You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇరాన్ సుప్రీం లీడర్ ఎందుకు కనిపించడం లేదు, అధికారం ఆయన చేతిలోనే ఉందా?
- రచయిత, అర్మాన్ షరీఫీ, ఘోంచె హబీబీ ఆజాద్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- చదివే సమయం: 5 నిమిషాలు
ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడిగా మార్చి 8న నియమితులైన తర్వాత మోజ్తాబా ఖమేనీ బయట ఎక్కడా కనిపించ లేదు.
దీంతో ఆయన ఆరోగ్యంపై, అధికారంపై పలు ఊహాగానాలు సాగుతున్నాయి.
నాయకత్వం కొనసాగుతోందన్న భావనను కలిగించేందుకు రాతపూర్వక ప్రకటనలు, ఏఐతో జనరేట్ చేసిన ఇమేజ్‌లు, ప్రతీకాత్మక సంకేతాలను ప్రదర్శిస్తూ ఆయన కనిపించని లోటును పూడ్చాలని ప్రయత్నించింది అధికార యంత్రాంగం.
అయితే, ఐఆర్‌జీసీ నాయకుడి చేతుల్లోనే అసలైన అధికారం ఉందనే వాదనను ఇవి మరింత బలపర్చాయి.
ఐఆర్‌జీసీ నాయకుడు కూడా ఇప్పటి వరకు ప్రజల ముందుకు రాలేదు.
మోజ్తాబా ఖమేనీ ఎక్కడ?
ఆయన నియామకం జరిగి సుమారు నెల అవుతున్నప్పటికీ, ఇరాన్ సుప్రీం నేత మోజ్తాబా ఖమేనీ ఇంకా కనిపించలేదు.
56 ఏళ్ల మోజ్తాబా మార్చి 8న ఇరాన్ సుప్రీం లీడర్‌గా నియమితులైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రసంగం చేయలేదు. కెమెరా ముందుకు రాలేదు. వెరిఫై చేయదగిన ఆయన ఫోటో ఒక్కటి కూడా విడుదల కాలేదు.
మోజ్తాబా ప్రజలకు అందుబాటులో లేకపోవడం, ఆయన అధికారాన్ని పటిష్టం చేసేందుకు భద్రతా, మత సంస్థలు చేస్తున్న ప్రయత్నాలను మరింత సంక్లిష్టం చేసింది.
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై జరిపిన దాడిలో మోజ్తాబా గాయపడ్డారని వార్తలు వచ్చాయి. ఈ దాడిలో ఆయన తండ్రి అలీ ఖమేనీ మరణించారు.
ఇరాన్ రాజకీయాల్లో ఆయన తండ్రి టీవీ ప్రసంగాలు చాలా తరచుగా ఉండేవి. కానీ, మోజ్తాబా ఖమేనీ విషయంలో అలా జరగడం లేదు.
ప్రభుత్వ టీవీలో యాంకర్ల ద్వారా మాత్రమే మోజ్తాబా ప్రసంగాలు ఇప్పటి వరకు మనకు వినిపించాయి.
సైప్రస్‌కు ఇరాన్ అంబాసిడర్‌గా పనిచేస్తున్న దౌత్యవేత్తను ఉటంకిస్తూ.. తన తండ్రి కాంపౌండ్‌పై జరిగిన దాడిలో మోజ్తాబా ఖమేనీ గాయపడ్డారని మార్చి 11న ది గార్డియన్ రిపోర్టు చేసింది.
ఖమేనీ కాలికి, చేతికి గాయాలయ్యాయని ఈ దౌత్యవేత్త చెప్పారు. అదేరోజు, అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కొడుకు మాట్లాడుతూ.. సుప్రీం లీడర్ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.
ఖమేనీ తొలి సందేశాన్ని మార్చి 12న టీవీ యాంకర్ చదివారు. ఆ సందేశంలో ప్రతీకారానికి పిలుపునిచ్చారు. అలాగే, హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని బెదిరించారు.
