ఒక్కో చీమ రూ.21 వేలు.. ఈ చీమలతో స్మగ్లర్లు ఏం చేస్తున్నారు?

ఫొటో సోర్స్, Dino Martins
- రచయిత, వైక్లిఫ్ ముయా
- హోదా, నైరోబి, కెన్యా
- చదివే సమయం: 7 నిమిషాలు
కెన్యాలో చీమలకు ఇది సంభోగకాలం.
వర్షాకాలంలో, గిల్గిల్ అనే చిన్న పట్టణం చుట్టూ వేలాది చీమల పుట్టల నుంచి గుంపులు గుంపులుగా చీమలు బయటకు రావడం చూడొచ్చు.
కెన్యాలోని రిఫ్ట్ లోయలో ఉండే ఈ పట్టణం ఇప్పుడొక అక్రమ వ్యాపారానికి అడ్డాగా మారింది.
వర్షాకాలంలో.. మగ చీమలకు రెక్కలు విచ్చుకుని, రాణి చీమతో సంభోగం జరిపేందుకు ఎగురుతాయి. ఆ సమయంలో రాణి చీమ కూడా ఎగురుతుంది. రాణి చీమలను పట్టుకుని, స్మగ్లర్లకు వాటిని అమ్మేందుకు అదే సరైన సమయం.
ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద బ్లాక్ మార్కెట్ ఉంది. ఈ మార్కెట్లో ప్రజలకు చీమలను పట్టుకుని గాజు బాక్సులలో పెట్టి, అవి తమ పుట్టలను నిర్మించుకోవడాన్ని చూసి ఆనందించడం అభిరుచిగా ఉంది.
అత్యంత ఎక్కువ మంది కోరుకునేది ''అతిపెద్ద ఆఫ్రికన్ హార్వెస్టర్'' అనే రాణి చీమనే. ఇది చాలా పెద్దగా, ఎరుపు రంగులో ఉంటుంది. ఆన్‌లైన్ బ్లాక్ మార్కెట్లో.. ఒక్కో రాణి చీమ 220 డాలర్ల వరకు అంటే సుమారు 21 వేల రూపాయల వరకు ఉంటుంది.
ఒక గర్భవతి అయిన రాణి చీమ పెద్ద కాలనీని (పెద్ద సమూహాన్ని) ఏర్పాటు చేస్తుంది. దీర్ఘకాలం జీవిస్తుంది.
వీటిని ప్యాక్ చేయడం కూడా సులభం. ఎయిర్‌పోర్టు స్కానర్లు బతికున్న జీవులను అంత త్వరగా గుర్తించలేవు.
''ముందుగా, నాకు వీటిని రవాణా చేయడం చట్టవిరుద్ధమని తెలియదు'' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యక్తి బీబీసీకి చెప్పారు.
ఆయన గతంలో విదేశీ కొనుగోలుదారులను, స్థానికంగా చీమలు పట్టుకునే వారిని కలిపే మధ్యవర్తిగా పనిచేసేవారు.

ఈ చీమలను శాస్త్రీయంగా మెస్సార్ సెఫలోట్స్‌గా పిలుస్తారు. ఇవి తూర్పు ఆఫ్రికాకు చెందినవి. గింజలను సేకరించుకుని తమ గూళ్లలో నిల్వ చేసుకునే వీటి సామర్థ్యం బాగా ప్రసిద్ధి పొందింది.
''ఇక్కడ తేలికగా దొరికే రాణి చీమల కోసం విదేశీయులు మంచి డబ్బులను చెల్లిస్తారని ఒక ఫ్రెండ్ నాతో చెప్పాడు'' అని మధ్యవర్తిగా పనిచేసిన ఆ వ్యక్తి చెప్పారు.
''సూర్యోదయానికి ముందు, పొద్దునే పొలాల్లో చీమల కోసం వెళ్తాం. విదేశీయులు నేరుగా పొలాల దగ్గరకు రారు. వారు అతిథి గృహంలో లేదా నగరంలో కారులో ఉంటారు. మాకు వారిచ్చిన చిన్న ట్యూబ్‌లు, సిరంజీల్లో వాటిని సేకరించి, డెలివరీ చేస్తాం'' అని తెలిపారు.
