మేక్రాన్: ‘రోజూ మాట్లాడొద్దు.. రోజుకో మాటొద్దు, ఇదేమీ షో కాదు’ ట్రంప్‌ను ఉద్దేశించి ఫ్రాన్స్ అధ్యక్షుడి కామెంట్స్

సారాంశం
  • ఇరాన్‌ యుద్ధంపై స్పందించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు
  • ట్రంప్ రోజూ మాట్లాడడాన్ని తప్పుపట్టిన మేక్రాన్
  • నేటోపై ట్రంప్ వ్యాఖ్యలు సరికాదన్న మేక్రాన్
  • ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని దాడులతో పూర్తిగా అడ్డుకోలేమన్న మేక్రాన్
  • ట్రంప్ తనపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై స్పందించడానికి నిరాకరణ
  • హార్ముజ్ జలసంధిని తెరవడానికి సైనికచర్యకు దిగకూడదని సూచన
    • రచయిత, లారా గోజీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 5 నిమిషాలు
ఇరాన్, అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్ యుద్ధం విషయంలో సీరియస్ అప్రోచ్ అవసరమని, అది రోజుకొకలా మారకూడదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మేక్రాన్ అన్నారు. సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఉద్దేశించి మేక్రాన్ ఈ సూచన చేశారు.

''ఇది షో కాదు. మనం యుద్ధం గురించి, శాంతి గురించి, ప్రజల జీవితాల గురించి మాట్లాడుతున్నాం'' అని దక్షిణకొరియా పర్యటనలో మేక్రాన్ జర్నలిస్టులతో వ్యాఖ్యానించారు.

''మీ విధానం సీరియస్‌గా ఉండాలంటే మీరు నిన్న చెప్పినదానికి వ్యతిరేకమైనది ఇవాళ చెప్పకూడదు''

''మీరు ప్రతిరోజూ మాట్లాడకపోవడం మంచిది. అంతా ప్రశాంతంగా జరిగేలా చూడాలి'' అని మేక్రాన్ సూచించారు.

ఇరాన్‌లో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంపై అడిగిన ప్రశ్నలకు మేక్రాన్ సమాధానమిచ్చారు. ఈ ప్రాంతంలో కొన్ని అమెరికా ఆపరేషన్లకు ఫ్రాన్స్, ఇతర యూరప్ దేశాలు మద్దతిస్తున్నాయి కానీ యుద్ధంలో నేరుగా పాల్గొనడం లేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇరాన్, అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యుద్ధానికి వెళ్లాలని అమెరికా, ఇజ్రాయెల్ తమంతట తాముగా నిర్ణయించుకున్నాయని మేక్రాన్ అన్నారు.

‘‘ఇది వాళ్ల నిర్ణయం, ఇప్పుడనుకుని ఉపయోగం లేదు’’

సంక్షోభంపై ట్రంప్, ఆయన యంత్రాంగం మిశ్రమ సందేశాలు పంపిస్తున్నారు. కాల్పుల విరమణ దగ్గరలో ఉందని కొన్ని సందర్భాల్లో చెప్పారు. యుద్ధం ఇప్పటికే గెలిచామని, అమెరికా ఇంకా యుద్ధం కొనసాగిస్తుందని మరికొన్ని సందర్భాల్లో చెప్పారు.

నేటోలో అమెరికా కొనసాగడంపై పునరాలోచన చేస్తున్నామన్న ట్రంప్ ఇటీవలి వ్యాఖ్యలపై కూడా మేక్రాన్ స్పందించారు.

''నేటో వంటి కూటములు చాలా విలువైనవి. వాటిమీద చాలా నమ్మకముంటుంది. ఒక దేశం తన అంకింతభావంపై సందేహం వ్యక్తం చేస్తే, కూటమి అసలు సారం దెబ్బతింటుంది. భాగస్వామ్యదేశాలు ఒప్పందాలు కుదుర్చుకుని, సమస్యలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించడానికి ముందుకు రావాలి. వాటి గురించి ప్రతిరోజూ మాట్లాడడం.. గౌరవిస్తాను లేదా గౌరవించడం వంటివి చెప్పడం కాకుండా సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలి'' అని మేక్రాన్ సూచించారు.

'చాలా మాటలు వినపడుతున్నాయి. అవన్నీ గందరగోళానికి దారితీస్తున్నాయి'' అని ఆయన అన్నారు.

ఈ ఆపరేషన్ అమెరికా, ఇజ్రాయెల్ తమంతట తాముగా తీసుకున్ననిర్ణయమని, దీనిపై తాను మాట్లాడబోనని ఆయన అన్నారు.

''వాళ్లు తమంతట తామే నిర్ణయం తీసుకుని, తర్వాత ఒంటరిగా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని బాధపడుతున్నారు. ఇది మా ఆపరేషన్ కాదు'' అని మేక్రాన్ అన్నారు.

