'నేటో ఓ కాగితం పులి, అందులోంచి బయటకు వద్దామనుకుంటున్నాం’- డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Aaron Schwartz/CNP/Bloomberg via Getty Images
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో నేటో దేశాలు సహకరించకపోవడంతో, ఆ కూటమి నుంచి అమెరికాను పూర్తిగా బయటకు తీసుకువచ్చే అంశాన్ని బలంగా పరిశీలిస్తున్నట్లు డోనల్డ్ ట్రంప్ చెప్పారని టెలిగ్రాఫ్ పత్రిక రిపోర్ట్ చేసింది.
ఆ వార్తాపత్రిక కథనం ప్రకారం, ట్రంప్ ఈ కూటమిని ఒక "కాగితపు పులి" అని అభివర్ణించారు, బ్రిటన్‌కు నౌకాదళమే లేదని ఆరోపించారు.
మధ్యప్రాచ్యంలో ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో, నేటోలో అమెరికా సభ్యత్వంపై మళ్లీ ఆలోచిస్తారా అని అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ, అది పునరాలోచన దశను దాటిపోయిందని పేర్కొన్నారు.
"నేను ఎప్పుడూ నేటో వైపు మొగ్గు చూపలేదు. అది ఒక కాగితపు పులి. ఆ విషయం పుతిన్‌కు కూడా తెలుసు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా బ్రిటన్ సైనిక సామర్థ్యంపై కూడా ట్రంప్ విమర్శలు గుప్పించారు. "మీకు కనీసం నౌకాదళం కూడా లేదు. మీ వ్యవస్థలన్నీ పాతబడిపోయాయి. మీ దగ్గర ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు (యుద్ధ విమాన వాహక నౌకలు) కూడా పనిచేయడం లేదు" అన్నారు ట్రంప్.


ఫొటో సోర్స్, Getty Images
బ్రిటన్ ఏమంది?
డోనల్డ్ ట్రంప్ విమర్శలు, నేటో నుంచి అమెరికా వైదొలగుతుందన్న హెచ్చరికల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ బుధవారం కీలక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకల స్వేచ్ఛను పునరుద్ధరించే ప్రణాళికలపై చర్చించేందుకు, బ్రిటన్ విదేశీ వ్యవహారాల కార్యదర్శి యెవెట్ కూపర్ అంతర్జాతీయ నేతలతో ఒక సదస్సును నిర్వహించనున్నారని స్టార్మర్ ప్రకటించారు.
ఇజ్రాయెల్-అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ ఈ జలసంధిని దిగ్బంధించింది. ఈ కీలక నౌకా రవాణా మార్గంపై ఆంక్షలు విధించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయి.
పెరుగుతున్న జీవన వ్యయాలను అదుపు చేయాలంటే ఉద్రిక్తతలను తగ్గించడం, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించడమే ఉత్తమ మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సమస్య పరిష్కారానికి అందుబాటులో ఉన్న ప్రతి దౌత్య మార్గాన్ని అన్వేషిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
"మీ పోరాటాలు మీరే చేసుకోవాలి, అమెరికా ఇకపై మీకు సహాయం చేయదు" అని డోనల్డ్ ట్రంప్ మంగళవారం ట్రూత్ సోషల్‌లో చేసిన వ్యాఖ్యలపై స్టార్మర్ స్పందించారు.
ఇరాన్ యుద్ధంలో చేరాలని తనపై తీవ్ర ఒత్తిడి ఉందని, కానీ తాను ఆ నిర్ణయాన్ని మార్చుకోబోనని స్టార్మర్ స్పష్టం చేశారు.
"ఎంత ఒత్తిడి ఉన్నా, ఎంత అలజడి ఉన్నా.. నేను బ్రిటన్ ప్రధానమంత్రిని. మా జాతీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తాను" అన్నారు.
"బ్రిటన్ దీర్ఘకాలిక జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఐరోపాలోని మా మిత్రదేశాలతో, యూరోపియన్ యూనియన్‌తో మరింత సన్నిహిత భాగస్వామ్యం అవసరమని స్పష్టమవుతోంది" అని ప్రధాని స్టార్మర్ పేర్కొన్నారు.
సమీప భవిష్యత్తులో ఈయూ భాగస్వాములతో ఒక సదస్సు జరగనుందని ఆయన ప్రకటించారు.
ట్రంప్‌తో సంబంధాలు దెబ్బతింటున్న తరుణంలో, యూరప్ తో మీరు సన్నిహిత సంబంధాలను పెంచుకుంటున్నారా? అని అడిగిన ప్రశ్నకు స్టార్మర్ స్పందిస్తూ.. తాను అమెరికాకు, ఐరోపా ఖండానికి మధ్య ఎవరినో ఒకరిని ఎంచుకోవడం లేదని చెప్పారు.
