"నా సొంత ఇంట్లోనే నన్ను రహస్యంగా వీడియో తీయడం చిత్రవధకు గురిచేసింది’’

కిర్క్ బిషప్, రహస్య వీడియో, లైంగిక నేరం, బాధితురాలు, నేరాలు, వాయెరిజం
ఫొటో క్యాప్షన్, లూసీ డొమైల్ తన కథను అందరికీ చెప్పాలనుకున్నారు.
    • రచయిత, జాన్ ఫెర్నాండెజ్
    • హోదా, బీబీసీ న్యూస్
  • చదివే సమయం: 5 నిమిషాలు

సొంత ఇంట్లోనే తనను రహస్యంగా వీడియో తీయడం.. తన జీవితం పూర్తిగా మారిపోయిందని అభద్రతాభావం వెంటాడుతోందని లూసీ డొమైల్ అనే మహిళ చెప్పారు.

లూసీ డొమైల్ బ్రిటన్ పశ్చిమ తీరంలోని గాన్జీ ద్వీపంలో నివసిస్తున్నారు. ఈమె లైంగిక వేధింపుల బాధితులకు ఉండే గోప్యతా హక్కును వదులకుని మరీ ఈ వోయరిజం (రహస్యంగా లైంగిక కార్యకలాపాలను ఫోటోలు, వీడియోలు తీయడం) పై బహిరంగంగా మాట్లాడారు.

"నాకు నిద్ర పట్టడం లేదు" అని డొమైల్ బీబీసీకి చెప్పారు. "ఏ శబ్దం విన్నా, అలాగే తలుపు తీసిన ప్రతిసారీ ఎవరో 24 గంటలు నన్ను గమనిస్తున్నారనే భయం వేస్తోంది. ఇది నా జీవితాన్ని పూర్తిగా ఆక్రమించేసింది. ఎప్పడూ దీని గురించే ఆలోచిస్తుంటా" అని ఆమె అన్నారు.

గత ఏడాది అక్టోబర్‌లో గాన్జీ పోలీసులు లూసీడొమైన్‌ను కలిసి, ఆమె ఒక 'వోయరిజం' నేరానికి బాధితురాలిగా మారారని సమాచారం ఇచ్చారు.

సుమారు పాతికేళ్లుగా పరిచయం ఉన్న ఓ వ్యక్తే, ఆమె స్నానం ముగించుకుని వస్తున్న సమయంలో కిటికీ దగ్గర నక్కి, తెరల మధ్య ఉన్న చిన్న ఖాళీ ద్వారా రహస్యంగా వీడియో తీశాడు.

ఈ ఘటన జరిగినప్పటి నుండి లూసీ ప్రతి నిమిషం నరకాన్ని అనుభవిస్తున్నారు. ఆమె మాటల్లో చెప్పాలంటే: "నేను మునుపటిలా లేను. ఇది నా మనసును చిత్రవధ చేసింది. నన్ను చిత్రహింసలకు గురిచేస్తోంది."

ఈ ఘటన లూసీ వ్యక్తిగత భద్రతను మాత్రమే కాదు, ఆమె ఇంటి ప్రశాంతతను కూడా దూరం చేసింది. "సాధారణంగా మనం ఇంట్లోకి వెళ్ళగానే సురక్షితంగా ఉన్నామనే భావన కలుగుతుంది. కానీ నాకు ఆ నమ్మకం పూర్తిగా పోయింది" అని వివరించారు.

‘‘కునుకు కూడా తీయలేకపోతున్నా’’ అని చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పిల్లల అమాయకత్వంపై ప్రభావం

లూసీ ఓ సూపర్‌మార్కెట్ వద్ద ఉండగా, ఆమె భర్త ఫోన్ చేశారు. సాధారణ దుస్తుల్లో ఉన్న ఇద్దరు అధికారులు ఇంటికి వచ్చారని, వారు లూసీతో మాట్లాడాలనుకుంటున్నారని చెప్పారు.

తరువాత తాను కిర్క్ బిషప్ బాధితురాలినని లూసీకి తెలిసింది. అంతకుముందు నెలలో గాన్జీ పోలీసులు సోషల్ మీడియాలో పోస్టు చేసిన నిందితుడి నేరాల గురించి ఆమె చదివారు. ఈ ఘటన ఆమెను ‘తీవ్ర మానసిక వేదనకు’’ గురిచేసింది.

