అమెరికా కంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్‌ ఏంటి? ఇరాన్‌లో కూలిన ఎఫ్-15 పైలట్‌ కోసం అది ఎలా వెతుకుతోంది?

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బెర్న్‌డ్ డెబుస్‌మాన్ జూనియర్
    • హోదా, వైట్ హౌస్
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఇరాన్‌‌లో కూలిన అమెరికా ఎఫ్-15 యుద్ధ విమానం రెండో పైలట్‌ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

దశాబ్దాలుగా కొనసాగుతున్న అమెరికా కంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ (సీఎస్ఏఆర్) మిషన్‌లలో ఇది మరొక ఆపరేషన్.

అమెరికా, దాని మిత్రదేశాలు నిర్వహించే అత్యంత సంక్లిష్టమైన సైనిక కార్యకలాపాలలో అమెరికా కంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ (సీఎస్ఏఆర్) మిషన్‌లను ఒకటిగా పరిగణిస్తారు.

అమెరికాలో వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విభాగాలు సీఎస్ఏఆర్ మిషన్ల కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందుతాయి.

సంక్షోభం సమయంలో విమానాలు కూలిపోయే అవకాశం ఉన్న ప్రాంతాలకు సమీపంలో ముందుగానే మోహరించి ఉంటాయి.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ అంటే ఏంటి?

సీఎస్ఏఆర్ మిషన్లు అంటే కూలిపోయిన విమానంలో ఉన్న పైలట్లు లేదా ఒంటరిగా మిగిలిపోయిన సైనికులను గుర్తించడం, వారికి సహాయం చేయడం, వారిని రక్షించడం లక్ష్యంగా పెట్టుకున్న సైనిక కార్యకలాపాలు.

ప్రకృతి వైపరీత్యాలు లేదా మానవతా సహాయక చర్యల సమయంలో జరిగే సాధారణ సెర్చింగ్, రక్షణ కార్యకలాపాలకు భిన్నంగా సీఎస్ఏఆర్ మిషన్లు శత్రువు ఉండే ప్రాంతం లేదా సంక్షోభ ప్రాంతాల్లో జరుగుతాయి.

కొన్ని సందర్భాల్లో ఈ మిషన్లను శత్రు భూభాగంలో చాలా లోపలి ప్రాంతాల్లో నిర్వహిస్తారు. ఇరాన్‌ ఆపరేషన్ దీనికి ఉదాహరణ.

ఈ మిషన్లు టైమ్ సెన్సిటివ్ (సమయంపరంగా అత్యంత సున్నితమైనవి)గా చెబుతారు. ఎందుకంటే రెస్క్యూ టీమ్ సైనికుల కోసం వెతుకుతున్న అదే ప్రాంతంలో శత్రు దళాలు కూడా వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి.

సీఎస్ఏఆర్ మిషన్లను హెలికాప్టర్లను ఉపయోగించి నిర్వహిస్తారు. వీటికి తోడుగా ఇంధనం నింపే విమానాలు, అవసరమైతే దాడులు చేయడానికి లేదా ఆ ప్రాంతంలో నిఘాకు వీలుగా ఇతర సైనిక విమానాలు కూడా ఉంటాయి.

శుక్రవారం ఇరాన్ నుంచి వచ్చిన కొన్ని ధ్రువీకరించిన వీడియోల్లో అమెరికా సైనిక హెలికాప్టర్లు, ఒక ఇంధనం నింపే విమానం ఖుజెస్తాన్ ప్రావిన్స్‌పై సంచరిస్తున్నట్టు కనిపిస్తోంది.

‘పైలట్‌ను గుర్తించేదాకా సెర్చ్ ఆపరేషన్ నిలిపివేయరు’

కూలిపోయిన అమెరికా యుద్ధవిమానంలో కనిపించకుండా పోయిన పైలట్‌ను వెతకడం అత్యవసరంగా జరగాలని, తనకు తెలిసినంతవరకు ఇది అత్యంత ప్రమాదకరమైన మిలటరీ మిషన్ అని సైనిక వ్యూహకర్త, అమెరికా మాజీ దౌత్యవేత్త జేమ్స్ జెఫ్రీ చెప్పారు.

''ఇవి వైమానికదళ ప్రత్యేక ఆపరేషన్లు. డెల్టా ఫోర్స్, నేవీ సీల్ టీమ్ సిక్స్ వంటివాటి స్థాయిలో ఈ సిబ్బంది శిక్షణ పొందుతారు. వారికి వైద్యం అందించే సామర్ధ్యం కూడా ఉంటుంది'' అని బీబీసీతో చెప్పారు జెఫ్రీ.

