‘‘ఇరాన్‌లో ప్రతి బ్రిడ్జ్‌ను, పవర్ స్టేషన్‌ను పేల్చేస్తాం’’ అని ప్రకటించిన కొన్ని గంటల్లోనే ట్రంప్ కాల్పుల విరమణను ఎందుకు పొడిగించారు?

ఫొటో సోర్స్, Win McNamee/Getty Images

    • రచయిత, సారా స్మిత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఇరాన్‌తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తన గత ప్రకటనలకు భిన్నమైన వైఖరి ప్రదర్శిస్తూ కాల్పుల విరమణను నిరవధికంగా పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

కాల్పుల విరమణ పొడిగిస్తున్నట్లు ప్రకటించడానికి కొన్నిగంటల ముందు ఆయన సీఎన్‌బీసీ వార్తా సంస్థతో మాట్లాడుతూ "మేం ఇరాన్ మీద బాంబులు వేస్తామని అనుకుంటున్నాను. మా సైన్యం పూర్తిగా సంసిద్ధంగా ఉంది" అని చెప్పారు.

ఇరాన్‌లో వంతెనలు, విద్యుదుత్పత్తి కేంద్రాలన్నింటినీ కూల్చి వేస్తామనే అంశాన్ని ఆయన పునరుద్ఘాటించారు.

కాల్పుల విరమణ కాసేపట్లో ముగుస్తుందనగా యుద్ధాన్ని నిరవధికంగా ఆపేస్తూ కాల్పుల విరమణను కొనసాగించేందుకు అమెరికా అంగీకరించింది.

పాకిస్తాన్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా తెలిపింది.

ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

యుద్ధ సంయంలో డోనల్డ్ ట్రంప్ తన హెచ్చరికలతో ఇరాన్‌ను భయపెట్టేందుకు ప్రయత్నించారు.

అయితే తాజా పరిణామాలు చూస్తే ఆయన వాస్తవాంగా ఇరాన్‌పై దాడి చేసే ఉద్దేశం లేనట్లు కనిపించింది.

ట్రంప్ ప్రకటన వెనక కారణాలేంటి, ఆయన ఎందుకు కాల్పుల విరమణ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు అనే అంశాలపై ముగ్గురు బీబీసీ ప్రతినిధులు విశ్లేషించే ప్రయత్నం చేశారు.

ఫొటో సోర్స్, Leigh Vogel/Getty Images for About Face: Veterans Against The War

ఫొటో క్యాప్షన్, ఇరాన్‌పై అమెరికా చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 20న వాషింగ్టన్‌లో మాజీ సైనికుల కుటుంబాలు నిరసన తెలిపాయి.

అంతర్గత ఒత్తిడి

కాల్పుల విరమణ కొనసాగింపుపై డోనల్డ్ ట్రంప్ ప్రకటన రానున్న రోజుల్లో చర్చలు కొనసాగవచ్చనే సంకేతాలిచ్చింది.

చర్చల్లో ఇరాన్ ప్రతిపాదన ఏంటి? ఇరాన్ ప్రభుత్వం తరపున ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో ట్రంప్‌కు తెలియదని ఆయన పోస్ట్ సూచిస్తోంది.

ఇరాన్ నాయకత్వం బలహీన పడిందని, ఆ దేశ ప్రభుత్వ నిర్ణయాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని ట్రంప్ తరచుగా చెబుతున్నారు.

కాల్పుల విరమణకు ముందు ఇరాన్ మీద దాడి చేసిన స్థాయిలో ఇప్పుడు దాడి చేసేందుకు ట్రంప్ ఇష్టపడటం లేదని ఆయన ప్రకటన చెబుతోంది.

అమెరికాలో రాజకీయ పరిస్థితులు, చమురు ధరలు పెరిగే అవకాశాలు వంటి అంశాల వల్ల ఆయన మళ్లీ యుద్ధం మొదలు పెట్టడం కష్టం కావచ్చు.

కాల్పుల విరమణకు అమెరికా గడువు కూడా ప్రకటించలేదంటే దీనర్థం ఈ సమస్య పరిష్కారానికి డెడ్‌లైన్ ఏదీ లేదు. ఈ వ్యూహం సిద్ధాంతపరంగా అమెరికాకు మరింత సౌలభ్యాన్ని అందిస్తుంది.

అయితే ఇరాన్ పోర్టుల్లో దిగ్బంధనం కొనసాగుతుంది. దీన్ని తాము యుద్ధం మాదిరిగానే పరిగణిస్తామని ఇరాన్ చెబుతోంది. చర్చలకు ఇదొక పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉంది.

ఇలాంటి పరిస్థితుల మధ్య ఇరాన్ కావాలనుకుంటే పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరగవచ్చు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఏప్రిల్ ప్రారంభంలో ఇరాన్‌లోని తెహ్రన్ -కరాజ్ నగరాలను కలుపుతూ నిర్మించిన బి వన్ బ్రిడ్జ్‌లో కొంత భాగాన్ని అమెరికా కూల్చివేసింది.

యుద్ధం చేయడంలో ట్రంప్‌కు ఆసక్తి లేదు

ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా డోనల్డ్ ట్రంప్‌కు మరింత సమయం లభిస్తుంది.

ఒప్పందం కుదుర్చుకోండి లేదా బుధవారం నుంచి యుద్ధం మొదలవుతుందని ట్రంప్ హెచ్చరిస్తూ వస్తున్నారు.

