లోపల ఉన్నవారి కాళ్లు కనిపించేలా టాయిలెట్లను ఎందుకు నిర్మిస్తారు? ఈ ఆలోచన వెనక ఉన్న ఆర్కిటెక్ట్ ఎవరు?

ఫొటో సోర్స్, Kangah/iStock via Getty Images
- రచయిత, పారా పద్దయ్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 6 నిమిషాలు
‘‘ఇదేమీ ఇప్పుడే పుట్టుకొచ్చిన కొత్త ఆలోచన కాదు. అమెరికాలో చాలాకాలం కిందటే ఉంది. అక్కడ నుంచే అనేక దేశాలు అడాప్ట్ చేసుకున్నాయి"- కాళ్లు కనిపించేలా టాయిలెట్లు ఎందుకు నిర్మిస్తారు అని అడిగినప్పుడు ఆర్కిటెక్ట్ కిరణ్మయి చెప్పిన మాట ఇది.
"ధారాళంగా గాలి వెలుతురు రావడం, తేలికగా శుభ్రం చేసే అవకాశం ఉండటం, ఇంకా ఖర్చు తక్కువ. నేల పొడిగా ఉంటుంది. ఇవే ఇందులో సానుకూలతలు" అని హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అనేక కార్యాలయాల్లో హౌస్ కీపింగ్ ఆపరేషన్స్ నిర్వహించే నాగేశ్వరరావు అన్నారు.
ఎయిర్ పోర్టులు, మాల్స్, ఆసుపత్రులు, కార్పొరేట్ ఆఫీసులు, స్టేడియాలు, ఆడిటోరియాలు ఇలా జనంతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో టాయిలెట్ స్టాల్‌కుండే తలుపులకు, నేలకు మధ్య కొద్దిగా ఖాళీగా ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు.
ఈ టాయిలెట్ స్టాల్స్‌కు మూడు వైపులా ఈ గ్యాప్ ఉంటుంది. తలుపుకి అయితే కింద, పైనా కూడా ఖాళీ ఉంటుంది.
ఈ స్టాల్స్‌లో వెస్ట్రన్ టాయిలెట్ కమోడ్‌ను మాత్రమే అమర్చుతారు. వీటిలో నీటి వినియోగం కూడా తక్కువగా ఉంటుంది.

రెస్ట్ రూమ్ తలుపుకి కిందవైపు, పైన కొన్ని అంగుళాల ఖాళీ స్థలం ఉండటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆర్కిటెక్ట్ కిరణ్మయి చెప్పారు.
అత్యవసర పరిస్థితుల్లో సాయం అందించడం, నిర్వహణ, పరిశుభ్రత, జనం రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఈ డిజైన్ సౌకర్యంగా ఉంటుందని భవన నిర్మాణ రంగంలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న గణేశ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలెలా మొదలైంది?
పబ్లిక్ రెస్ట్‌రూమ్ డిజైన్ చాలా కాలంగా అనేక రకాలుగా మారుతూ వస్తోంది. జనం ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో టాయిలెట్ స్టాల్స్, యూరినరీ పార్టీషన్స్ ఆధునికత సంతరించుకుంటున్నాయి.
అయితే భవన నిర్మాణాల్లో వచ్చిన మార్పు, మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా కొంతమంది ఈ డిజైన్‌కు తుది రూపం ఇచ్చారని అహ్మదాబాద్‌లోని సెప్ట్ యూనివర్సిటీలో ఆర్టిటెక్చర్ లెక్చరర్‌గా పని చేస్తున్న మేఘన కన్నెగంటి చెప్పారు.
1903- 1950 మధ్య న్యూయార్క్‌లోని బఫెలో ప్రాంతంలో ప్రఖ్యాత లార్కిన్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కోసం ప్రముఖ ఆర్కిటెక్ట్ ఫ్రాంక్ లాయిడ్ రైట్ ఈ డిజైన్‌ను ఉపయోగించారు.
ఆయన ఉపయోగించిన అనేక పద్దతుల్లో భాగంగా బాత్‌రూమ్‌లకు ఉపయోగించిన తలుపులు తర్వాతి కాలంలో వాణిజ్య భవన నిర్మాణాల్లో ప్రామాణికంగా మారాయని ఫ్రాంక్ లాయిడ్ రైట్ ఫౌండేషన్ వెబ్‌సైట్ తెలిపింది .

