తోడేళ్ల సంతతి నుంచి వచ్చిన కుక్కలు మనుషులకు ఎలా దగ్గరయ్యాయి? ఈ చిన్న దవడ ఎముక చెబుతున్న చరిత్రేంటి?

ఫొటో సోర్స్, Kevin Church
- రచయిత, పల్లబ్ ఘోష్
- హోదా, సైన్స్ ప్రతినిధి
- చదివే సమయం: 5 నిమిషాలు
సోమర్‌సెట్‌లోని ఒక గుహ భూగర్భంలో దొరికిన దవడ ఎముకలోని ఒక భాగం.. కుక్కలు మనకెప్పుడు, ఎలా ప్రాణ స్నేహితులయ్యాయనే చరిత్రను తిరగరాసింది.
డీఎన్ఏ విశ్లేషణలో, ఇది మనకు ఇప్పటివరకూ తెలిసిన మొట్టమొదటి పెంపుడు కుక్కలలో ఒకదానికి చెందినదని వెల్లడైంది. పాడి పశువులను మచ్చిక చేసుకోవడానికి ముందే, పిల్లులు మన ఇళ్లలోకి రావడానికి వేల ఏళ్ల కిందటే, అంటే.. 15 వేల ఏళ్ల క్రితమే బ్రిటన్‌లో ప్రజలు వాటితో సన్నిహితంగా జీవించినట్లు డీఎన్ఏ విశ్లేషణ సూచిస్తోంది.
ఈ తాజా ఆవిష్కరణ.. తోడేలు పూర్వీకుల నుంచి మొట్టమొదట కుక్కలు ఆవిర్భవించిన కాలాన్ని సుమారు 5000 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లింది.
నేచురల్ హిస్టరీ మ్యూజియానికి చెందిన డాక్టర్ విలియం మార్ష్ ప్రకారం, మొట్టమొదటి కుక్కలు, రాతియుగపు మనుషులకు మధ్య స్నేహం దాదాపు మొదట్నుంచే ఉంది.
''15000 ఏళ్ల క్రితమే కుక్కలకు, మనుషులకు మధ్య నమ్మశక్యం కానీ రీతిలో బలమైన సంబంధం ఉందని ఇది చూపుతోంది. ఈ చిన్న దవడ ఎముక ఒక చిన్న విషయంలా అనిపించవచ్చు. కానీ, కుక్కలకు, మనుషులకు మధ్య సంబంధం ఎలా మొదలైందనే మానవ చరిత్రను మొత్తం తెలుసుకునేందుకు సాయపడింది.''
మంచుయుగం ముగింపు నాటికి.. మనుషుల ఆవాస ప్రాంతాల వద్ద తిరుగుతూ, బయట పడేసిన ఆహార పదార్థాలను తింటూ నెమ్మదిగా మచ్చికైన బూడిద రంగు తోడేళ్ల సంతతికి చెందినవే మొట్టమొదటి కుక్కలు.

కాలక్రమేణా వీటిని మనుషులు వేటకు, కాపలాకు, జాడ కనుక్కునేందుకు ఉపయోగించడం ప్రారంభించారు. దీంతో అవి క్రూర మృగాలుగా కాకుండా పనిలో భాగస్వాములుగా మారాయి.
వందలాది తరాల మానవుల పెంపకం తర్వాత.. కుక్కలు చిన్న మూతి, చిన్న దంతాలతో వివిధ రకాలుగా పరిణామక్రమం చెందాయి.
మార్ష్ తన పీహెచ్‌డీ ప్రాజెక్టులో భాగంగా అనుకోకుండా దీన్ని కనుగొన్నారు. చెడ్డార్ చీజ్‌ను నిల్వ చేయడానికి ప్రసిద్ధిగాంచిన చెడ్డార్ గార్జ్‌లోని 'గాఫ్స్ గుహ'లో 1920లలో చేపట్టిన తవ్వకాల్లో ఈ దవడ ఎముక బయటపడింది.
ఇదొక సాధారణమైన నమూనాగా భావించి దశాబ్దాలుగా మ్యూజియం డ్రాలోనే దీన్ని భద్రపరిచారు. కానీ, ఈ యువ పరిశోధకుడు పదేళ్ల క్రితం ప్రచురితమైన ఒక పరిశోధనా పత్రాన్ని చూశారు. దానిలో ఇది కుక్కకు చెందినది కావొచ్చని రాసి ఉంది.
ఈ దవడ ఎముకకు చెందిన జన్యు విశ్లేషణను మార్ష్ చేపట్టారు. అది నిజంగా కుక్కకు చెందినదేనని తెలుసుకుని ఆయన ఆశ్చర్యానికి, ఆనందానికి లోనయ్యారు.
దీంతో, ఇంతకుముందు ధ్రువీకరించిన దానికంటే వేల ఏళ్ల క్రితం నుంచే కుక్కలు ఉన్నాయనే దానికి ఇదొక స్పష్టమైన సాక్ష్యంగా నిలిచింది.
పరీక్షా ఫలితాలను నమ్మలేకపోయిన మార్ష్.. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, ఎల్ఎంయూ మ్యూనిచ్‌కు చెందిన తన స్నేహితుడు, శాస్త్రీయ సహకారమందించే డాక్టర్ లాచీ స్కార్స్‌బ్రూక్‌కు ఈ విషయాన్ని తెలియజేశారు.
''రాతియుగపు ప్రారంభం నాటి కుక్కను కనుగొన్నాను అని విలియం నాకు చెప్పారు. లేదు, అది సాధ్యం కాదు అని నేనన్నాను. అప్పటివరకు ఉన్న కుక్కలన్నీ తోడేళ్లు అని చెప్పాను. కానీ, ఆయన చాలా నమ్మకంగా ఉన్నారు'' అని స్కార్స్‌బ్రూక్ తెలిపారు.
''అప్పుడాయన మాకు ఫలితాలను చూపించారు.. ఆ తర్వాత, నిజంగానే ఆయన వేల ఏళ్ల కిందటి కుక్కను కనుగొని ఉండొచ్చని మేం భావించాం'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Kevin Church/NHM
గాఫ్స్ గుహ నుంచి వెలికితీసిన దవడ ఎముక ఒక కుక్కకు చెందినదని ఇప్పుడు చాలా నమ్మకంగా నిర్ధరించడంతో, శాస్త్రవేత్తలు ఈ జన్యు సంకేతాలను ఉపయోగించి ఇదే యుగంలోని పశ్చిమ ఐరోపా, ఆధునిక తుర్కియేలోని సెంట్రల్ అనటోలియా ప్రాంతాల్లో లభించిన దాదాపు అదే వయసు కలిగిన నమూనాలను పరీక్షించేందుకు వీలైంది.
ఆ నమూనాలన్నీ కుక్కలవేనని తేలింది.
''కుక్కలు, తోడేళ్ల మధ్యనున్న డీఎన్ఏ పురాతన నమూనాలను అర్థం చేసుకునేందుకు మేం ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాం'' అని స్కార్స్‌బ్రూక్ నాతో అన్నారు.
''కుక్కలు నిజంగా ఎక్కడ మొదలయ్యాయో కచ్చితంగా చెప్పలేకపోవడంతో .. మా ప్రతి ప్రయత్నం కూడా వృథా అయింది'' అని అన్నారు.
''అప్పుడే ఈ చిన్న దవడ ఎముక దొరికింది. యూరప్ అంతటా విస్తరించి, ఇన్నాళ్లూ మన కళ్లముందే గుర్తింపు లేకుండా ఉండిపోయిన ఇతర ప్రాచీన జాతి కుక్కలను నిర్ధరించేందుకు కీలకంగా మారింది'' ఆయన బీబీసీతో చెప్పారు.
నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ కథనం.. మరిన్ని జన్యు, రసాయన విశ్లేషణలతో దీని వెనుకాలనున్న రహస్యం తెలుసుకోవడంలో మరింత ఆసక్తికరంగా మారింది.

