ఇరాన్‌‌పై సైనిక చర్యకు రెండు మూడు వారాల్లో ముగింపు పలుకుతామన్న ట్రంప్, ఇరాన్ ఏమంటోంది?

 అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్

ఫొటో సోర్స్, EPA

చదివే సమయం: 4 నిమిషాలు

ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఓ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై సైనిక చర్యను రెండు మూడు వారాల్లో ముగిస్తామని చెప్పారు.

ఇజ్రాయెల్‌తో కలిసి గత నెల చివరన ప్రారంభించిన గగనతల దాడులకు ముందే నిర్ణయించిన లక్ష్యాలను అమెరికా ఇప్పటికే సాధించిందని ట్రంప్ అన్నారు. ముఖ్యంగా, ఇరాన్ అణ్వస్త్రాలను పొందే సామర్థ్యాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యమని, అది పూర్తయిందని చెప్పారు.

ఇరాన్ గగనతలంపై అమెరికా పూర్తిగా ఆధిపత్యం సాధించిందని, అలాగే పలువురు ఉన్నత స్థాయి రాజకీయ, సైనిక నాయకుల హత్యల తర్వాత అక్కడ పాలనా మార్పు కూడా జరిగిందని ట్రంప్ పేర్కొన్నారు.

తెహ్రాన్‌లో కొత్తగా వచ్చిన నాయకులు గత నాయకులతో పోలిస్తే తక్కువ తీవ్రవాద భావాలు కలిగిఉన్నారని, మరింత సమతుల్యంగా ఆలోచిస్తున్నారని వ్యాఖ్యానించారు.

‘‘ఇరాన్ అణ్వాస్త్రాలు తయారుచేసే స్థితిలో లేదనే నిర్థరణకు వచ్చిన వెంటనే ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా మేం అక్కడినుంచి వైదొలుగుతాం’’ అని ట్రంప్ తెలిపారు. యుద్ధం ముగించాలని ఇరాన్ నాయకులు ప్రాధేయపడుతున్నారని ట్రంప్ చెప్పారు. కానీ ఇరాన్ ఈ వ్యాఖ్యలను అంతకుముందే ఖండించింది.

యుద్ధం కారణంగా పెరుగుతున్న ఇంధన ధరలపై స్పందిస్తూ, అమెరికా సైనిక చర్యలు ముగిసిన వెంటనే ధరలు తగ్గుతాయని చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
 అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్ ఏమంటోంది?

ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ దీనిపై స్పందించారు. మంగళవారం నాడు ఆయన మాట్లాడుతూ కొన్ని షరతులకు అంగీకరిస్తే, అమెరికా ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు తమ దేశానికి "తగిన సంకల్పం" ఉందని తెలిపారు.

యురోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్, పెజిష్కియాన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈ వ్యాఖ్యలతో అమెరికా మార్కెట్లలో సానుకూల ప్రభావం కనిపించింది.

 అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అమెరికా టెక్ కంపెనీలను ఇరాన్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందన్న హెచ్చరికలు వినిపించాయి.

ఐఆర్‌జీసీ కొత్త హెచ్చరికలు

పశ్చిమ దేశాల్లో మితవాదిగా పేరున్న పెజిష్కియాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై కొంత ఆశాభావం వ్యక్తమైనప్పటికీ, ఇరాన్ రాజకీయ వ్యవస్థలో అధ్యక్ష పదవి పరిమిత అధికారాలతో కూడినదే. దేశాన్ని ప్రధానంగా అతివాద మతపెద్దలు ప్రభావితం చేస్తుంటారు.

యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్నామనే వ్యాఖ్యకు కూడా కొన్ని కీలక షరతులు ఉన్నాయి . ముఖ్యంగా, భవిష్యత్తులో మళ్లీ ఘర్షణలు చోటుచేసుకోకుండా హామీలు ఇవ్వాలని ఇరాన్ కోరుతోంది.

ఈ డిమాండ్ కొత్తది కాదని విశ్లేషకులు చెబుతున్నారు. గత వారం అమెరికా ప్రతిపాదించిన 15 అంశాల శాంతి ప్రణాళికకు ఇరాన్ ఇచ్చిన ప్రతిస్పందనలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు.

అయితే, శక్తిమంతమైన ఐఆర్‌జీసీ మాత్రం శాంతి సంకేతాలు ఇవ్వడం లేదు. ప్రతీకార చర్యలను విస్తరించి అమెరికా టెక్ కంపెనీలను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని కొత్త హెచ్చరికలు జారీ చేసింది.

 అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇరాన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ గతవారం అమెరికాలో భారీ ఆందోళనలు జరిగాయి.

అమెరికాకు రోజూ యుద్ధం ఖర్చు ఎంతంటే...

ఇరాన్‌తో యుద్ధం కారణంగా అమెరికాకు రోజుకు సుమారు 2 బిలియన్ డాలర్ల (దాదాపు ₹16,000 కోట్లు) వరకు ఖర్చవుతోందని, ప్రపంచ ఘర్షణల ఆర్థిక ప్రభావాన్ని అధ్యయనం చేసే నిపుణులు అంచనా వేస్తున్నారు.

బ్రౌన్ యూనివర్సిటీలోని "కాస్ట్ ఆఫ్ వార్" ప్రాజెక్ట్ డైరెక్టర్ స్టీఫనై సావెల్ మాట్లాడుతూ ఆయుధ వ్యయం, సైనిక కార్యకలాపాలు, అమెరికా ఆస్తులకు జరిగిన నష్టం తదితర అంశాల వల్ల ఇప్పటికే ఈ యుద్ధం అమెరికన్లకు దశాబ్దాల బిలియన్ డాలర్ల భారాన్ని మోపిందని తెలిపారు.

"యుద్ధం కొనసాగుతున్న ప్రతి రోజూ అప్పుల భారం పెరుగుతోంది" అని ఆమె పేర్కొన్నారు.

పెంటగాన్ ఈ నెల ప్రారంభంలో కాంగ్రెస్‌కు ఇచ్చిన వివరాల మేరకు యుద్ధం మొదటి ఆరు రోజుల్లోనే 11.3 బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయని అమెరికా మీడియా వెల్లడించింది. అయితే ఈ అంచనాలు వాస్తవానికి ఇంకా ఎక్కువగా కూడా ఉండవచ్చని సావెల్ అభిప్రాయపడ్డారు.

యుద్ధం ఖర్చు రోజుకు సుమారు 2 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని రక్షణ బడ్జెట్ నిపుణురాలు లిండా బిల్మెస్ అంచనా వేశారు.

ఈ స్థాయి ఖర్చు చివరకు సాధారణ అమెరికన్ పౌరులపై ప్రభావం చూపుతుందని సావెల్ తెలిపారు.

ఇప్పటికే పెట్రోల్ ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయని, దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం, వ్యాపార అనిశ్చితి, బీమా ఖర్చులపై కూడా ప్రభావం పడే అవకాశముందని చెప్పారు.

ఈ నెల ప్రారంభంలోనే ఇరాన్ యుద్ధం కోసం శ్వేతసౌధం అదనంగా 200 బిలియన్ డాలర్ల నిధులు కోరినట్లు తెలిపింది.

ఇది భారీ మొత్తమని, యుద్ధం ఇంకా కొనసాగుతున్నదనే విషయాన్ని ఇది స్పష్టంగా చూపుతోందని సావెల్ వ్యాఖ్యానించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)