రష్యా చమురుపై అమెరికా యూ-టర్న్.. భారత్‌కు భారీగా కలిసిరానుందా?

ఫొటో సోర్స్, AFP via Getty Images
- రచయిత, సందీప్ రాయ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 6 నిమిషాలు
అమెరికా మరోసారి యూ-టర్న్ తీసుకుంటూ రష్యా చమురు కొనుగోలుపై మినహాయింపు గడువును నెలరోజులు పొడిగించింది. ఇరాన్‌తో యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన ధరలు వేగంగా పెరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం వెలువడింది. మార్కెట్‌ను స్థిరంగా ఉంచే ప్రయత్నంగా దీనిని భావిస్తున్నారు.
రష్యా చమురుపై ఇచ్చిన మినహాయింపు ముగిసిందని అమెరికా ఆర్థిక మంత్రి రెండు రోజుల కిందటే ప్రకటించారు. కానీ, ఇప్పుడు గడువును మళ్లీ పెంచారు.
ఇది కేవలం ట్రంప్ మాత్రమే కాదు, 'మొత్తం టీమ్ యూ-టర్న్' అని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఒకరోజు ముందే లెబనాన్‌లో కాల్పుల విరమణను ఉటంకిస్తూ, హార్ముజ్ జలసంధిని 'పూర్తిగా తెరుస్తున్నట్లు' ఇరాన్ ప్రకటించింది. అనంతరం, గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి.
ఇరాన్ ప్రకటన తర్వాత, బ్రెంట్ క్రూడ్ ధర 90 డాలర్ల కంటే కిందకు పడిపోయింది. అంతకుముందు రోజు ఇది 98 డాలర్ల పైన ఉంది. యుద్ధానికి ముందు ఇది 70 డాలర్ల దగ్గర ఉండేది.

శుక్రవారం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఎక్స్ పోస్టులో, "లెబనాన్‌లో కాల్పుల విరమణతో, హార్ముజ్ జలసంధి మార్గం అన్ని వాణిజ్య నౌకల కోసం కాల్పుల విరమణ ముగిసే వరకు పూర్తిగా తెరిచి ఉంటుంది" అని చెప్పారు.
అదేరోజు డోనల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్‌లో హార్ముజ్ జలసంధి తెరిచినందుకు ఇరాన్‌కు ధన్యవాదాలు తెలిపారు. కానీ, మరో పోస్ట్‌లో- "హార్ముజ్ జలసంధి వ్యాపారం, రాకపోకల కోసం పూర్తిగా సిద్ధంగా ఉంది. కానీ, నౌకాదళ దిగ్బంధం కొనసాగుతుంది" అని తెలిపారు.
ఈలోపు అమెరికా - ఇరాన్ మధ్య రెండో రౌండ్ చర్చల అవకాశం కనిపిస్తోంది. ఈ చర్చల్లో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఇరాన్ - అమెరికా మధ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయని, కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం రావాల్సి ఉందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చెప్పారు.
అయితే, శనివారం మళ్లీ హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసినట్లు వార్తలొస్తున్నాయి.

ఫొటో సోర్స్, Stringer/Anadolu via Getty
ఆ మూడు దేశాలకు మినహాయింపు లేదు
రష్యా చమురు, పెట్రోలియం ఉత్పత్తులను సముద్ర మార్గం ద్వారా కొనుగోలు చేయడానికి అన్ని దేశాలకు (మూడు మినహా) అనుమతిస్తూ అమెరికా ఏప్రిల్ 17న నిర్ణయం తీసుకుంది. ఈ మినహాయింపు దాదాపు ఒక నెల వరకు అమలులో ఉంటుందని తెలిపింది. నౌకల్లో శుక్రవారం వరకు లోడ్ చేసిన చమురును మే 16 వరకు కొనుగోలు చేయవచ్చని అమెరికా ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
మార్చిలో ట్రంప్ ప్రభుత్వం రష్యా చమురు కొనుగోలుపై ఒక నెల మినహాయింపు ఇచ్చింది, అది ఏప్రిల్ 11న ముగిసింది. దీంతో, అమెరికా ఆర్థిక విభాగం విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం తాజాగా జనరల్ లైసెన్స్ 134బి జారీ చేసింది.