ఫొటో సోర్స్, Lars Larsson.
నేచురల్ హిస్టరీ మ్యూజియానికి చెందిన డాక్టర్ సెలీనా బ్రేస్ ప్రకారం.. ఈ పరీక్షలు కేవలం కుక్కలు జన్యుపరంగా ఒకే రకమైన పోలికలు కలిగి ఉన్నట్లు చూపించడమే కాకుండా (అంటే మనుషులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లడం వల్ల వారితో పాటు కుక్కల పూర్వీకులు కూడా వారితో పాటు యూరప్ అంతటా తిరిగి ఉండాలి ).. తమ యజమానులు తిన్న ఆహారాన్నే అవి తిన్నట్లు కూడా చూపించాయి.
''వాటి ఆహార అలవాట్లను బట్టి తుర్కియేలో మనుషులు తిన్న చేపల్నే తిన్నాయని లేదా గాఫ్ గుహలో ఒకే రకమైన మాంసాహారం లేదా మొక్కల ఆహారం తిన్నాయని మనకు తెలుసు. కాబట్టి ఇది మనుషులకు, కుక్కలకు మధ్య బలమైన సన్నిహిత సంబంధాన్ని సూచిస్తుంది.''
''ఇది చాలా అద్భుతం కదా.. 15 వేల ఏళ్ల క్రితం కూడా నేడు మనం చూస్తున్న అనుబంధాన్ని చూశాం. ఇది చాలా సుదీర్ఘ స్నేహ సంబంధం.''
జర్మనీ, ఇటలీ, స్విట్జర్లాండ్‌లో చివరి మంచుయుగానికి చెందిన గుహల్లో కుక్కలను పోలిన చిన్న కుక్కలకు చెందిన పురావస్తు ఆధారాలు దొరికాయి. కొన్నిసార్లు మనుషులతో పాటు వీటిని కూడా ఖననం చేసినట్లు తెలిసింది. ఇవన్నీ.. అదే సమయంలో వాటి మధ్యనున్న సన్నిహిత సంబంధాన్ని తెలియజేస్తున్నాయి.
కానీ, తాజా పరిశోధనలో ఉపయోగించిన వివరణాత్మక డీఎన్ఏ పరీక్ష గాఫ్స్ గుహ నుంచి వెలికితీసిన జంతువు నిజంగా కుక్కదేనని తెలియజేసింది. పశ్చిమ యూరప్, ఆసియా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో అప్పటికే విస్తరించిన తొలితరం కుక్కల సమూహంలో ఇవి భాగమని తెలిపింది.
నేడు మన ఇళ్లల్లో తిరిగే పెంపుడు జంతువులన్నీ కూడా మంచుయుగం చివరినాటికి ఉత్తరాది ప్రపంచంలో విస్తరించిన ద్వంద్వ పూర్వీకుల నుంచి ఉద్భవించినట్లు నేచర్‌లో ప్రచురితమైన మరో అధ్యయనం పేర్కొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































