బైకర్ మూవీ రివ్యూ: రేసులో జోరు తగ్గిందా? శర్వానంద్‌కు తండ్రిగా రాజశేఖర్ నటన ఎలా ఉంది?

ఫొటో సోర్స్, uvcreationsofficial
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
- చదివే సమయం: 4 నిమిషాలు
‘నారీనారీ నడుమ మురారి’తో శర్వానంద్ హిట్ కొట్టాన తరువాత ఇపుడు ‘బైకర్’గా వచ్చాడు. రేసింగ్ కథాంశంతో, శర్వా కొత్త లుక్‌తో వచ్చిన సినిమా ఎలా ఉంది?
కథేంటంటే... వికాస్ నారాయణ్ -విక్కీ (శర్వానంద్) ఒకప్పటి బైక్ రేసర్. భార్య అనన్య (మాళవిక), కొడుకుతో ప్రశాంతంగా ఉంటుంటాడు.
స్కూల్లో ఒక కుర్రాడు తండ్రిని ఏదో అన్నాడని కొడుకు గొడవ పడడంతో విక్కీకి గతం గుర్తొస్తుంది.
విక్కీకి తండ్రి సునీల్ నారాయణ్ (రాజశేఖర్) గురువు, దైవం. తండ్రిని ఎవరైనా ఒక్క మాటన్నా సహించలేడు.
కొడుకుని ఇంటర్నేషనల్ రేసర్‌ను చేయాలనేది తండ్రి ఆశయం. కఠినమైన శిక్షణ ఇస్తాడు. ఒక పెద్ద పారిశ్రామికవేత్త (అతుల్ కులకర్ణి)తో ఒప్పందం కుదుర్చుకుంటాడు.
అయితే రేస్ మధ్యలోనే వదిలేసి విక్కీ తప్పుకుంటాడు. దీంతో తండ్రికి అతని మీద కోపం.


ఫొటో సోర్స్, uvcreationsofficial
స్పోర్ట్స్ డ్రామాకు ఎమోషనల్ టచ్ వచ్చిందా?
తండ్రి మీద పడిన నిందని పోగొట్టడానికి విక్కీ మళ్లీ రేస్‌లకి వస్తాడు. విజయం సాధించాడా? లేదా? అతుల్ కులకర్ణి చేసిన కుట్ర ఏంటి? ఇది మిగతా కథ.
స్పోర్ట్స్ డ్రామాలు మనకి కొత్తకాదు. ఏ కథలో అయినా పరాజయం , కఠిన శ్రమ, విజయాన్ని అందుకోవడమే ప్రధానాంశాలు.
రన్నింగ్ రేస్ ఆధారంగా తెరకెక్కిన అశ్విని (1991) మొదటి ఫుల్ లెంగ్త్ డ్రామాగా చెప్పవచ్చు. తరువాత చాలా వచ్చాయి. లేటెస్ట్‌గా జెర్సీ.
బైక్ రేస్‌లు కూడా మనకి కొత్త కాదు. అయితే హీరో రేసుల్లో పాల్గొని కప్ కొట్టడం వరకే. ఒక పాత సినిమాలో ఎన్టీఆర్ కూడా బైక్ రేస్ చేస్తాడు.
అయితే ఫుల్ లెంగ్త్ బైక్ రేస్‌లపై ఇదే మొదటి సినిమా అనొచ్చు. దర్శకుడు అభిలాష్‌రెడ్డి మోటో క్రాస్ రేస్‌లపై చూపిన శ్రద్ధ , పరిశోధన మెచ్చుకోతగింది.
రేస్‌లు ఎలా జరుగుతాయి, శిక్షణ , మెలకువలు అన్నీ అధ్యయనం చేశాడు. అయితే కేవలం రేస్‌లు చూడడానికి ప్రేక్షకులు రారు. టీవీలో ఎప్పుడైనా చూడొచ్చు. స్పోర్ట్స్‌ని ఒక ఎమోషనల్ కథతో కనెక్ట్ చేయాలి.
తండ్రీకొడుకుల అనుబంధం మంచి ఫార్ములా. అమ్మానాన్న తమిళమ్మాయి, జెర్సీ హిట్‌కి ఎమోషన్ వర్కౌట్ కావడమే కారణం. దంగల్ కూడా అదే కథ.
తండ్రి తాను సాధించలేనిదాన్ని కొడుకు ద్వారా సాధించాలని అనుకుంటాడు. అది మానవ నైజం.
రాజశేఖర్, శర్వానంద్ మంచి నటులు. ఎమోషనల్ సీన్స్‌ని పండించగలరు. అయితే దర్శకుడు రేస్ చిత్రీకరణ మీద ఎక్కువ పోకస్ పెట్టి, అసలు విషయాన్ని మరిచిపోయాడు.

