అమెరికాతో చర్చలకు ఇరాన్ ఎందుకు ఆసక్తి చూపడం లేదు, తెరవెనుక ఏం జరుగుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ అభ్యర్థన మేరకు ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, ఇరాన్ నౌకాశ్రయాల దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తుందని స్పష్టంచేశారు.
పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ విజ్ఞప్తి మేరకు ఇరాన్‌పై దాడిని వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ 'ట్రూత్ సోషల్'లో పేర్కొన్నారు.
"దిగ్బంధనాన్ని కొనసాగించాలని, అప్రమత్తంగా ఉండాలని నా సైన్యాన్ని ఆదేశించాను. వారి నుంచి ప్రతిపాదన వచ్చి, చర్చలు ఒక కొలిక్కి వచ్చే వరకు కాల్పుల విరమణను పొడిగిస్తున్నా" అని ట్రంప్ తెలిపారు.
మరోవైపు, ఇరాన్ నౌకాశ్రయాల దిగ్బంధనం యుద్ధ చర్యతో సమానమని, ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అన్నారు.
"వాణిజ్య నౌకలపై దాడి చేయడం, సిబ్బందిని బందీలుగా పట్టుకోవడం ఇంకా పెద్ద ఉల్లంఘన. ఆంక్షలను ఎలా ఎదుర్కోవాలో, మా ప్రయోజనాలను ఎలా కాపాడుకోవాలో, బెదిరింపులకు ఎలా సమాధానం చెప్పాలో ఇరాన్‌కు తెలుసు" అని ఆయన 'ఎక్స్' పోస్టులో తెలిపారు.


ఫొటో సోర్స్, Getty Images
ఇస్లామాబాద్‌కు చేరుకోని జేడీ వాన్స్
అమెరికా కాల్పుల విరమణను పొడిగించడాన్ని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ స్వాగతించారు. ఇది ఉద్రిక్తతలను తగ్గించే చర్య అని, ఇరాన్-అమెరికా మధ్య దౌత్యం, నమ్మకాన్ని పెంచే వాతావరణాన్ని సృష్టిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అన్ని పక్షాలూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ఒప్పందాన్ని బలహీనపరిచే చర్యలకు దూరంగా ఉంటూ శాశ్వత పరిష్కారం కోసం చర్చలు జరపాలని కోరారు.
కాల్పుల విరమణ పొడిగించినప్పటికీ, ఇస్లామాబాద్‌లో జరగాల్సిన రెండో విడత చర్చలపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ చర్చల కోసం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వంలో ప్రతినిధి బృందాన్ని పాకిస్తాన్‌కు పంపుతున్నట్లు ట్రంప్ గతంలో ప్రకటించారు.
నిజానికి వాన్స్ బుధవారం ఉదయం పాకిస్తాన్ చేరుకోవాల్సి ఉందని అమెరికా మీడియా తెలిపింది. అయితే ఆయన పర్యటన రద్దయింది, ఎందుకంటే అమెరికా ప్రతినిధి బృందం వచ్చినప్పుడు మీటింగ్ టేబుల్ వద్ద ఇరాన్ నుంచి ఎవరైనా ఉంటారా లేదా అనే ప్రశ్నకు ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్ వద్ద కూడా ఇప్పటివరకు సమాధానం లేదు.
చర్చలకు ప్రతినిధులను పంపడం తప్ప ఇరాన్‌కు మరో మార్గం లేదని ట్రంప్ మంగళవారం ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, అమెరికాతో చర్చలపై ఇరాన్ అధికారుల నుంచి ఎటువంటి సానుకూల సంకేతాలు రాలేదు.
మరోవైపు, ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లకు లొంగి ఇరాన్ చర్చలు జరపదని పాకిస్తాన్‌లోని ఇరాన్ రాయబారి రజా అమిరీ మొగదమ్ తెలిపారు.
"ప్రాచీన నాగరికత కలిగిన ఏ దేశమైనా బెదిరింపులకు లొంగి చర్చలు జరపదనేది జగమెరిగిన సత్యం. ఇది మా ఇస్లామిక్ సిద్ధాంతం కూడా. అమెరికా దీన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది" అని ఆయన ఎక్స్‌లో రాశారు.
