You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నాసా: తొలినాటి ప్రయోగాలలో ముగ్గురి మరణం నుంచి ఆర్టెమిస్ 2 వరకు, ఈ సంస్థ లక్ష్యాలు ఎలా మారుతూ వచ్చాయి? భవిష్యత్తు ప్రణాళికలేంటి?
- రచయిత, శ్రీకాంత్ బక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 7 నిమిషాలు
చంద్రుడి పైకి నలుగురు వ్యోమగాములతో నాసా ప్రయోగించిన ఆర్టెమిస్ 2 మిషన్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.
కానీ, ఆర్టెమిస్ 2 చంద్రుడి మీద ల్యాండ్ కాదు. జస్ట్ చంద్రుడి చుట్టూ పరిభ్రమించి భూమ్మీదకు తిరిగి రాబోతోంది.
మరి 1969లోనే చంద్రుడి మీద అడుగుపెట్టిన నాసా ఇప్పుడెందుకు చంద్రుడి మీద దిగడం లేదు?
అప్పటికన్నా శక్తిమంతమైన రాకెట్లు, అత్యాధునిక కంప్యూటర్లున్నప్పటికీ చంద్రుడిని చుట్టి రావడానికే ఎందుకు ప్రాధాన్యమిస్తోంది?
‘అసలు నాసా ఇంతవరకు చంద్రుడి మీద దిగనేలేదు’ అని ఎన్నో కుట్ర సిద్ధాంతాలు కూడా అప్పట్లో చాలా వినిపించాయి. అవన్నీ నిజమేనా? ఇలాంటి అనుమానాలు ఎన్నో కలుగుతున్నాయి.
నాసా ఆర్టెమిస్ ప్రయోగాల లక్ష్యమేంటి?
Nasa.gov వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆర్టెమిస్ మిషన్లలో నాసా వ్యోమగాముల్ని చంద్రుడి మీదకు పంపనుంది.
చంద్రుడి మీద శాస్త్రీయ ఆవిష్కరణలు, ఆర్థిక ప్రయోజనాలు కలిగించే దిశగా అడుగులు వేయడంతో పాటు, అంగారకుడి మీదకు మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు అవసరమైన ఏర్పాట్లు చేయడమే ఆర్టెమిస్ మిషన్ లక్ష్యం.
అంతరిక్ష ప్రయోగాలు అంత సులువు కాదు
1960ల్లో అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికా, రష్యా మధ్య ఆధిపత్య పోటీ ఉండేది. అందుకే అప్పట్లో పోటాపోటీగా ఇరు దేశాలూ అంతరిక్షంలోకి పరుగులు పెట్టాయి.
అప్పటి అంతరిక్ష ప్రయోగాలు, చంద్రుడిపైకి మానవుల్ని పంపిన లక్ష్యాలు, ఇప్పుడు ఆధునిక కాలంలో చంద్రుడి పైకి నాసా సహా అనేక సంస్థలు చేస్తున్న ప్రయోగాల లక్ష్యాలు వేర్వేరు.
అంతరిక్ష ప్రయోగాలు చాలా సంక్లిష్టమైన, ఖరీదైన వ్యవహారం. నూటికి నూరుపాళ్లు కచ్చితంగా ఉండాలి. రవ్వంత తప్పిదం జరిగినా భారీ నష్టం తప్పదు.
మానవ సహిత అంతరిక్ష యాత్రల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే నాసా చేపట్టిన చాలెంజర్, కొలంబియా షటిల్ ప్రమాదాలు కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి.
అపోలో 1లో చిన్న తప్పిదం ముగ్గురి ప్రాణాలు తీసింది
నాసా తన వెబ్‌సైట్ nasa.gov లో వెల్లడించిన వివరాల ప్రకారం 1967 ఫిబ్రవరి 21న ఆ సంస్థ అపోలో 1 ప్రయోగానికి సిద్దమైంది. ఇందుకోసం గస్ గ్రిసమ్, ఎడ్ వైట్, ఇంకా రోజర్ చేఫీ అనే ముగ్గురిని ఎంపిక చేసుకుంది.
జనవరి 27న రిహార్సల్ నిర్వహించింది. వారిని కమాండ్ మాడ్యూల్‌లో ఉంచి, లోపలి నుంచి తలుపు మూసేశారు.
అందులో ప్యూర్ ఆక్సిజన్ నింపారు. కానీ, కొద్దిసేపటికే లోపల మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ ముగ్గురూ కమాండ్ మాడ్యూల్‌లోనే మరణించారు.
