లైవ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో నేడే పోలింగ్

పశ్చిమ బెంగాల్‌లో తొలి విడత, తమిళనాడులో మొత్తం అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. బెంగాల్‌లో మొదటి విడతలో 152 నియోజకవర్గాలకు, తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.

సారాంశం

  • తమిళనాడు శాసనసభ ఎన్నికలకు పోలింగ్ మొదలైంది.
  • ఈ రాష్ట్రంలో 234 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
  • పశ్చిమ బెంగాల్‌లో తొలివిడతలో భాగంగా 152 అసెంబ్లీ స్థానాలకూ నేడు పోలింగ్.
  • డోనల్డ్ ట్రంప్ ప్రకటించిన యుద్ధ విరామ పొడిగింపుపై ఇరాన్ స్పందించింది.
  • రాజకీయ పరిణామాలను తెహ్రాన్ నిశితంగా గమనిస్తోందని ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ చెప్పారు.

లైవ్ కవరేజీ

  1. చెన్నైలో ఓటేసిన రజనీ, విజయ్, అజిత్

    రజనీకాంత్, తమిళనాడు ఎన్నికలు

    ఫొటో సోర్స్, ANI

    నటుడు రజనీకాంత్ చెన్నైలోని స్టెల్లా మారిస్ స్కూల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    అలాగే, నటుడు అజిత్ కుమార్ చెన్నైలోని తిరువాన్మియూర్ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు.

    టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ చెన్నైలోని నీలంకరై పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    ఎంఎన్ఎం చీఫ్, నటుడు కమల్ హాసన్ తన కుమార్తె శృతి హాసన్‌తో కలిసి చెన్నైలో ఓటు వేశారు.

    అజిత్ కుమార్

    ఫొటో సోర్స్, ANI

  2. అమెరికాతో చర్చలకు ఇరాన్ ఎందుకు ఆసక్తి చూపడం లేదు, తెరవెనుక ఏం జరుగుతోంది?

    అమెరికా, చర్చలు, ఇరాన్

    ఫొటో సోర్స్, Getty Images

    కాల్పుల విరమణ పొడిగించినప్పటికీ, ఇస్లామాబాద్‌లో జరగాల్సిన రెండో విడత చర్చలపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వంలో ప్రతినిధి బృందాన్ని పాకిస్తాన్‌కు పంపుతున్నట్లు అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గతంలోనే ప్రకటించారు.

    నిజానికి వాన్స్ బుధవారం ఉదయం పాకిస్తాన్ చేరుకోవాల్సి ఉందని అమెరికా మీడియా తెలిపింది. అయితే, ఆయన పర్యటన రద్దయింది, ఎందుకంటే అమెరికా ప్రతినిధి బృందం వచ్చినప్పుడు మీటింగ్ టేబుల్ వద్ద ఇరాన్ నుంచి ఎవరైనా ఉంటారా లేదా అనే ప్రశ్నకు ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్ వద్ద కూడా ఇప్పటివరకు సమాధానం లేదు.

    చర్చలకు ప్రతినిధులను పంపడం తప్ప ఇరాన్‌కు మరో మార్గం లేదని ట్రంప్ మంగళవారం ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, అమెరికాతో చర్చలపై ఇరాన్ అధికారుల నుంచి ఎటువంటి సానుకూల సంకేతాలు రాలేదు.

    ఈ నేపథ్యంలో, రెండో విడత చర్చల్లో ఇరాన్ ఎందుకు పాల్గొనడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

    దీనికి సంబంధించిన పూర్తి కథనం ఇక్కడ చదవండి.

  3. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో నేడే పోలింగ్

    తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ పోలింగ్

    ఫొటో సోర్స్, Rupak De Chowdhuri/NurPhoto via Getty Images

    ఫొటో క్యాప్షన్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు ముందు వీవీప్యాట్ యంత్రాలను తీసుకువెళ్తున్న ఎన్నికల సిబ్బంది

    పశ్చిమ బెంగాల్‌లో తొలి విడత, తమిళనాడులో మొత్తం అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి.

    పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలుండగా మొదటి విడతలో 152 నియోజకవర్గాలకు, తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.

    బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ - బీజేపీ మధ్య ప్రత్యక్ష పోరు కనిపిస్తుండగా, తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకే మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది.

  4. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్‌డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.