ఇరాన్, అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Getty Images

‘‘ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని దాడులతో ఆపలేం’’

గత ఏడాది జూన్‌లో ఇరాన్‌పై అమెరికా చేసిన దాడుల గురించి కూడా మేక్రాన్ మాట్లాడారు. ఈ దాడుల్లో ఇరాన్ అణుస్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశామని ట్రంప్ చెప్పారు.

ఇరాన్ అణ్వాయుధాల కార్యక్రమంపై దాడి చేయడానికి ఇది చివరి, ఉత్తమ అవకాశమని ఫిబ్రవరి దాడుల తర్వాత ట్రంప్ చెప్పారు.

''ఆరు నెలల క్రితం అన్నీ ధ్వంసమవడం, అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని చెప్పడం మనకు గుర్తుంది'' అని మేక్రాన్ అన్నారు.

ఇరాన్‌లో అణ్వాయుధతయారీ పరిస్థితిని అంతర్జాతీయ పరిశీలకులు తనిఖీ చేయాల్సిన అవసరముందని, యురేనియం శుద్ధిని నియంత్రించేవిధానం అవసరమని ఆయన సూచించారు.

''ఇప్పడు, భవిష్యత్తులో కూడా నైపుణ్యం గల వ్యక్తులు, రహస్య ప్రయోగశాలలు ఉంటాయి. కొన్నివారాలపాటు మిలటరీ చర్యలో వాటిని లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, అణుసమస్యను పూర్తిగా తొలగించడం వీలు కాదు'' అని మేక్రాన్ అభిప్రాయపడ్డారు.

ఇరాన్, అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Getty Images

మేక్రాన్‌పై ట్రంప్ వ్యక్తిగత విమర్శలు

ఇరాన్ యుద్ధంలో సహాయం చేయడంలో ఫ్రాన్స్ విఫలమైందని ట్రంప్ విమర్శిస్తున్నారు.

ఒక ప్రైవేట్ లంచ్ సమయంలో బుధవారం(ఏప్రిల్ 1) ఫ్రెంచ్ యాసలో మేక్రాన్‌ను ట్రంప్ ఎగతాళి చేశారు. మేక్రాన్ భార్య బ్రిజిట్ భర్తతో సరిగ్గా వ్యవహరించడం లేదని, దవడకు తగిలిన దెబ్బనుంచి కోలుకోవడానికి మేక్రాన్ ఇంకా ప్రయత్నిస్తున్నారని ట్రంప్ వ్యంగ్యంగా మాట్లాడారు.

2025నాటి వీడియోను ఉద్దేశించి ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోలో బ్రిజిట్ తన భర్త మేక్రాన్ ముఖాన్ని తోసివేసినట్టు కనిపించింది.

ఈ వ్యాఖ్యలు సరైనవి కాదని, స్థాయికి తగ్గవి కాదని మేక్రాన్ అన్నారు.

ట్రంప్ మాటలపై తాను స్పందించబోనని, వాటికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదని మేక్రాన్ చెప్పారు.

మేక్రాన్ కుటుంబంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఫ్రాన్స్‌లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మేక్రాన్‌ను తీవ్రంగా విమర్శించేవారు సైతం ఆయనకు మద్దతుగా మాట్లాడారు.

డోనల్డ్ ట్రంప్ అలా మాట్లాడడం, ఆయన భార్య గురించి అలాంటి వ్యాఖ్యలు చేయడం మర్యాదకరం కాదని, అవి అంగీకారయోగ్యం కాదని లెఫ్టిస్ట్ పార్టీ ఫ్రాన్స్ అన్‌బోవ్డ్‌కు చెందిన మాన్యువల్ బొంపార్డ్ అభ్యంతరం వ్యక్తంచేశారు.

ఇరాన్, అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Reuters

‘‘మిలటరీ ఆపరేషన్‌తో హార్ముజ్ జలసంధిని తెరవలేం’’

తన భూభాగంపై దాడులకు ప్రతీకారంగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీనికి తక్షణ పరిష్కారం లభించడం లేదు. హార్ముజ్ జలసంధి మూసివేతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న దేశాలు తమంతటతాము ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ట్రంప్ సూచిస్తున్నారు.

జలసంధిని తెరవడానికి మిలటరీ ఆపరేషన్ నిర్వహించాలన్న ఆలోచనను మేక్రాన్ వ్యతిరేకించారు. ఇది అసహజంగా ఉంటుందని, పైదా దీనికి చాలా సమయం పడుతుందని, చాలా ప్రమాదకరమైనదని మేక్రాన్ ఆందోళన వ్యక్తంచేశారు.

''అది అక్కడ ప్రయాణించేవారికి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ నుంచి ముప్పు కలిగిస్తుంది. బాలిస్టిక్ మిసైళ్లు, ఇతర ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఇది సైనికచర్యతో పరిష్కరించే సమస్యకాదు'' అని మేక్రాన్ అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)