వెస్ట్ బెంగాల్‌లో ఫిష్ పాలిటిక్స్.. బీజేపీ అభ్యర్థులు చేపలను చూపిస్తూ ప్రచారం చేస్తున్నారెందుకు?

- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, ఇండియా కరస్పాండెంట్
- చదివే సమయం: 6 నిమిషాలు
కోల్‌కతా నగరంలో ఉక్కపోతగా ఉండే ఓ ఉదయం, కౌస్తవ్ బాగ్చి తెలుపు, ఎరుపు రంగుల్లో సంప్రదాయ దుస్తులు ధరించి, చేతిలో ఒక చేప పట్టుకుని ఇంటింటికీ తిరుగుతున్నారు.
వెనుక డప్పులు మోగుతుండగా, మద్దతుదారులు ఆయన పేరును నినదిస్తున్నారు. న్యాయవాది నుంచి రాజకీయ నాయకుడిగా మారిన బాగ్చి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బ్యారక్‌పుర్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ప్రసంగాలు, ఆర్భాటాలు లేకుండా కేవలం ఈ చేపే ప్రజలను ఒప్పిస్తుందని ఆయన నమ్ముతున్నారు. అక్కడ తమ విధానాల గురించిన ప్రసంగాలు లేవు. కేవలం ‘నేనూ మీలో ఒకడినే’’ అనే సంకేతాన్ని చూపడం తప్ప.
కోల్‌కతా పోర్ట్ ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో.. మరో బీజేపీ అభ్యర్థి రాకేశ్ సింగ్ కూడా ఇలాంటి తరహాలోనే ప్రచారం చేస్తున్నారు.
ఆయన ఉదయం వేళ జనంలో తిరుగుతూ తన చేతిలోనే చేపను పైకి కనిపించేలా పట్టుకుని చూపిస్తున్నారు. పశ్చిమబెంగాల్‌లో కీలక నియోజకవర్గాల్లో ఒకటిగా పేర్కొంటున్న ‘కోల్‌కతా పోర్ట్’ నియోజకవర్గంలో ఆయన నగర మేయర్ ఫిర్హాద్ హకీమ్‌పై పోటీ చేస్తున్నారు.
బెంగాల్‌లో చేప కేవలం ఆహారం మాత్రమే కాదు. అది వారి వంటకాలకు గుండె లాంటిది. జ్ఞాపకాలలో, సంప్రదాయాల్లో, రోజువారీ జీవితంలో అల్లుకుపోయింది. చేప బెంగాలీల అస్తిత్వానికి, అనుబంధానికి సూచిక.
పశ్చిమ బెంగాల్ అంతటా ఇప్పుడీ అనుబంధాన్ని రాజకీయ తెరపైకి తీసుకొస్తూ అభ్యర్థులు చేపను ప్రదర్శిస్తూ ఒక నిర్దిష్ట ఆందోళనను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.
ఆహారపు అలవాట్లు రాజకీయంగా ప్రభావితం అయ్యే దేశంలో, ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ తరచూ కఠినమైన, కొన్నిసార్లు నైతికతతో ముడిపడిన శాకాహార దృక్పథంతో కనిపిస్తుంటుంది.
భారత్‌లో ఎక్కువ మంది మాంసాహారులే అయినప్పటికీ, కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాంసం విక్రయాలపై కాలానుగుణ ఆంక్షలు, గో సంరక్షణ పేరిట తీసుకున్న చర్యలు , ఈ అభిప్రాయాన్ని మరింత బలపరిచాయి.


పళ్లెం నుంచి ప్రచారంలోకి జారిన చేప
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో చేప పళ్లెం నుంచి ప్రచారంలోకి జారింది. సాంస్కృతిక నిబద్ధతకు నిదర్శనంగా ‘సంస్కృతిలో జోక్యం’ అనే ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నంగా మారుతోంది.
వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీని "బెంగాల్ జీవన విధానానికే ముప్పు" అని హెచ్చరిస్తున్నారు. చేప, బియ్యం వంటి అంశాలు రాజీపడలేనివని ఆమె అంటున్నారు.
"బీజేపీ మిమ్మల్ని చేపలు తిననివ్వదు. మాంసం, గుడ్లు కూడా తిననివ్వదు" అని ఆమె ఇటీవల ఓ ప్రచార సభలో అన్నారు.
ఈ 71 ఏళ్ల నాయకురాలు మరో సభలో బీజేపీపై విమర్శలు చేస్తూ.. "బెంగాల్ చేప, బియ్యంతోనే జీవిస్తుంది. మీరు బెంగాల్ ప్రజలకు చేపలు, మాంసం, గుడ్లు తినకూడదని చెబుతున్నారు, మరి వారేం తినాలి?" అని ప్రశ్నించారు.
ఈ ఆరోపణలపై బీజేపీ కూడా అంతే తీవ్రంగా ప్రతిస్పందిస్తూ, వాటిని ఖండించడంతోపాటు ఎదురుదాడిచేసింది.