ఇరాన్ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్‌కు బయలుదేరిందనే వార్తలను ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ మంగళవారం మధ్యాహ్నం తోసిపుచ్చింది. బెదిరింపుల నీడలో ఎటువంటి చర్చలను అంగీకరించబోమని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగర్ గాలిబాఫ్ సహా ఇతర ఉన్నతాధికారులు తమ వైఖరిని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో, రెండో విడత చర్చల్లో ఇరాన్ ఎందుకు పాల్గొనడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
చర్చలకు ఆటంకాలు
అమెరికా 'రెచ్చగొట్టే చర్యలు, పదేపదే కాల్పుల విరమణను ఉల్లంఘించడం' వల్ల దౌత్యపరమైన ప్రక్రియ ముందుకు సాగడం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అభిప్రాయపడ్డారు. ఇరాన్ వాణిజ్య నౌకల పట్ల అమెరికా 'బెదిరింపులు, జోక్యం' చేసుకోవడం, పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయడం ఈ ప్రక్రియకు అడ్డంకిగా మారాయని ఆయన పేర్కొన్నారు.
ఏప్రిల్ 12న ఇరాన్-అమెరికా మధ్య జరిగిన మొదటి విడత చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రధానంగా ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం నిల్వలపై అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాలను తయారు చేయకూడదన్నది అమెరికా ప్రధాన డిమాండ్.
మరోవైపు, లెబనాన్‌లో కాల్పుల విరమణ జరిగే వరకు తాము చర్చలకు సిద్ధం కాబోమని ఇరాన్ గతంలో స్పష్టం చేసింది. ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య చర్చల తర్వాత అక్కడ కాల్పుల విరమణ జరిగినప్పటికీ, ఇరాన్ పెట్టిన మిగిలిన నిబంధనలేవీ ఇప్పటివరకు నెరవేరలేదు. తమపై ఉన్న ఆంక్షలను తొలగించాలని, సీజ్ చేసిన ఆస్తులను విడిపించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. అయితే వీటిపై చర్చల సమయంలో మాట్లాడుకోవచ్చని భావిస్తున్నారు.
హార్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కూడా చర్చలకు పెద్ద అడ్డంకిగా మారింది. మొదటి రౌండ్ చర్చల తర్వాత ఈ సమస్య మరింత తీవ్రమైంది.
హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచి ఉంచాలని అమెరికా కోరుతోంది. లెబనాన్ కాల్పుల విరమణ తర్వాత, అబ్బాస్ అరాగ్చీ వాణిజ్య నౌకల కోసం ఈ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించడంతో పరిస్థితులు కుదుటపడతాయని అనిపించింది. కానీ, అమెరికా నౌకాదళం దిగ్బంధనాన్ని తొలగించేందుకు ట్రంప్ నిరాకరించడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఏదైనా ఒప్పందం కుదిరే వరకు దిగ్బంధనం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఇదే సమయంలో, ఒమన్ గల్ఫ్‌లో ఇరాన్ జెండాతో ఉన్న ఒక నౌకపై అమెరికా కాల్పులు జరిపి దానిని స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనను సముద్రపు దొంగతనం, కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనగా అభివర్ణించడమే కాకుండా, ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది.
ప్రస్తుతం, హార్ముజ్ జలసంధిలో అమెరికా దిగ్బంధనం, ట్రంప్ ప్రకటనలపై ఇరాన్ నాయకత్వం తీవ్ర ఆందోళనతో ఉంది.
కాల్పుల విరమణ, దిగ్బంధనం ద్వారా అమెరికా అధ్యక్షుడు తన రెచ్చగొట్టే చర్యలను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ బగర్ గాలిబాఫ్ ఆరోపించారు. బెదిరింపుల మధ్య జరిగే చర్చలను ఇరాన్ అంగీకరించబోదని ఆయన చెప్పారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులలో ఇరు దేశాల మధ్య చర్చలు సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
'చర్చలకు ఆరాటపడటం ఇరాన్‌కు ఇష్టం లేదు'
ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా, అమెరికా-ఇరాన్ చర్చలను నిశితంగా గమనిస్తున్న విశ్లేషకులు, ఇరాన్ ప్రతినిధి బృందం కచ్చితంగా ఇస్లామాబాద్‌కు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
"ఏ ఇరాన్ వాసి కూడా చర్చల కోసం తాము ఆరాటపడుతున్నట్లు కనిపించడానికి ఇష్టపడరు" అని కాయిద్-ఎ-అజం యూనివర్సిటీకి చెందిన అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు, అసోసియేట్ ప్రొఫెసర్ మొహమ్మద్ షోయబ్ బీబీసీ ఉర్దూకు చెప్పారు.
ఇరాన్ అంతర్గత రాజకీయాల దృష్ట్యా కూడా ఆ దేశ నాయకులు కఠినమైన వైఖరిని ప్రదర్శించాల్సిన అవసరం ఉందని ఆయన అంటున్నారు.