ఫొటో సోర్స్, imsharwanand
రాజశేఖర్, శర్వానంద్ తండ్రీకొడుకులుగా ఎలా ఉన్నారంటే..
తండ్రీకొడుకులకి ఒకరంటే ఒకరికి ఇష్టం. అయితే డైలాగ్‌లు చెప్పకపోతే ప్రేక్షకులు అది ఫీల్ కారు. అనుబంధాన్ని ఎలివేట్ చేసే సంఘర్షణ ఉండాలి. నాలుగైదు సీన్స్ పడాలి. అవి మిస్ అయ్యాయి.
ఉదాహరణకి సింహాద్రి సినిమాలో పెద్దాయనని అవమానించినందుకు సింహాద్రి కోపాన్ని తీర్చుకునే సీన్ మనకి ఇప్పటికీ గుర్తుంటుంది.
స్టోరీ టెల్లింగ్‌లో గాఢత తగ్గిపోవడంతో సంఘర్షణ ఎస్టాబ్లిష్ కాలేదు. రాజశేఖర్ చేసిన మోసం ఏంటో , ప్రాణంగా చూసుకునే రేస్‌ను , తండ్రిని వదిలి విక్కీ ఎందుకు వెళ్లిపోయాడో ప్రేక్షకుడికి అర్థం కాదు. ఫీల్ పోయింది.
ఇలాంటి డ్రామాల్లో బలమైన విలన్ వుండాలి. కులకర్ణి మంచి నటుడే కానీ, నటించే స్కోప్ లేకపోవడంతో తేలిపోయాడు. హీరోయిన్‌గా మాళవిక , ఆమె తల్లిగా తులసి బాగా నటించారు. పాటలు గుర్తుండవు. సంగీతం ఓకే.
యువరాజ్ కెమెరా పనితనం రేస్ సీన్‌ను బ్రహ్మాండంగా చిత్రీకరించింది. 150 నిమిషాలకి పైగా నిడివి. కొంచెం ఇబ్బంది. ఎడిటింగ్‌కి అవకాశం ఉంది. ఎందుకంటే సినిమా అంతా అవే సీన్స్ రిపీటెడ్‌గా వస్తుంటాయి.
చూస్తున్నంత సేపు జెర్సీ గుర్తుకు వస్తే అది మన తప్పు కాదు. శర్వానంద్ చాలా కష్టపడి బరువు తగ్గాడు. అయితే ఈ సినిమాకి ఆయన ఫిజిక్‌తో పనిలేదు. రేసర్ సూట్‌తో వుండి, హెల్మెట్ పెట్టుకుంటే హీరోకి, డూప్‌కి పెద్ద తేడా లేదు.
రాజశేఖర్ కొన్ని సీన్స్‌లో బాగా నటించినా, కొన్ని సీన్స్‌లో ఎక్స్‌ప్రెషన్ లేకుండా ప్లాట్‌గా ఉంటాడు. హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పరిణామం చెందలేదేమో.. అక్కడక్కడ డైలాగ్‌లు బాగున్నాయి.

ఫొటో సోర్స్, uvcreationsofficial
బైకర్ గెలుపును ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారా?
యూవీ ప్రొడక్షన్స్ భారీగా ఖర్చు పెట్టారు. ఈ కథ 2003లో కోయంబత్తూర్‌లో జరుగుతుంది. దీని వల్ల పెద్ద యాడ్ అయ్యిందేమీ లేదు.
మనిషి బుద్ధి జీవిగా మారినప్పటి నుంచి మానవ సంబంధాలున్నాయి. టెక్నాలజీ ఎంత మారినా అంతర్లీనంగా మనిషి , అతని స్వభావం ఒక్కటే. కథాంశం ఎంత కొత్తది, పరిశోధనాత్మకం కావచ్చు. ఎమోషన్స్ సమపాళ్లలో కలవకపోతే ప్రయోజనం వుండదు. బైకర్ స్క్రీన్‌పై గెలిస్తే లాభం లేదు. ప్రేక్షకుడు అది తన గెలుపుగా భావించాలి. సొంతం చేసుకోవాలి. బైకర్‌లో లేనిది అదే.
ప్లస్ పాయింట్స్
1. రేసింగ్ చిత్రీకరణ
2. శర్వానంద్, రాజశేఖర్ నటన
3. అక్కడక్కడ డైలాగ్‌లు
మైనస్ పాయింట్స్:
1. ఎమోషన్ మిస్ అవడం
2. సన్నివేశాలు రిపీటెడ్‌గా వుండడం
3. బలమైన విలన్ లేకపోవడం
ఫైనల్‌గా బైక్‌లో వేగం వుంది కానీ, సినిమా స్లో
(గమనిక: అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