చంద్రుడి మీదకు చేరుకోవాలన్న నాసా లక్ష్యానికి ఈ ప్రమాదం పెద్ద ఇబ్బందిగా మారింది. మాడ్యూల్‌ని పరిశీలించిన నాసా దర్యాప్తు నిపుణుల బృందం అందులో అనేక లోపాలను గుర్తించింది.
ఆ తర్వాత అపోలో 2 మిషన్‌లో ఆ లోపాలన్నీ సరిదిద్ది అపోలో 1 టీమ్‌కి బ్యాకప్‌గా ఉన్న వ్యోమగాముల్ని ఈ ప్రయోగం కోసం ఎంపిక చేసింది. వీరికి బ్యాకప్‌గా మరో ముగ్గురిని కూడా ఎంపిక చేసింది.
అపోలో 1 ప్రమాదం తర్వాత అపోలో 2 కమాండ్ మాడ్యూల్‌లో చేసిన మార్పులు, తీసుకున్న చర్యలు చూసి సంతృప్తి చెంది మిషన్‌లో కొనసాగుతున్నామని ఆ ఆరుగురు వ్యోమగాములు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు.
అపోలో 1 ప్రమాదంతో చాలా పాఠాలు నేర్చుకున్నామని నాసా తన వెబ్‌సైట్‌లో రాసిన కథనంలో పేర్కొంది.
అందులోని కమాండ్ మాడ్యూల్ హ్యాచ్ (తలుపు) లోపల నుంచి మాత్రమే తెరిచేందుకు వీలుండేది. అందుకే ప్రమాద సమయంలో నాసా సిబ్బంది బయటి నుంచి తలుపు తీయడం సాధ్యం కాలేదు.
లోపల నింపిన స్వచ్ఛమైన ఆక్సిజన్‌కి, అందులోని వైర్లలో కొద్దిపాటి రాపిడితో చిన్న నిప్పురవ్వలు రేగి, మంటలు అంటుకున్నాయి. దీంతో నాసా అపోలో 2 కమాండ్ మాడ్యూల్‌లో బయటి నుంచి కూడా తెరిచేలా తలుపు డిజైన్ మార్చింది.
అన్ని వైర్లకూ ఇన్సులేషన్ తప్పనిసరి చేసింది. మండే స్వభావం గల పదార్థాలను తొలగించింది. ఆస్ట్రోనాట్ల స్పేస్ సూట్లను కూడా కమిషన్ పరిశీలించింది. వ్యోమగాములు కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువగా పీల్చడం వల్ల మరణించారని, వారికి ఆ అగ్ని ప్రమాదంలో అయిన గాయాలు ప్రాణాలు తీసేంత పెద్దవికావని గుర్తించినట్లు పరిశోధనలో వెల్లడైనట్లు నాసా తెలిపింది.
ఆ తర్వాత అపోలో ఆరో మిషన్ వరకూ... ఒక్కో అవరోధాన్ని, సమస్యనూ పరిష్కరించుకుంటూ వచ్చినట్లు నాసా పేర్కొంది.
ఆపై అపోలో 7 మిషన్‌లో 1968 అక్టోబర్ 11న షిర్రా, ఏసల్, కన్నింగ్‌హాం అనే ముగ్గురు వ్యోమగాములతో చంద్రుడిపైకి మానవ సహిత వ్యోమనౌకను ప్రయోగించింది. ఇందులో కమాండ్ మాడ్యూల్ ప్రయోగాన్ని మాత్రమే నిర్వహించింది.
దీంతో కమాండ్ మాడ్యూల్‌లో అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములు.. తిరిగి అక్టోబర్ 22న క్షేమంగా భూమ్మీద ల్యాండయ్యారు.
1968 డిసెంబర్ 25న అపోలో 8 ప్రయోగంలో ఫ్రాంక్ బోర్మన్, బిల్ యాండ్రెస్, జిమ్ లోవెల్‌లతో కూడిన వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించి, వెనక్కి వచ్చేసింది. అంటే ఇప్పుడు వెళ్తున్న ఆర్టెమిస్ 2 వ్యోమనౌక మాదిరిగా అది కూడా చంద్రుడి చుట్టూ తిరిగి వచ్చింది.
1969 మార్చి 3న చేసిన అపోలో 9 ప్రయోగంలో మరో ముగ్గురితో లూనార్ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి పంపి పరీక్షించింది. ఆపై 1969 మే18న అపోలో 10 మిషన్‌లో కెర్నెన్, యంగ్, స్టాఫోర్డ్ అనే ముగ్గురు వ్యోమగాములతో లూనార్ మాడ్యూల్‌ను విజయవంతంగా పంపింది.
ఇది చంద్రుడి చుట్టూ రెండు రోజులు పరిభ్రమించింది. కానీ, ల్యాండింగ్ కమాండ్ రాకపోవడంతో వారు మే 26న భూమ్మీదకు తిరిగి వచ్చారు.
