ఇరాన్ యుద్ధ దౌత్యంలో పాకిస్తాన్ దూకుడు.. భారత్‌ను పక్కకు నెట్టేసిందా?

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 6 నిమిషాలు

అమెరికా - ఇరాన్ సంక్షోభంలో పాకిస్తాన్ తనకు తాను ఒక మధ్యవర్తిగా వ్యవహరిస్తూ తీసుకున్న చొరవ.. భారత్‌‌ను పక్కకు నెట్టేసిందా? అని దిల్లీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

వాషింగ్టన్, తెహ్రాన్ మధ్య మధ్యవర్తిగా వ్యవహరించేందుకు.. ఇస్లామాబాద్ అసాధారణమైన చొరవ ప్రదర్శించింది.

గత వారం, 15 అంశాల అమెరికా శాంతి ప్రణాళికను ఇరాన్‌కు తెలియజేసి, చర్చలకు ఆతిథ్యమిస్తామని తెలిపినట్లు సమాచారం. అయితే, ఆ ప్రతిపాదనలను తెహ్రాన్‌ తిరస్కరించింది.

గతవారం, మరోమారు కూడా పాకిస్తాన్ చొరవ తీసుకుంది. ఈ సంఘర్షణకు ముగింపు పలికేందుకు ఐదు అంశాల శాంతి ప్రణాళికకు చైనా మద్దతు కోరేందుకు పాక్ విదేశాంగ మంత్రి బీజింగ్‌ వెళ్లారు.

పాకిస్తాన్‌కు పెద్ద పొరుగుదేశంగా, బద్ధ శత్రువుగా ఉన్న భారత్‌కు ఈ పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో సంబంధాలను పాకిస్తాన్‌ తిరిగి పునరుద్ధరించుకుంటున్నట్లు కనిపిస్తుంటే.. అమెరికాతో భారత్ సంబంధాలు మరింత అస్థిరంగా మారి, ఈ పరిణామాలు మరింత ఆందోళనను పెంచుతున్నాయి.

అయితే, ఈ విషయంలో భారత వ్యూహాత్మక వర్గాల్లో విభజన కనిపించింది.

ప్రాంతీయంగా మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో, మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో భారత్ అంటీముట్టనట్లు వ్యవహరించకుండా.. కనీసం మధ్యవర్తిత్వం వహించే ప్రయత్నమైనా చేయాల్సిందని కొందరు ప్రతిపక్ష నేతలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పాకిస్తాన్‌ మధ్యవర్తిగా వ్యవహరించాలని కోరినట్లు వార్తలొచ్చిన తర్వాత, భారత దౌత్యానికి ఇది ''అవమానకరం'' అని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.

''యుద్ధ కథనాల వేళ మరింత దూకుడుగా, చురుగ్గా వ్యవహరించడం ద్వారా పాకిస్తాన్ దౌత్యపరంగా తరచూ భారత్‌ను అధిగమించింది'' అని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు బ్రహ్మ చెల్లానీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో రాశారు.

సొంత ప్రయోజనాల కోసం ఇలాంటి ప్రాచుర్యాన్ని కోరుకోవడంలో ఎలాంటి విలువ లేదని ఇతరులు భావిస్తున్నారు. ఎలాంటి ఒత్తిడి లేదా ఆహ్వానం లేకుండా మధ్యవర్తిత్వం వికటించవచ్చని హెచ్చరిస్తున్నారు.

ఎలాంటి ఆర్భాటాలు లేకుండా నిశ్శబ్ద దౌత్యం, వ్యూహాత్మక దూరం పాటించడం ద్వారానే భారత్ ప్రయోజనాలు మెరుగ్గా నెరవేరుతాయని వారు భావిస్తున్నారు.

ప్రభుత్వంలోనూ ఇదే అభిప్రాయం వినిపిస్తోంది. గతవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్.. పాకిస్తాన్ పాత్రను 'దలాలీ' (బ్రోకరేజ్)గా కొట్టిపారేస్తూ, అమెరికా - తాలిబాన్ల చర్చలతో సహా 1981 నుంచి ఇలాంటి పాత్రనే పోషిస్తోందని పేర్కొన్నట్లు సమాచారం.

''మేం మధ్యవర్తిత్వ పాత్రను పోషించగలమంటూ దేశాల చుట్టూ తిరగం'' అని ఆయన అన్నట్లు వార్తలొచ్చాయి.

ప్రధానంగా ఈ అంశం, వ్యూహాత్మకంగా కంటే కూడా ఆలోచనా విధానానికి సంబంధించిందని శివ్ నాడార్ యూనివర్సిటీకి చెందిన హ్యాపీమోన్ జాకోబ్ అన్నారు.

''భారత్‌లో కనిపిస్తున్న ప్రతిస్పందన, పోటీతత్వ ఆందోళనతో కూడుకున్నది. ఒకవేళ పాకిస్తాన్ చేయగలిగితే, మనమెందుకు చేయలేం! అన్నట్లుగా..'' అని ఒక సంపాదకీయ వ్యాసంలో రాశారు.

