అగ్రరాజ్యాలతో రక్షణ ఒప్పందాలు గల్ఫ్ దేశాలకు భద్రత కల్పించలేకపోయాయా? స్వీయ రక్షణకు కొత్త వ్యూహం అవసరమా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నస్రీన్ హాతుమ్
- హోదా, బీబీసీ అరబిక్ సర్వీస్
- చదివే సమయం: 5 నిమిషాలు
మధ్యప్రాచ్యంలో ఇటీవలి యుద్ధం గల్ఫ్ దేశాల రక్షణ వ్యవస్థల సమర్థతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. ప్రపంచ అగ్రరాజ్యాలతో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాల మేరకు, ఈ దేశాలలో విదేశీ సైనిక స్థావరాలకు ఆతిథ్యం ఇవ్వడంపై ఈ ప్రశ్నలు తలెత్తాయి.
స్పష్టంగా చెప్పాలంటే, ఉద్రిక్తతలను అదుపు చేయడంలో లేదా గల్ఫ్ దేశాలకు రక్షణ కల్పించడంలో ఇప్పటి వరకు ఉన్న ఒప్పందాలు తగినంతగా పనిచేయలేదని తేలింది. దీనివల్ల రక్షణ భాగస్వామ్యాల భవిష్యత్తుపై ప్రశ్నలు నెలకొన్నాయి.
అనేక గల్ఫ్ దేశాలు అమెరికా, పాశ్చాత్య భాగస్వాములతో రక్షణ ఒప్పందాలను కలిగి ఉన్నప్పటికీ, ఈ యుద్ధం ఆ కూటములపై ఆధారపడటం కంటే రక్షణ ప్రత్యామ్నాయాలపై సమగ్ర సమీక్షకు ప్రేరేపించింది.
ప్రస్తుత యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో, గల్ఫ్ దేశాలు తమ ఉమ్మడి ప్రాంతీయ భద్రతా వ్యవస్థను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఖతార్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి మాజిద్ అల్-అన్సారీ ఇటీవల ఒక విలేఖరుల సమావేశంలో సూచించారు.

యుద్ధ సమయంలో గల్ఫ్ దేశాల రక్షణ భాగస్వామ్యాలు సమర్థవంతంగా పనిచేస్తాయని నిరూపించుకున్నప్పటికీ, ప్రస్తుత ముప్పులను ఎదుర్కోవాలంటే గల్ఫ్ దేశాలు ప్రాంతీయ సమన్వయ స్థాయిలో ఒక ఉమ్మడి విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
మాజిద్ అల్-అన్సారీ ప్రకటనల ప్రకారం, మిత్రదేశాలతో చేసుకున్న సైనిక ఒప్పందాలు రక్షణ పరంగా విజయవంతమయ్యాయి. కానీ, కేవలం మిత్రదేశాలపై ఆధారపడటం సరిపోదు. భవిష్యత్తులో ఎదురయ్యే ఏవైనా ముప్పులను సంయుక్తంగా ఎదుర్కోవడానికి గల్ఫ్ దేశాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలి.
దీర్ఘకాలంలో గల్ఫ్ దేశాలకు ప్రపంచంలోని ప్రధాన శక్తులపై ఆధారపడటం సమర్థవంతమైన ఎంపికేనా? లేక కొత్త రక్షణ భాగస్వామ్యాలు ఏర్పడుతాయా? అనే ప్రాథమిక ప్రశ్నలు లేవనెత్తింది.

ఫొటో సోర్స్, Getty Images
యుద్ధంలో గల్ఫ్ దేశాల పాత్ర ఏమిటి?
గల్ఫ్ దేశాల్లోని దాని స్థావరాల నుంచి అమెరికా (ఇజ్రాయెల్ సహకారంతో) ఇరాన్‌పై యుద్ధం ప్రకటించిందని, దాని ఫలితంగానే ఇరాన్ ఆ దేశాలపై ప్రతీకారం తీర్చుకుందని రక్షణ వ్యవహారాల నిపుణులైన అమెరికన్ జర్నలిస్ట్ సెబాస్టియన్ రూబ్లిన్ అభిప్రాయపడ్డారు.
ఈ సంక్షోభంలో గల్ఫ్ దేశాలకు బాధ్యత లేదని అనలేమని బీబీసీ న్యూస్ అరబిక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రూబ్లిన్ చెప్పారు.
నిరంతర ముప్పుగా పరిగణిస్తున్న ఇరాన్‌ను బలహీనపరిచేందుకు ఒక అవకాశంగా భావిస్తూ, కొన్ని దేశాలు ఇరాన్‌పై దాడి చేయమని అమెరికాను 'నిశ్శబ్దంగా' ప్రోత్సహించాయన్న రిపోర్టులను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
"వాస్తవానికి ఖతార్, బహ్రెయిన్ వంటి ఇతర చిన్న గల్ఫ్ దేశాలు కూడా ఈ యుద్ధాన్ని కోరుకోలేదు" అన్నారు రూబ్లిన్.