'11వ ప్రయత్నంలో చంద్రుడిపై కాలుపెట్టారు..'
నాసా పొందుపరిచిన వివరాల ప్రకారం మూడేళ్లలో పది అపోలో మిషన్లు ప్రయోగాలు చేసిన నాసా, ఒక్కో ప్రయోగంలో ఎదురయ్యే సవాళ్లను క్రమంగా అధిగమిస్తూ, వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ, ముందుకెళ్లింది.
అపోలో 11 మిషన్‌లో 1969 జులై 16న... కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి శాటరన్ ఫైవ్ ఎస్ఏ 506 రాకెట్ సాయంతో నీల్ ఆల్డెన్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఎడ్విన్ ఈ ఆల్డ్రిన్, మైఖేల్ కాలిన్స్ అనే ముగ్గురు వ్యోమగాముల్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చంద్రుడిపైకి పంపింది.
వీళ్లు కూడా చంద్రుడి కక్ష్యలో పరిభ్రమించి వెనక్కి వచ్చేస్తారనుకున్నారు. కానీ, నాసా వారికి ల్యాండింగ్ కమాండ్ ఇవ్వడంతో కమాండ్ మాడ్యూల్ నుంచి ఈగిల్ అనే ల్యాండర్ విడిపోయి చంద్రుడి ఉపరితలంవైపు ప్రయాణించింది.
చంద్రుడి చుట్టూ పరిభ్రమించే కమాండ్ మాడ్యూల్‌లో.. మైఖేల్ ఉండిపోయారు. ఆయన ల్యాండర్‌కి, భూమికి మధ్య వారధిలా ఉంటూ.. చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇక ల్యాండర్ ఈగిల్‌లో నీల్ ఏ ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ ఈ ఆల్డ్రిన్‌లు చంద్రుడి మీద ల్యాండయ్యారు.
చంద్రుడి మీద ఈగిల్ ల్యాండ్ అయిన వెంటనే.. వ్యోమగాములు బయటకు రాలేదు. కొంతసేపు వేచి చూసి, అంతా సేఫ్ అని నిర్థరించుకున్నాక బయటకు వచ్చారు.
అలా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్.. చంద్రుడి మీద కాలు పెట్టిన మొదటి మానవుడిగా చరిత్ర కెక్కారు.
1972 తర్వాత మానవ ప్రయోగాలను నిలిపేసిన నాసా
అపోలో 11 తర్వాత కూడా నాసా తన ప్రయోగాలు కొనసాగించింది. అదే ఏడాది నవంబర్ 14న అపోలో 12 ప్రయోగంలో కన్రాడ్, బీన్, గోడన్ అనే మరో ముగ్గురు వ్యోమగాముల్ని చంద్రుడిపైకి పంపింది.
1970 ఏప్రిల్ 11న అపోలో 13 ప్రయోగంలో మరో ముగ్గురిని చంద్రుడిపైకి పంపింది. కానీ, ల్యాండింగ్‌కి ముందు కమాండ్ మాడ్యూల్‌లో సమస్య తలెత్తడంతో వాళ్లు చంద్రుడి మీద దిగకుండానే వెనక్కొచ్చేశారు.
ఆపై రెండేళ్లలో చేపట్టిన అపోలో 14 నుంచి 17 వరకూ ఒక్కో విడతలో ముగ్గురేసి వ్యోమగాముల్ని చంద్రుడి మీదకు పంపింది. ఈ అన్ని ప్రయోగాల్లోనూ ఇద్దరేసి వ్యోమగాములు చంద్రుడి మీద ల్యాండయ్యారు. ఒకరు మాత్రం కమాండ్ మాడ్యూల్‌లో ఉండిపోయారు.
1972 డిసెంబర్ 7న అపోలో 17 ప్రయోగంలో చివరి సారిగా ముగ్గురు వ్యోమగాముల్ని పంపింది. ఇలా నాసా మూడేళ్ల వ్యవధిలోనే 12 మంది వ్యోమగాముల్ని చంద్రుడి మీద కాలుమోపేలా చేసింది.
ఆ తర్వాత చంద్రుడి మీదకు మనుషుల్ని పంపే ప్రయోగాలను నిలిపేసింది. ఈ ప్రయోగాలన్నింటిలోనూ కేవలం పురుష వ్యోమగాములు మాత్రమే చంద్రుడి మీదకు వెళ్లారు. కానీ తాజాగా ఆర్టెమిస్ మిషన్‌లో నాసా ఒక మహిళా వ్యోమగామిని కూడా భాగస్వామిని చేసింది.
