పహల్గాం దాడి: ఏడాది గడిచినా ఆ బాధ వీడటం లేదు.. బాధితులు ఏం చెబుతున్నారు?

కశ్మీర్‌లో కిందటేడాది జరిగిన మిలిటెంట్ల దాడిలో ఐశ్వర్య ద్వివేది భర్త శుభం చనిపోయారు

ఫొటో సోర్స్, Tariq Khan/BBC Hindi

ఫొటో క్యాప్షన్, కశ్మీర్‌లో కిందటేడాది జరిగిన మిలిటెంట్ల దాడిలో ఐశాన్య ద్వివేది భర్త శుభం చనిపోయారు
    • రచయిత, జోయా మతీన్, కమల్ సైనీ, నీతూ సింగ్
    • హోదా, బీబీసీ పంజాబీ, బీబీసీ హిందీ
  • చదివే సమయం: 6 నిమిషాలు

పహల్గాంలో పర్యటకులపై దాడి జరిగి ఏడాదైంది. తాము కోల్పోయిన దాని నుంచి బయటపడటం గురించి బాధిత కుటుంబాలు ఇప్పటికీ నేర్చుకుంటున్నాయి.

ఐశాన్య ద్వివేది ఒకప్పుడు తన భర్తతో కలిసి నివసించిన గదిలో గోడుకున్న అద్దం వైపు చూస్తున్నారు.

"అక్కడ అద్దం ఎందుకు లేదని నేను ఆయన్ని అడిగాను. తర్వాత రోజే ఆయన దాన్ని తీసుకొచ్చి అక్కడ బిగించారు" అని ఆమె చెప్పారు.

పహల్గాంలో 2025 ఏప్రిల్ 22న మిలిటెంట్లు పర్యటకుల మీద విచక్షణా రహితంగా కాల్పులు జరిపినప్పుడు మరణించిన 26 మందిలో ఐశాన్య భర్త శుభం ద్వివేది కూడా ఉన్నారు.

పహల్గాంలో పర్యటకుల హత్యలకు పాకిస్తాన్ కారణమని దిల్లీ ఆరోపించింది. పాకిస్తాన్‌ కేంద్రంగా నడుస్తున్న ఓ గ్రూపు ఈ దాడులు చేసినట్లు ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను పాకిస్తాన్ తిరస్కరించింది.

రెండు వారాల తర్వాత, పాకిస్తాన్‌లో మిలిటెంట్ గ్రూపులు ఉన్న ప్రాంతాలుగా ఆరోపిస్తూ, ఆ ప్రాంతాలపై భారత్ వైమానిక దాడులు చేసింది.

దీంతో రెండు అణ్వాయుధ దేశాల మధ్య నాలుగు రోజుల పాటు బాంబు దాడులు, వైమానిక దాడులు జరిగాయి. అనూహ్యంగా కాల్పుల విరమణ ప్రకటించే వరకు ఇవి కొనసాగాయి.

పహల్గాం దాడి జరిగిన తీరుపై భారత్‌లో ఆగ్రహం వ్యక్తమైంది. దాడిలో ఎక్కువ మంది హిందువులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు.

బాధితుల్లో అనేక మంది యువకులు. అప్పుడే పెళ్లైన వారు, తమ కెరీర్‌ను ప్రారంభించినవారు. వారి జీవితాలు అర్థంతరంగా ముగిశాయి.

గడచిన ఏడాదిలో ఈ దాడికి సంబంధించిన విషాదం అధికారుల ప్రకటనలు, భద్రత సమీక్షలు, కట్టుదిట్టమైన ఆంక్షలకు పరిమితమైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పహల్గాంలోని  అందమైన పచ్చికమైదానంలో కాల్పులు జరిగాయి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పహల్గాంలోని అందమైన పచ్చికమైదానంలో కాల్పులు జరిగాయి

కాలం మాన్చలేని గాయమది

ఆ ఘోరం జరిగి ఏడాది గడిచింది. ఆ విషాద తీవ్రతను ఇప్పుడు అధికారిక ప్రకటనల్లోనో, భద్రతా సమీక్షల్లోనో, కఠినతరమైన నిబంధనల్లోనో కొలుస్తున్నారు.

