పిఠాపురం: ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య వివాదం ఏంటి?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
- చదివే సమయం: 4 నిమిషాలు
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నాయకుల మధ్య రెండేళ్లుగా ఏదో ఒక వివాదం రాజుకుంటూనే ఉంది.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎస్‌వీఎస్ఎన్ వర్మ ప్రోటోకాల్ అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో అది వివాదంగా మారింది.
ఏప్రిల్ 21న ప్రధానమంత్రి అనుసుచిత్ జాతి అభ్యుదయ్ యోజన (పీఎంఏజేఏవై) పథకంలో భాగంగా పిఠాపురంలో నిర్వహించిన డ్వాక్రా సంఘాల యానిమేటర్లకు సెల్‌ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ అంశాన్ని లేవనెత్తారు వర్మ.
ఈ వివాదంలో నేతల మధ్య స్థానికతకు సంబంధించిన వ్యాఖ్యలు, విమర్శలు వినిపించగా, అవి పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించినవేనని జనసేన నేతలు, కాదని టీడీపీ నేతలు వాదించుకున్నారు.
అయితే, మిత్రపక్షాలైన పార్టీల నేతలు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకోవడం సరికాదని, చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలని ఈ వివాదాలను గమనిస్తున్న విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఫొటో సోర్స్, UGC
వివాదం ఎక్కడ మొదలైంది?
పిఠాపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (పాడా) కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్భంగా ప్రాంగణం ముందు స్వాగత ద్వారం వద్ద ఓ ఫ్లెక్సీ, సభావేదికపై మరో ఫ్లెక్సీని అధికారులు ఏర్పాటు చేశారు.
స్వాగత ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడం వివాదానికి దారి తీసింది.
సీఎం ఫోటో లేకుండా ఫ్లెక్సీని ఎలా కట్టారంటూ మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులను నిలదీశారు. సభావేదికపై ఉన్న ఫ్లెక్సీలో సీఎం ఫోటో పెద్దగా ఉందని అధికారులు జవాబివ్వగా, తాను బయటి ఫ్లెక్సీ గురించి మాట్లాడుతున్నానంటూ ఆయన అధికారుల తీరును తప్పు పట్టారు.

ఫొటో సోర్స్, UGC
టీడీపీ, జనసేన నేతల వాదోపవాదనలు
ఎస్‌వీఎస్ఎన్ వర్మ అధికారులతో వాదనకు దిగిన సమయంలోనే జనసేనకు చెందిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తన అనుచరులతో అక్కడికి వచ్చారు. సభా వేదికపై ఫోటో ఉంది కాబట్టి దీన్ని వివాదం చేయవద్దని వర్మతో అన్నారు దొరబాబు.
ఈ సందర్భంగా వర్మ అనుచరులకు, జనసేన వర్గీయులకు మాటామాటా పెరిగింది. ఇంతలో అక్కడే ఉన్న వర్మపై దొరబాబు ఆగ్రహంతో దూసుకువెళ్లారు.
అయితే పరిస్థితి అదుపు తప్పకుండా వెంటనే పోలీసులు ఇరువర్గాల నేతలు ఇద్దరినీ పక్కకు తీసుకువెళ్లి శాంతింపజేశారు.
‘‘వేదికపై కట్టిందే మెయిన్ బ్యానర్. దానిపైనే సీఎం బొమ్మ వేస్తాం. మిగతా వాటిపై స్థానిక ప్రజాప్రతినిధి బొమ్మలు వేస్తాం. నాకు తెలిసి ఎక్కడైనా అంతే వేస్తారు. కానీ ఇక్కడ అదే ఇష్యూ కావడం మాకు బాగా ఇబ్బంది అనిపించింది. వివాదం చెలరేగిన సమయంలో నేను అక్కడ లేను. కానీ మా అధికారులు ఇబ్బందిపడ్డారు’’ అని పిఠాపురం మునిసిపల్ కమిషనర్ రాజు బీబీసీతో అన్నారు.
ఆ వివాదం తర్వాత వర్మ టీడీపీ శ్రేణులతోనూ, మీడియాతోనూ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు చర్చాంశనీయమయ్యాయి.
‘‘మేం బలంగా ఉన్నాం కాబట్టే పవన్ కల్యాణ్‌ను గెలిపించాం. ఎన్నికల తర్వాత కొత్త టీమ్ వచ్చి మీద పడిపోతున్నారు. టూ మచ్‌గా ఉంది నియోజకవర్గంలో. మాకు చేతకాక కాదు.. చాలా గట్టిగా ఇస్తాం.. ఇక్కడ పుట్టి పెరిగాం. ఎక్కడి నుంచో దత్తతకు రాలేదు’’ అని వర్మ వ్యాఖ్యానించారు.
‘‘చంద్రబాబు ఫోటో శాశ్వతంగా లేకుండా చేయాలని చూస్తున్నారు. ఒకవేళ చంద్రబాబే స్వయంగా ఆయన ఫోటో వద్దన్నా నేను ఒప్పుకోను. బాబు ఫోటో ఉండాల్సిందే. ఆయన మా లీడర్, ఆయనకు అవమానం జరిగితే ఊరుకోను’’ అని వర్మ అన్నారు.
దీనిపై స్పందించిన జనసేన నేత దొరబాబు ‘‘వర్మ వల్లనే పిఠాపురంలో అనవసరంగా గొడవలు జరుగుతున్నాయి. ప్రశాంతంగా ఉన్న పిఠాపురంలో చిచ్చు రేపుతున్నారు’’ అని విమర్శించారు.