గత ఏడాది నైవాషాలో ఒక అతిథి గృహంలో బతికి ఉన్న 5 వేల భారీ హార్వెస్టర్ (గింజలు సేకరించే) రాణి చీమలను పట్టుకున్నప్పుడు కెన్యాలోని ఈ అక్రమ వ్యాపారపు నిజ స్వరూపం వెలుగులోకి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
కెన్యా వైల్డ్‌లైఫ్ సర్వీస్ (కేడబ్ల్యూఎస్) ప్రకారం.. అనుమానితులందరూ బెల్జియం, వియత్నాం, కెన్యాలకు చెందినవారు. చీమలను వారు తడి దూదితో నింపిన సిరంజీలు, టెస్ట్ ట్యూబ్‌లలో ఉంచారు.
ప్రతి చీమ కూడా రెండు నెలల వరకు బతకగలదు. ఇలా నింపిన చీమలను యూరప్, ఆసియాకు పంపి విక్రయించాలన్నది వారి ప్లాన్.
చీమల వ్యాపారం గురించి తెలుసుకున్న శాస్త్రవేత్తలు, అధికారులు ఆశ్చర్యపోయారు.
కెన్యా తరచూ ఐవరీ (ఏనుగు దంతాలలోని గట్టి, తెల్లటి పదార్థం), ఖడ్గమృగం కొమ్ములకు సంబంధించి అక్రమ రవాణా కేసులు తరచూ ఎదుర్కొంటున్నప్పటికీ.. ఈ చీమల అక్రమ రవాణాను ఎప్పుడూ పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు.
యూకేకు చెందిన రిటైలర్ యాంట్స్ ఆర్ అజ్ కు చెందిన వెబ్‌సైట్ ఈ జెయింట్ ఆఫ్రికన్ హార్వెస్టర్ చీమను ‘‘చాలామందికి కలల జాతి’’గా పేర్కొంటోంది. ప్రస్తుతం రాణి చీమల స్టాక్ లేదని, వాటిని సమకూర్చుకోవడం రిటైలర్లకు చాలాకష్టమని తెలిపింది.
కెన్యాకు చెందిన బయోలాజిస్ట్ డినో మార్టిన్స్ ఎంటమాలజిస్ట్ (కీటక శాస్త్రవేత్త). '' ఈ అక్రమ వ్యాపార పరిమాణం తెలిసి చాలా ఆశ్చర్యపోయాను'' అని చెప్పారు.
కెన్యా ప్రస్తుతం 600 చీమల జాతులకు నిలయంగా ఉంది. అయితే ప్రజలు ఎందుకు ఈ చీమలకు ఆకర్షితులవుతున్నారో ఆయనకు అర్థమైంది.
వీటి రాణి చీమను ''ఫౌండ్రెస్ క్వీన్'' అంటారు. ఇది 25 మిల్లీమీటర్ల వరకు అంటే 0.98 ఇంచి పొడవు పెరుగుతుంది. తన జీవితకాలమంతా గుడ్లను పెడుతుంది.
''ఈ చీమల జాతుల్లో అత్యంత ఆసక్తికరమైన, రహస్య అంశాల్లో ఇదొకటి'' అని మార్టిన్స్ తెలిపారు.
''అవి పెద్ద కాలనీలను ఏర్పాటు చేయగలవు. వాటి ప్రవర్తన అద్భుతం. వాటిని తేలికగా పెంచవచ్చు. అవి పెద్దగా దూకుడు స్వభావం కలిగి ఉండవు'' అని తెలిపారు.
