టిక్‌టాక్ స్టార్, సింగర్ డేవిడ్ కారు డిక్కీలో 14 ఏళ్ల బాలిక శవం, అసలేం జరిగిందంటే..

అమెరికా, లాస్ ఏంజెల్స్, సింగర్, మర్డర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నార్డైన్ సాడ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 4 నిమిషాలు

(ఈ కథనంలోని అంశాలు మిమ్మల్ని కలచివేయొచ్చు)

సింగర్ D4Vd(డేవిడ్) కారు డిక్కీలో శవమై కనిపించిన బాలిక హత్యకు గురైనట్లు ఎన్నో ఊహాగానాలు, నెలల తరబడి ఆలస్యం తర్వాత అధికారులు నిర్ధరించారు.

"శరీరంపై లోతైన గాయాల" కారణంగా ఆమె మరణించినట్లు అధికారులు ప్రకటించారు.

సెలెస్టీ రీవాస్ హెర్నాండెజ్ అనే ఆ బాలిక హత్యకు గురైందని నిర్ధరించినట్లు లాస్ ఏంజెల్స్ కౌంటీ వైద్యపరీక్షల కార్యాలయం బుధవారం ప్రకటించింది. గుర్తుతెలియని వస్తువు, లేదా వస్తువులతో దాడి చేయడంతో ఈ 14 ఏళ్ల బాలిక మరణించినట్లు పేర్కొంది.

గత సెప్టెంబర్‌లో, 21 ఏళ్ల టిక్‌టాక్ స్టార్ డేవిడ్ పేరిట రిజిస్టర్ అయిన టెస్లా కారు ముందు డిక్కీలో ఆమె మృతదేహం లభ్యమైంది. బాలిక మరణానికి సంబంధించి సింగర్ డేవిడ్ హత్యానేరంతో సహా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

డేవిడ్ అసలు పేరు డేవిడ్ ఆంథోనీ బర్క్. ఈ కేసులో తాను నిర్దోషినని ఆయన వాదిస్తున్నారు. ఆయన తరఫు న్యాయవాదులు డేవిడ్ "నిర్దోషిత్వాన్ని బలంగా సమర్థిస్తున్నారు"

"అసలు ఆధారాలు, సెలెస్టీని డేవిడ్ హత్య చేయలేదని.. ఆమె మరణానికి ఆయన కారణం కాదని నిరూపిస్తాయి" అని తాము విశ్వసిస్తున్నట్లు గాయకుడి తరఫు న్యాయవాద బృందం చెబుతోంది.

"డేవిడ్ నిర్దోషిత్వాన్ని మేం బలంగా సమర్థిస్తాం" అని ఆయన తరఫు న్యాయవాదులు బ్లెయిర్ బెర్క్, మార్లిన్ బెడ్నార్స్కీ, రెజీనా పీటర్ బీబీసీకి ఇచ్చిన ఒక ప్రకటనలో తెలిపారు.

అమెరికా, లాస్ ఏంజెల్స్, సింగర్, మర్డర్

ఫొటో సోర్స్, Courtesy of Celeste Rivas Hernandez's family

ఈ కేసులో ఏం జరిగింది?

సెప్టెంబర్‌లో రీవాస్ హెర్నాండెజ్ మృతదేహం లభ్యమైన కొద్దిసేపటికే వైద్యాధికారులు శవ పరీక్షలు నిర్వహించారు. ఆమె మృతికి గల కారణాలను, ఆమె ఎలా చనిపోయారనే వివరాలను డిసెంబర్‌ 9న నిర్ధరించారు. అయితే, కేసు దర్యాప్తులో ఉన్నందున ఆ వివరాలను బహిరంగపర్చలేదు.

ఆమె డెడ్‌బాడీ కనిపించడానికి నాలుగు నెలల ముందే, అంటే 2025 మే 5న (లేదా మరోరోజు) ఆమెను హత్య చేసి, ఆమె శరీరాన్ని ముక్కలు చేశారని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నట్లు అభియోగపత్రాల్లో ఉంది.

"నెలల తర్వాత, ఎట్టకేలకు ఈ వివరాలను బాధిత కుటుంబానికి, ప్రజలకు తెలియజేయగలిగినందుకు కృతజ్ఞుడిని" అని చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ డాక్టర్ ఓడే ఉక్పో ఒక ప్రకటనలో తెలిపారు.

"తమ బిడ్డకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇంతసమయం పట్టడం ఊహించలేనంత బాధగా ఉంటుంది" అని ఉక్పో పేర్కొన్నారు.

బీబీసీకి లభించిన వైద్య పరీక్షల రిపోర్ట్ ప్రకారం.. ఆమె పొట్ట, ఛాతీపై కత్తిపోట్లు ఉన్నట్లు శవపరీక్షలో తేలింది.