ఫొటో సోర్స్, ChandrababuNaidu/X
బాబు దృష్టికి పిఠాపురం వ్యవహారం
పిఠాపురంలో వర్మ, దొరబాబుల మధ్య జరిగిన వివాదం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీడీపీ అధిష్ఠానం కూడా దీనిపై స్పందించింది. ఈ వ్యవహారంలో వర్మతో మాట్లాడాల్సిందిగా టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను ఆదేశించారు.
‘‘అది ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఆయన కూటమిలోని జనసేన పార్టీ అధ్యక్షుడు. అలాంటి నియోజకవర్గంలో చీటికీ మాటికీ ఇష్యూలు రావడం సరికాదు. మీకు ఏమైనా సమస్య అనిపిస్తే అధిష్ఠానం దృష్టికి తీసుకురండి. ప్రోటోకాల్ విషయమైనా సరే, మీరు అక్కడ మాట్లాడటం కరెక్ట్ కాదు. మరోసారి ఇలాంటి వివాదాలకు అవకాశం ఇవ్వకండి’’ అని వర్మకు సూచించినట్లు పల్లా శ్రీనివాస్ బీబీసీకి తెలిపారు. తాను చెప్పిన విషయాలన్నీ వర్మ సావధానంగానే విన్నారని పల్లా చెప్పారు.
అయితే, తాను పవన్ కల్యాణ్‌ను విమర్శించలేదని వర్మ అంటున్నారు. ‘‘వైసీపీ నుంచి వచ్చిన దొరబాబును విమర్శిస్తే అది పవన్ కల్యాణ్‌ను విమర్శించినట్లుగా ఆపాదించడం సరికాదు’’ అని బీబీసీతో అన్నారు వర్మ.
‘‘ఇక్కడే పుట్టి పెరిగాం. ఎక్కడి నుంచో దత్తతకు రాలేదు'' అన్న వ్యాఖ్యలను అంగీకరించిన వర్మ, తాను వాటిని దొరబాబును ఉద్దేశించే అన్నానని స్పష్టం చేశారు.
‘‘పవన్‌ను ఉద్దేశించి ఎందుకంటాను? ఆయనంటే నాకు చాలా గౌరవం'' అని వర్మ అన్నారు.
ఎన్నికలకు ముందు జనసేనను ఓడించడానికి ప్రయత్నించిన దొరబాబు, అదే జనసేనలోకి వచ్చి పెత్తనం చేస్తున్నారనీ, తన పార్టీ అధిష్ఠానం సూచనల మేరకు తాను ఈ వివాదాన్ని ఇంతటితో ముగిస్తున్నానని వర్మ అన్నారు.
దీనిపై స్పందించిన దొరబాబు, ‘‘పిఠాపురంలో వర్మ ఎంతగా డిస్టర్బ్ చేస్తున్నారో ఇక్కడి ప్రజలందరికీ తెలుసు. మొదట్లో సీటు పోయిందని ఏదో ఉక్రోశంతో ఇదంతా చేస్తున్నారని అనుకున్నాం. ప్రతిదానికీ వివాదాలు సృష్టిస్తున్నారు’’ దొరబాబు బీబీసీతో అన్నారు.
పిఠాపురం ప్రాంతంలోనే పుట్టి పెరిగిన తనను బయటి నుంచి వచ్చిన వ్యక్తిగా వర్మ అభివర్ణించడం విడ్డూరమని అన్నారు.
‘‘వర్మ చేసిన వ్యాఖ్యలు పవన్ కల్యాణ్ మీదే. అది ఎక్కడ సమస్యగా మారుతుందోనని నా మీద చేసినట్లు చెబుతున్నారు’’ అని దొరబాబు అన్నారు.

ఫొటో సోర్స్, Janasena/X
కాగా, మిత్రపక్షాల నేతలు పిఠాపురంలో ఇలా వివాదాలకు దిగడం సరికాదని స్థానికంగా ఈ వివాదాన్ని గమనిస్తున్న జర్నలిస్టులు అంటున్నారు.
‘‘ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ స్వయంగా వర్మ సహకారం కోరారు. ఎన్నికల తర్వాత వర్మ మాకు సహకరించడం లేదంటూ జనసేన నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అది అంతర్గత వ్యవహారం. ఇరు వర్గాలు ఓసారి సీరియస్‌గా కూర్చుని పరిష్కరించుకుంటే మంచిది’’ అని కాకినాడకు చెందిన సీనియర్ జర్నలిస్టు స్వాతి ప్రసాద్ అభిప్రాయపడ్డారు.
‘‘లేకపోతే ఇది ఆరని చిచ్చులా అలా మండుతూనే ఉంటుంది’’ అని స్వాతి ప్రసాద్ వ్యాఖ్యానించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































