చనిపోయాడనుకుని ‘సమాధి’ చేస్తే... 16 రోజుల తరువాత ‘‘నన్ను బయటకు లాగండి’’ అంటూ కేకలు పెట్టాడు

అబ్దుల్ వహాబ్‌ను శిథిలాల నుంచి ప్రాణాలతో కాపాడారు

ఫొటో సోర్స్, QASIM

ఫొటో క్యాప్షన్, అబ్దుల్ వహాబ్‌ను శిథిలాల నుంచి ప్రాణాలతో కాపాడారు
    • రచయిత, అజీజుల్లా ఖాన్
    • హోదా, బీబీసీ ఉర్దూ, పెషావర్
  • చదివే సమయం: 4 నిమిషాలు

ఒక ఘోర ప్రమాదం జరిగినప్పుడు, అందులో చనిపోయారనుకున్న తమ వాళ్లు ప్రాణాలతో క్షేమంగా ఉన్నారని తెలిస్తే ఆ కుటుంబం పొందే ఆనందాన్ని అంచనా వేయలేం.

అబ్దుల్ వహాబ్ కుటుంబానికి ఇలాంటి వార్త సంతోషంతో పాటు నమ్మలేనంత ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఎందుకంటే, ఒక పెద్ద ప్రమాదంలో వహాబ్ మరణించారని భావించిన ఆయన కుటుంబ సభ్యులు 'అతని మృతదేహానికి' అంత్యక్రియలు చేశారు.

ఇది జరిగిన 16 రోజుల తర్వాత, వారికి అబ్దుల్ వహాబ్ బతికే ఉన్నారనే కబురు అందింది.

పాకిస్తాన్‌లోని ఖైబర్ పంఖ్తూన్‌ఖ్వా రాష్ట్రం మర్దాన్ ప్రాంతంలోని ఒక మార్బుల్ గనిపై మార్చి 31న ఒక భారీ కొండచరియ విరిగిపడింది. ఆ సమయంలో గనిలో 12 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అందులో 9 మంది ఈ ప్రమాదంలో చనిపోగా, ఇద్దరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి ఆచూకీ తెలియకపోవడంతో అతని కోసం గాలిస్తున్నారు. ఇన్ని రోజుల వెతుకులాట తర్వాత, శిథిలాల కుప్ప నుంచి ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు.

అయితే అతను అందరూ కనిపించడంలేదనుకుంటున్న వ్యక్తి కాదు. 16 రోజుల కిందట కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తిచేసిన అబ్దుల్ వహాబ్.

గనిప్రమాదంలో మరణించినవారిలో ఒకరిని వహాబ్‌గా భావించి కుటుంబసభ్యులు అంత్యక్రియలు చేశారు.

ఓ మృతదేహాన్ని అబ్దుల్‌ వహాబ్‌దిగా భావించి అంత్యక్రియలు చేసినట్లు వారి బంధువు ఫజల్ మన్నన్ చెప్పారు.

'మృతదేహంపై ఉన్న దుస్తులు చూసి అబ్దుల్ వహాబే అనుకున్నాం. పైగా ఆ మృతదేహం బాగా పాడై ఉండటంతో మాకేం అర్థం కాలేదు. ముఖాన్ని సరిగ్గా గుర్తించలేకపోయాం' అని ఆయన తెలిపారు.

అబ్దుల్ వహాబ్ సోదరుడు నాసిర్ నుంచి ఏప్రిల్ 16న ఉదయం తనకు ఫోన్ వచ్చినట్లు ఫజల్ చెప్పారు.

'ఫోన్‌లో అతను ఏడుస్తూనే అబ్దుల్ వహాబ్ బతికే ఉన్నాడని చెప్పాడు. ఆ విషయం చెప్పి నాసిర్ మళ్లీ ఏడ్వటం మొదలుపెట్టాడు. ఏప్రిల్15వతేదీ రాత్రి నేను అబ్దుల్ అమ్మానాన్నతో ఉన్నాను. అప్పుడు వాళ్లమ్మ చాలా దిగులుగా ఉంది. ఏడాదిన్నర క్రితమే సౌదీ అరేబియా నుంచి అనారోగ్యంతో తిరిగొచ్చిన ఆమె మరో కుమారుడు కూడా అప్పుడే చనిపోయారు' అని ఫజల్ వివరించారు.

ప్రమాదం జరిగిన 16 రోజుల తర్వాత, ప్రమాదానికి గురైన గని నుంచి అబ్దుల్ వహాబ్ ప్రాణాలతో క్షేమంగా తిరిగి రావడంతో వారి కుటుంబీకులు, బంధువులు ఆనందంగా ఉన్నారు.

