తామరకాడతో ఊపిరి తీసుకుంటూ 5 గంటలపాటు చెరువులో దాక్కున్న దొంగ.. చివరకు ఎలా చిక్కాడంటే..

అసలు ఏం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, విష్ణుకాంత్ తివారీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 6 నిమిషాలు

చెరువు అడుగున ఏకంగా ఐదు గంటల పాటు దాక్కున్న ఓ దొంగను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు.

చెరువు అడుగుకు చేరి, తామర కాడతో శ్వాస తీసుకుంటూ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఆ దొంగ ప్రయత్నించాడు.

అయితే పోలీసుల అనుభవం, సహనం, అప్రమత్తత ముందు ఆ దొంగ తెలివితేటలు పనిచేయలేదు. 400లకు పైగా దొంగతనాలు చేసిన, రైల్వే మోస్ట్ వాంటెడ్ నిందితుడు చివరకు ఎలా పట్టుబడ్డాడు?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో మధ్యప్రదేశ్‌లోని ఖితౌలా రైల్వే స్టేషన్ నుంచి ఒక వ్యక్తి బయటకు పరిగెత్తాడు. రైల్వే పోలీసులు అతనిని వెంబడించడంతో పక్కనే ఉన్న ఒక చెరువులోకి దూకాడు.

చెరువు దగ్గరికి వచ్చి గాలించిన పోలీసులకు అతను కనిపించలేదు. పరిసరాలలోనూ ఆ వ్యక్తి కోసం పోలీసులు వెదికారు . ఆ సమయంలో ఆ వ్యక్తి చెరువు నీటి అడుగున దాక్కున్నాడు.

చెరువులోని తామర కాడ సహాయంతో శ్వాస తీసుకుంటూ పోలీసుల కంటబడకుండా దాక్కునే ప్రయత్నం చేశాడు. గంటసేపు అతని కోసం గాలించిన ఆర్‌పీఎఫ్ పోలీసులు చివరకు ఖితౌలా పోలీసుల సాయం కోరారు. రైలులో ఒక మహిళ పర్సు కొట్టేయడానికి ప్రయత్నించిన దొంగను వెంబడించగా అతను చెరువులోకి దూకాడని ఖితౌలా పోలీసులకు ఆర్‌పీఎఫ్ సమాచారం ఇచ్చింది.

దీంతో టౌన్‌‌ఇన్‌స్పెక్టర్ రమణ్ సింగ్ మర్కామ్ తన బృందంతోపాటు డైవర్స్‌ను వెంటబెట్టుకు వచ్చారు. దొంగ కోసం 5 గంటలపాటు ముమ్మరంగా గాలించారు. చివరకు చెరువు అడుగున దాక్కున్న దొంగను పట్టుకోగలిగారు.

చెరువు అడుగుకు చేరుకుని తామరకాడ సాయంతో శ్వాస తీసుకుంటూ అక్కడే ఉండి పోయినట్టు ఆ దొంగ పోలీసుల విచారణలో తెలిపాడు. తదుపరి అతనిని ఖితౌలా పోలీసులు ఆర్‌పీఎఫ్ పోలీసులకు అప్పగించారు. ఆ దొంగ పేరు హర్విందర్.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

అసలేం జరిగింది?

రీవా-ఇత్వారీ స్టేషన్ (నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇత్వారీ జంక్షన్, నాగపూర్) నుంచి ఓ మహిళ ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్నారు. రైలు సిహోరా స్టేషన్‌ను సమీపించగానే ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఆ మహిళ పర్సు లాక్కోవడానికి విఫలయత్నం చేస్తూ రైల్వే పోలీసుల దృష్టిలో పడ్డాడు.

దీంతో ఆర్‌పీఎఫ్ పోలీసులకు పట్టుబడకుండా అతను స్టేషన్ బయటకు పరిగెత్తడంతో, అతన్ని పట్టుకోవడానికి ఆశిష్ యాదవ్, వినయ్ మౌర్య అనే కానిస్టేబుళ్లు కూడా వెంబడించారు.

అయితే స్టేషన్‌కు అరకిలోమీటరు దూరంలో ఉన్న ఓచెరువులోకి దూకిన దొంగ అక్కడే దాక్కున్నాడు.