ఇరాన్‌పై అమెరికా దాడి గల్ఫ్ దేశాల భద్రతపై అనేక ప్రతికూల ప్రభావాలను చూపుతుందని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న గల్ఫ్ ఇంటర్నేషనల్ ఫోరమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డానియా జాఫర్ అభిప్రాయపడ్డారు.
"అమెరికా దాడికి ముందు, గల్ఫ్ దేశాలపై దాడి చేయడానికి ఇరాన్ సంకోచించింది. అంటే, అమెరికా ఉనికి ఒక నిరోధకంగా పనిచేసింది. ఈ కాలంలో ఇరాన్ ఏ గల్ఫ్ దేశంపైనా దాడి చేయడానికి ప్రయత్నించలేదు" అని బీబీసీ న్యూస్ అరబిక్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో డానియా జాఫర్ చెప్పారు.
"సమస్య సైనిక ఒప్పందాలలో లేదు, దేశాల మధ్య సంబంధాలను బాధ్యతాయుతంగా నిర్వహించగల నిర్ణేతల సామర్థ్యంలో ఉంది" అని కువైట్ విశ్వవిద్యాలయం పొలిటికల్ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ హమద్ అల్-థునిన్ అభిప్రాయపడ్డారు.
"అమెరికా గల్ఫ్ దేశాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోకుండా, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు లక్ష్యాలకు ప్రాధాన్యతనిస్తూ అమెరికా ఈ యుద్ధంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకోవడమే అసలు సమస్య" అని అన్నారు.
బీబీసీ న్యూస్ అరబిక్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అల్-థునిన్ మాట్లాడుతూ, ఇరాన్‌తో గల్ఫ్ దేశాల సంబంధాలు అనేక ఉద్రిక్తతలను ఎదుర్కొన్నాయని అయితే భద్రత, స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ఈ దేశాలు దౌత్యానికే ప్రాధాన్యత ఇచ్చాయని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్‌పై ఎందుకు ప్రతీకారం తీర్చుకోలేదు?
ఇరాన్ దాడులకు గల్ఫ్ దేశాలు సైనికపరంగా ఎందుకు ప్రతిస్పందించలేదని కూడా చాలామంది ప్రశ్నించారు.
ఇరాన్ దాడుల నుంచి గల్ఫ్ దేశాలు సమర్థవంతంగా తమను తాము రక్షించుకున్నాయని దానియా జాఫర్ అన్నారు. ఖతార్ 100 శాతం వరకు క్షిపణులను అడ్డుకుందని ఆయన చెప్పారు.
గల్ఫ్ దేశాలు ఇరాన్‌తో నేరుగా యుద్ధానికి వెళ్లగలవు, కానీ ఎలాంటి దాడి జరిగినా ఇరాన్ మరింత తీవ్రమైన ప్రతిస్పందన ఇస్తుందని భావించారు.
గల్ఫ్ దేశాల వాయు రక్షణ వ్యవస్థలు ఇరాన్ క్షిపణుల్లో సుమారు 94 శాతాన్ని అడ్డుకున్నాయని, ఇది రక్షణ పెట్టుబడుల సమర్థతకు నిదర్శనమని అల్-థునిన్ పేర్కొన్నారు. గల్ఫ్ దేశాలు సైనిక చర్యకు దిగకపోవడానికి మూడు కారణాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
''ఇది మా యుద్ధం కాదు.. మేం దీనిని ప్రారంభించలేదు. ఇది మా ప్రయోజనాలకు విరుద్ధం'' అని గల్ఫ్ దేశాలు భావిస్తుండొచ్చని విశ్లేషించారు.
ఇది సామర్థ్య లోపాన్ని సూచించదు. వ్యూహాత్మక సహనాన్ని ప్రతిబింబిస్తుందని అల్ థునిన్ అభిప్రాయపడ్డారు.
గుర్తించడం, అడ్డగించడం కష్టంగా ఉండే ఇరాన్ డ్రోన్‌ల వల్ల గల్ఫ్ దేశాలకు పొంచి ఉన్న ముప్పును ఈ యుద్ధం వెలుగులోకి తెచ్చిందని సెబాస్టియన్ రూబ్లిన్ అన్నారు.
వీటి తయారీ ఖర్చు చాలా తక్కువ (20 నుంచి 40 వేల అమెరికన్ డాలర్లు) కావడంతో, పేట్రియాట్ లేదా థాడ్ వంటి అత్యంత ఖరీదైన క్షిపణులను వీటిపై ప్రయోగించడం ఆర్థికంగా లాభదాయకం కాదని ఆయన పేర్కొన్నారు.
