కండోమ్ ధరలు 30 శాతం పెంపు... కారణమేంటో వివరించిన తయారీ కంపెనీ

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, ఒస్మండ్ చియా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 3 నిమిషాలు
తమ ఉత్పత్తుల ధరలను 30శాతం పెంచుతున్నట్లు ప్రపంచంలోనే కండోమ్‌ల ఉత్పత్తుల్లో అతిపెద్ద కంపెనీ అయిన కరెక్స్ అధిపతి ప్రకటించారు.
ఇరాన్ యుద్ధం కారణంగా కండోమ్ ఉత్పత్తిలో వినియోగించే ముడి పదార్థాల సరఫరాకు అంతరాయం కొనసాగితే ఈ ధరలు మరింత పెరిగే అవకాశముందని చెప్పారు.
ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత ఉత్పాదక ఖర్చులు పెరిగాయని కరెక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గోహ్ మియా కియట్ చెప్పారు.
మలేసియాకు చెందిన ఈ కండోమ్‌ల సంస్థ ఏటా 5 వందల కోట్ల కండోమ్‌లు తయారు చేస్తుంది.

వాటిని ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కండోమ్ బ్రాండ్‌లైన డ్యూరెక్స్, ట్రోజెన్‌తో పాటు బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలకు సరఫరా చేస్తుంది.
రాయిటర్స్, బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో గోహ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం గురించి తెలుసుకునేందుకు బీబీసీ కరెక్స్ సంస్థను సంప్రదించింది.
అమెరికా, ఇజ్రాయెల్ గగనతలదాడులపై ఇరాన్ స్పందించిన తరువాత అంతర్జాతీయ చమురు సరఫరాకు తీవ్ర ఆటంకం ఎదురైంది. హార్ముజ్ జలసంధిలో నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ ప్రకటించింది. దీంతో ఈ మార్గంలో రవాణా స్తంభించిపోవడంతో అంతర్జాతీయ సరఫరా గొలుసు తీవ్రంగా ప్రభావితమైంది.
ప్రపంచ ముడి చమురు, ద్రవరూప సహజవాయువు సరఫరాలో ఐదోవంతు హార్ముజ్ జలసంధి గుండా రవాణా అవుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
'కండోమ్‌లకు డిమాండ్ పెరిగింది'
చమురు నుంచి వెలికి తీసే ముడి పదార్ధాలు, రబ్బరును కాపాడే అమ్మోనియా, సిలికాన్ వంటి పదార్థాలపై కరెక్స్ ఆధారపడింది.
నౌక రవాణా చార్జీలు పెరగడం, షిప్పింగ్‌లో ఆలస్యం, తగినంత సరకు లేకపోవడంతో ఈ ఏడాది కండోమ్‌ల కోసం డిమాండ్ 30శాతం పెరిగిందని గోహ్ చెప్పారు.
"కష్టకాలంలో కండోమ్ వాడాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వచ్చే ఏడాది మీ ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు. మీ భవిష్యత్ మీద అనిశ్చితి ఏర్పడుతుంది. ఒక వేళ మీరు ఇప్పుడు బిడ్డను కంటే మరొకరి కోసం ఆహారం సంపాదించాల్సి ఉంటుంది" అని గోహ్ బ్లూమ్‌బర్గ్‌తో చెప్పారు.
కండోమ్‌ల ధరలు పెరగడం అమెరికా- ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచ మార్కెట్లు ఎలా ప్రభావితం అయ్యాయి? వినియోగ వస్తువుల ధరలు ఎంతలా పెరిగాయో చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తోంది.
యుద్ధం కారణంగా విమానాల ఛార్జీలు పెరిగాయి. ఎకానమీ టిక్కెట్ల రేట్లు ఏడాది క్రితం ఉన్న ధరలతో పోలిస్తే సగటున 24శాతానికి పైగా పెరిగాయని తాజా పరిశోధన ఒకటి వెల్లడించింది.
హార్ముజ్ జలసంధిని మూసివేయడం వల్ల రసాయన ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. కంప్యూటర్ చిప్స్ తయారీలో ఉపయోగించే హీలియం లభ్యత తగ్గిపోయింది.
ముడి పదార్ధాలు అందకపోవడంతో వాటర్ బాటిళ్ల ఉత్పత్తిదారులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.
రవాణా చార్జీలు పెరిగి చక్కెర, పాల ఉత్పత్తులు, పండ్ల ధరలు పెరగవచ్చని ఈ నెల ప్రారంభంలో ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.
కాల్పుల విరమణను నిరవధికంగా పొడిగిస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన తర్వాత కూడా బుధవారం జరగాల్సిన అమెరికా- ఇరాన్ మధ్య రెండో దశ చర్చలు జరగలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