నాచు, గుర్రపుడెక్క నిండిపోయిన ఆ చెరువులో దొంగ జాడ కనుక్కోవడానికి కానిస్టేబుళ్లు ఎంతగానో ప్రయత్నించారు. కానీ, అతను దొరక్కపోవడంతో ఆర్‌పీఎఫ్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రాజీవ్ ఖరబ్‌కు సమాచారం ఇచ్చారు.

తరువాత ఖితౌలా స్టేషన్ పోలీసుల సహాయంతో దొంగను పట్టుకోవడంలో ఆర్పీఎఫ్ విజయం సాధించింది. ఆ తర్వాత దొంగను జబల్‌పూర్‌కు తరలించారు.

తెలివైన ఈ దొంగ ఎవరు?

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

తెలివైన ఈ దొంగ ఎవరు?

జబల్‌పూర్‌కు తీసుకువచ్చిన తర్వాత స్టేషన్ ఇన్‌ఛార్జ్ రాజీవ్ ఖరబ్ అతనిని విచారించారు. విచారణలో ఈ దొంగ మాటిమాటికీ తన పేరు, చిరునామా మార్చి చెప్పాడు. అయినా, ఆ దొంగ ముఖం బాగా తెలిసినట్లుగా భావించిన రాజీవ్ ఖరబ్ తన ఫోన్‌లోని ఒక ఫోటోను చూశారు. ఒక ఆంగ్ల వార్తాపత్రికలో ప్రచురితమైన ఫోటో అది. ఆ ఫోటోలోని వ్యక్తి, ఈ దొంగ ఒక్కరే అని గమనించిన అక్కడివారంతా షాకయ్యారు.

ఆ యువకుడిని హర్విందర్ సింగ్ (32 ఏళ్లు)‌గా గుర్తించారు.

అతను ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లా హల్దౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొహల్లా ఖేడా నివాసి.

జీఆర్‌పీ భోపాల్, జీఆర్‌పీ ఇటార్సీ, జీఆర్‌పీ ఉజ్జయిని, జీఆర్‌పీ ఇగత్‌పురి, రాజ్‌గఢ్ పోలీస్ స్టేషన్ , వాల్‌చంద్ నగర్ పోలీస్ స్టేషన్ (పుణె), ఎంఐడీసీ పోలీస్ స్టేషన్ (ముంబయి), జీఆర్‌పీ/పీఎస్ విశాఖపట్నం, గుడివాడ జీఆర్‌పీ పోలీసులు నెలల తరబడి ఈ దొంగ కోసం గాలిస్తున్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

రైల్వే మోస్ట్ వాంటెడ్ దొంగగా ఎలా మారాడు?

హర్విందర్ సింగ్ ఇప్పటివరకు దాదాపు 400 కంటే ఎక్కువ దొంగతనాలు చేశాడు. ఆయన దోచుకున్న సొమ్ము మొత్తం విలువ కోట్లలో ఉంది. ఆయన ఎంతటి జిత్తులమారి అంటే ప్రయాణికులతో పాటు చాలాసార్లు ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులను కూడా మోసం చేశాడు.

హర్విందర్ ఎప్పుడూ ఏసీ కోచ్‌ల్లోనే దొంగతనం చేసేవాడు. మొదట్లో అతను సాధారణ ప్రయాణికుడిలాగే రైలు టికెట్ తీసుకుని ప్రయాణించేవాడు. అయితే రైలులో కెమెరాలు అమర్చడం, ఆన్‌లైన్‌లో టికెట్ అమ్మకాలు మొదలైన తర్వాతి నుంచి అతను టికెట్ తీసుకోవడం మానేశాడు. రైలు ఎక్కగానే అతని దృష్టి మొదట టీసీపై ఉండేది.

టీసీ వస్తుంటే బాత్‌రూమ్‌లో దాక్కునేవాడు. టీసీ వెళ్ళగానే ఆ కోచ్‌లో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకునేవాడు.

హర్విందర్ 2010-11లో ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో తొలిసారి దొంగతనం చేసినట్లు చెబుతారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అతను 400 కంటే ఎక్కువ దొంగతనాలు చేశాడు.