"ఈ చర్చల ద్వారా తమకు చాలా ప్రయోజనం చేకూరుతుందని ఇరాన్‌లోని సంప్రదాయవాదులు భావిస్తున్నారు. లెబనాన్‌లో కాల్పుల విరమణ జరగాలన్న వారి ప్రధాన డిమాండ్ ఇప్పటికే నెరవేరింది. ఇప్పుడు తమ మిగిలిన డిమాండ్లను కూడా నెరవేర్చుకోవడానికి వారు ప్రయత్నిస్తారనేది స్పష్టంగా కనిపిస్తోంది" అని షోయబ్ అన్నారు.
ఇరాన్ వెనుకడుగు వేయడానికి డోనల్డ్ ట్రంప్ వైఖరి కూడా ఒక కారణమని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీకి చెందిన అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు మొహమ్మద్ ఫైసల్ అన్నారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
"కాల్పుల విరమణ జరిగినప్పుడు చర్చలు జరుగుతాయని అందరూ ఆశించారు. మొదటి రౌండ్ చర్చలు జరుగుతున్న సమయంలోనే ట్రంప్ ఇరాన్ నౌకాదళ దిగ్బంధనాన్ని ప్రకటించారు. నౌకాదళ దిగ్బంధనం అంటే అది యుద్ధ చర్య కిందకే వస్తుంది" అని ఫైసల్ అన్నారు.
"దీనివల్ల చర్చలపై ఇరాన్‌కు నమ్మకం తగ్గింది. అందుకే మొదటి రౌండ్ చర్చల తర్వాత పాకిస్తాన్ ప్రతినిధి బృందం వారికి నమ్మకాన్ని కలిగించడానికి తెహ్రాన్ కూడా వెళ్లింది. నేరుగా బెదిరింపులు ఎదుర్కొంటున్న సమయంలో చర్చలు జరపడం ఇరాన్‌కు ఇష్టం లేదు. ఇలాంటి వాతావరణం చర్చల ప్రక్రియను మరింత క్లిష్టతరం చేస్తుంది. ఇక్కడ అమెరికాకు ఇచ్చే చిన్న రాయితీని కూడా ఇరాన్ ఓటమిగా భావించే అవకాశం ఉంది" అని తెలిపారు.
ఈ నేపథ్యంలో, సోమవారం ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఇచ్చిన ప్రకటనలో 'ప్రస్తుతానికి' అనే పదం కీలకంగా మారింది.
"పాకిస్తాలో అమెరికాతో రెండో రౌండ్ చర్చలు జరిపే ప్రణాళిక ప్రస్తుతానికి మాకు లేదు" అని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.
ఇరాన్ చివరి నిమిషంలో పాకిస్తాన్‌కు వెళ్లే నిర్ణయం తీసుకోవచ్చనే సంకేతాలను ఈ వాక్యం ఇస్తోంది. పైగా, ఈ రెండు దేశాల మధ్య ప్రయాణం కొన్ని గంటల వ్యవహారం మాత్రమే కావడం గమనించాల్సిన విషయం.
పాకిస్తాన్‌కు కఠిన పరీక్ష
ఇస్లామాబాద్‌లో చర్చల వేదిక సిద్ధమైంది కానీ, అతిథులు మాత్రం ఇంకా చేరుకోలేదని బీబీసీ ప్రతినిధి పాల్ ఆడమ్స్ చెప్పారు. అసలు ప్రశ్న ఏమిటంటే.. ఇరాన్ నాయకుడు గాలిబాఫ్ మళ్లీ వస్తారా? లేదా గతంలో సోషల్ మీడియాలో సూచించినట్లు స్వయంగా అధ్యక్షుడు ట్రంప్ వస్తారా?
పాల్ ఆడమ్స్ విశ్లేషణ ప్రకారం, పరిస్థితులు అంత అనుకూలంగా ఏమీ కనిపించడం లేదు. అయితే, ఇస్లామాబాద్ వేదికగా జరుగుతున్న ఈ కీలక దౌత్య ప్రక్రియ పట్టాలు తప్పడం ఇరు పక్షాలకు ఇష్టం లేదు.
ప్రస్తుతం ఇస్లామాబాద్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, తెరవెనుక ఏదో ఒక ఒప్పందం తుది రూపు దాల్చుతున్నట్లు కనిపిస్తోంది. ఇరు వర్గాలు కొన్ని రాయితీలకు అంగీకరిస్తూనే, ఆ ఒప్పందాన్ని తమ సొంత విజయంగా ప్రపంచానికి చాటిచెప్పుకునేలా ఒక మధ్యేమార్గం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