అన్నిసార్లు విజయం సాధించినా ఇప్పుడెందుకింత జాగ్రత్త?
అపోలో మిషన్ల ప్రధాన లక్ష్యం అంతరిక్ష రంగంలో అమెరికా ప్రాధాన్యత పెంచడం, చంద్రుడి మీద శాస్త్రీయ పరిశోధనలు చేయడం, భవిష్యత్తులో చంద్రుడి మీద మానవ పరిశోధనలకు మార్గాన్ని సుగమం చేయడమేనని నాసా పేర్కొంది.
కానీ, ఇప్పుడు ఆర్టెమిస్ మిషన్ లక్ష్యం మాత్రం మార్స్ మీదకు యాత్రలు చేసేలా చంద్రుడిని వేదికగా చేసుకోవడం. అంటే ఈ మిషన్ల లక్ష్యం కేవలం చంద్రుడి మీద దిగి, కొన్ని గంటల పాటు ఉండి తిరిగి వచ్చేయడం కాదు. అక్కడే ఉండి ప్రయోగాలు చేయడం.
ఇందుకోసం మానవ నివాసానికి అనుకూలమైన వాతావరణం ఉండే ప్రాంతానికి వెళ్లాలి. నీరు వంటివి కీలక వనరులు లభ్యం కావాలి. అంటే చంద్రుడి దక్షిణ ధృవంపై దిగాలి. చంద్రయాన్ త్రీ ల్యాండర్ కూడా చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండయ్యింది ఇందుకే.
అపోలో 11 నుంచి 17 వరకూ సాగిన మిషన్లు ల్యాండయిన అన్ని ప్రాంతాలూ చంద్రుడి మధ్య భాగంలోనివే. కింద ఉన్న ఫోటోలో ఆ ల్యాండింగ్ ప్రదేశాలు చూడొచ్చు.
కానీ ఆర్టెమిస్ మిషన్ లక్ష్యం చంద్రుడి దక్షిణ ధృవానికి దగ్గరగా దిగడం. అక్కడ మానవ రహిత ల్యాండర్లను దింపడానికే చాలా అంతరిక్ష సంస్థలు ప్రయత్నించి విఫలమయ్యాయి.
ఇస్రో చంద్రయాన్ త్రీ వంటివి విజయవంతంగా ల్యాండయ్యాయి. అలాంటి చోట మనుషుల్ని దింపి, సుదీర్ఘకాలం పాటు ప్రయోగాలు చేయాలంటే చాలా జాగ్రత్తలు అవసరం.
అందుకే ఆర్టెమిస్ వన్ మిషన్‌లో మానవ రహిత ప్రయోగం చేపట్టిన నాసా... ఇప్పుడు ఆర్టెమిస్ 2 ద్వారా చంద్రుడికి ఆవల వైపు వెళ్లి చూసి రాబోతోంది.
ఇదొక్కటే కాదు... చంద్రుడి ఆవలి వైపు వెళ్లినప్పుడు... నాసా కమాండ్ మాడ్యూల్‌తో భూమ్మీద నుంచి కమ్యూనికేషన్ సాధ్యం కాదు. అప్పుడు వ్యోమగాములు తమ కమాండ్ మాడ్యూల్‌ను మాన్యువల్‌గానే నావిగేట్ చేయాలి.
ఇవన్నీ చేయాలంటే భవిష్యత్తులో అక్కడ దిగేందుకు అవసరమైన విధంగా ల్యాండర్, కమాండ్ మాడ్యూల్ నావిగేషన్ వ్యవస్థ పరీక్షలు, అక్కడి వాతావరణం, ఇతర అంశాలన్నింటినీ ఆర్టెమిస్ 2 ప్రయోగంలో పరిశీలించబోతున్నారు.
ఈ డేటాను విశ్లేషించి, తర్వాత చేపట్టబోయే ఆర్టెమిస్ 3 మిషన్‌లో మరింత ముందుకెళ్లనున్నారు. 2028లో చేపట్టే ఆర్టెమిస్ 4 మిషన్ ద్వారా ఇద్దరు వ్యోమగాముల్ని చంద్రుడి దక్షిణ ధృవం మీద దింపి, ఆరు రోజుల పాటు అక్కడే ప్రయోగాలు చేసి, ఆ తర్వాత వారిని భూమ్మీదకు తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించామని నాసా వెల్లడించింది.
అందుకే ఈ ఆర్టెమిస్ ప్రయోగంలో నాసా వ్యోమగాములు చంద్రుడి చుట్టూ ఒక్కసారి పరిభ్రమించి, తిరిగి భూమ్మీదకు పయనమవుతారు. అంతేతప్ప చంద్రుడి మీద దిగరు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)