You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
థియా: చంద్రుడిని సృష్టించడానికి భూమి ఈ గ్రహాన్ని మింగేసిందా?
- రచయిత, ఫెర్నాండో డ్యుయార్టే
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
- చదివే సమయం: 4 నిమిషాలు
ఈసారి మీరు పున్నమి చంద్రుడిని కనుక చూస్తే.. ఒక్కసారి థియా గురించి గుర్తుచేసుకోండి.
సుమారు 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమిని ఢీకొన్నట్లు భావిస్తున్న ఈ హైపోథిటికల్ ప్లానెట్ (ఉనికి గురించి పెద్దగా తెలియని గ్రహం)కు శాస్త్రవేత్తలు పెట్టిన పేరు ఇది.
ఇలా ఢీకొన్నప్పుడు విడుదలైన శకలాలే.. చంద్రుడిగా మారి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఈ సిద్ధాంతం ప్రకారం.. విశ్వంలో థియా కనుక ఈ త్యాగం చేయకపోయుంటే, మనకు ఈ సహజ ఉపగ్రహం ఉండేది కాదేమో, ఈ కథనాన్ని మనం చదివే అవకాశం కూడా ఉండకపోయేది.
ప్రారంభంలో భూమికి, అంగారక పరిణామంలో ఉన్నంత మరో గ్రహం ఢీకొనడం వల్ల.. విడుదలైన పదార్థాలన్నీ క్రమంగా కలిసిపోయి, చంద్రుడు ఏర్పడినట్లు ప్రస్తుతం శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
జెయింట్ ఇంపాక్ట్ హైపోథిసిస్‌గా పిలిచే ఈ సంఘటన మనకు తెలిసిన జీవరాశి ఎలా ఏర్పడింది, ఎలా మనుగడ సాధిస్తుందనే విషయాలను అర్థం చేసుకోవడంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఒక సంబంధానికి నాంది పలికింది.
ఇతర విషయాలతో పాటు చంద్రుడు మన గ్రహంతో గురుత్వాకర్షణ పోటీ కొనసాగిస్తూ.. బిలియన్ ఏళ్లుగా, భూమి తన అక్షంపై స్థిరంగా తిరిగేలా, స్థిరమైన వాతావరణం ఏర్పడేలా దోహదపడుతున్నాడు.
'' వాతావరణంలో స్థిరత్వం లేకుంటే, మనం తీవ్రమైన వాతావరణ, పర్యావరణ ప్రభావాలను ఎదుర్కొనేవాళ్లం. జీవరాశి మనుగడ, అభివృద్ధికి ఇది సాయం చేయకపోయేది'' అని జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేసే ప్లానెటరీ సైంటిస్ట్, ప్రొఫెసర్ థార్‌స్టెన్ క్లైన్ చెప్పారు.
గత నవంబర్‌లో భూమికి సంబంధించిన అత్యంత కీలకమైన, రహస్యాలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందంలో క్లైన్ ఒకరు.
జర్నల్ సైన్స్‌లో ప్రచురితమైన కథనంలో.. భూమి, చంద్రుడు నుంచి తీసుకున్న నమూనాల రసాయన చర్యలను ఈ శాస్త్రవేత్తల బృందం విశ్లేషించిందని పేర్కొన్నారు.
సోలార్ వ్యవస్థ పుట్టుక సమయంలో థియా, భూగ్రహం రెండూ పక్కపక్కన ఉండేవని మనం చెబుతున్న సిద్ధాంతాలను ఈ విశ్లేషణ బలపర్చింది.
ఒకటే చంద్రుడు, దాని చుట్టూ సిద్ధాంతాలెన్నో..
కానీ, మనం ఎప్పుడూ థియాను పరిగణనలోకి తీసుకోలేదు.
1969లో చంద్రుడి ఉపరితలంపై మనుషులు అడుగు పెట్టకముందు, చంద్రుడి పుట్టుక గురించి ప్రధానంగా మూడు వాదనలు వినిపించేవి.
ఒకటి ఫిషన్ థియరీ.. ప్రారంభంలో భూమి వేగంగా తిరిగేటప్పుడు అంతరిక్షంలోకి విడుదల చేసిన తన పదార్థంలోని ఒక ముక్క ద్వారా చంద్రుడు ఏర్పడ్డాడు.
క్యాప్చర్ థియరీ అనే మరో సిద్ధాంతంలో.. సోలార్ వ్యవస్థలో ఎక్కడో చంద్రుడు ఏర్పడ్డాడని, అయితే, భూ గురుత్వాకర్షణ శక్తి వల్ల భూమికి దగ్గరగా వచ్చాడని అన్నారు.
చివరికి కో-ఫార్మేషన్ థియరీ.. దీనిలో భూమి, చంద్రుడు ఒకదానికొకటి పక్కపక్కనే ఏర్పడి, స్థిరత్వం చెందాయని పేర్కొంటారు.
ఈ సిద్ధాంతాల్లో దేనివల్ల ఎక్కువగా చంద్రుడు సంభవించుంటారనే దానిపై దృష్టిపెట్టడం కంటే.. నాసా అపోలో మిషన్లు పూర్తిగా కొత్త సిద్ధాంతంపై దృష్టిపెట్టాయి.