ఒక్క ఆడ చీమ ఎన్నో మగ చీమలతో సంభోగం జరుపుతుంది. '' ఆ తర్వాత మగ చీమల పని అయిపోతుంది. వాటిలో చాలా చీమలను వేటాడే జంతువులు (ప్రిడేటర్లు) తినేస్తాయి లేదా వాటికవే చనిపోతాయి. ఆ తర్వాత రాణి చీమలు చిన్న గోయ్యి తవ్వి, గుడ్లు పెడతాయి. తమ కాలనీని నిర్మించుకునేందుకు అదే ప్రారంభం'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Dr. Pronoy Baidya
ఈ పనిలో రాణికి సాయపడే చీమలన్నీ కూడా ఆడవే. ఆ తర్వాత వీటి సంఖ్య లక్షల్లోకి చేరుకుంటుంది.
''ఒక చీమల సమూహం (కాలనీ) 50 నుంచి 70 ఏళ్లు బతకగలదు'' అని మార్టిన్స్ వివరించారు. ''కెన్యా రాజధాని నైరోబీకి సమీపంలో కొన్ని చీమల పుట్టలు ఉన్నాయి. వాటిని నేను 40 ఏళ్లుగా చూస్తున్నా'' అని తెలిపారు మార్టిన్స్.
దీని అర్థం ఒక రాణి చీమ కూడా అన్నే సంవత్సరాలు బతుకుతుంది. రాణి చీమ మరణించిన తర్వాత.. ఆ చీమల సమూహంతా చెల్లాచెదురవుతుంది. బతికున్న చీమలు మరో గూడు కోసం వెతకడం ప్రారంభిస్తాయి.
చీమల బెడదతో బాధపడే కెన్యా రైతులకు ఈ విషయం బాగా తెలుసు. ఒక చీమల సమూహాన్ని నిర్మూలించాలంటే, చీమల పుట్టలోని సొరంగాలలో లోపలికి దాక్కునే రాణి చీమను కనుగొనాలి.
''ఒకవేళ ఆ పుట్టను కొద్దిగా కదిలిస్తే.. ఈ చీమలన్నీ బయటకు రావడం మొదలవుతుంది. అలా చేసినప్పుడు, దాన్ని పట్టుకోవడం తేలిక'' అని మధ్యవర్తిగా పనిచేసిన ఒక వ్యక్తి చెప్పారు.
''చీమల రవాణాలో వారిని అరెస్ట్ చేస్తున్నారని వార్తలు వచ్చినప్పుడు, నేనేం చేస్తున్నానో నాకర్థమైంది. ఆ తర్వాత వెంటనే నా ఉద్యోగాన్ని మానేశాను'' అని తెలిపారు.
అరెస్ట్ అయిన వారిపై ''బయోపైరసీ'' అభియోగాలు మోపారు. దీనర్థం.. దేశానికి చెందిన జీవరాశులను లేదా సహజ వనరులను దొంగిలించడం.
అరెస్ట్ అయిన వారికి 12 నెలలు జైలు లేదా జరిమానాను ఎదుర్కొనే అవకాశం ఇచ్చారు. అందరూ సుమారు రూ.6.5 లక్షల జరిమానా చెల్లించగా... విదేశీయులు దేశం విడిచి వెళ్లిపోయారు.
రెండు వారాల క్రితం చైనాకు చెందిన ఒక వ్యక్తిని నైరోబీ జోమో కెన్యాట్టా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. గతేడాది చీమల అక్రమ రవాణాకు ఈయనే సూత్రధారి.

ఫొటో సోర్స్, KWS
వేరే పాస్‌పోర్టుతో ఆయన దేశం విడిచి వెళ్లారు. 2000 రాణి చీమలను టెస్టు ట్యూబ్‌లలో, టిస్యూ పేపర్ రోల్స్‌లో ప్యాక్ చేసి, అక్రమంగా సరఫరా చేయబోయారు.
చైనాలో జరిగే చీమల వ్యాపారంపై జెంగ్యాంగ్ వాంగ్ 2023లో ఓ రిపోర్టును నివేదించారు. ఈ వ్యాపారం చాలా ప్రమాదకరమైనదిగా ఆయన భావిస్తున్నారు. స్థానిక జీవవ్యవస్థను ఇది దెబ్బతీయగలదని తెలిపారు.