యుద్ధం దీర్ఘకాలం పాటు కొనసాగితే ఆయుధ నిల్వలపై అవసరం ఉన్నప్పటికీ ఒకే దాడిని ఎదుర్కోడానికి కొన్నిసార్లు పెద్ద సంఖ్యలో పేట్రియాట్ క్షిపణులను ప్రయోగిస్తున్నారని గల్ఫ్ డిఫెన్స్ మానిటరింగ్‌కు చెందిన యుక్రెనియన్ పరిశీలకుల రిపోర్టులు సూచిస్తున్నాయని రూబ్లిన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గల్ఫ్ రక్షణ భవిష్యత్తు, ఆయుధ పోటీ
డ్రోన్‌లను ఎదుర్కోవడానికి గల్ఫ్ దేశాలకు యుద్ధ విమానాలు లేదా భూ-ఆధారిత వ్యవస్థల ద్వారా ఉపయోగించగల లేజర్ - గైడెడ్ ఏపీకేడబ్ల్యూఎస్ క్షిపణుల వంటి తక్కువ ఖర్చుతో కూడిన విమాన నిరోధక ఆయుధాలు(యాంటి ఎయిర్‌క్రాఫ్ట్ వెపన్స్) అవసరమని రూబ్లిన్ అభిప్రాయపడ్డారు.
అంతేకాదు, గల్ఫ్ దేశాలకు "ఇంటర్‌సెప్టర్ క్షిపణుల నిల్వలను పెంచుకోవడం, అదనపు రక్షణ వ్యవస్థల్లో పెట్టుబడి పెట్టడం, మరిన్ని సెన్సార్లను మోహరించడం అవసరమవుతుంది. విమాన, ఉపగ్రహ ఆధారిత సెన్సార్లు కూడా అవసరమవుతాయి. ఈ విషయంలో అమెరికా, యూరప్, దక్షిణ కొరియా సహాయపడగలవు" అని రూబ్లిన్ తెలిపారు.
"రష్యా, చైనా వంటి ప్రత్యామ్నాయ శక్తులకు కూడా ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో గల్ఫ్ దేశాలు ఐరోపా, చైనా, రష్యాల వైపు మొగ్గు చూపుతూ తమ ఆయుధ వనరులను వైవిధ్యపరచుకోవడానికి ప్రయత్నించాయి" అని అన్నారు.
"గల్ఫ్ దేశాలు అమెరికాతో సహకారాన్ని కొనసాగిస్తాయి. ఇటీవలి పరిణామాల తర్వాత, ఈ ప్రాంతంలో మనం ఒక పెద్ద ఆయుధ పోటీ అంచున ఉన్నామని అనుకుంటున్నా, గల్ఫ్ భద్రతకు అమెరికా వెన్నెముకగా నిలుస్తుందని నమ్ముతున్నా" అని జాఫర్ చెప్పారు.
గల్ఫ్, అమెరికా మధ్య ఆర్థిక, సైనిక వ్యూహాత్మక సంబంధాలనేవి ఉమ్మడి, పరస్పర ప్రయోజనాలపై ఆధారపడినంత కాలం కొనసాగుతాయని అల్-థునిన్ కూడా విశ్వసిస్తున్నారు.
మధ్యప్రాచ్య దేశాల్లో ఉన్న తమ సైనిక స్థావరాల విషయమై అమెరికా సంప్రదించిందని యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలియన్ స్కీ ఇటీవల 'లే మోండే' పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రకటించారు.
సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, జోర్డాన్, కువైట్ కూడా తనను సంప్రదించాయని అన్నారు. యుక్రేనియన్ నిపుణులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేస్తూ, అనుభవాలను పంచుకుంటున్నారని జెలియన్ స్కీ తెలిపారు.
"మధ్యప్రాచ్యంలో ఎన్ని పేట్రియాట్, థాడ్ లేదా ఇతర వాయు రక్షణ వ్యవస్థలను మోహరించినప్పటికీ, పూర్తిస్థాయి సమర్థవంతమైన వాయు రక్షణను సాధించడానికి అవి సరిపోవు. భారీ స్థాయి డ్రోన్ దాడులను ఎదుర్కోవడానికి ఆధునిక ఇంటర్‌సెప్టర్‌లను కూడా రూపొందించారు" అన్నారు జెలియన్ స్కీ.
తమ దేశం వద్ద మిగిలిపోయిన సిస్టంలను భాగస్వాములకు విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు జెలియన్ స్కీ స్పష్టం చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