''ఇంకా సరిగ్గా చెప్పాలంటే.. ఇది అవకాశాన్ని కోల్పోతామనే భయం. నెగెటివ్‌గా చెప్పాలంటే.. దీనికి భారత్‌కు అర్హత ఉంది, కానీ పొరుగు చిన్న దేశానికి దక్కుతోందనే అసూయ. అయితే, ఏదో కోల్పోతామనే భయం కానీ, అసూయ కానీ.. ఒక మంచి విదేశాంగ విధానానికి సరైన పునాదులు కావు'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

అట్లాంటిక్ కౌన్సిల్‌లోని దక్షిణాసియా వ్యవహారాల నిపుణులు మైకేల్ కుగల్‌మన్ కూడా ''భారత్ - పాకిస్తాన్ వైరుధ్యంలో జీరో సమ్ అప్రోచ్‌ను (ఒకరి గెలుపును మరొకరు ఓటమిగా చూసుకునే వైఖరిని)'' వ్యతిరేకించారు. మధ్యవర్తిత్వ రేసులో భారత్ ఎప్పుడూ లేదని, పైగా అధికారిక ఆహ్వానం లేకుండా జోక్యం చేసుకోకపోవచ్చని అన్నారు.

పాకిస్తాన్ దౌత్యపరమైన దూకుడు తాత్కాలికమే కావొచ్చని, కేవలం మధ్యవర్తి పాత్రకే పరిమితం కావొచ్చని ఆయన సూచిస్తున్నారు.

అపనమ్మకం కారణంగా సమీప భవిష్యత్తులో అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలు జరిగే అవకాశం లేదని ఆయన సూచిస్తున్నారు. ''ఇది వాస్తవ పరిస్థితిని తప్పుగా చిత్రీకరిస్తోంది" అని ఆయన చెప్పారు.

నిజానికి, మధ్యవర్తిత్వ రేసులో భారత్ లేకపోతే.. దానికి బదులుగా భారత్ మరే పాత్ర పోషించాలనేదే మరింత కీలకమైన ప్రశ్న అని చాలామంది అంటున్నారు.

భారత్ బలాలను, పరిమితులను గుర్తించడంలోనే ఈ ప్రశ్నకు సమాధానం ఉందని పాకిస్తాన్‌కు భారత హై కమిషనర్‌గా పనిచేసిన అజయ్ బిసారియా చెప్పారు.

ఈ ప్రాంతమంతా భారత్‌కు ఉన్న సంబంధాలు, కీలక ప్రయోజనాల దృష్ట్యా.. దానికి శాంతి నెలకొల్పే సామర్థ్యం భారత్‌కు ఉన్నప్పటికీ.. వాషింగ్టన్ నిర్దేశించగలిగే సాధనం మాత్రం కాదని తెలిపారు.

''దీంతో, ఈ పాత్రకు భారత్ సరిపడదు'' అని బిసారియా అన్నారు.

దిల్లీ మరింత గణనీయమైన శాంతి నెలకొల్పే పాత్రను పోషించాలని, అయితే, పాకిస్తాన్ మాదిరి కాదని, ప్రస్తుత దశలో అసలు కాదని ఆయన అంటున్నారు.

''ఈ యుద్ధం భారత ప్రయోజనాలను దాదాపు అన్ని ఆచరణాత్మక కోణాల్లో దెబ్బతీసింది. ఈ విషయాన్ని భారత్ తగినంత స్పష్టతతో చెప్పడానికి సిద్ధంగా ఉందా లేదా అన్నదే లోతైన ప్రశ్న" అని భారత మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమ రావు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో రాశారు.

స్వదేశంలో ఈ సంయమనం తీవ్రవిమర్శల పాలైంది. గాజాలో ఇజ్రాయెల్ చర్యల విషయంలో, ఇరాన్‌పై దాడుల సమయంలో మోదీ ప్రభుత్వం స్పష్టమైన మౌనం వహిస్తోందని విపక్ష నేతలు ఆరోపించారు.

ఇది ఇజ్రాయెల్ అనుకూల సంకేతాలను, భారత సంప్రదాయ దౌత్య సమతుల్యతకు విఘాతాన్ని కలిగిస్తుందని వారు వాదించారు.

''సంయమనం పాటించే దగ్గర పాటించాలి. ఆచితూచి వ్యవహరించడం అవసరమే. కానీ, సౌర్వభౌమాధికారం, పౌరుల రక్షణ, సైనిక బలగాల పరిమితుల విషయంలో ప్రాథమిక ప్రశ్నలు తలెత్తినప్పుడు, భారత్ మౌనంగా ఉండకూడదు'' అని నిరుపమ రావు అన్నారు.

దౌత్యానికి మించి భారత్ ఆలోచించాల్సిన అవసరం ఉందని బిసారియా అభిప్రాయపడ్డారు.