బెంగాల్‌లో ప్రచారం చేస్తున్న బీజేపీ నేత స్మృతి ఇరానీ ఈ వాదనను "అబద్ధం"గా కొట్టిపారేస్తూ, "చేప, బియ్యం బెంగాల్ సంస్కృతిలో భాగం. అవి ఎప్పటికీ అంతరించవు" అన్నారు.
కోల్‌కతాలోని రాస్‌బిహారి స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి స్వపన్ దాస్‌గుప్తా మాట్లాడుతూ... మమతా బెనర్జీ ఆరోపణలు దృష్టి మళ్లించే ప్రయత్నమన్నారు "మేం చేపల వినియోగాన్ని నిషేధిస్తామని చెప్పే ఈ తప్పుడు కథనం ద్వారా, తమ అవినీతి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. ఇది పూర్తిగా అబద్ధం’’ అన్నారు.
ప్రచారంలో మోదీ కూడా చేప అంశాన్ని ప్రస్తావిస్తూ, దాన్ని పాలనా వైఫల్యానికి సూచికగా మలచారు.
మత్స్య సంపదలో బెంగాల్‌ను స్వయం సమృద్ధిగా మార్చడంలో మమత ప్రభుత్వం విఫలమైందని మోదీ ఆరోపించారు.
"పదిహేనేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ, మీకు చేపల వంటి ప్రాథమిక అవసరాన్ని కూడా అందించడంలో తృణమూల్ కాంగ్రెస్ విఫలమైంది. ఇప్పటికీ చేపలను ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకోవాల్సి వస్తోంది" అని మోదీ అన్నారు.
దీనికి మమత స్పందిస్తూ.. పశ్చిమ బెంగాల్ చేపల అవసరాల్లో 80 శాతం స్థానికంగానే తీరుతున్నాయని చెప్పారు.
"మీరు (బీజేపీ) అధికారంలో ఉన్న బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌ల రాష్ట్రాల్లో చేపల వినియోగాన్ని అనుమతించరు. దిల్లీలో చేపల దుకాణాలపై దాడులు జరగనిస్తారు. మీకు సిగ్గుగా అనిపించదా?" అని ఆమె ప్రశ్నించారు.

చేపను చూపితే ప్రజలు వలలో పడతారా?
చేపల ఉత్పత్తిలో భారత్ మూడో స్థానంలో ఉన్నప్పటికీ తలసరి చేపల వినియోగంలో మాత్రం 129వ స్థానంలో ఉంది. అయితే పశ్చిమ బెంగాల్‌లో మాత్రం పరిస్థితి భిన్నం. అక్కడ చేప కేవలం ఆహారం కాదు.. దాదాపు అందరి జీవితంలో భాగం.
పశ్చిమ బెంగాల్‌లో సుమారు 65.7 శాతం మంది వారానికి కనీసం ఒకసారి చేపలు తింటారని 2024లో ఐసీఏఆర్, వరల్డ్ ఫిష్ సంయుక్తంగా చేసిన అధ్యయనం తెలిపింది.
చేపలను ఆహారంగా తీసుకునే ప్రజలు 90 శాతానికి పైగా ఉన్న తూర్పు, దక్షిణాది రాష్ట్రాల సరసన పశ్చిమబెంగాల్ నిలుస్తోంది. . మరోవైపు, భారత్ అంతటా చేపల వినియోగం స్థిరంగా పెరుగుతూ, ఇప్పుడు జనాభాలో 70 శాతం మందికి పైగా ఈ ఆహారం చేరింది.
బెంగాల్‌లో చేప ఎప్పటినుంచో ఆహారానికి మించి అనేక అర్థాలను మోస్తోంది. అందుకే అది రాజకీయ రంగంలోకి రావడం కూడా సహజంగానే కనిపిస్తోంది.
ప్రఖ్యాత బెంగాలీ నవల ‘పద్మ నదిరొ మాఝి’(ది బోట్‌మెన్ ఆఫ్ ది పద్మ)లో రచయిత మానిక్ బందోపాధ్యాయ జీవన పోరాటం, విధి అనే భావాలతో అనుసంధానిస్తారు. అలాగే 'ది హంగ్రీ టైడ్'లో అమితావ్ ఘోష్.. చేపను సుందర్బన్ ప్రాంతంలో పర్యావరణం, అస్థిర జీవన పరిస్థితులతో ముడిపెడతారు.
"బెంగాలీ వంటకాలను వింబుల్డన్ టోర్నమెంట్‌తో పోలిస్తే.. హిల్సా ఎప్పుడూ సెంటర్ కోర్ట్‌లోనే ఆడుతుంది" దాన్ని నోట్లోనే ఎముకలు వేరుచేసుకుంటూ తినే నైపుణ్యం సాధించడమంటే వారి దృష్టిలో ఒక రకంగా సంస్కృతిలో భాగమైపోయినట్లే' అని ప్రసిద్ధ హిల్సా చేప గురించి సమంత్ సుబ్రమణియన్ తన 'ఫాలోయింగ్ ఫిష్' పుస్తకంలో రాశారు.
