రెండు అమెరికా యుద్ధ విమానాలను కూల్చినట్టు ప్రకటించిన ఇరాన్, గల్లంతయిన వ్యక్తికోసం తెహ్రాన్, అమెరికా పోటాపోటీ సెర్చ్ ఆపరేషన్

ఫొటో సోర్స్, EPA/Shutterstock
అమెరికా యుద్ధ విమానాలు రెండింటిని కూల్చామని ప్రభుత్వం వెల్లడించినట్లు రాన్ మీడియా తెలిపింది. వాటిలో ఒకటి దేశ నైరుతి ప్రాంతంపై ఎగురుతున్న ఎఫ్-15 కాగా, మరొకటి ఎఫ్-15 సిబ్బందిని రక్షించే ఆపరేషన్‌లో పాల్గొన్న విమానం.
మొదట కూలిన ఎఫ్-15 విమానంలో ఇద్దరు సిబ్బంది ఉండగా, వారిలో ఒకరిని రక్షించారు. మరొకరి ఆచూకీ ఇంకా దొరకలేదని బీబీసీ అమెరికా భాగస్వామి సీబీఎస్ తెలిపింది.
ఇరాన్ కూల్చిన రెండో విమానం ఏ-10 వార్‌హాగ్ నుంచి పైలట్ గల్ఫ్ ప్రాంతం మీదుగా సురక్షితంగా బయటకు దూకారు. ఆ తర్వాత ఆయన్ను రక్షించారు.
గల్లంతయిన సిబ్బందిని సజీవంగా పట్టుకున్న వారికి ఇరాన్ బహుమతిని ప్రకటించిందని ఇరాన్ ప్రభుత్వ టీవీ తెలిపింది.
విమానంలోని ఇద్దరు సిబ్బందిలో ఒకరు పారాచూట్ ఉపయోగించి బయటకు దూకి, దేశంలోని దక్షిణ ప్రాంతంలో దిగి ఉండొచ్చని ఇరాన్ మీడియా పేర్కొంది.

పట్టుకున్నవారికి బహుమతి ఎంతంటే?
విమానం పైలట్‌ను సురక్షితంగా రక్షించారని, గల్లంతైన వ్యక్తి ఆయుధ వ్యవస్థల అధికారి అని అమెరికా అధికారులు బీబీసీ అమెరికా భాగస్వామి సీబీఎస్‌కు తెలిపారు.
"పైలట్‌ను సజీవంగా పట్టుకోవాలి" అని ఇరాన్ ప్రభుత్వ అనుబంధ చానెళ్లు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. దీని కోసం ఇరాన్ బహుమతి కూడా ప్రకటించింది.
దాదాపు 50,000 పౌండ్లు (దాదాపు రూ. 61 లక్షలు) రివార్డును ప్రకటించినట్టు తెలుస్తోంది. దక్షిణ ఇరాన్‌లోని రెండు ప్రావిన్సులలో సాయుధ బలగాలు విమానం నుంచి గల్లంతయిన వ్యక్తికోసం వెతుకుతున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి.
ఖుజెస్తాన్ ప్రావిన్స్ నుంచి వచ్చిన ధృవీకరించని ఒక వీడియోలో ప్రజలు ఆయుధాలు, ఇస్లామిక్ రిపబ్లిక్ జెండాలు పట్టుకుని వెతుకుతున్నట్టు కనిపిస్తోంది. వారిలో ఒక వ్యక్తి "దేవుడి దయ ఉంటే మనం అతన్ని పట్టుకుంటాం" అని అంటున్నట్టు వినిపిస్తోంది.
‘‘చర్చలపై ప్రభావం చూపదు’’
అదే సమయంలో గాలింపు, సహాయక చర్యల సందర్భంగా అమెరికా బృందాలపై కాల్పులు జరిగినట్టు కూడా నివేదికలు తెలిపాయి.
ఈ వార్త మొదట ఇరాన్ మీడియాలో ప్రచురితమైంది. అమెరికా తమ సిబ్బంది కోసం గాలిస్తోందని తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
ఆ తర్వాత ఆక్సియోస్, రాయిటర్స్, ది న్యూయార్క్ టైమ్స్ కూడా ఒక అమెరికా అధికారిని ఉటంకిస్తూ అదే విషయాన్ని చెప్పాయి.
ఖుజెస్తాన్ ప్రావిన్స్‌లో ఒక అమెరికా విమానం, రెండు హెలికాప్టర్లు యుద్ధ విమాన సిబ్బంది కోసం గాలిస్తున్న దృశ్యాల వీడియోను బీబీసీ ధృవీకరించింది.
ఈ గాలింపు చర్య కొనసాగుతున్న సమయంలో ఇజ్రాయెల్ సైన్యం ఆ ప్రాంతంలో తన దాడులను నిలిపివేసినట్టు కూడా సమాచారం.
"మనం యుద్ధంలో ఉన్నాం. అయితే యుద్ధ విమానంపై దాడి ఇరాన్‌తో జరిగే చర్చలను ప్రభావితం చేయదు'' అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఎన్‌బీసీ నెట్‌వర్క్‌తో మాట్లాడుతూ అన్నారు.

ఫొటో సోర్స్, STATE MEDIA
అంతకుముందు దక్షిణ ఇరాన్‌లో అమెరికా యుద్ధ విమానం ఎఫ్-15 కూల్చివేశారని శుక్రవారం(ఏప్రిల్ 3) వార్తలొచ్చాయి. ఈ విషయాన్ని బీబీసీ అమెరికా భాగస్వామి అయిన సీబీఎస్ న్యూస్‌కు రెండు వర్గాలు ధృవీకరించాయి.
కూలిన ఎఫ్-15 యుద్ధ విమానంలోని సిబ్బందిలో ఒకరిని రక్షించినట్టు కూడా ఆ వర్గాలు సీబీఎస్ న్యూస్‌కు తెలిపాయి.
అమెరికా ఎఫ్-15 యుద్ధ విమానంలోని 'గల్లంతైన పైలట్' కోసం గాలింపు చర్యలు 'పూర్తి స్థాయిలో' కొనసాగుతున్నాయని ఇరాన్‌లోని దక్షిణ కోహ్గిలుయే ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ బోయెర్ అహ్మద్ తెలిపారు.
ఆ పైలట్‌ను గుర్తించేందుకు అమెరికా కూడా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను ఉపయోగించి "విస్తృత ప్రయత్నాలు" చేస్తోందని మీడియా రిపోర్టులు తెలిపాయి.
'పోలీసులు, భద్రతా దళాలు, స్థానికులు పైలట్‌ను గుర్తించి, పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు' అని డిప్యూటీ గవర్నర్ చెప్పినట్టు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ‘ఫార్స్’ తెలిపింది.
'గల్లంతైన పైలట్' గురించి ఏమైనా సమాచారం తెలిస్తే అధికారులకు తెలియజేయాలని డిప్యూటీ గవర్నర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
విమానం కచ్చితంగా ఎక్కడ కూలిపోయిందో తెలియలేదు. అయితే ఇరాన్ ప్రభుత్వ మీడియా కోహ్గిలుయే-బోయార్ అహ్మద్, ఖుజెస్తాన్ ప్రావిన్సులను ప్రస్తావించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























