డచ్ మ్యూజియంలో దోపిడీకి గురైన 2500 ఏళ్ల పురాతన బంగారు హెల్మెట్ ఇప్పుడు ఎక్కడుందంటే...

 బంగారం, సాంస్కృతిక సంపద, కళాకృతులు, డచ్, రొమేనియా

ఫొటో సోర్స్, ANP/AFP

    • రచయిత, పాల్ కిర్బీ
    • హోదా, యూరప్ డిజిటల్ ఎడిటర్
  • చదివే సమయం: 4 నిమిషాలు

నెదర్లాండ్స్‌లోని ఓ మ్యూజియం నుంచి దోపిడీకి గురైన బంగారు హెల్మెట్ ఏడాది తర్వాత దొరికింది.

రొమేనియా సాంస్కృతిక సంపదలో, అత్యంత విలువైన వాటిలో ఒకటిగా భావించే ఈ బంగారు హెల్మెట్ దాదాపు 2,500 సంవత్సరాల నాటిది.

డచ్ మ్యూజియంలో ఉంచిన ఈ హెల్మెట్ కనిపించకుండాపోయి ఏడాది దాటింది.

ఈ హెల్మెట్‌తో పాటు దాదాపు క్రీస్తు పూర్వం 450 సంవత్సరానికి చెందిన రెండు బంగారు బ్రాస్‌లెట్‌లను గురువారం (ఏప్రిల్ 2) మ్యూజియంకు తిరిగి అప్పగించారు.

ఇద్దరు భద్రతా సిబ్బందితో వాటికి రక్షణ కల్పించారు. మూడో బ్రాస్‌లెట్ ఇంకా లభ్యం కాలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రొమేనియా హెల్మెట్ డచ్‌లో ఎందుకుంది?

అసెన్‌లోని డ్రెంట్స్ మ్యూజియంలో ఉంచిన ఈ హెల్మెట్, బ్రాస్‌లెట్ల దోపిడీ జరిగినప్పుడు రొమేనియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇతర దేశాలకు ఇచ్చిన అమూల్యమైన వస్తువుల భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తాయి.

''చాలా కాలంగా దీనికోసం ఎదురుచూస్తున్నాం. అమూల్యమైన రొమేనియా సంపద తిరిగి దొరకడం సంతోషం కలిగిస్తోంది'' అని రొమేనియన్ ప్రాసిక్యూటర్ డానియెలా బురుయానా అన్నారు.

రొమేనియా నేషనల్ హిస్టరీ మ్యూజియం నుంచి తీసుకుని ''డేసియా - బంగారం, వెండి సామ్రాజ్యం'' అనే ఎగ్జిబిషన్‌లో వాటిని ప్రదర్శనకు ఉంచినప్పుడు దోపిడీ జరిగింది. క్రీస్తు శకం 106లో రోమన్ల ఆక్రమణకు ముందు రొమేనియాలో నివసించిన ప్రజల నాగరికతకు సంబంధించిన విశేషాలతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.

ఈ దోపిడీ రెండు దేశాల మధ్య వివాదానికి దారితీసింది. డచ్ ప్రభుత్వం దాదాపు 55 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించింది.

ఆ డబ్బును ఇప్పుడేం చేస్తారనే విషయంపై మాట్లాడేందుకు రొమేనియా అధికారులు నిరాకరించారు.

హెల్మెట్ కొద్దిగా దెబ్బతిందని, కానీ దానిని సరిచేయొచ్చని.. బ్రాస్‌లెట్‌లకు ఎలాంటి నష్టం జరగలేదని ఉత్తర నెదర్లాండ్స్‌లోని డ్రెంట్స్ మ్యూజియం డైరెక్టర్ రాబర్ట్ వాన్ లాంగ్ చెప్పారు.

 బంగారం, సాంస్కృతిక సంపద, కళాకృతులు, డచ్, రొమేనియా

ఫొటో సోర్స్, Getty Images

విచారణకు ముందు ఒప్పందం

ఈ దోపిడీ తమ దేశంలో తీవ్ర ప్రభావం చూపిందని రొమేనియా ప్రాసెక్యూటర్ రేర్స్ -పెట్రు స్టాన్ చెప్పారు. దాన్ని తిరిగి తెచ్చేందుకు కష్టపడిన డచ్ సహచరులకు కృతజ్ఞతలు చెప్పారు.

''మిగిలిన బ్రాస్‌లెట్ కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఈ సంపదను రొమేనియా ప్రజలకు తిరిగి ఇవ్వగలిగినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం'' అని ఆయనన్నారు.

ముగ్గురు అనుమానితుల తరఫు లాయర్లతో జరిగిన సంప్రదింపుల అనంతరం, బుధవారం (ఏప్రిల్ 1) హెల్మెట్, బ్రాస్‌లెట్లను అధికారులకు అప్పగించినట్లు డచ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరిన్ ఫానెర్ చెప్పారు.

అనుమానితుల్లో ఇద్దరు 30ల వయసులో ఉన్నారని, మరొకరికి 21ఏళ్లని, వారంతా ఈ నెల చివర్లో విచారణ ఎదుర్కొంటారని ఫానెర్ చెప్పారు. అనుమానితులతో విచారణకు ముందు కుదిరిన ఒప్పందంలో భాగంగా విలువైన వస్తువులను తిరిగి ఇచ్చారని తెలిపారు.

పేలుడు పదార్థాలు ఉపయోగించి మ్యూజియంలోకి చొరబడి దోపిడీకి పాల్పడిన కొద్దిరోజులకే వారిని అరెస్టు చేశారు. కానీ, విలువైన వస్తువులు ఎక్కడున్నాయో తెలియలేదు.

క్రిమినల్ గ్యాంగ్ ఆదేశాల మేరకే హెల్మెట్, బ్రాస్‌లెట్ల దొంగతనం జరిగినట్లు ఆర్ట్ నిపుణులు అంటున్నారు.

 బంగారం, సాంస్కృతిక సంపద, కళాకృతులు, డచ్, రొమేనియా

ఫొటో సోర్స్, Getty Images

హెల్మెట్ వల్ల ఉద్యోగం పోగొట్టుకున్న మ్యూజియం హెడ్

అమూల్యమైన కళాకృతులకు తగినంత భద్రత కల్పించడం కష్టతరంగా మారడంతో ఇటీవల కాలంలో అనేక డచ్ మ్యూజియంలు లక్ష్యంగా మారాయి. ఒక గాజు కేస్‌లో హెల్మెట్, బ్రాస్‌లెట్లు ఉంచారు. సాయుధ గ్యాంగ్‌ అక్కడి నుంచి వాటిని సులభంగానే ఎత్తుకెళ్లింది.

బంగారు వస్తువులను విదేశాలకు అరువుగా ఇచ్చినందుకు బుచారెస్ట్‌లోని నేషనల్ హిస్టరీ మ్యూజియం మాజీ హెడ్ ఎర్నెస్ట్ ఒబెర్‌లాండర్ - టార్నోవెను తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దొంగతనం జరిగిన కొన్నిరోజుల్లోనే ఆయన ఉద్యోగం పోయింది.

హెల్మెట్ దొరకడంతో ఉపశమనంగా ఉందని ఆయన అన్నారు.

''ఇది యూరప్‌లో మాత్రమే కాకుండా ప్రపంచ సాంస్కృతిక వారసత్వంలో చాలా ప్రత్యేకమైన వస్తువు. డేసియన్ నాగరికతకు సంబంధించి ఈ హెల్మెట్ సామాజికంగా, రాజకీయంగా కీలకమైన చిహ్నం'' అని ఆయన చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)