ఈ నివేదికలో మరికొన్ని వివరాలు కూడా ఉన్నాయి. ఆమె శరీరంపై ఉన్న గాయాల్లో నీలిరంగు ప్లాస్టిక్ ముక్కలు ఉన్నట్లు గుర్తించారు. టెస్లా కారు ముందు డిక్కీలో నల్లటి జిప్పర్ బ్యాగులో ఆమె శవం లభించినట్లు అందులో పేర్కొన్నారు.

టాక్సికాలజీ ప్రకారం, ఆమె శరీరంలో మెథాంఫెటామిన్ లేదా ఎండీఎంఏ, కొద్దిపాటి ఆల్కహాల్ స్థాయిలు ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఈ రెండూ ఆమె మరణానికి కారణమైనట్లు ఎలాంటి ఆధారాలూ దొరకలేదు.

అమెరికా, లాస్ ఏంజెల్స్, సింగర్, మర్డర్

ఫొటో సోర్స్, Getty Images

బర్క్‌ను సోమవారం కోర్టులో హాజరుపరిచిన అనంతరం రీవాస్ కుటుంబం తొలిసారి ఒక ప్రకటన చేసింది.

కొద్దినెలలుగా తమకు మద్దతుగా నిలిచిన పోలీసులకు, ప్రాసిక్యూటర్లకు, లేక్ ఎల్సినోర్‌లోని తమ ఇరుగుపొరుగు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

"సెలెస్టీ అందమైన, దృఢమైన అమ్మాయి. ఆమెకు పాడడం, డ్యాన్స్ చేయడమంటే చాలా ఇష్టం. ప్రతి శుక్రవారం రాత్రి మేం సినిమా చూసేవాళ్లం. ఉత్సాహంగా గడిపేవాళ్లం" అని ఆమె తల్లిదండ్రులు జీసస్ రీవాస్, మెర్సిడెస్ మార్టినెజ్ తెలిపారు.

"తనంటే మాకు చాలా ఇష్టం. మేమంటే కూడా చాలా ఇష్టమని చెబుతుండేది. చాలా మిస్ అవుతున్నాం. సెలెస్టీకి న్యాయం జరగడమే మాకు కావాలి" అని వారు అన్నారు.

డేవిడ్ బర్క్ విచారణలో వెల్లడైన దారుణమైన విషయాలు విన్న తర్వాత ఆ కుటుంబం కుంగిపోయిందని వారి ఫ్యామిలీ లాయర్ పాట్రిక్ స్టెయిన్‌ఫెల్డ్ బీబీసీకి ఇచ్చిన ఒక ప్రకటనలో తెలిపారు.

లాస్ ఏంజెల్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ నాథన్ హోచ్‌మన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆమె 2025 ఏప్రిల్ 23న హాలీవుడ్ హిల్స్‌లోని బర్క్ ఇంటికి వెళ్లారని, ఆ తర్వాత ఆమె గురించి ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.

సెలెస్టీ కనిపించడం లేదంటూ ఏప్రిల్‌లో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కానీ ఆమె మృతదేహం లభ్యమయ్యే వరకూ ఆమె గురించి ఎలాంటి వివరాలూ తెలియలేదు. ఫిర్యాదు చేసిన ఏడు నెలల తర్వాత, గత వారం లాస్ ఏంజెల్స్‌లో 'రొమాంటిక్ హోమిసైడ్' పాటల సింగర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి ఆయనకు బెయిల్ రాలేదు. తన కారులో టీనేజర్ మృతదేహం లభ్యమైన తర్వాత ఆయన జనంలో కనిపించడం దాదాపు మానేశారు. ప్రపంచ పర్యటనను రద్దు చేశారు. బ్రాండ్‌లతో ఆయనకున్న ఒప్పందాలు కూడా రద్దైనట్లు సమాచారం.

తమ సంస్థ పనితీరును, అరెస్టు చేసేందుకు ఇంత సమయం తీసుకోవడాన్ని లాస్ ఏంజెల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ చీఫ్ జిమ్ మెక్‌డొనెల్ సమర్థించుకున్నారు.

"ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నా. ఊహాగానాలకు ఆజ్యం పోయడం నా పనికాదు. న్యాయం జరిగేలా చూడడమే నా కర్తవ్యం. అందుకు ప్రతి ఒక్కరికీ సహనం, క్రమశిక్షణ అవసరం" అని ఆయన అన్నారు.

"సెలెస్టీ రీవాస్‌కు, ఆమె ఆత్మీయులకు న్యాయం జరిగేలా చూడాలన్న లక్ష్యంతోనే ఈ దర్యాప్తు సాగింది. మేం చేసేది, లేదా చెప్పే విషయాలేవీ ఈ కేసును ప్రమాదంలో పడేయకూడదన్నదే మా ఉద్దేశం."

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)