ఇందులో "నౌకల్లో లోడ్ చేసిన రష్యా సంబంధిత ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల డెలివరీ, విక్రయాలకు 2026 ఏప్రిల్ 17 వరకు అనుమతి ఉంది" అని తెలిపింది.
జనరల్ లైసెన్స్ 134బి ప్రకారం, ఈ మినహాయింపులో రష్యన్ హార్మ్‌ఫుల్ ఫారిన్ శాంక్షన్ రెగ్యులేషన్స్ లేదా యుక్రెయిన్ - రష్యా యుద్ధం సంబంధిత ఆంక్షలు ఉన్న ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయి. అయితే ఇందులో ఇరాన్, ఉత్తర కొరియా, క్యూబాకు మినహాయింపు ఇవ్వలేదు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
భారత్‌కు ఊరట
ప్రపంచ చమురు మార్కెట్‌ను గమనిస్తున్న నిపుణులు అమెరికా నిర్ణయాలను భారత్‌కు ఊరటగా అభివర్ణించారు.
"అమెరికా ప్రకటన ప్రధానంగా వారి దేశ ప్రజలనుద్దేశించే ఉంటుంది ఎందుకంటే, చమురు ధరలు పెరిగితే అక్కడ రాజకీయ ప్రభావం చూపవచ్చు" అని అంతర్జాతీయ చమురు మార్కెట్ నిపుణులు నరేంద్ర తనేజా బీబీసీతో చెప్పారు.
నిజానికి, అమెరికాలో ఇదే ఏడాది నవంబర్‌లో మిడ్ టర్మ్ ఎన్నికలు జరగనున్నాయి, ఇరాన్ యుద్ధం విషయంలో ట్రంప్‌కు చాలా తక్కువ మద్దతు ఉందని పోల్స్ చెబుతున్నాయి.
"అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం మిగిలిన దేశాల కోసం కూడా తీసుకున్నప్పటికీ, దీనివల్ల భారత్‌కు భారీ ఊరట లభించనుంది. హార్ముజ్ జలసంధి ఆటంకం వల్ల భారత్‌కు ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీలోనే ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ, యుద్ధం 20 రోజులు సాగితే భారత్‌లో చమురు కొరత ఏర్పడేది" అని నరేంద్ర తనేజా చెప్పారు.
దీనికి కారణం, భారత్ తన మొత్తం చమురు అవసరాలలో దాదాపు 90 శాతం దిగుమతి చేసుకోవడం. భారత్ సంప్రదాయబద్ధంగా గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకునేది.
కానీ, యుక్రెయిన్ యుద్ధం తర్వాత భారీ మొత్తంలో రాయితీ ధరలపై రష్యా చమురు కొనడం ప్రారంభించింది. అమెరికా టారిఫ్ వల్ల ఈ కొనుగోలుపై ప్రభావం పడింది, దీంతో గల్ఫ్ దేశాల నుంచి మళ్లీ కొనుగోలు పెంచింది. ఇప్పుడు హార్ముజ్ జలసంధి సంక్షోభం వల్ల ఇబ్బందుల్లో పడింది.
అయితే, రష్యా నుంచి చమురు కొనడం భారత్ ఎప్పుడూ ఆపలేదు. గత నెల అమెరికా మినహాయింపు ఇచ్చినప్పుడు ఇందులో మళ్లీ పెరుగుదల కనిపించింది.
"గత నాలుగు వారాలుగా రష్యా నుంచి భారత్ ఎక్కువ మొత్తంలో చమురు కొంటోంది. యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు భారత్ పెద్దయెత్తున రష్యా చమురు కొనడాన్ని బైడెన్ ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది" అని నరేంద్ర తనేజా తెలిపారు.