దీనివల్ల ఆమె పూర్తిగా మారిపోయారు. ‘‘నేను గతంలోలా లేను. ఇకపై ఎప్పటికీ పాత లూసీలా మారలేను’’ అన్నారు.

ఇద్దరు చిన్న పిల్లలకు తల్లి అయిన లూసీ, ఈ ఘటన తర్వాత ఇంట్లో పిల్లలతో తాను వ్యవహరించే తీరు కూడా మారిపోయిందని చెప్పారు.

"పిల్లలు స్నానం ముగించుకుని బట్టలు లేకుండా హాల్‌లో పరిగెత్తుకుంటూ వెళ్లడం సహజం. కానీ ఇప్పుడు నేను అది భరించలేకపోతున్నాను. నా పిల్లల అమాయకత్వాన్ని ఎవరో లాగేసుకున్నట్లు అనిపిస్తోంది. వారు నిరంతరం ఒంటిపై దుస్తులతో ఉండేలా జాగ్రత్త పడుతున్నాను"

నలభై ఏళ్ల కిర్క్ బిషప్ ఈ నేరానికి పాల్పడినట్లు తేలింది. ఇతడు లూసీకి 25 ఏళ్లుగా తెలిసిన వ్యక్తి కావడం గమనార్హం. కేవలం లూసీ మాత్రమే కాదు, ఇతడు మొత్తం 12 మంది బాధితులపై 20 రకాల నేరాలకు పాల్పడినట్లు కోర్టులో అంగీకరించాడు. 2022 నుండి 2025 మధ్య కాలంలో ఇతడు ప్రజల ఇళ్లలోకి చొరబడటం, దొంగతనాలకు పాల్పడటం, వారు ఏకాంతంగా ఉన్నప్పుడు రహస్యంగా వీడియోలు తీయడం చేశాడు.

కిర్క్ బిషప్, రహస్య వీడియో, లైంగిక నేరం, బాధితురాలు, నేరాలు, వాయెరిజం

ఫొటో సోర్స్, Getty Images

కిర్క్ బిషప్, రహస్య వీడియో, లైంగిక నేరం, బాధితురాలు, నేరాలు, వాయెరిజం

ఫొటో సోర్స్, BBC News

ఫొటో క్యాప్షన్, కొన్ని సందర్భాల్లో కిర్క్ బిషప్ ప్రజల ఇళ్లలోకి చొరబడి, వారి ఏకాంత కార్యకలాపాలను రహస్యంగా వీడియో తీశారు.

నిందితుడు పట్టుబడినా..

నిందితుడు పట్టుబడినప్పటికీ, పోలీసుల ప్రవర్తన న్యాయ వ్యవస్థ తీరు కారణంగా భవిష్యత్తులో ఏదైనా నేరంపై ఫిర్యాదు చేయాలా వద్దా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోందని లూసీ చెప్పారు.

నిందితుడి నేరాల గురించి విన్న తర్వాత పోలీసులు ఆమెకు "మీ కిటికీల తెరలు సరిగ్గా మూసి ఉంచండి" అని సలహా ఇవ్వడం ఆమెకు ఆగ్రహం కలిగించింది.

బిషప్ ఫోన్‌లో తనకు సంబంధించిన ఫోటోను ఆమె గుర్తించారు. అది ఓ వీడియో ఫ్రేమ్ నుంచి తీసిన ఫోటో. ఈ ఫోటోలోని లూసీని గుర్తించడానికి దానిని స్టేషన్‌లోని సిబ్బంది అందరికీ పంపిణీ చేశారు. దీనివల్ల తన వ్యక్తిగత సమాచారం ఇతరులకు తెలిసిపోయిందని ఆమె ఆవేదన చెందారు.

ఆ సమయంలో తన గోప్యతకు మరోసారి భంగం వాటిల్లిందని లూసీ భావించారు. ‘‘దాని ప్రభావం వెంటనే మొదలైంది కూడా. ఇది ఇక ఎంతమాత్రం నా వ్యక్తిగత విషయం మాత్రమే కాదు’’ అనిపించింది.

తరువాత ఆమెకు సంబంధించి రెండు వీడియోలు ఉన్నాయని తెలిపారు.

‘‘ఓ సమస్యను పరిష్కరించుకున్నామని అనుకున్న ప్రతిసారీ మరో సమస్య మీద పడుతోంది’’ అని ఆమె చెప్పారు.