ఫొటో సోర్స్, Robert Altman/Michael Ochs Archives/Getty Images
అమెరికాలో చట్టం
ప్రస్తుత డిజైన్ టాయిలెట్ల నిర్మాణం, నిర్వహణకు అయ్యే ఖర్చుని చాలా వరకు తగ్గించింది.
అమెరికా, కెనడాల్లో నిర్మించిన ఈ డిజైన్ ప్రపంచంలోనే అనేక దేశాల్లో పబ్లిక్ టాయిలెట్‌కు ప్రామాణికంగా నిలిచింది.
వీల్‌చెయిర్‌లో ఉండే వారి కోసం టాయిలెట్ల నిర్మాణానికి సంబంధించి అమెరికన్ ప్రభుత్వం ది అమెరికన్స్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్( ఏడీఏ) రూపొందించింది.
టాయిలెట్ పార్టీషన్ ప్యానల్స్, తలుపుల కింద ఖాళీ ఉండాలని ఈ చట్టం స్పష్టంగా చెబుతోంది. ఇందులో చిన్నారుల కోసం ఏర్పాటు చేసే టాయిలెట్ షీట్ వారు సౌకర్యవంతంగా కూర్చునేలా ఉండాలని 'ది అమెరికన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్' సూచిస్తోంది.
జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి బాత్‌రూమ్‌ల వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Meghana Kanneganti
అత్యవసర పరిస్థితి, భద్రత
పబ్లిక్ టాయిలెట్ల సైజు వెడల్పు మూడు అడుగులు, పొడవు ఐదు అడుగులు లేదా అంత కంటే తక్కువ ఉంటుంది. ఇంత తక్కువ ప్రాంతాన్ని పూర్తిగా గాలి, వెలుతురు రాకుండా మూసి వేస్తే అనేక సమస్యలు వస్తాయి.
హఠాత్తుగా కరెంటుపోతే, లోపల ఉన్న వారు భయపడే అవకాశం ఉంటుంది. స్పేస్ చిన్నగా ఉంటే కొంతమందిలో ఆందోళన, భయం ఏర్పడవచ్చని మేఘన అన్నారు.
పబ్లిక్ ప్లేసెస్‌లో పూర్తిగా మూసి వేసి ఉన్న బాత్‌రూమ్‌లో అసాంఘిక కార్యక్రమాలు, బాత్ రూమ్ గోడల మీద పిచ్చిరాతలు రాయడం, బొమ్మలు వేయడం, డ్రగ్స్ తీసుకోవడం లాంటి సంఘటనలు జరిగాయి.
గతంలో టాయిలెట్ గది నాలుగు వైపులా మూసి వేసి ఉండేది. ఇవి ఎక్కువగా తడిగా, లోపల దుర్గంధం వెదజల్లుతూ ఉండేవి.
వీటి లోపల ఏర్పాటు చేసిన పైపులు, ట్యాపుల ద్వారా నీరు లీకవడం వల్ల వాసనతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
అలా కాకుండా నేల, తలుపు మధ్య గ్యాప్ ఉండటం వల్ల లోపల ఏదైనా అత్యవసర పరిస్థితి, మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వారికి వెంటనే సాయం అందించవచ్చు.
డోర్ లాక్ పడిపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా తక్షణ సాయం కోసం అభ్యర్థించవచ్చు. అదే తలుపు మూసి వేసి ఉన్న బాత్‌రూమ్‌లలో ఇలాంటి పరిస్థితి ఉండదు.

ఫొటో సోర్స్, Getty Images
ఖర్చు తక్కువ, నిర్వహణ తేలిక
ఈ టాయిలెట్లను భవనంలోని ఫ్లోర్‌లో ఎక్కడైనా ఏర్పాటు చేయవచ్చు. వీటి నిర్మాణానికి ఖర్చు తక్కువ, ఒక చోట నుంచి మరో చోటకు తేలిగ్గా తరలించవచ్చు. ఏదైనా పాడైపోతే త్వరగా తిరిగి అమర్చవచ్చు.
మాల్స్, థియేటర్లు, ఎయిర్‌పోర్టులు లాంటి ప్రదేశాలకు ప్రతీ రోజూ వేల మంది వస్తుంటారు. వారిలో అనేక మంది టాయిలెట్లను ఉపయోగిస్తుంటారు. పదే పదే ఉపయోగించడం వల్ల వాసన రాకుండా తరచుగా శుభ్రం చేయడానికి, పొడిగా, శుభ్రంగా ఉంచడానికి ఈ డిజైన్ అనుకూలంగా ఉంటుంది.
మూసి ఉన్న టాయిలెట్లలో ఈ-కొలీ అనే బ్యాక్టీరియాతో పాటు ఇతర వైరస్‌లు ఉంటాయి. వీటి వల్ల దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. అయితే తలుపు కింద గ్యాప్ ఉండే డిజైన్‌తో ఈ సమస్యలు చాలా తక్కువ.
టాయిలెట్లను అన్ని వైపుల నుంచి మూసి వేయడం వల్ల లోపల చెమ్మ ఏర్పడుతుంది. దీర్ఘకాలం ఇలాంటి పరిస్థితి వల్ల పార్టీషన్స్ పాడయ్యే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ధారాళంగా గాలి, వెలుతురు
ప్రైవేట్ రెస్ట్‌రూమ్‌లతో పోలిస్తే పబ్లిక్ రెస్ట్‌రూమ్‌లను ఎక్కువ మంది ఉపయోగిస్తారు.
దీని వల్ల అవి తరచుగా తడిగా మారుతుంటాయి. గాలి సరిగ్గా వీయకపోతే దుర్వాసన వెదజల్లుతాయి.
ఈ స్టాల్స్‌కి అమర్చిన తలుపు కింద ఉండే ఖాళీ ద్వారా గాలి వీయడం వల్ల అవి త్వరగా ఆరిపోవడంతో పాటు, వాసన వచ్చే అవకాశం తగ్గుతుంది.
భవనంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఇలాంటి పార్టీషన్ వల్ల త్వరగా తెలుస్తుంది.
టాయిలెట్ స్టాల్స్‌లో ఏది ఖాళీగా ఉందో తేలిగ్గా గుర్తించవచ్చు.
తలుపుకి నేలకు మధ్య ఖాళీ ఉండటం వల్ల క్లీనింగ్ సిబ్బంది తలుపు తీయాల్సిన అవసరం లేకుండా ఫ్లోర్‌ను క్లీన్ చేయవచ్చు.
తలుపు నేలకు ఉండే టాయిలెట్‌తో పోల్చితే ఈ డిజైన్‌తో టాయిలెట్ల నిర్మాణం ఆర్థికంగా కూడా తేలిగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