మార్చి 18న, ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీ, ఇరాన్‌లోని శక్తివంతమైన పారామిలటరీ దళం 'బసిజ్' కమాండర్ ఘోలమ్రేజా సులేమానీ మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటానని ఖమేనీ వాగ్దానం చేశారు.
మార్చి 20న , నౌరూజ్ (ఇరాన్ కాలెండర్ ప్రకారం నూతన సంవత్సరం) పండుగ సందర్భంగా కూడా ఆయన జాతినుద్దేశించి రాతపూర్వక సందేశాన్నే విడుదల చేశారు.
జనరల్‌గా ఆయన తండ్రి ఇరాన్ నూతన సంవత్సరం ప్రారంభంలో టీవీలో కనిపించి ప్రసంగమిస్తుండేవారు.
సంప్రదాయబద్ధంగా ఇరాన్ సుప్రీం నాయకుడి నేతృత్వంలో జరిగే తెహ్రాన్‌లోని ఈద్-ఉల్-ఫితర్ ప్రార్థనలకు కూడా మోజ్తాబా ఖమేనీ హాజరు కాలేదు. ఈ కార్యక్రమం మార్చి 21న జరిగింది.
ఆయన స్థానంలో ఒక సీనియర్ మత గురువు ప్రార్థనలకు నేతృత్వం వహించి, ఖమేనీ పంపిన నౌరూజ్ సందేశాన్ని "జీవన సందేశం"గా ప్రశంసించారు.
ఇరాన్ దురాక్రమణపై ''స్పష్టమైన వైఖరి'' తీసుకున్నందుకు ఇరాన్ మత పెద్దలకు, ప్రజలకు ఆయన మార్చి నెల చివరిలో ధన్యవాదాలు తెలిపారు.
ఏప్రిల్ 1న లెబనాన్ సంస్థ హిజ్బొల్లాకు ఇరాన్ మద్దతును పునరుద్ఘాటిస్తూ.. దాని నేత నాయిమ్ ఖాసిమ్‌కు ఒక సందేశాన్ని పంపారు.
అదే రోజు, మరో ప్రకటనను కూడా విడుదల చేశారు. ప్రకృతి దినోత్సవం సందర్భంగా ప్రజలు మొక్కలను నాటాలని చెబుతూ.. ఇరాన్ పర్యావరణాన్ని లక్ష్యంగా చేసుకున్న ''అమెరికా, జియోనిస్టు దుష్టశక్తులకు'' ఇది నిరసనగా పేర్కొన్నారు.
ఇన్ని ప్రకటనలు విడుదల చేసినప్పటికీ, ఆయన ఫోటోలు కానీ, వాయిస్‌లు కానీ, బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు, వినిపించ లేదు.
ఏఐ ఇమేజ్‌లు, కార్డుబోర్డు బొమ్మలు
నాయకత్వం విషయంలో కనిపిస్తున్న ఈ లోటును ప్రచారాలు, ఇంటర్నెట్ జోకులు, గందరగోళం కలిసి భర్తీ చేయడానికి ప్రయత్నించాయి.
ధృవీకరించిన ఆయన ఇటీవలి ఫోటోలు అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వ అనుబంధ మీడియా సంస్థలు ఏఐతో రూపొందించిన చిత్రాలను ప్రసారం చేయడం ప్రారంభించాయి.
దీనిలో తెహ్రాన్ రివల్యూషన్ స్క్వేర్‌లో ఐఆర్‌జీసీ కమాండర్లతో సుప్రీం లీడర్ ఉన్నట్లు చూపించే పెద్ద బ్యానర్ ఉంది. ఆయన కొత్త ఎక్స్ ప్రొఫైల్ పిక్చర్ కూడా ఏఐ డిటెక్షన్ టూల్స్‌తో పరిశీలించినప్పుడు, అది కృత్రిమంగా మార్చినట్లు తేలింది.
డిజిటల్‌గా సృష్టించిన ఈ చిత్రం ప్రజల్లో ఒక హాస్యాస్పదమైన అంశంగా మారిపోయింది.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ పెద్ద కార్డుబోర్డు కటౌట్‌ను ఆయన మద్దతుదారులు ఆవిష్కరిస్తున్నట్లు చూపించే వైరల్ వీడియో కూడా ఏఐతో జనరేట్ చేసిన నకిలీ వీడియో అని తెలిసింది.