‘‘అవకాశం ఉందనుకుంటే పైలట్‌ను గుర్తించేవరకు వారు ప్రయత్నాలు నిలిపివేయరు'' అని జేమ్స్ జెఫ్రీ తెలిపారు.

కూలిపోయిన జెట్‌లోని పైలట్, ఇతర సిబ్బంది ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలనేదానిపై అత్యున్నత శిక్షణ పొంది ఉంటారు.

''జీవించి ఉండడం, పట్టుబడకుండా తప్పించుకోవడం వారి మొదటి ప్రాధాన్యం. ఎక్కువగా గాయాలు కాకపోతే, కాస్త శక్తి ఉందనుకుంటే విమానం కూలిపోయిన ప్రాంతం నుంచి వీలయినంత దూరంగా వెళ్లి దాక్కునేందుకు ప్రయత్నించి తప్పించుకునేలా శిక్షణ పొందుతారు. ఆహారం, నీళ్లు లేకుండా వీలయినంతకాలం గడపగలిగేలా, స్థానిక ప్రాంతంలో లభ్యమయ్యే వనరులను ఉపయోగించుకునేలా నైపుణ్యాలపై కూడా వారికి శిక్షణ ఇస్తారు'' అని బీబీసీతో డిఫెన్స్ ప్రయారిటీస్ థింక్ టాంక్‌లో మిలటరీ విశ్లేషణ డైరెక్టర్, సీనియర్ ఫెలో జెన్నిఫర్ కవనాగ్ చెప్పారు.

ఫొటో సోర్స్, STATE MEDIA

ఫొటో క్యాప్షన్, సోషల్ మీడియాలో షేర్ అయిన ఫోటోలు అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ విమానానివేనని బీబీసీ వెరిఫై ధ్రువీకరించింది.

సీఎస్ఏఆర్ మిషన్ల చరిత్ర

వైమానిక దాడులు, యుద్ధకాలపు రెస్క్యూ మిషన్‌ల చరిత్ర చాలా పాతది. మొదటి ప్రపంచ యుద్ధం నాటిది. ఆ సమయంలో పైలట్లు తమ సహచరులను రక్షించడానికి ఫ్రాన్స్‌లో ఆకస్మికంగా దిగేవారు.

అమెరికా సైన్యం పారా-రెస్క్యూ యూనిట్ల మూలాలు 1943 నాటి ఒక మిషన్‌లో ఉన్నాయి. ఆ మిషన్‌లో ఇద్దరు సైనిక సర్జన్లు గాయపడిన సైనికులకు సహాయం చేయడానికి అప్పటి బర్మా (ప్రస్తుతం మియన్మార్)లోకి పారాచూట్ సాయంతో దిగారు.

ప్రపంచంలోనే మొట్టమొదటి హెలికాప్టర్ రెస్క్యూ ఒక సంవత్సరం తర్వాత జరిగింది. ఒక అమెరికన్ లెఫ్టినెంట్ జపనీయుల స్థావరాల వెనుక చిక్కుకున్న నలుగురు సైనికులను రక్షించారు. యుద్ధంలో హెలికాప్టర్లను మొట్టమొదటిసారి ఉపయోగించింది కూడా అప్పుడే. స్మిత్సోనియన్ ఎయిర్ అండ్ స్పేస్ మేగజైన్ ఈ విషయాలు తెలిపింది.

యుద్ధం తర్వాత అమెరికాలో మొట్టమొదటి సెర్చ్, రక్షణ బృందాలు ఏర్పాటయ్యాయి. కానీ ఆధునిక సీఎస్ఏఆర్ మిషన్ల మూలాలు వియత్నాం యుద్ధంలో కూడా ఉన్నాయి.

"బాట్ 21"గా పిలిచే ఈ మిషన్, ఉత్తర వియత్నాం సైనిక స్థావరాల వెనుక కూలిపోయిన ఒక పైలట్‌ను రక్షించేందుకు మొదలుపెట్టారు. కానీ ఈ ప్రయత్నంలో అనేక విమానాలు కూలిపోయాయి. పలువురు అమెరికన్ సైనికులు మరణించారు.