రసాయన సారూప్యతలు
చంద్రుడిపై కాలుమోపిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఇతర వ్యోమగాముల ప్రయాణాలు ప్రముఖంగా నిలిచాయి. కానీ, అపోలో మిషన్లు సాధించిన ఘనత.. ఈ ప్రయాణాల్లో వ్యోమగాములు అక్కడ్నుంచి తీసుకొచ్చిన భౌతిక పదార్థాల రూపంలో ఉంది.
''అపోలో వ్యోమగాములు చంద్రుడిపై ఉన్న శిలలకు సంబంధించిన నమూనాలను తీసుకుని వచ్చారు. వాటిని విశ్లేషించినప్పుడు, చంద్రుడిపై కనిపించే రాళ్లు, మట్టి నమూనాలకు భూమిపై ఉన్న మట్టి, రాళ్లకు సారూప్యం ఉన్నట్టు తేలింది'' అని యూనివర్సిటీ కాలేజీ లండన్‌లోని ఆస్ట్రోనామర్, పిల్లల సైన్స్ పుస్తకం ''వండర్స్ ఆఫ్ ది మూన్'' రాసిన ప్రొఫెసర్ రామన్ ప్రింజా తెలిపారు.
భూమి నుంచే చంద్రుడు ఉద్భవించి ఉండొచ్చని ఆయన సూచిస్తున్నారు.
ఈ శిలలు తీవ్రమైన వేడి వల్ల ఏర్పడ్డాయనే చూపిస్తున్నాయని ప్రింజా పేర్కొన్నారు. భారీ విస్ఫోటన ప్రభావం వల్ల అవి పుట్టాయని సూచించారు.
ఈ నమూనాలు అందించిన ఆధారాలు, కేవలం తక్కువ సమాచారమేనని నాసాకు చెందిన లూనార్ జియాలజిస్ట్ సారా వాలెన్సియా చెప్పారు.
ఇటీవల దశాబ్దాల్లో సాంకేతిక పురోగతులు ముఖ్యంగా కంప్యూటర్ మోడలింగ్ లాంటివి... అతిపెద్ద ఇంపాక్ట్ హైపోథెసిస్ సిద్ధాంతాన్ని మరింత బలపరుస్తున్నాయి.
జెయింట్ ఇంపాక్ట్ థియరీనే భూమికి, చంద్రునికి మధ్య సంబంధాన్ని, కెమిస్ట్రీని వివరించే ఉత్తమ నమూనాగా ఉందని వాలెన్సియా తెలిపారు.
థియాను భూమి మింగేసిందా?
అయితే, థియాకు ఏమైంది?
విశ్వంలో మిగిలివున్న రహస్యాల్లో ఇదొకటి.
65 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక అప్రసిద్ధ ఆస్ట్రనాయిడ్ భూమిని ఢీకొన్నప్పుడు డైనోసార్లు పూర్తిగా అంతమైన మాదిరిగా కాకుండా.. మెక్సికోలో యుకాటన్ ద్వీపకల్పంలో భారీ బిలం ఏర్పడ్డ మాదిరిగా కాకుండా.. థియాకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు.
ఎందుకు? క్లైన్ వాదన ప్రకారం, భూ ద్రవ్యరాశిలో 10 శాతం థియా ఉంటుంది. అది భూమిని ఢీకొన్నప్పుడు విచ్ఛిన్నమై, మన గ్రహం దాన్ని ఎక్కువగా గ్రహించి ఉంటుంది.
దాని శకలాలు కూడా చంద్రుడు ఏర్పడేందుకు కారణమైన మిశ్రమంలో భాగంగా ఉండవచ్చు.
''ఇలా ఢీకొట్టినప్పుడు ఏర్పడిన సహజ ఫలితం ఇది కావొచ్చు. అయితే, చంద్రుని ఏర్పాటులో థియా మిశ్రమం ఏ స్థాయిలో ఉందో చూడాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు మనం దానిని కనుగొనలేదు'' అని శాస్త్రవేత్తలు అంటున్నారు.
''భూమి, థియా సౌరవ్యవస్థలోని ఒకేప్రాంతంలో ఏర్పడడం వల్ల వాటి మధ్య చాలా సారూప్యతలు ఉండేవి. ఎందుకంటే, సోలార్ వ్యవస్థలో ఒకే ప్రాంతంలో ఇవి ఏర్పడ్డాయి'' అని వివరించారు.
అదేవిధంగా అంగారకుడు, శుక్రుడు వంటి సమీప గ్రహాలతో భూమికి అనేక సారూప్యతలు ఉన్న విషయం తెలిసిందే.
శుక్రుడిని కొన్నిసార్లు ''ఎర్త్స్ ఎవిల్ ట్విన్'' అంటే భూగ్రహానికి దుష్ట కవలగా వర్ణిస్తుంటారు.
''కానీ, థియా పుట్టుక గురించి పెద్దగా తెలియనట్లే, దాని డెస్టినీ గురించి కూడా తెలియకపోవచ్చు'' అని వాలెన్సియా అంటున్నారు.
అయితే, కొన్ని ఆధారాలు ఉన్నాయి.
భూమి లోపల రెండు ఖండాల పరిణామంలో ఉన్న ప్రాంతాలు థియాకు చెందిన అవశేషాలని 2023 అధ్యయనంలో వెల్లడైంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)