భార్యను హత్య చేసి, నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న భర్తను పట్టించిన గ్యాస్ సిలిండర్

ఫొటో సోర్స్, Punjab Police
- రచయిత, నవజోత్ కౌర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 4 నిమిషాలు
భార్య హత్య కేసులో గత నాలుగేళ్లుగా పరారీలో ఉన్న భర్తను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సందీప్ తోమర్ అనే ఈయన భారత సైన్యంలో మాజీ కెప్టెన్.
సందీప్ తోమర్ అరెస్ట్ కొంత నాటకీయంగా జరిగింది. ఎల్‌పీజీ సిలిండర్ తీసుకునే సమయంలో నగదు లావాదేవీ కోసం నిందితుడు తన బ్యాంక్ ఖాతా, పాన్ కార్డును ఉపయోగించడంతో పంజాబ్ రాష్ట్రంలోని ఫాజిల్కా పోలీసులకు చిక్కారు.
ఫాజిల్కా ఎస్ఎస్పీ గుర్మీత్ సింగ్ ఈ విషయాన్ని బీబీసీ పంజాబీకి వెల్లడించారు.
సందీప్ తోమర్‌పై భార్యను కొట్టడం, వరకట్నం డిమాండ్ చేయడం, ఆమె మరణానికి కారణమైనట్లు ఆరోపణలు ఉన్నాయి.
దీనిపై 2013లో ఐపీసీ సెక్షన్ 304-బి కింద కేసు నమోదైంది. సందీప్ తోమర్ భార్య తండ్రి ఈ ఫిర్యాదు చేశారని ఎస్ఎస్పీ గుర్మీత్ సింగ్ తెలిపారు.
సందీప్ తోమర్ తన భార్య శ్వేతా సింగ్‌ను హత్య చేసి, దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని గుర్మీత్ సింగ్ చెప్పారు.

అయితే, సందీప్ తోమరే తన భార్యను హత్య చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఘటన జరిగిన రోజే ఆయనను అరెస్ట్ చేశారు.
భార్య హత్య కేసులో 5 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన సందీప్ తోమర్‌ను 2019లో పంజాబ్-హరియాణా హైకోర్టు బెయిల్‌పై విడుదల చేసింది. అయితే, 2022లో సందీప్ తోమర్‌ను లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. కానీ, ఆయన లొంగిపోకుండా అప్పటి నుంచి పరారీలో ఉన్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. సందీప్ తోమర్ కోసం నిరంతరం గాలింపు కొనసాగుతూనే ఉంది. చివరకు మార్చి 28న మధ్యప్రదేశ్ పోలీసుల సహాయంతో ఫాజిల్కా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.
మధ్యప్రదేశ్‌లోని పంధుర్నా జిల్లాలో సందీప్ తోమర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలు కేసు ఏంటి?
సందీప్ తోమర్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్. ఘటన జరిగిన సమయంలో ఆయన పంజాబ్‌లోని అబోహర్‌లో 12 బిహార్ రెజిమెంట్‌లో కెప్టెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య కూడా ఉత్తరప్రదేశ్‌కు చెందినవారే.
పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం.. వీరిద్దరికీ 2013 ఫిబ్రవరిలో వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన కొద్ది నెలలకే అంటే 2013 జూలై 8న సందీప్ తోమర్ భార్య మరణించారు.
ఫిర్యాదుదారు (సందీప్ తోమర్ భార్య శ్వేతా సింగ్ తండ్రి) తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లయిన కొద్ది రోజుల నుంచే సందీప్ తోమర్, ఆయన కుటుంబ సభ్యులు అదనపు వరకట్నం కోసం శ్వేతా సింగ్‌ను వేధించడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని శ్వేతా సింగ్ తన తల్లికి కూడా చెప్పారు.
జూలై 8న తమ కుమార్తె మరణించినట్లు సమాచారం అందడంతో, వారు అల్లుడు సందీప్ తోమర్‌పై ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
నిందితుడు మొదట తన భార్య ఆత్మహత్య చేసుకుందని చెప్పినప్పటికీ, పోలీసు దర్యాప్తులో అది హత్య అని తేలిందని ఎస్ఎస్పీ గుర్మీత్ సింగ్ వెల్లడించారు. 2014లో స్థానిక కోర్టు సందీప్ తోమర్‌ను దోషిగా నిర్ధరించి, ఆయనకు జీవిత ఖైదు విధించింది.
దీని తర్వాత ఆయనను ఫిరోజ్‌పూర్ జైలుకు పంపారు. అదే సమయంలో సైన్యం కూడా ఆయన్ను విధుల్లోంచి తొలగించింది. సందీప్ తోమర్ దాదాపు 5 ఏళ్ల పాటు జైలులో గడిపిన తర్వాత, తన శిక్షను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.
2019లో హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
అయితే, 2022లో హైకోర్టు ఆయన జీవిత ఖైదు శిక్షను సమర్థించింది. కోర్టు ఆదేశాల తర్వాత కూడా సందీప్ తోమర్ లొంగిపోకుండా పరారీలో ఉన్నారని ఎస్ఎస్పీ గుర్మీత్ సింగ్ తెలిపారు.
మృతురాలి తండ్రి 2024లో హైకోర్టును ఆశ్రయించి, సందీప్ తోమర్‌ను అరెస్టు చేయాలని కోరారు. దీనిపై దర్యాప్తు కోసం ఫాజిల్కా ఎస్పీ అస్వంత్ సింగ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన సిట్ ఏర్పాటు చేశారు.
అప్పటి నుంచి పోలీసులు సందీప్ తోమర్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. గుర్మీత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. సందీప్‌ను పట్టుకోవడానికి ఒక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు, ఇది ఆయన కదలికలపై నిరంతరం నిఘా ఉంచింది.

ఫొటో సోర్స్, fb/fazilka police
పోలీసులు ఎలా పట్టుకున్నారు?
ఎస్ఎస్పీ గుర్మీత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. జైలు నుంచి విడుదలైన తర్వాత సందీప్ తోమర్ తన గుర్తింపును మార్చుకున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తూ ఉద్యోగాలు చేశారు. అరెస్ట్ చేసే సమయానికి ఆయన రెండో పెళ్లి కూడా చేసుకున్నట్లు గుర్తించారు.
ఈ నాలుగేళ్లలో ఆయన తన వేషధారణ (లుక్), చిరునామాను కూడా మార్చుకున్నారు. పంజాబ్ తర్వాత ఒడిశా, బెంగళూరు, మధ్యప్రదేశ్‌లలో ఉంటూ పనిచేశారు.
"కొన్ని రోజుల కిందట సందీప్ తోమర్ బ్యాంక్ స్టేట్‌మెంట్ పరిశీలించగా.. గ్యాస్ ఏజెన్సీ ద్వారా ఎల్‌పీజీ సిలిండర్ తీసుకుంటున్నట్లు గమనించాం. పోలీసులు సదరు గ్యాస్ ఏజెన్సీని సంప్రదించగా సందీప్ చిరునామా లభించింది. ఈ సమాచారాన్ని పాంధుర్నా పోలీసులకు అందించడంతో వారు సందీప్ తోమర్‌ను వెంటనే అరెస్ట్ చేశారు" అని గుర్మీత్ సింగ్ చెప్పారు..
ఆ తర్వాత ఫాజిల్కా పోలీసు బృందం సందీప్ తోమర్‌ను అదుపులోకి తీసుకొని పంజాబ్‌కు తీసుకువచ్చింది. స్థానిక కోర్టు ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