కానీ, ఈ దాడి పర్యవసనాలు బాధితుల వ్యక్తిగత జీవితాల్లో తీవ్ర కల్లోలాన్ని రేపాయి. వారి ఇళ్లలో ఆ విషాదపు చాయలు కాలం గడిచే కొద్దీ రూపం మార్చుకుంటున్నాయే తప్ప తొలగిపోవడం లేదు. కాలం గడుస్తున్నా మానని గాయమది.

ఐశాన్యకు సంబంధించి కాలం ఆ బెడ్‌రూమ్‌లో స్తంభించిపోయింది.

అక్కడ ఆమె భద్రపరుచుకున్న వస్తువులేవీ మొదటిసారి చూసినప్పుడు అంత గొప్పగా అనిపించవు. కానీ, ఏ ఒక్క వస్తువునూ ఆమె కదల్చలేదు. మంచం, అల్మారా, శుభం కొన్న అద్దం.. అన్నీ అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడూ అలాగే ఉన్నాయి.

మంచం వైపు చూపిస్తూ, "మంచం మీద ఆ వైపు శుభంది. నేనక్కడ కూర్చోను. ఆ పక్కన నిద్రపోనుకూడా. నిద్రలో కూడా అటువైపు వెళ్లకుండా దిండ్లు అడ్డు పెట్టుకుంటాను" అని ఆమె చెప్పారు.

ఆ రోజు ఎంత సాధారణంగా మొదలైందో ఆమెకు ఇప్పటికీ గుర్తుంది.

పెళ్లైన రెండు నెలల తర్వాత ఆ జంట మరో 9 మంది కుటుంబ సభ్యులతో కలిసి కశ్మీర్‌ వెళ్లింది.

దాడి జరిగిన రోజు శుభం, ఐశాన్య బైసరన్ లోయకు వెళ్లారు. మిగతా కుటుంబ సభ్యులు పహల్గాంలోనే ఉన్నారు. బైసరన్ లోయ హహల్గాం కంటే ఎత్తులో పచ్చిక బయళ్లతో ఉండే అద్భుతమైన ప్రాంతం.

శుభం, ఐశాన్య దంపతులు పచ్చిక మైదానంలో నడుస్తుండగా ఒక వ్యక్తి వారి వద్దకు వచ్చి, శుభంమతాన్ని అడిగి వెంటనే కాల్పులు జరిపాడని ఐశాన్య తర్వాత ఇంటర్వ్యూలలో చెప్పారు. తనను కూడా చంపేయమని ఆమె దుండగులను వేడుకున్నా, వారు వదిలేసి వెళ్ళిపోయారు.

ఐశాన్య ద్వివేది ఫోన్ లాక్ స్క్రీన్‌గా  ఆమె పెళ్లి ఫోటో ఉంది

ఫొటో సోర్స్, Tariq Khan/BBC Hindi

ఫొటో క్యాప్షన్, ఐశాన్య ద్వివేది ఫోన్ లాక్ స్క్రీన్‌గా ఆమె పెళ్లి ఫోటో ఉంది

మాటే.. ఊరట

ఆమె ఫోన్ లాక్ స్క్రీన్ మీద ఇప్పటికీ వారి పెళ్లి నాటి ఒక అందమైన ఫోటో ఉంది. గ్యాలరీలో పదే పదే వెనక్కి వెళ్లి మరీ శుభం ఫోటోలు చూస్తుంటారు. అప్పుడప్పుడు పాత వీడియోలు ప్లే చేస్తూ, ఆయన గొంతు ఎలా ఉండేదో, ఆయన ఎలా నవ్వేవాడో గుర్తు చేసుకుంటూ, ఆ చిన్న చిన్న వివరాలను పదేపదే అనుభూతి చెందాలని ప్రయత్నిస్తుంటారు.