దొంగతనం ఆరోపణలపై 2018లో విజయవాడ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

జబల్‌పూర్‌లో విచారణ సమయంలో నిందితుడు చాలాసార్లు తన పేరు మార్చాడు. ఒకసారి బబ్లూ అని, మరోసారి తనది చండీగఢ్ అని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

''నేను 2018లో కోటా రైల్వే ఇంటెలిజెన్స్‌లో పనిచేశాను. ఆ సమయంలో ఒక ఇంగ్లిష్ వార్తాపత్రికలో ఈ దొంగ ఫోటోను వేశారు. ఆ ఫోటో ఇప్పటికీ నా ఫోన్‌లో ఉంది. ఈ దొంగ పేరు హర్విందర్ సింగ్ అలియాస్ సన్నీ అని పేపర్‌లో రాశారు. అది చూశాక విచారణలో 'సన్నీ, నువ్విప్పుడు దొరికిపోయావు' అనగానే అతను షాకయ్యాడు'' అని ఆర్పీఎఫ్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రాజీవ్ ఖరబ్ వివరించారు.

విజయవాడ పోలీసులు 2018లో దొంగతనం ఆరోపణపై తనను అరెస్టు చేశారని ఆర్పీఎఫ్ విచారణలో అతను వెల్లడించాడు. ఆ సమయంలో తన నుంచి రూ. 70,38,500 విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారని అతను చెప్పాడు.

ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు.

హర్విందర్ పట్టుబడ్డాక, ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా అతన్ని విచారించేందుకు వస్తున్నారు.

స్వతంత్ర కౌన్సిలర్ కూడా..

ముంబై సెంట్రల్-ఇండోర్ అవంతిక ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తిని 2018 జులైలో హర్విందర్ దోచుకున్నాడు.

ఆ ప్రయాణికుడి నుంచి 32 బోర్ లైసెన్స్ ఉన్న ఒక పిస్టల్, 10 కాట్రిడ్జ్‌లు, లోడెడ్ మ్యాగజీన్, రూ.1.90 లక్షల నగదును దొంగిలించాడు. ముంబై సెంట్రల్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజీ చూసి బాధితుడు, హర్విందర్ సింగ్‌ను గుర్తించాడు.

హర్విందర్ సింగ్ 2017 డిసెంబర్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యాడని హల్దౌర్ మున్సిపాలిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అభిషేక్ కుమార్ చెప్పారు. అయితే అతని నేర నేపథ్యం గురించి ఇంట్లో ఎవరికీ ఏమీ తెలియదు.

నిందితుడిపై ఐపీసీ 379/411 కింద మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ రైల్వే పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు నమోదయ్యాయి.

దొంగతనం

ఫొటో సోర్స్, Getty Images

ప్రతీ దొంగతనానికి కొత్త సిమ్ కార్డ్

హర్విందర్ సింగ్ అలియాస్ సన్నీ దొంగతనం చేసే ప్రతీసారి కొత్త సిమ్ ఉపయోగించేవాడు. మొబైల్ ద్వారా లొకేషన్ ట్రాక్ చేసి పోలీసులు అరెస్ట్ చేస్తారని అతనికి తెలుసు. అందుకే కొత్త సిమ్ వాడటంతో పాటు, తన గుర్తింపు తెలియకుండా ఉండటానికి అతను తన దగ్గర ఎలాంటి ఐడీ కార్డును ఉంచుకునేవాడు కాదు.

'తన గుర్తింపు తెలియకుండా, ఎలాంటి ఆనవాళ్లు బయటపడకుండా ఉండటానికి అతను ప్రతీ 6 నెలలకు తన రూట్ మార్చేసేవాడు. దొంగతనం చేయడానికి ఒకసారి దిల్లీ-భోపాల్, మరోసారి కోల్‌కతా- బీహార్ రూట్ ఎంచుకునేవాడు. ఇంకోసారి మరో భిన్నమైన మార్గంలో ప్రయాణించేవాడు' అని ఆర్పీఎఫ్ పోలీసులు వెల్లడించారు.

''అతని అరెస్ట్ తర్వాత ఇప్పుడు మాకు వివిధ రాష్ట్రాల పోలీసుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. చెన్నై అధికారులు కూడా అతని వీడియో ఫుటేజ్ పంపారు. దర్యాప్తులో భాగంగా మేం దాన్ని పరిశీలిస్తున్నాం' అని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికతో ఆర్పీఎఫ్ ఐజీ రాజీవ్ కుమార్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)