శాంతి, సంఘర్షణ రెండింట్లో భారత్‌కు ప్రమేయం ఉంటుందని, ఎందుకంటే, యుద్ధాలు భారత ప్రధాన లక్ష్యమైన సుస్థిర ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తాయని చెప్పారు.

మధ్యవర్తిత్వ పాత్రను పోషించడానికి ప్రయత్నించే బదులు.. దీర్ఘకాలంలో శాంతి స్థాపనకు అవసరమయ్యే పైకి కనిపించని వ్యవస్థలపై దిల్లీ దృష్టి సారించాలని సూచించారు.

బందీల మార్పిడి, రహస్య సైనిక సంప్రదింపులు, హార్ముజ్ జలసంధి లాంటి చెక్ పాయింట్ల ద్వారా సురక్షితంగా నౌకలు ప్రయాణించేలా చేయడం వరకు కీలకమైన విషయాలను సమర్థవంతంగా నిర్వహించేలా భారత్ ప్రత్యేక సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు.

భారత్ పాత్ర గురించి చర్చ జరిగిన నేపథ్యంలో, ఇస్లామాబాద్ వైపు అసలు వాషింగ్టన్ ఎందుకు మొగ్గు చూపింది అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.

ఈ ప్రశ్నకు సమాధానం కొంత భౌగోళికపరంగా, మరికొంత నెట్‌వర్క్‌పరంగా ఉంది.

ఇరాన్, గల్ఫ్ రాచరిక దేశాలు రెండింటితోనూ సంబంధాలు కొనసాగిస్తున్న 'ముస్లిం కూటమిలోని ఏకైక దేశం పాకిస్తాన్' అని లాహోర్‌కు చెందిన డిఫెన్స్ అనలిస్ట్ ఎజాజ్ హైదర్ చెప్పారు.

అనిశ్చితి నెలకొన్న ఈ ప్రాంతంలో సందేశాలను చేరేవేసే అరుదైన సామర్థ్యాన్ని ఇది అందిస్తుందని అన్నారు.

పాకిస్తాన్ దౌత్య ప్రాముఖ్యత.. గల్ఫ్‌ భద్రతలో పాకిస్తాన్‌ పాత్రపై ఆధారపడి ఉందని ఇస్లామాబాద్‌కు చెందిన విశ్లేషకులు, జేన్స్ డిఫెన్స్ వీక్లీ మాజీ కరస్పాండెంట్ ఉమర్ ఫరూఖ్ చెప్పారు.

యెమెన్ నుంచి ఇరాక్, లెబనాన్ వరకున్న ప్రాంతాల్లో ఇరాన్ మద్దతున్న మిలీషియాల ముప్పు ఎదుర్కొంటున్న సౌదీ అరేబియా, దాని పొరుగు దేశాలు పాకిస్తానీ బలగాలను ఒక నమ్మకమైన రక్షణ కవచంగా భావిస్తున్నాయని ఫరూఖ్ తెలిపారు.

''మన దౌత్యపరమైన ప్రాధాన్యత ఈ పరపతి మీదనే ఆధారపడి ఉంది'' అని చెప్పారు.

పాకిస్తాన్ కేవలం గల్ఫ్ దేశాలకు చేరువలో ఉండటమే కాకుండా.. ఈ విషయంలో భారత్ అందించలేని ఒక రకమైన సైనిక భరోసాను కల్పిస్తుందని తెలిపారు.

పాకిస్తాన్ మధ్యవర్తిత్వ ప్రయత్నం, దౌత్య పాత్రను కాకుండా.. వేరే దారి లేక చేస్తున్న పనిలాగా కనిపిస్తుందని లండన్‌లోని ఎస్ఓఏఎస్ యూనివర్సిటీలో రాజకీయాలు, అంతర్జాతీయ అంశాలను బోధించే అవినాష్ పాలివాల్ చెప్పారు.

'' భారత్ మాదిరి కాకుండా.. ఈ యుద్ధంలో పాల్గొనకుండా తప్పుకునే అవకాశం పాకిస్తాన్‌కు లేదు. ఒకవేళ ఇది మరింత ముదిరితే.. పాకిస్తాన్ కచ్చితంగా సౌదీ అరేబియా వైపు యుద్ధంలోకి దిగాలి. ఉద్రిక్తతలను తగ్గించడంలో విజయం సాధించడమా? లేక భారీ మూల్యం చెల్లించాల్సిన యుద్ధంలో చేరడమా? అనేది ఇస్లామాబాద్ ఎంపిక చేసుకోవాల్సిన విషయం'' అని తెలిపారు.

ఇరాన్, అమెరికా లేదా ఇజ్రాయెల్‌లో ప్రభావం లేకపోవడం గురించి తరచూ చెబుతున్నా, దాని కారణంగా ఈ ప్రయత్నం విలువ లేనిది కాబోదు అని పాలివాల్ పేర్కొన్నారు.

''అలా చూస్తే, ఏ దేశానికీ అలాంటి ప్రభావం లేదు, భారత్‌తో సహా."

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)