూసి మేం నిశ్చేష్టులమయ్యాం. ఆ వెంటనే బ్రిగేడియర్ జోషి కింద పడిపోయారు. అప్పటికే కార్లు ముందుకు వెళ్లిపోయాయి" అని ఆయన చెప్పారు.

మొదట గుండెపోటేమో అనుకున్నామని, కానీ ఆయన ఛాతీ నుంచి రక్తస్రావం అవుతోందని ఎస్పీ శర్మ చెప్పారు.

ఆయనను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాం, కానీ అప్పటికే ఆలస్యమైపోయిందన్నారు.

"ఆయన నాకు కేవలం అన్నయ్య మాత్రమే కాదు, తండ్రిలాంటివారు, నా మార్గదర్శి" అని ముఖేష్ జోషి తమ్ముడు రాకేష్ జోషి అన్నారు.

"ఆయనకు వాకింగ్ అంటే చాలా ఇష్టం. అదే ఆయన జీవితంలో చివరి పని అవుతుందని అనుకుని ఉండరు" అని వృత్తిరీత్యా పాత్రికేయుడైన రాకేష్ జోషి అన్నారు.

"ఒకప్పుడు దెహ్రాదూన్ చాలా ప్రశాంతంగా ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడి వాతావరణం మారిపోయింది. ఎప్పటికైనా నేను కూడా దెహ్రాదూన్‌లో స్థిరపడి మా అన్నయ్యతో కలిసుండాలని అనుకునేవాడిని. కానీ ఆ కల నెరవేరలేదు" అని ఆయన చెప్పారు.

ఎక్సైజ్ శాఖ చర్యలు

ఈ ఘటన నేపథ్యంలో.. చాలా క్లబ్‌లు కాలపరిమితిని పాటించకుండా నడుస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.

నైట్ లైఫ్, శాంతి భద్రతలతో ఈ ఘటనను ముడిపెట్టడమే కాకుండా, ఎక్సైజ్ శాఖపై కూడా చాలామంది ప్రశ్నలు లేవనెత్తారు.

"మొదట క్లబ్‌కు నోటీసు జారీ చేశాం. సంతృప్తికరమైన స్పందన రాకపోవడంతో, లైసెన్స్‌ను రద్దు చేయాలని సిఫార్సు చేశాం. ఆ తర్వాత క్లబ్‌ బార్ లైసెన్స్‌ను రద్దు చేశాం" అని మసూరీ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ప్రేరణా బిష్ట్ తెలిపారు.

బార్, క్లబ్ నిర్వాహకులతో సమావేశం అనంతరం.. వారాంతాల్లో రాత్రి 12 గంటల తర్వాత, మిగిలిన రోజుల్లో రాత్రి 11 గంటల తర్వాత ఎవరైనా మద్యం విక్రయిస్తున్నట్లు తేలితే వారి లైసెన్స్ రద్దయ్యేలా కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేసినట్టు బిష్ట్ తెలిపారు.

అయితే, తన పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక రెస్టారెంట్ అండ్ బార్ యజమాని మాట్లాడుతూ, "ఇలాంటి సమావేశాలు ప్రమాదం జరిగినప్పుడే నిర్వహిస్తారు. ముందుగా పర్యవేక్షణ ఎందుకు ఉండదు?" అని ప్రశ్నించారు.

ఇదిలా ఉండగా, పెరుగుతున్న నైట్ లైఫ్ నేపథ్యంలో, అవగాహన కార్యక్రమాలపై తమ శాఖ దృష్టి సారిస్తోందని జిల్లా ఎక్సైజ్ అధికారి వి.కె. జోషి తెలిపారు.

నిబంధనలు.. క్షేత్రస్థాయి వాస్తవాలు..

కొన్నేళ్లుగా దెహ్రాదూన్ నైట్ లైఫ్ వేగంగా పెరిగిపోయింది. కొత్త క్లబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్లు మొదలవడంతో నగర రూపం కూడా మారింది.

అయితే ఈ మార్పుతోపాటు నిబంధనల అమలు, పర్యవేక్షణ, జవాబుదారీతనంపై కూడా ప్రశ్నలు తలెత్తడం మొదలైంది.

కాగితాలపై పొందుపరిచిన నియమాలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు మధ్య వ్యత్యాసం ఉందని సామాజిక కార్యకర్త అనూప్ నౌటియాల్ అంటున్నారు.

"క్లబ్‌లు లేదా బార్‌లు ఏ సమయానికి మూసివేస్తారు, చివరి ఆర్డర్లు ఎప్పుడు తీసుకుంటారు అనే విషయాల్లో నిబంధనలు చెప్పేదానికి, వాస్తవంగా జరిగేదానికి మధ్య వ్యత్యాసం ఉంది" అని ఆయన అన్నారు.

"ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న మౌలిక మార్పులను అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం. రోడ్లు వెడల్పు అయ్యాయి, పెద్ద వాహనాలు పెరిగాయి, వాటితో పాటు ఇతర అంశాలు కూడా వచ్చాయి. ఏర్పడిన డిమాండ్‌కు అనుగుణంగా నగరంలోని క్లబ్‌లు, బార్‌లు కూడా తమ స్వరూపం మార్చకుంటున్నాయి" అని ఆయన అన్నారు.

పర్యవేక్షణ, నియంత్రణకు సంబంధించిన ప్రశ్నలు కూడా తలెత్తుతాయని నౌటియల్ అంటున్నారు.

"కొన్ని క్లబ్‌లు లేదా బార్లు పలుకుబడి ఉన్న వ్యక్తుల అండతో నడుస్తున్నాయని చాలా మందిలో ఒక అభిప్రాయం ఉంది, ఇది నిబంధనలను పాటించడంలో అలసత్వానికి దారితీస్తుంది" అని ఆయన చెప్పారు.

"కొంతమంది కింది స్థాయి అధికారులను సస్పెండ్ చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పారని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. కానీ జవాబుదారీతనాన్ని నిర్ణయించాల్సి వస్తే, అది కేవలం కింది స్థాయికే పరిమితం కావాలా, లేక ఉన్నత స్థాయి వారిని కూడా బాధ్యులను చేయాలా అనే ప్రశ్న తలెత్తుతోంది?" అని నౌటియాల్ చెప్పారు.

అయితే, ఇటువంటి ఆరోపణలు, ప్రశ్నలపై సంబంధిత ఏజెన్సీల నుంచి భిన్నమైన స్పందనలు వచ్చాయి. తాము నిబంధనలను పాటిస్తున్నామని అధికారులంటున్నారు.

" పోలీస్, ఎక్సైజ్ వంటి విభాగాల మధ్య మెరుగైన సమన్వయం అవసరం. చాలాసార్లు సంఘటనలు జరిగిన తర్వాతే చర్యలు తీసుకున్నట్లు అనిపిస్తుంది" అని నౌటియాల్ అన్నారు.

ఇలాంటి సంఘటన కేవలం క్రిమినల్ కేసు మాత్రమే కాదని, వ్యవస్థ పనితీరుపై కూడా ప్రశ్నలను లేవనెత్తుతోందని ఆయన అంటున్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)