దాడి జరిగిన కొత్తలో ఐశాన్య శుభం గురించి తరచుగా మాట్లాడటం మొదలుపెట్టారు. మొదట్లో అందరూ అడుగుతున్నారని చెప్పేవారు. కానీ తర్వాత అదే తనకు ఓ ఊరటగా మారుతోందని గ్రహించారు. "మీడియాతో మాట్లాడటం నాకో చికిత్సలా పనిచేసింది. ఇప్పుడు నాకు దానిపై ఎలాంటి సంకోచం లేదు" అని ఆమె అంటున్నారు.

అయితే, తన దుఃఖాన్ని ఇలా బహిరంగంగా వ్యక్తపరచడం వల్ల కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యాయి. భారత్ వైమానిక దాడుల తర్వాత, పార్లమెంటులో ప్రధాని మోదీ తన ప్రసంగంలో బాధితుల పేర్లను ప్రస్తావించి ఉండాల్సిందని ఐశాన్య చెప్పినప్పుడు సోషల్ మీడియాలో ఆమెపై తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. కానీ ఆ విమర్శలేవీ ఆమెను ఆపలేకపోయాయి.

"నేను మాట్లాడతాను, బయట ప్రపంచంలోకి వెళతాను, నాకు నచ్చినవన్నీ చేస్తాను. నా భర్తను కోల్పోయిన నేను ఎలా ఉండాలో శాసించడానికి ఆ ట్రోలర్స్ ఎవరు?" అని ఆమె గట్టిగా ప్రశ్నించారు.

హనీమూన్ కోసం వచ్చిన వినయ్ నర్వాల్ మిలిటెంట్ల కాల్పుల్లో  చనిపోయారు

ఫొటో సోర్స్, BBC Punjabi

ఫొటో క్యాప్షన్, హనీమూన్ కోసం వచ్చిన వినయ్ నర్వాల్ మిలిటెంట్ల కాల్పుల్లో చనిపోయారు

మాట పెగలని మౌనం... మనసును మెలిపెట్టే గాయం

ఐశాన్యకు తన బాధను పంచుకోవడం ఒక ఊరటనిస్తే, మరికొందరికి మాత్రం మౌనమే తోడుగా నిలుస్తోంది. రాజేష్ నర్వాల్ కుమారుడు వినయ్ నర్వాల్ కూడా ఆ దాడిలో మరణించిన వారిలో ఒకరు.

పెళ్లయి వారం కూడా తిరక్కుండానే, హనీమూన్ కోసం కాశ్మీర్ వెళ్లిన 26 ఏళ్ల ఈ నేవీ అధికారి మిలిటెంట్ల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. దాడి జరిగిన తర్వాత, ఆయన మృతదేహం పక్కన నిశ్చేష్టురాలై కూర్చున్న ఆయన భార్య ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

వారి ఇంట్లో వినయ్ వస్తువులన్నీ ఇప్పటికీ ప్యాక్ చేసినట్లే ఉన్నాయి, ఎవరూ వాటిని విప్పలేదు. ఆ ఇంట్లో చాలామంది ఆయన పేరు ఎత్తడానికి గానీ, ఆ రోజు ఏం జరిగిందో మాట్లాడటానికి గానీ ఇష్టపడరు. "మాలో ఎవరికీ ఆ ధైర్యం లేదు. కనీసం ఆయన ఫోటోను ఇంట్లో తగిలించుకోవడానికి కూడా మాకు మనస్కరించడం లేదు" అని రాజేష్ అన్నారు.

కానీ ఆయన జ్ఞాపకాలు మాత్రం వారిని నీడలా వెన్నాడుతూనే ఉన్నాయి.

