ఆర్టెమిస్ 2: చంద్రుడి దిశగా వెళుతూ తీసిన 5 ఫోటోల్లో భూమి ఎలా ఉందో చూశారా?

నాసా, ఆర్టెమిస్ 2 , చంద్రుడు, భూమి, మూన్ మిషన్

ఫొటో సోర్స్, Nasa/Reid Wiseman

    • రచయిత, సోఫియా ఫెరీరా శాంటోస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 3 నిమిషాలు

చంద్రుడి దిశగా వెళుతున్న ఆర్టెమిస్ 2 సిబ్బంది, అంతరిక్షం నుంచి తీసిన భూమి హై రిజల్యూషన్ చిత్రాలను నాసా విడుదల చేసింది.

మిషన్ కమాండర్ రీడ్ వైజ్‌మన్ అద్భుతమైన చిత్రాలను తీశారని నాసా ప్రకటించింది.

"హలో వరల్డ్" పేరుతో ఈ చిత్రాలను నాసా పోస్ట్ చేసింది.

తొలి చిత్రంలో రెండు ధ్రువాల దగ్గర ఆకుపచ్చ అరోరాతో కూడిన చట్రంలో విశాలమైన అట్లాంటిక్ మహాసముద్రం కనిపిస్తోంది.

కుడివైపు దిగువన ప్రకాశవంతంగా కనిపిస్తున్న గ్రహం శుక్రుడని నాసా తెలిపింది.

నాసా, ఆర్టెమిస్ 2 , చంద్రుడు, భూమి, మూన్ మిషన్

ఫొటో సోర్స్, Nasa/Reid Wiseman

ఫొటో క్యాప్షన్, ఈ చిత్రాన్ని కూడా వైజ్‌మాన్ తీశారు. దీనికి ఆర్టెమిస్ 2 భూమి వైపు చూస్తోంది అని పేరు పెట్టారు. ఓరియన్ వ్యోమనౌకకున్న నాలుగు కిటికీల్లో ఒక దాని నుంచి ఈ చిత్రాన్ని తీశారు.

శుక్రవారం తెల్లవారుజామున ఆర్టెమిస్ 2 సిబ్బంది ఈ చిత్రాలను తీశారు.

2 లక్షల మైళ్లకు పైగా దూరంలో ఉన్న చంద్రుడి వద్దకు ప్రయాణంలో భాగంగా ఓరియన్ అంతరిక్ష నౌకను భూ కక్ష్య నుంచి బయటకు తీసుకువెళ్లారు.

1972 తర్వాత మనిషి భూమి కక్ష్యకు వెలుపల ప్రయాణించడం ఇదే మొదటిసారి. ఆర్టెమిస్2 సిబ్బంది ఏప్రిల్ 6న చంద్రుని అవతలివైపు చుట్టూ ప్రయాణించి ఏప్రిల్ 10న భూమికి తిరిగి రానున్నారు.

నాసా, ఆర్టెమిస్ 2 , చంద్రుడు, భూమి, మూన్ మిషన్

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, సిబ్బంది తీసిన మరో ఫోటో ఇది. భూమి మీద కొంత ప్రాంతం చీకట్లో, మరికొంత ప్రాంతం వెలుగులో ఉండి రేయింబవళ్లను సూచిస్తోంది. దీన్ని టెర్మినేటర్ అని పిలుస్తారు.

ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ ప్రధాన ఇంజన్ మండించిన తర్వాత ఆర్టెమిస్ 2 సిబ్బంది కిటికీలకు అతుక్కుపోయి ఫోటోలు తీశారని మిషన్ స్పెషలిస్ట్ జెరెమీ హాన్సెన్.. హ్యూస్టన్‌లోని మిషన్ కంట్రోల్‌కు తెలిపారు.

"చంద్రుని వెలుగుతో ప్రకాశిస్తున్న భూమి చీకటి భాగం అందంగా కనిపిస్తోంది" అని ఆయన అన్నారు.

అంతరిక్షంలోకి చూడాలనే వ్యోమగాముల ఉత్సాహం వల్ల కిటికీలు మురికిగా మారడంతో వాటిని ఎలా శుభ్రం చేయాలనే సమాచారం కోసం వైజ్‌మాన్ హ్యూస్టన్‌లోని మిషన్ కంట్రోల్‌ను సంప్రదించారు.

నాసా, ఆర్టెమిస్ 2 , చంద్రుడు, భూమి, మూన్ మిషన్

ఫొటో సోర్స్, NASA/Reid Wiseman

భూమిపై అంతటా దాదాపుగా చీకటి అలముకున్నప్పుడు రాత్రివేళ విద్యుత్ దీపాలు మినుకుమినుకుమంటున్నట్లు చూపిస్తున్న మరో చిత్రాన్ని నాసా పోస్ట్ చేసింది.

ఇది ప్రస్తుతం భూమిని, 1972లో చంద్రుడిపై అడుగు పెట్టినప్పుడు అపోలో 17 బృందం తీసిన ఫోటోను పక్కపక్కన పెట్టి పోల్చి చూపించింది.

ఈ రెండు ఫోటోలను పోలుస్తూ "54 ఏళ్లలో మనం ఎంతో సాధించాం, కానీ ఒక్క విషయం మాత్రం మారలేదు. అంతరిక్షం నుండి చూస్తే మా ఇల్లు అద్భుతంగా కనిపిస్తుంది!" అని రాసింది.

నాసా, ఆర్టెమిస్ 2 , చంద్రుడు, భూమి, మూన్ మిషన్

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, భూమి అప్పుడు, ఇప్పుడు కుడివైపున ఉన్న చిత్రం 1972లో తీసింది. ఎడమవైపున ఉన్న చిత్రం ప్రస్తుతం ( 2026) నాటిది.
నాసా, ఆర్టెమిస్ 2 , చంద్రుడు, భూమి, మూన్ మిషన్

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, చంద్రుడి మీదకు ప్రయాణం కోసం ఓరియన్ వ్యోమనౌకలో ఆస్ట్రోనాట్లు విక్టర్ గ్లోవర్, జెరెమీ హాన్సెన్, రీడ్ వైజ్‌మన్ కలిసి పని చేస్తున్నారు.
నాసా, ఆర్టెమిస్ 2 , చంద్రుడు, భూమి, మూన్ మిషన్

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, ఆర్టెమిస్ 2 మిషన్‌లో భాగంగా ఫస్ట్ డౌన్‌లింక్ ఈవెంట్ తర్వాత సిబ్బంది జెరెమీ హాన్సెన్, రీడ్ వైజ్‌మన్, క్రిస్టినా కోచ్, విక్టర్ గ్లోవర్‌లు రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)