రష్యాలోని సముద్రం లోపల సఖాలిన్-1 అనే చమురు క్షేత్రంలో భారతీయ కంపెనీలకు 18 బిలియన్ డాలర్ల పెట్టుబడి ఉందని, ఈ పెట్టుబడిని అమెరికా కూడా ప్రోత్సహించిందని ఆయన చెప్పారు. ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితికి తేడా ఉంటుందని నరేంద్ర తనేజా అంటున్నారు.
అయితే, రష్యాతో ఇంధన సహకారాన్ని మరింత పెంచాలని దిల్లీలోని థింక్ ట్యాంక్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్‌ఐ) హెడ్ అజయ్ శ్రీవాస్తవ కోరుతున్నారు.
"ఒక నెల మినహాయింపులో అర్థమే లేదు. ఎందుకంటే, ఇప్పటికే నౌకల్లో లోడ్ అయిన చమురుకు మాత్రమే అది వర్తిస్తుంది" అని శ్రీవాస్తవ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చమురు నౌక ఏ దేశం నుంచి ఎన్ని రోజుల్లో చేరుతుంది?
ఇటీవలి కాలంలో చమురు దిగుమతులను వైవిధ్యీకరించడంపై దృష్టి సారించామని, ప్రస్తుతం 41 దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నామని భారత ప్రభుత్వ పెట్రోలియం శాఖ తెలిపింది.
అయితే, భారత్ విషయంలో చమురు దిగుమతుల లెక్కలు కొంత క్లిష్టంగానే ఉన్నాయి.
"అమెరికాతో ట్రేడ్ డీల్ చర్చలు జరుగుతున్నాయి. అమెరికా నుంచి భారత్ చమురు తీసుకోవాలని వాషింగ్టన్ కోరితే ఇబ్బందేం లేదు. కానీ, అమెరికా, బ్రెజిల్ నుంచి భారత్‌కు చమురు చేరడానికి 50 నుంచి 60 రోజులు పడుతుంది. అదే రష్యా నుంచి 28 రోజులు పడుతుంది. గల్ఫ్ దేశాల నుంచి ఈ సమయం ఐదు నుంచి ఏడు రోజులు మాత్రమే" అని నరేంద్ర తనేజా అన్నారు.
చమురు మూడు రకాల నౌకల ద్వారా వస్తుందని నరేంద్ర తనేజా వివరించారు: యూఎల్‌సీసీ (అల్ట్రా లార్జ్ క్యారియర్), వీఎల్‌సీసీ (వెరీ లార్జ్ క్యారియర్), ఆఫ్రామాక్స్. వీటి వేగం వాటి పరిమాణంపై ఆధారపడి ఉంటుంది.
ప్రస్తుతం అమెరికా ఇస్తున్న మినహాయింపు సముద్రంలో ఉన్న చమురు ట్యాంకర్లపైనే. అంటే యుద్ధానికి ముందు బయలుదేరిన నౌకలు ఇంకా దారిలోనే ఉన్నాయి. ఈ నౌకలు అమెరికా, బ్రెజిల్, గయానా, అంగోలా వంటి దేశాల నుంచి వస్తున్నాయి.
అయితే, గత కొద్ది రోజులుగా చమురు ధరలు భారీగా పెరిగాయి.
నరేంద్ర తనేజా ప్రకారం, "యుద్ధం సమయంలో ట్రేడర్స్ స్క్రీన్‌పై ధరలు 110 డాలర్లు ఉన్నప్పుడు, భారత్ బ్యారెల్‌కు 140 డాలర్ల చొప్పున కూడా చమురు కొనుగోలు చేసింది. భారత్ ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ, విదేశీ మారక నిల్వలు కలిగి ఉంది. చమురు ఉత్పత్తి దేశాల మధ్య భారత్‌కు మంచి పరపతి ఉంది".