బెంగాల్‌లో చేప కేవలం ఆహారమే కాదు, అది భౌగోళికతను (గంగ, పద్మ నదీవ్యవస్థల), చరిత్రను (తూర్పు-పశ్చిమ బెంగాల్‌గా విడిపోవడం), సామాజిక స్థితిని కూడా సూచిస్తుంది. ఎవరికి ఏ చేప అందుబాటులో ఉంది? ఎవరు వాటిని వండగలరు? వాటిని ఎలా తినాలి అనే సంస్కృతి తెలుసు?..ఇవన్నీ ఇందులో దాగి ఉన్నాయి.
ఇక్కడి ఫుట్‌బాల్ పోటీల్లో కూడా చేపకు చోటుంది. తూర్పు బెంగాల్ ఎఫ్‌సీ అభిమానులు, ముఖ్యంగా బంగ్లాదేశ్ మూలాలున్నవారు హిల్సాను ఇష్టపడతారనే ఒక సామాన్య అభిప్రాయం ఉంది. మరోవైపు మోహన్ బగాన్ సూపర్ జెయింట్ అభిమానులు రొయ్యలను ఇష్టపడతారని చెబుతారు. ఇది కేవలం సరదా పోలిక మాత్రమే కాదు. వలసలు, వర్గం, రుచుల మధ్య ఉన్న లోతైన చరిత్రను సూచించే సంకేతం.

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images
ఈ గాఢమైన ప్రతీకాత్మక అర్థాలే చేపను రాజకీయంగా ఉపయోగకరంగా మార్చాయని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పార్టీలు దాన్ని కేవలం ప్రస్తావించడం మాత్రమే కాదు.. ప్రచార వ్యూహంలో భాగంగా మార్చి ప్రత్యర్థులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నాయి.
చరిత్రకారుడు జయంత్ సేన్‌గుప్తా మాటల్లో "బెంగాలీ వంటకాల నుంచి చేపను వేరు చేయడం అసాధ్యం. అది భౌగోళిక పరిస్థితులతో పాటు, తక్కువ ఖర్చుతో లభించే ప్రోటీన్ వనరుగా దీర్ఘకాలంగా కొనసాగుతోంది."
అలాగే ఆయన చెప్పినట్లుగా, "బీజేపీ కొన్ని సందర్భాల్లో శాకాహార ధోరణులను ప్రోత్సహించే పార్టీగా కనిపించడంతో.. బెంగాల్‌లోని అధికార పార్టీ ఆహారాన్ని సంస్కృతితో ముడిపెట్టింది"
"చేపకు ఉన్న ఈ ప్రతీకాత్మక ప్రాధాన్యాన్ని బీజేపీ కూడా నిర్లక్ష్యం చేయలేకపోయింది. అందుకే రెండు పక్షాలు కూడా ఈ అంశంపై పరస్పరం ప్రతిస్పందిస్తూ ప్రచారం చేస్తున్నాయి" అని ఆయన చెప్పారు.
గత వారం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య ఫలితాలు వెల్లడయ్యే మే 4న జర్నలిస్టులను కోల్‌కతాకు ఆహ్వానిస్తూ ఆ రోజున వారికి వేయించిన చేపతో ఆతిథ్యం ఇస్తామన్నారు.
మరో ఇంటర్వ్యూలో ఆయన మరింత ముందుకెళ్లి, ఫలితాల తర్వాత వివిధ రకాల చిన్న చేపలను మమతా బెనర్జీ ఇంటికి పంపి, ఆమె పార్టీ కార్యకర్తలను "మచ్ బాత్" (చేపల కూరు, అన్నంతో భోజనం)కు ఆహ్వానిస్తామని చెప్పారు.
ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది, ఆతిథ్యం ఇస్తుంది అనే నమ్మకం ఈ వ్యాఖ్యలో కనిపిస్తోంది.
గుర్తింపు, జీవనోపాధి, అలాగే కొంత సరదా రాజకీయ గిలిగింతలతో కూడిన ఈ ఎన్నికల్లో చేప ఒక్కటే ఫలితాన్ని నిర్ణయించకపోవచ్చు.
కానీ ప్రచారంలో సంస్కృతి, రాజకీయాలు ఎలా సహజంగా కలసిపోతాయో చూపిస్తూ అదిప్పటికే ఈ పోటీని నిర్వచించే అంశంగా మారింది.
(అడిషనల్ రిపోర్టింగ్: కోల్‌కతా నుంచి స్నిగ్థేందు భట్టాచార్య)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