మర్దాన్ ఆసుపత్రిలో అబ్దుల్ వహాబ్ చికిత్స పొందుతున్నారు

ఫొటో సోర్స్, QASIM

ఫొటో క్యాప్షన్, మర్దాన్ ఆసుపత్రిలో అబ్దుల్ వహాబ్ చికిత్స పొందుతున్నారు

అబ్దుల్ వహాబ్ ఎలా దొరికాడు?

ఈ గాలింపు చర్యల్లో గనిలో పనిచేసే కార్మికులు, వారి బంధువులు, ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు సహాయం చేశారని ఫజల్ మన్నన్ చెప్పారు.

అబ్దుల్ వహాబ్ సోదరుడు నజీబుల్లా కూడా మార్బుల్ గనిలోనే పనిచేస్తారు.

'గత 16-17 రోజులుగా కనిపించకుండా పోయిన మా సహచరుని కోసం గాలిస్తున్నాం. గాలింపు చర్యల కోసం మైన్స్‌లోని భారీ మెషీన్లు కూడా వాడారు.

మేం అబ్దుల్ వహాబ్ కోసం నమాజ్-ఎ-జనాబీ కూడా చదివాం. కానీ, గురువారం తవ్వకాలు జరుపుతుండగా ఆయన ప్రాణాలతో దొరికారు.

మేం గనిలోపలి నుంచి శిథిలాలను తొలగిస్తున్నాం. సాయంత్రానికి సొరంగం దగ్గరకు చేరుకుంటామనుకున్నాం. కానీ, మధ్యాహ్నం సమయంలో తవ్వకాలు జరుపుతుండగా, 'నేను బతికే ఉన్నాను, నన్ను బయటకు తీయండి' అంటూ ఒక అరుపు వినిపించింది.

అది విని మేం చాలా ఆశ్చర్యపోయాం. వెంటనే శిథిలాలను తొలగిస్తుండగా వహాబ్ ప్రాణాలతో దొరికారు' అని ఆయన వివరించారు.

దుస్తులను చూసి పొరబడ్డారు

సామాజిక కార్యకర్త మొహమ్మద్ ఖాసిమ్ మాట్లాడుతూ, తాను మార్చి 31 నుంచి గని వద్దే ఉన్నానని, గాలింపు చర్యల్లో పాల్గొన్నానని చెప్పారు.

'మృతదేహాలను బయటకు తీసుకు వస్తున్నప్పుడు అబ్దుల్ వహాబ్ కుటుంబీకులు ఒక శవానికి ఉన్న దుస్తుల్ని చూసి అతనే అయ్యుండొచ్చనుకున్నారు' అని ఆయన తెలిపారు.

ఇప్పుడు అబ్దుల్ వహాబ్ బతికే ఉండటంతో, అంత్యక్రియలు పూర్తయి, సమాధి చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి డిప్యూటీ కమిషనర్ ఒక కమిటీ వేశారని రెస్క్యూ 1122 మర్దాన్ బృందం అధికార ప్రతినిధి చెప్పారు. డీఎన్ఏ పరీక్ష ద్వారా ఆ వ్యక్తిని గుర్తిస్తామని తెలిపారు.

అబ్దుల్ వహాబ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని మొహమ్మద్ ఖాసిమ్ చెప్పారు.

గత నెలలో గనిలో పనిచేయడానికి వచ్చిన కార్మికులు తమ మెషీన్లను శుభ్రం చేసుకొని టీ తాగుతుండగా అకస్మాత్తుగా ఓ భారీ కొండచరియ విరిగిపడింది.

ఘటన జరిగినప్పుడు బీబీసీతో మాట్లాడిన ఖాసిమ్.. ఈ ప్రమాదం మర్దాన్ జిల్లా పలోడేరీ నాగ్ ఆబాద్ ప్రాంతంలో జరిగినట్లు చెప్పారు.

ఆ ప్రాంతంలో కొన్ని రోజులుగా వర్షం కురుస్తోందని, అప్పటికి ఇంకా మైనింగ్ పనులు ప్రారంభం కాలేదని తెలిపారు.

ఖైబర్ పంఖ్తూన్‌ఖ్వాలో భారీగా మార్బుల్, ఇతర ఖనిజాల గనులు ఉన్నాయి. మర్దాన్ జిల్లాలోని రుస్తమ్, కాట్‌లంగ్, బైజై ప్రాంతాల్లోనూ మార్బుల్ గనులు ఉంటాయి. ఈ ప్రాంతాల్లోని గనుల్లో సుమారు 75 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని ఒక అంచనా.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)