హార్ముజ్ జలసంధి మీదుగా నౌకలను అనుమతిస్తాం, కానీ శత్రువులకు నో ఎంట్రీ: ఇరాన్ విదేశాంగ శాఖ

ఇరాన్, ఇస్మాయిల్ బఘాయ్

ఫొటో సోర్స్, Anadolu via Getty Images

ఫొటో క్యాప్షన్, ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్
చదివే సమయం: 3 నిమిషాలు

చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలు "దురాక్రమణ దారులకు చెందినవి కానంత వరకు, వారితో సంబంధం లేనంత వరకు" వాటిని అనుమతిస్తున్నట్లు ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ ప్రకటన చేశారు.

'న్యూస్‌రూమ్ ఆఫ్రికా' టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇస్మాయిల్ బఘాయ్ మాట్లాడుతూ.. "మా అధికారులతో సంప్రదించి, అనుమతి పొందిన తర్వాతే" నౌకలను జలసంధి గుండా వెళ్లేందుకు అనుమతిస్తామని చెప్పారు.

ప్రస్తుత సంఘర్షణను ప్రస్తావిస్తూ.. "యుద్ధం, చర్చలు, కాల్పుల విరమణ చుట్టూ తిరిగే ఈ విష వలయాన్ని" ఇరాన్ సహించబోదని బఘాయ్ అన్నారు.

జూన్ నెలలో ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య 12 రోజుల పాటు జరిగిన యుద్ధంలో, ఇరాన్ అణు, సైనిక స్థావరాలపై అమెరికా దాడులు చేసింది.

"వారు ఆపుదామంటేనే మేం ఆగాం, కానీ 9 నెలల తర్వాత మళ్లీ ప్రారంభించారు" అని బఘాయ్ పేర్కొన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇరాన్, హార్ముజ్ జలసంధి

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఇరాన్ నిర్లక్ష్యపూరిత వైఖరిని బ్రిటన్ విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్ విమర్శించారు.

35 దేశాల నాయకుల సంతకాలు

హర్ముజ్ జలసంధి గుండా నౌకల ప్రయాణం సురక్షితంగా సాగేలా చూసేందుకు, అవసరమైన చర్యల్లో భాగస్వాములం అవుతామని పేర్కొంటూ 35 దేశాల నాయకులు ఇటీవల ఒక ఉమ్మడి ప్రకటనపై సంతకం చేశారు.

ఇందులో భాగంగా, అనేక దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధులు ఈ రోజు మధ్యాహ్నం 'వర్చువల్ సమ్మిట్'లో పాల్గొన్నారు.

హార్ముజ్ మార్గాన్ని తిరిగి ప్రారంభించడానికి 'ఆచరణాత్మక దౌత్య, రాజకీయ' పరిష్కారాలపై చర్చించడం దీని ప్రధాన ఉద్దేశం.

'దేశ శత్రువుల'కు ఈ మార్గం మూసివేసే ఉంటుందని ఇరాన్ చెబుతున్న నేపథ్యంలో, ఇది అంత సులభంగా పరిష్కారమయ్యే అంశం కాదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ బుధవారం అభిప్రాయపడ్డారు.

ఈ సమ్మిట్‌లో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలు పాల్గొనే అవకాశం ఉండగా, అమెరికా మాత్రం ఇందులో భాగస్వామిగా లేదు.

ఈ సంఘర్షణ ముగిస్తే రాత్రికి రాత్రే హార్ముజ్ మార్గం 'ఆటోమేటిక్'గా తెరుచుకుంటుందని డోనల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఇతర దేశాలు దీనిపై అంత నమ్మకంగా లేవు.

ఉదాహరణకు, అక్కడ అమర్చిన మైన్‌లను తొలగించాల్సి రావొచ్చు. అందుకే, యుద్ధం ముగిసిన తర్వాత ఆ మార్గాన్ని ఎలా సురక్షితంగా మార్చవచ్చనే అంశంపై చర్చించడానికి వివిధ దేశాల సైనిక నిపుణులు సమావేశమవుతున్నారు.

నౌకల రాకపోకలకు భద్రత కల్పించడం ద్వారా చమురు ధరలను తగ్గించడం, ఆహార ఉత్పత్తికి కీలకమైన ఎరువుల సరఫరాను పెంచడమే ప్రస్తుత ప్రధాన లక్ష్యమని చెబుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)