వినయ్ చిన్నప్పుడు తండ్రీకొడుకులు క్రికెట్ ఆడుకునేవారు. రాజేష్ ఆఫీసు నుంచి రాగానే వినయ్ ఆట కోసం ఎదురుచూస్తూ ఉండేవాడు. సెలవు రోజుల్లో అయితే రోజంతా అదే ఆట ఆడేవారు.

"మేము ఈ దుఃఖం నుండి తేరుకోలేకపోతున్నాం. ఇంకా ఆ బాధలోనే ఉన్నాం. పనిలో ఉన్నప్పుడు ధ్యాస మళ్లుతుంది కానీ, ఇంటికి రాగానే పాత గాయం మళ్ళీ రేగినట్లు అవుతుంది. ఆ నొప్పి భరించలేం" అని రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

తన కుమారుడు బాల్యంలో ఉన్నప్పుడు తనతో క్రికెట్ ఆడిన క్షణాలను రాజేష్ నర్వాల్ గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Kamal Saini/BBC Punjabi

ఫొటో క్యాప్షన్, తన కుమారుడు బాల్యంలో ఉన్నప్పుడు తనతో క్రికెట్ ఆడిన క్షణాలను రాజేష్ నర్వాల్ గుర్తు చేసుకున్నారు.

దారులు వేరు.. కానీ బాధ ఒక్కటే

ఈ రెండు కుటుంబాలూ తమ ప్రియమైన వ్యక్తులు లేని లోటును భర్తీ చేసుకునేందుకు రెండు వేర్వేరు మార్గాలను ఎంచుకున్నాయి. ఒకరు నిరంతరం మాట్లాడుతూ జ్ఞాపకాలను సజీవంగా ఉంచుకుంటే, మరొకరు మౌనంతో ఆ స్మృతులను కాపాడుకుంటున్నారు. కానీ ఇద్దరూ కూడా ఆ శూన్యం చుట్టే తమ జీవితాలను మళ్ళీ నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

కాన్పూర్‌లో ఉన్న ఐశాన్య ఇప్పటికీ తన జీవితాన్ని చక్కదిద్దుకునే పనిలోనే ఉన్నారు . ప్రతి సాయంత్రం తన అత్తమామలతో గంటసేపు కూర్చుని శుభం గురించే మాట్లాడతారు. ప్రతిరోజూ అదే మనిషి, అవే విషయాలు.. కానీ ప్రతిసారీ ఏదో ఒక కొత్త కోణం.

"కొడుకును లేదా భర్తను కోల్పోయిన బాధ ఎప్పటికీ పోదు. అలాగని మనం జీవించడం ఆపేయలేం కదా" అని ఆమె అంటారు. ఆమె సంగీతం వింటారు. రాస్తారు. "రాస్తున్నప్పుడు ఏడుపు వస్తుంది. కానీ ఏడవడం, గట్టిగా అరవడం కూడా అవసరమే" అంటారు ఆమె.

మంచి నృత్యకారిణి అయిన ఐశాన్య, ఆ ఘటన తర్వాత మళ్ళీ నృత్యం చేయలేకపోయారు. "నా పాదాలు కదలడం లేదు"అంటారు ఆమె. అయితే ఏదో ఒక రోజు మళ్ళీ నాట్యం చేయగలనని ఆశిస్తోంది.

కొన్ని అనుభూతులను మాటల్లో వివరించలేమంటారు ఐశాన్య . ఒకసారి విమానంలో వెళ్తున్నప్పుడు శుభంకు ఇష్టమైన పాట వింటూ కిటికీలోంచి బయటకు చూస్తే ఇంద్రధనుస్సు కనిపించింది. మరో సాయంత్రం బాల్కనీలోకి వెళ్ళినప్పుడు చంద్రుడు కనిపిస్తే, శుభం తననే చూస్తున్నాడని ఒక్క క్షణం అనిపించింది.

ఇలాంటి చిన్న చిన్న క్షణాలే శుభం ఇంకా తనతోనే ఉన్నాడనే భరోసాని ఇస్తున్నాయని ఆమె చెబుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)