"అటు అమెరికాతో, ఇటు ఐరోపాతో బలమైన సంబంధాలను కలిగి ఉండటం మా ప్రయోజనాలకు మంచిదని భావిస్తున్నాను" అని స్టార్మర్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ నేటో?
నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్‌నే సంక్షిప్తంగా నేటో(NATO) అంటారు. అమెరికా, యూకే, కెనడా, ఫ్రాన్స్ సహా 12 దేశాలతో 1949 ఏప్రిల్ 4న ఇది ఏర్పాటైంది.
రష్యా సహా అనేక కమ్యూనిస్టు దేశాల సమాహారమైన సోవియట్ యూనియన్ విస్తరణను అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా నేటోను ఏర్పాటు చేశారు.
నేటో సభ్య దేశాలలో, ఏ దేశంపై దాడి జరిగినా మిగిలిన సభ్యదేశాలు అండగా నిలవాలని సంకల్పించారు.
నేటోకు సొంతంగా సైన్యం లేదు. సంక్షోభ సమయంలో నేటోలోని సభ్యదేశాలన్నీ ఉమ్మడి సైనిక చర్య తీసుకుంటాయి.
ఈ దేశాలన్నీ మిలటరీ ప్రణాళికలపై సమన్వయం చేసుకొంటాయి. ఉమ్మడి సైనిక విన్యాసాలు చేస్తాయి.
నేటోలో ప్రస్తుతం 32 సభ్యదేశాలు ఉన్నాయి.
ఈ నేటో ఎందుకు?
నేటో అధికారికంగా చెప్తున్న ప్రధాన కారణం.. ''ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో సుస్థిరత, శ్రేయస్సులను పెంపొందించటం ద్వారా సభ్య దేశాల స్వాతంత్ర్యం, ఉమ్మడి వారసత్వం, నాగరికతలను సంరక్షించటం''
నేటో సభ్య దేశాల్లో ఏదో ఒక దేశం మీద సాయుధ దాడి జరిగితే.. దానిని తమ అందరి మీదా దాడిగా పరిగణిస్తామని, అందరూ పరస్పర సాయం కోసం ముందుకు వస్తారని నేటో ఒప్పందం స్పష్టంచేస్తోంది.
ఆచరణలో.. ''తన యూరప్ సభ్య దేశాల భద్రత ఉత్తర అమెరికా సభ్య దేశాల భద్రతతో విడదీయలేనంతగా ముడిపడి ఉంద''ని కూటమి చూపుతోంది.
ఈ భద్రతకు సోవియట్ యూనియన్‌ను, కమ్యూనిజాన్ని ప్రధాన ముప్పుగా ఈ సంస్థ పరిగణించింది.
కానీ.. నేటో ఏర్పాటైనప్పటి నుంచీ దాని సరిహద్దులు రష్యా రాజధాని మాస్కోకు 1000 కిలోమీటర్ల సమీపానికి జరిగాయి.
తూర్పు యూరప్‌లో 1989 విప్లవాలు, సోవియట్ యూనియన్ ముగిసిన అనంతరం.. ఒకప్పటి సోవియట్ శాటిలైట్ దేశాలను కూడా తన సభ్య దేశాలుగా నేటో ఇప్పుడు లెక్కిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గతంలోనూ నేటోను తీవ్రంగా విమర్శించారు.
ఆయన 2016లో అధ్యక్ష అభ్యర్థిగా ఉన్నప్పుడే.. నేటోకు కాలం చెల్లిందని, ఆ సంస్థ ముక్కలైతే బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
కూటమి సభ్య దేశాల మీద దాడి జరిగితే రక్షించాలన్న నిబద్ధతకు కట్టుబడి ఉండటానికి అమెరికా తిరస్కరించవచ్చునని - అసలు నేటో నుంచే వైదొలగవచ్చునని కూడా ట్రంప్ అప్పట్లో సంకేతాలిచ్చారు.
నేటో సభ్య దేశాల్లో అన్ని దేశాలకన్నా రక్షణ కోసం అమెరికాయే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతోందని కూడా ఆయన ఫిర్యాదు చేశారు.
''అమెరికా చాలా ఎక్కువ ఖర్చు చేస్తోంది. ఇది న్యాయం కాదు. అమోదనీయమూ కాదు'' అని ఆయన 2018 సెప్టెంబర్‌లో ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