తన కేసు దర్యాప్తు ‘దారుణంగా’ ఉందని ఆమె వివరించారు. ‘‘ఎన్నో తప్పులు, పొరపాట్లు జరిగాయి. ఇకపై ఏదైనా సమస్య వస్తే నేను పోలీసుల దగ్గరకు వెళ్లగలనని అనుకోవడం లేదు’’ అన్నారు.

బిషప్ తన నేరాలను అంగీకరించడానికి కోర్టుకు హాజరయ్యేలోపే ఆ విచారణ ఆరుసార్లు వాయిదాపడింది.

గాన్జీ పోలీసు

ఫొటో సోర్స్, Facebook/Guernsey Police

దర్యాప్తు ఎంతో క్లిష్టమైనది

ఈ దర్యాప్తు అత్యంత క్లిష్టమైనదని గాన్జీ పోలీసులు చెప్పారు. లూసీపై తమకు సానుభూతి ఉందని, లైంగిక నేరాల ప్రభావం ‘అంచనాలకు మించి ఉంటుందని’ పేర్కొన్నారు. తాము ఆమెను కలిసి, ఆమె ఇచ్చిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకున్నామని, దర్యాప్తులో లోపాలు ఉన్నాయని ఆమె భావించినందుకు క్షమాపణలు చెబుతున్నామని తెలిపారు.

శిక్షాకాలం ఖరారు కాకుండా పెండింగ్‌లో ఉన్న కేసు గురించి, లేదంటే ఎన్నిసార్లు వాయిదా పడిందనే విషయంపై తాము వ్యాఖ్యానించలేమని గాన్జీ రాయల్ కోర్టు పేర్కొంది.

గాన్జీ పోలీసు చీఫ్ ఆఫీసర్ మాట్లాడుతూ ‘‘ఇది చాలా క్లిష్టమైన కేసు. లూసీ డొమైల్, ఇతరులకు మేం ఓ విషయం స్పష్టం చేయదలుచుకున్నాం. మేం ఉపయోగించిన ఫోటోలు కేవలం వారి ముఖాలు గుర్తించడానికి మాత్రమే పరిమితం అయ్యాయి. వాటిని ఇతరులకు అందించే విషయంలోనూ చాలా కఠినంగా వ్యవహరించాం’’ అన్నారు.

‘‘బాధితులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఆ ఫోటోలను ఉపయోగించాల్సి వచ్చింది. ఆ ఫోటోలను గుర్తించమని సిబ్బందిని అడిగేటప్పుడు కూడా, వాటి వెనుక ఉన్న నేరస్వభావాన్ని వారికి వివరించకుండా, గోప్యతను పాటించాం. ఇప్పుడు బిషప్ జైలులో ఉన్నాడు. అతడు ఇకపై ఎవరికీ హాని చేయలేడు. ఒకవేళ మేం ఫోటోలను ఉపయోగించి ఉండకపోతే కొంతమంది బాధితులకు తమకు అన్యాయం జరిగిందనే విషయం తెలిసేది కాదు. వారికి న్యాయం కూడా జరిగేది కాదు’’ అని చెప్పారు.

గాన్జీ చట్టాల ప్రకారం 'వోయరిజం' నేరానికి గరిష్ట శిక్ష కేవలం రెండేళ్లు మాత్రమే. ఎంతమంది బాధితులు ఉన్నా శిక్ష పెరగకపోవడంపై లూసీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "నాకు జరిగిన అన్యాయానికి అతను కేవలం ఆరు వారాల శిక్ష అనుభవించి బయటకు వచ్చేస్తాడు" అని ఆమె వాపోయారు.

ఈ కేసు నేపథ్యంలో గాన్జీ ప్రభుత్వం లైంగిక నేరాల చట్టాలను కఠినతరం చేసేందుకు సిద్ధమైంది.

శిక్షా కాలాన్ని పెంచేలా కొత్త నిబంధనలు తీసుకురావాలని భావిస్తోంది.

ఇది మంచి పరిణామమే అయినప్పటికీ, తన కేసులో నిందితుడికి పాత చట్టం ప్రకారమే తక్కువ శిక్ష పడుతుందనే బాధ లూసీలో ఉంది.

బిషప్‌కు మే 15న శిక్ష ఖరారు కానుంది.

"గాన్జీలో అందరూ సురక్షితంగా ఉన్నామని భావిస్తారు. కానీ నేను ఆ నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయాను’’ అంటారు లూసీ.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)