ఇజ్రాయెల్ vs హూతీలు: మిడిల్‌ఈస్ట్‌లో యుద్ధం మలుపు తిరుగుతుందా?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, సెబాస్టియన్ ఉషర్
- హోదా, మిడిల్ ఈస్ట్ అనలిస్ట్
- చదివే సమయం: 4 నిమిషాలు
ఇరాన్ మద్దతు ఉన్నప్పటికీ, యుద్ధం ప్రారంభమైన మొదటి నాలుగు వారాల పాటు హూతీలు దాడులకు దిగలేదు.
యెమెన్ రాజధాని సనాతో పాటు ఉత్తర ప్రాంతాలను తమ గుప్పిట్లో ఉంచుకున్న హూతీలు, ఇప్పుడు ఇజ్రాయెల్‌పై క్షిపణులు ప్రయోగించి తమ మొదటి దాడిని మొదలుపెట్టారు.
ఇజ్రాయెల్ సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు హూతీలు చెబుతున్నారు. ఇరాన్ దాడులతో పోలిస్తే, హూతీల క్షిపణి దాడుల వల్ల ఇజ్రాయెల్‌కు కలిగే ముప్పు చాలా తక్కువ.
ఇజ్రాయెల్‌పై 2023 అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడుల తర్వాత, గాజాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి హమాస్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై హూతీలు చాలాసార్లు దాడులు చేశారు. అయితే, ఆ దాడుల వల్ల ఇజ్రాయెల్‌కు పెద్దగా నష్టమేమీ జరగలేదు.

కానీ, యెమెన్ తీర ప్రాంతంలో హూతీల వల్ల పెద్ద ముప్పు పొంచి ఉంది. హమాస్‌కు మద్దతు ఇచ్చే చర్యల్లో భాగంగా యెమెన్, హార్న్ ఆఫ్ ఆఫ్రికా మధ్య ఉన్న బాబ్ అల్ మందాబ్ జలసంధి ద్వారా వెళ్లే నౌకలను హూతీలు లక్ష్యంగా చేసుకున్నారు.
దీని వల్ల ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన ఈ సముద్ర మార్గం ప్రమాదంలో పడింది.
వారు మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరో పెద్ద దెబ్బ అవుతుంది.
ఇరాన్ ఇప్పటికే హార్ముజ్ జలమార్గాన్ని దాదాపుగా మూసివేసింది. ఇప్పుడు హూతీలు కూడా తోడైతే ప్రపంచ వాణిజ్యానికి, చమురు సరఫరాకు కీలకమైన ఈ రెండు ప్రధాన దారులు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది.
అంతేకాకుండా, గతంలో చేసినట్లుగా హూతీలు తమ పొరుగున ఉన్న సౌదీ అరేబియా, యూఏఈ దేశాల్లోని సైనిక కేంద్రాలు, చమురు కేంద్రాలపై కూడా దాడులు చేసే అవకాశం ఉంది.
గతంలో హూతీలు ఇటువంటి చర్యలకు పాల్పడినప్పుడు వారి నాయకత్వాన్ని, సైనిక సామర్థ్యాన్ని దెబ్బ తీయడానికి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి భారీగా వైమానిక దాడులు చేశాయి.

ఫొటో సోర్స్, Getty Images
అయినప్పటికీ హూతీలు వాటిని తట్టుకుని నిలబడగలిగారు. అయితే, ఇప్పుడు వారు తమ పోరాటాన్ని ఎంత దూరం తీసుకెళ్తారనేది అసలు ప్రశ్న.
హమాస్, పాలస్తీనియన్లకు మద్దతుగా దాడులు చేసినప్పుడు హూతీలకు దేశీయంగా, ఇతర ప్రాంతాల నుంచి కొంత మద్దతు లభించింది.
కానీ ఇరాన్ కోసం హూతీలు ఇలాంటి దాడులు చేస్తే పరిస్థితి వేరుగా ఉండొచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎన్నో ఏళ్ల యుద్ధం, అల్లకల్లోలాల తర్వాత యెమెన్ ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడుతోంది.
ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో హూతీలు తలదూర్చితే అది యెమెన్‌లో అంతర్గత యుద్ధాన్ని రాజేసే ప్రమాదం ఉంది.
ఒకవేళ హూతీలు తమ దాడుల్ని కొనసాగిస్తే ఈ యుద్ధం మరింత ముదిరి ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించే ప్రమాదం లేకపోలేదు.

ఫొటో సోర్స్, EPA
ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణులతో హౌతీల దాడి
ఇరాన్ మద్దతు ఉన్న హూతీలు శనివారం ఇజ్రాయెల్‌పై భారీగా క్షిపణి దాడులు చేసినట్లు ప్రకటించారు. ఇజ్రాయెల్ సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకున్నామని, తమ మిత్రదేశాలపై యుద్ధం ఆపేంతవరకు ఇలాంటి దాడులు చేస్తామని వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
యెమెన్ నుంచి వచ్చిన రెండు మిసైళ్లను కూల్చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది.
హౌతీలు తమను తాము 'రెసిస్టెన్స్ యాక్సిస్'లో అంటే ప్రతిఘటన కూటమిలో భాగమని భావిస్తారు. ఇందులో ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బొల్లా, హమాస్ వంటి గ్రూపులు కూడా ఉన్నాయి.
యెమెన్‌లోని ఎర్ర సముద్ర తీరప్రాంతం హూతీల నియంత్రణలో ఉంది.
శనివారం నాటి దాడికి ముందు హౌతీల సైనిక ప్రతినిధి ఒక హెచ్చరిక చేశారు.
అమెరికా, ఇజ్రాయెల్‌తో కలిసి ఏ దేశమైనా దాడుల్లో పాల్గొన్నా, లేదా ఇరాన్‌కు వ్యతిరేకంగా ఎర్ర సముద్రాన్ని వాడుకున్నా తాము నేరుగా యుద్ధరంగంలోకి దిగుతామని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
కొన్ని గంటల తర్వాత తాము బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించామని హౌతీలు ధ్రువీకరించారు. హిజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు ఆపేంతవరకు తమ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
అదే రోజు రాత్రి ఇజ్రాయెల్‌పై క్షిపణులు, డ్రోన్లతో రెండో విడత దాడులు చేసినట్లు హూతీలు తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