సిచువాన్ విశ్వవిద్యాలయంలో జెంగ్యాంగ్ వాంగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. "మొదట్లో, ప్రజలు చీమలను పెంచుతుండటంతో మేం చాలా సంతోషించాం" అని ఆయన తెలిపారు.
ఆ చీమలను 'ఫార్మికేరియం' అని పిలిచే ఒక పారదర్శక ప్లాస్టిక్ పెట్టెలో ఉంచుతారు.
''అవి సొరంగాలు తవ్వడం, ఆహారం సేకరించడం, రాణికి కాపలా కాయడాన్ని ప్రజలు ప్రత్యక్షంగా చూస్తారు. ఇది చాలా మంచి అభిరుచి. కీటకాల గురించి తెలుసుకోవడానికి ఇదొక గొప్ప మార్గం'' అని చెప్పారు.
''కానీ, ఆ తర్వాత మేం గ్రహించిందేంటంటే.. వేరే దేశం నుంచి తీసుకొచ్చిన జీవులను పెంచడం ప్రమాదకరం కదా? అంటే, ఆ ప్రాంతానికి చెందని చీమను తీసుకొచ్చి పెంచడం పర్యావరణానికి అతిపెద్ద ముప్పుగా మారవచ్చు'' అని జెంగ్యాంగ్ వాంగ్ తెలిపారు.
పరిశోధకులు చైనాలో ఆరు నెలల పాటు ఆన్‌లైన్‌లో అమ్మకాలను పర్యవేక్షించారు. 58,000 కంటే ఎక్కువ చీమల సమూహాలు అమ్ముడయ్యాయని వారు కనుగొన్నారు.
ఈ జాతులను దేశంలోకి తీసుకు రావడం చట్టవిరుద్ధం అయినప్పటికీ, వీటిలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ జాతులు చైనాకు చెందినవి కావని తెలిసింది.
''ఒకవేళ ఈ వ్యాపారం ఇలానే కొనసాగితే.. ఒకరోజు కొన్ని చీమలు వాటి బాక్సుల నుంచి తప్పించుకుని, అడవుల్లో వ్యాపిస్తాయి. అది జరగడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు'' అని వాంగ్ హెచ్చరించారు.
బయోలాజికల్ కన్జర్వేషన్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో ఆఫ్రికన్ హార్వెస్టర్ చీమ కనుక చైనాలో వ్యాపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు.
గింజలను సేకరించే చీమలలో ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. ఆగ్నేయ చైనాలో గింజల ఆధారిత వ్యవసాయాన్ని ఇది నాశనం చేయచ్చు.
కెన్యాలో పర్యావరణంపై కూడా ఆందోళన నెలకొంది. ''విత్తనాలను సేకరించే చీమలు జీవవ్యవస్థకు పునాది. ఇవి గడ్డి, మొక్కల గింజలను సేకరించి, వాటిని ఇతర ప్రాంతాలకు తీసుకువెళతాయి. దీనిద్వారా మైదానాలు పచ్చగా ఉంచేందుకు ఇవి సాయపడతాయి'' అని మార్టిన్ తెలిపారు.
'' రాణి చీమలను ఇలా విచక్షణారహితంగా పట్టుకుంటుంటే.. మొత్తం చీమల సమూహాలే (కాలనీలే) తుడిచిపెట్టుకుపోతాయి. జీవవ్యవస్థ దెబ్బతింటుంది. జీవవైవిధ్యానికి ఇది ముప్పు'' అని కెన్యాలోని వైల్డ్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లోని సీనియర్ సైంటిస్ట్ ముకోన్యి వటాయ్ చెప్పారు.
కెన్యాలో చీమలను సేకరించడం చట్టబద్ధమే. కానీ, ప్రత్యేక అనుమతులు అవసరం. స్థానిక సమాజంలో లాభాల పంపిణీ ఒప్పందం కూడా అవసరం.
కేడబ్ల్యూఎస్ ప్రకారం.. ఎన్ని చీమలను ఎక్కడకు పంపుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు అలాంటి అనుమతులను ఎవరూ కోరలేదు.