ఈ యుద్ధ సమయంలో సీఎస్ఏఆర్ మిషన్ల పరిధి, సంక్లిష్టత గణనీయంగా పెరిగాయి. ఈ అనుభవం ఆధారంగా సైన్యం తన వ్యూహాలను, విధానాలను మెరుగుపరుచుకుంది. ఇవే నేటికీ సహాయక చర్యలకు పునాది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పారా-రెస్క్యూ అధికారిక నినాదం ‘ఇతరులు జీవించగలిగేలా మేము చేయగలిగినదంతా చేస్తాం’

అమెరికా ఎయిర్ ఫోర్స్ పారా-రెస్క్యూ టీమ్స్

అమెరికా సైన్యంలోని ప్రతి విభాగానికి పరిమితమైన సీఎస్ఏఆర్ సామర్థ్యాలు ఉన్నప్పటికీ దళాలను గుర్తించి, రక్షించే ప్రాథమిక బాధ్యత అమెరికా వైమానిక దళానిదే.

ఈ పనిని ప్రధానంగా ఆర్మీ స్పెషల్ ఆపరేషన్స్ యూనిట్లలో భాగమైన పారా-రెస్క్యూమెన్ చేస్తారు.

పారా-రెస్క్యూ అధికారిక నినాదం "ఇతరులు జీవించగలిగేలా మేము చేయగలిగినదంతా చేస్తాం. ఏ అమెరికన్ సైనికుడినీ వదిలివేయబోము’’ అనే వాగ్దానంలో వారి పనిని ఒక భాగంగా పరిగణిస్తారు.

మొత్తం ఎంపిక, శిక్షణా ప్రక్రియ దాదాపు రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఇందులో పారాచూట్ ట్రైనింగ్, డైవింగ్, నీటి అడుగున శిక్షణ, ప్రాణాలను రక్షించుకునే శిక్షణ, శత్రువుల నుంచి తప్పించుకోవడం, తరలింపు శిక్షణ, ఇంకా సివిలియన్ పారామెడిక్ కోర్సు ఉంటాయి.

దాదాపు 80 శాతం అభ్యర్థులు ఈ శిక్షణను పూర్తి చేయలేకపోతున్నారని, కొన్నిసార్లు ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని సైనిక వార్తల వెబ్‌సైట్ సోఫ్రెబ్ తెలిపింది.

క్షేత్రస్థాయిలో ఈ బృందాలకు కాంబాట్ రెస్క్యూ ఆఫీసర్లు దీనికి నాయకత్వం వహిస్తారు. వీరు రెస్క్యూ మిషన్ల ప్రణాళిక, సమన్వయం, అమలుకు పూర్తి శిక్షణ పొంది ఉంటారు.

ఫొటో సోర్స్, EPA/Shutterstock

ఫొటో క్యాప్షన్, కూలిపోయిన జెట్‌లోని పైలట్, ఇతర సిబ్బంది ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలనేదానిపై అత్యున్నత శిక్షణ పొంది ఉంటారు.

ఇటీవలి అమెరికన్ రెస్క్యూ మిషన్లు

ఇరాక్ అఫ్గానిస్తాన్ యుద్ధాల సమయంలో, గాయపడిన లేదా తరలించాల్సిన అవసరం ఉన్న అమెరికన్, మిత్రదేశాల సైనికులను రక్షించడానికి పారా-రెస్క్యూ బృందాలు వేలాది మిషన్లను నిర్వహించాయి.

2005లో అఫ్గానిస్తాన్‌లోని ఒక గ్రామంలో తలదాచుకున్న యూఎస్ నేవీ సీల్‌ను రక్షించడానికి వైమానిక దళ పారా-రెస్క్యూ బృందాలను పంపారు.

ఆ బృందంపై మెరుపుదాడి జరగడంతో ఆయనతో పాటు ఉన్న మరో ముగ్గురు మరణించారు. ఈ సంఘటన ఆధారంగా తర్వాత 'లోన్ సర్వైవర్' అనే సినిమా తీశారు.

ఇటీవలి దశాబ్దాలలో కూలిపోయిన అమెరికన్ పైలట్లను రక్షించే మిషన్లు గణనీయంగా తగ్గిపోయాయి.

1999లో సెర్బియాలో కూలిపోయిన ఎఫ్-117 స్టెల్త్ ఫైటర్ పైలట్‌ను పారా-రెస్క్యూ బృందాలు గుర్తించి సురక్షితంగా తరలించాయి.

1995లో బోస్నియాలో అమెరికన్ పైలట్ స్కాట్ ఓగ్రాడీని రక్షించారు.

విమానాన్ని కూల్చివేయడంతో ఆయన శత్రువు కంట పడకుండా ఆరు రోజుల పాటు దాక్కున్నారు.

ఆ తర్వాత వైమానిక దళం, మెరైన్ కోర్ సంయుక్తంగా చేపట్టిన సీఎస్ఏఆర్ మిషన్‌లో ఆయన్ను రక్షించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)