ఈ మాటలు చెబుతూనే అనూహ్యంగా కాల్పుల విరమణను నిరవధికంగా పొడిగించారు.

ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఇరాన్‌పై వైమానిక దాడుల్ని పునరుద్ధరిస్తామన్న తన హెచ్చరికల్ని ప్రస్తుతానికి అమలు చేయకూడదని ట్రంప్ నిర్ణయించుకున్నారు.

రానున్న రోజుల్లో కూడా ఆయన మళ్లీ ఇదే నిర్ణయం తీసుకుంటారని తాజా ప్రకటన చెబుతోంది.

కాల్పుల విరమణ ఎంత కాలం ఉంటుందో డోనల్డ్ ట్రంప్ స్పష్టంగా చెప్పలేదు. యుద్ధం ముగించేందుకు ఇరాన్ "సమగ్రమైన ప్రతిపాదన"తో వచ్చేందుకు వీలుగా సమయం ఇస్తున్నట్లు మాత్రమే చెప్పారు.

ఇరాన్ మీద యుద్ధం తీవ్రం చేస్తానని చెప్పిన ట్రంప్ వెనక్కి మళ్లడం గత రెండు వారాల్లో ఇది రెండోసారి.

ఇందులో యుద్ధాన్ని నెమ్మదిగా ముగించాలన్న వ్యూహం కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Majid Saeedi/Getty Images

ఫొటో క్యాప్షన్, ఏప్రిల్ 17న తెహ్రాన్‌లో ప్రభుత్వానికి అనుకూలంగా ప్రదర్శన నిర్వహించారు.

పరిష్కారం కాని సమస్యలు

అమెరికా తాజా నిర్ణయం ఆ దేశంతో పాటు ప్రపంచానికి ఉపశమనం కలిగిస్తుంది. ఇరాన్‌పై మరిన్ని దాడులు చేసి, మరింత విధ్వంసం సృష్టించే విషయంలో ట్రంప్ ఒకడుగు వెనక్కి వేశారు.

ఇరాన్‌లో నాయకత్వం విచ్ఛిన్నమైందని ట్రంప్ ప్రస్తావించడం ఆశ్చర్యం కలిగించే అంశం. దీన్ని బట్టి చూస్తే ఇరాన్‌లో ఎవరితో చర్చలు జరపాలి, ఇరాన్ ముందు ఏ ప్రతిపాదనలు ఉంచాలనే దానిలో అమెరికాకు ఇంకా స్పష్టత లేనట్లు కనిపిస్తోంది.

ఇరాన్ విషయంలో అమెరికా ప్రతిపాదనలు స్పష్టంగా ఉన్నాయి. అవి హార్ముజ్‌ను తెరిపించడం, ఇరాన్ అణు శుద్ధి సామర్థ్యాలను కట్టడి చేయడం.

అణుబాంబు తయారు చేసే ఉద్దేశం లేదని ఇరాన్ ప్రస్తుతం చెబుతున్నా భవిష్యత్‌లో అలాంటి అవకాశాన్ని వదులుకోగూడదని అనుకుంటున్నట్లు సందేహాలు వస్తున్నాయి.

రెండువైపులా పరిష్కరించుకోవల్సిన ముఖ్యమైన, క్లిష్టమైన అంశాలు చాలా ఉన్నాయి.

కాల్పుల విరమణ ముగింపు దశకు చేరుకుని, దాడులు మళ్లీ ప్రారంభం అవుతాయనే ఆందోళనల మధ్య అమెరికా ప్రభుత్వం వెనక్కి మళ్లింది.

ఈ పరిస్థితుల మధ్య తర్వాత ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

ఫొటో సోర్స్, REUTERS/Akhtar Soomro

ఫొటో క్యాప్షన్, అమెరికా- ఇరాన్ మధ్య మంగళవారం ఇస్లామాబాద్‌లో జరగాల్సిన రెండో విడత చర్చలు వాయిదా పడ్డాయి.

కాల్పుల విరమణ ఒప్పందంలో నిబంధనలు

ఏప్రిల్ 8న ఇరాన్ అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇది బుధవారంతో ముగిసింది.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

ఇజ్రాయెల్- లెబనాన్ కాల్పుల విరమణ పరిస్థితులు:

ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కూడా కాల్పుల విరమణ జరిగింది.

  • ఏప్రిల్ 16న ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య కాల్పుల 10 రోజుల విరమణ అమల్లోకి వచ్చినట్లు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.
  • 1933 తర్వాత ఈ రెండు దేశాల మధ్య తొలిసారి ప్రత్యక్ష చర్చలు జరిగాయి.
  • లెబనాన్‌లో కాల్పుల విరమణ తర్వాత హార్ముజ్ జలసంధిని పూర్తిగా తిరిగి తెరిచినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి తెలిపారు.
  • పోర్టుల్లో దిగ్భంధనాన్ని ఎత్తివేసేందుకు అమెరికా నిరాకరించడంతో ఇరాన్ మళ్లీ హార్ముజ్ జలసంధిని మూసివేసింది.
  • కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం తమపై దాడి జరిగే అవకాశం, ఆత్మరక్షణ కోసం ఎప్పుడైనా దాడులు చేసేందుకు ఇజ్రాయెల్‌కు అధికారం ఉంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)