వాస్తవానికి ఆధ్యాత్మిక నగరమైన ఖోమ్‌లో అంతకుముందు తీసిన అసలైన వీడియో ఆధారంగా ఆ నకిలీ వీడియోను రూపొందించారు.
అసలు వీడియోలో ఫోటో ఫ్రేమ్ ఉంటుందని, కార్డుబోర్డు బొమ్మ కాదని ఫ్యాక్ట్ చెకర్లు గుర్తించారు. ఏఐ వర్షన్ అరబిక్ లిపిని కూడా వక్రీకరించారని ఎత్తిచూపారు.
అయినప్పటికీ, "కార్డ్‌బోర్డ్ అయతొల్లా" మీమ్ నిరసనకారుల్లో, సామాన్య ప్రజల్లో విస్తృతంగా వ్యాపించి, బాగా ప్రాచుర్యం పొందింది.
అమెరికా అధికారులు కూడా తమ సొంత అంచనాల్లో మునిగిపోయారు. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేథ్ మాట్లాడుతూ.. దాడిలో ఖమేనీ గాయాల పాలై, ఆయన పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా మారి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
మోజ్తాబా ''చనిపోయి ఉంటారు లేదా విషమ పరిస్థితిలో ఉండొచ్చు, ఎందుకంటే, ఎవరూ ఆయన నుంచి ఒక్క మాట వినలేదు'' అని డోనల్డ్ ట్రంప్ అన్నారు.
ఇరాన్ అధికారులు భిన్నమైన కారణాలు చెబుతున్నారు. ''భద్రతా కారణాల'' వల్ల మోజ్తాబా ఖమేనీ బయటికి కనిపించడం లేదని జెనీవాలో ఐక్యరాజ్యసమితికి ఇరాన్ రాయబారి చెప్పారు.
ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, అన్ని రకాల బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ చెప్పారు. అయితే, ఈ వాదనలకు మద్దతు తెలిపేలా ఎలాంటి ఆడియో లేదా వీడియో సందేశాలు బయటికి రాలేదు.
అధికారం వెనుకున్న శక్తి ఏంటి?
ఖమేనీకి అయిన గాయాల నుంచి కోలుకుంటున్నా, హత్యాయత్నాల నుంచి తనను తాను రక్షించుకుంటున్నా, లేదా మరే ఇతర కారణాల వల్లనైనా కనిపించలేకపోతున్నా, ఆయన అజ్ఞాతం రాజకీయ మార్పులకు కూడా కారణమవుతోందన్న అనుమానాలు ఉన్నాయి.
ఆయన నియామకానికి మద్దతు ఇచ్చినట్లుగా చెబుతున్న ఐఆర్‌జీసీయే యుద్ధ సమయంలో అసలైన శక్తిగా వ్యవహరిస్తోందనే భావనను ఇది బలపరుస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
కొత్త సుప్రీం నేత ప్రజల్లోకి వస్తూ, సమావేశాలకు నేతృత్వం వహిస్తూ ఆయన అధికారాన్ని ప్రదర్శిస్తారని అంచనా వేసిన సమయంలో.. ఆయన బయటకు కనిపించకుండా ఉండటం వారసత్వానికి చట్టబద్ధతను కల్పించడం, వ్యవస్థలను గాడిలో పెట్టే ప్రయత్నాలకు అడ్డంకిగా మారుతోంది.
మొత్తం మీద ఇరాన్‌లోని అత్యంత శక్తివంతమైన వ్యక్తి ఆచూకీ అంతుచిక్కడం లేదు.
అయితే, కేవలం రాతపూర్వక ప్రకటనలు, ఏఐ ఫోటోలను చూపించి ఆయన నాయకత్వానికి, లేదా కనీసం బతికే ఉన్నాడనడానికి అవే రుజువని అధికారులు వాదించడం రానురాను మరింత కష్టం కావచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)