ఖతార్ నుంచి ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ సరఫరా నిలిచిపోయినప్పుడు, భారత్ వెంటనే అర్జెంటీనాను సరఫరా చేయాలని కోరిందని నరేంద్ర తనేజా చెప్పారు. అక్కడి నుంచి నౌక భారత్ చేరడానికి 58 రోజులు పట్టినప్పటికీ, భారత్‌తో మంచి సంబంధాలు కోరుకుంటున్న అర్జెంటీనా పెద్దయెత్తున సరఫరా చేయడానికి అంగీకరించిందని తెలిపారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
రెండు రెట్లు పెరిగిన రష్యా చమురు దిగుమతి
ఒక యూరోపియన్ థింక్ ట్యాంక్ గణాంకాల ప్రకారం, రష్యా నుంచి భారత్ ముడి చమురు దిగుమతులు ఈ ఏడాది మార్చిలో వేగంగా పెరిగాయి.
సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) రిపోర్ట్ ప్రకారం, భారత్ 2026 మార్చిలో మాస్కో నుంచి ముడి చమురు కొనుగోళ్లు 5.8 బిలియన్ డాలర్ల (రెండు రెట్లకు పైగా)కు పెంచింది. ఫిబ్రవరిలో ఇది 1.54 బిలియన్ డాలర్లుగా ఉండేది.
ఈ ఏడాది మార్చిలో రష్యా నుంచి 371 మిలియన్ డాలర్ల బొగ్గును, 196 మిలియన్ డాలర్ల పెట్రోలియం ఉత్పత్తులను కూడా భారత్ దిగుమతి చేసుకుంది.
2022 మార్చి తర్వాత రష్యా చమురుకు న్యూదిల్లీ ఒక ముఖ్యమైన మార్కెట్‌గా ఎదిగింది. 2024లో భారత్ రోజుకు సుమారు 20 లక్షల బ్యారెళ్ల చమురు కొనుగోలు చేసింది. గత ఏడాది మాస్కో నుంచి సుమారు 44 బిలియన్ డాలర్ల ముడి చమురు దిగుమతి చేసుకుంది.
ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం, భారత్‌కు రష్యా ముడి చమురు, ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ సహా ఇంధన ఎగుమతులను పెంచుతుందని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ హామీ ఇచ్చారు. భారత్‌కు ఎంత పరిమాణంలో అవసరమైతే అంత ఇంధన సరఫరాకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. భారత్ ఒక నమ్మకమైన భాగస్వామి అని, పాశ్చాత్య దేశాల కంటే భిన్నంగా భారత్ వైఖరి స్థిరంగా ఉంటుదని అన్నారు.
చౌకగా లభించే రష్యా చమురు భారత్‌కు ఎంతో కీలకం. ప్రపంచ అనిశ్చితి సమయంలో ఖర్చులను నియంత్రించడానికి, సరఫరాను స్థిరంగా ఉంచడానికి ఇది సహాయపడింది.
భారతీయ రిఫైనరీ కంపెనీలు గతంలో ఉన్న ఆంక్షలకు తగ్గట్టుగా తమను తాము సర్దుబాటు చేసుకున్నాయి. అయితే, మొదటిసారి మినహాయింపు లభించిన వెంటనే అవి రష్యా నుంచి కొనుగోళ్లను వేగవంతం చేశాయి.
ఇప్పుడు ఈ మినహాయింపును మళ్లీ పొడిగించడం వల్ల, మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య ఇంధన భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్న భారత్ వైఖరి మరింత బలపడుతుంది.
భారత్ తన ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకుని రష్యాతో 20 ఏళ్ల సుదీర్ఘ కాల ఇంధన ఒప్పందం చేసుకోవాలని, అమెరికా ఒత్తిడిని పట్టించుకోవద్దని అజయ్ శ్రీవాస్తవ సూచిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