అంతరించిపోయే ప్రమాదమున్న జాతుల అంతర్జాతీయ వాణిజ్యంపై కన్వెన్షన్‌లో అన్ని చీమలను చేర్చాలని ఇప్పుడు కొంతమంది పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల వ్యాపారాన్ని నియంత్రించే ఒప్పందం. ‘‘కానీ ఈ ఒప్పందంలో ఏ చీమల జాతిని చేర్చలేదు" అని పరిశోధకులు సెర్గియో హెన్రిక్స్ వివరించారు.
''అంతర్జాతీయ ఒప్పందం దీన్ని పర్యవేక్షించేంత వరకు.. ఈ వాణిజ్యానికి సంబంధించిన వాస్తవ విషయాలు ప్రభుత్వాలకు, ప్రజలకు తెలియవు'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
కీటకాల అక్రమ రవాణా తరచూ బయటికి రాకపోవడమే కేడబ్ల్యూఎస్‌కు అతిపెద్ద సవాలు. విమానాశ్రయాల్లో, సరిహద్దుల వద్ద మెరుగైన స్క్రీనింగ్ అవసరమని వారు ప్రతిపాదిస్తున్నారు.
''చీమల అక్రమ రవాణాలో దొరుకుతున్నవి మొత్తం వాణిజ్యంలో చాలా తక్కువ మాత్రమే. ఈ వ్యాపారం మొత్తం ఎంత అనేది కేవలం అంచనా వేయగలం'' అని మార్టిన్స్ కూడా అంగీకరిస్తున్నారు.
అయితే, జర్నలిస్టు చార్లెస్ ఓన్‌యాంగో ఒప్పో భిన్నమైన దృక్పథాన్ని వ్యక్తం చేశారు. డబ్బులను సంపాదించుకునేందుకు కెన్యాకు ఇదొక మంచి అవకాశమని తెలిపారు.
''బంగారం లేదా డైమండ్లలానే చీమలు పరిమిత స్థాయిలో లభించే సరుకు కాదు. ప్రతిరోజూ వేలసంఖ్యలో వీటిని పెంచవచ్చు. అయినప్పటికీ, వీటిని మనం దొంగిలించిన వస్తువులుగా చూస్తాం'' అని కెన్యా న్యూస్‌పేపర్ డైలీ నేషన్‌లో రాశారు.
కెన్యా ప్రభుత్వం గత సంవత్సరం, చీమల సహా వన్యప్రాణుల వ్యాపారాన్ని చట్టబద్ధం చేసి, వాణిజ్యకరీంచాలనే విధానాలను ఆమోదించింది.
"చీమల వంటి వన్యప్రాణి జాతులలో సుస్థిరమైన వాణిజ్యాన్ని సాధించడమే ఈ విధానాల లక్ష్యం" అని ముకోన్యి వటాయ్ చెప్పారు. "ఇది స్థానిక సమాజాలకు ఉద్యోగాలు, ఆదాయం, జీవనోపాధిని కల్పించడంలో సాయపడుతుంది" అని తెలిపారు.
దీన్ని సరిగ్గా పర్యవేక్షిస్తే.. గిర్గిల్‌లోని రైతులు తమ పంటలతో పాటు ప్రత్యేక బాక్సులలో రాణి చీమలను పెంచడం ప్రారంభించవచ్చు. వారికి ఇదొక మంచి ఆదాయ వనరు కావొచ్చు.
అయితే, ప్రపంచవ్యాప్తంగా చీమల పెంపకం అభిరుచి ఉన్న వారికి వీటిని అమ్మడం సురక్షితమా లేక ప్రమాదకరమా అనే విషయంపై చర్చ ఇంకా జరగాల్సి ఉంది.
సింగపూర్‌కు చెందిన ఓస్మాండ్ చియా కూడా ఈ కథనానికి అదనపు సమాచారం అందించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































