You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వీకే శశికళ: నెచ్చెలి నుంచి నాయకురాలి వరకు, రాజకీయ ప్రస్థానం ఎలా సాగిందంటే..
- రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 9 నిమిషాలు
చాలాకాలంగా రాజకీయంగా అజ్ఞాతంలో ఉన్న వీకే శశికళ మళ్లీ క్రియాశీలకంగా మారారు.
ఇంతకుముందు పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆమె, తన పార్టీ పేరును ప్రకటించారు.
పోయెస్ గార్డెన్‌లోని నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, "ఒక విధేయుడైన కార్యకర్త ప్రారంభించిన పార్టీలో చేరాను. పార్టీపేరు ఆల్ ఇండియా పురచ్చి తలైవర్ మక్కళ్ మున్నేట్ర కళగం" అని చెప్పారు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నెచ్చెలిగా పేరుగాంచిన శశికళ రాజకీయంగా అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లారు?
జయలలిత స్నేహితురాలు అనేది మాత్రమే ఆమెకున్న గుర్తింపా? వీకే శశికళ రాజకీయ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది?
వీడియో షాపుతో మొదలు పెట్టి..
సాధారణ కుటుంబంలో ఒక కుటుంబ పెద్దగా మొదలై.. తమిళనాడులో శక్తివంతురాలైన మహిళకు స్నేహితురాలిగా మారడం, అధికార పార్టీకి నాయకురాలవడం, ఆ తర్వాత జైలు పాలవడం వరకు శశికళ జీవితంలో అనేక మలుపులు ఉన్నాయి.
1984లో చెన్నైలోని అళ్వార్‌పేట్‌లోని భీమన్న తోట వీధిలో వినోద్ వీడియో విజన్ పేరుతో శశికళకు ఒక వీడియో షాపు ఉండేది. ఆమె భర్త ఎం.నటరాజన్ కడలూర్ జిల్లాలో ప్రభుత్వ ప్రజా సంబంధాల అధికారిగా పని చేసేవారు. అప్పట్లో ఆ జిల్లాకు చంద్రలేఖ కడలూర్ జిల్లా కలెక్టర్‌గా పని చేసేవారు.
ఆ సమయంలో కడలూర్ జిల్లాలో జయలలిత బహిరంగ సభలకు సంబంధించిన వీడియోల రికార్డింగ్ హక్కుల్ని వినోద్ వీడియో విజన్‌కు ఇచ్చారు కలెక్టర్ చంద్రలేఖ. అలా జయలలితకు శశికళ తొలిసారి పరిచయం అయ్యారు.
ఈ పరిచయం సాధారణమే అయినప్పటికీ ఆ తర్వాతి పరిణామాల్లో అది అసాధారణ పరిస్థితులకు దారితీసింది.
అ పరిణామాల గురించి తెలుసుకోవడానికి ముందు శశికళ గురించి కొంత ప్రాథమిక సమాచారం తెలుసుకుందాం.
శశికళ 1956లో తంజావూరు జిల్లాలోని తిరుత్తరై పూండి గ్రామంలో వివేకానందన్, కృష్ణవేణి దంపతులకు జన్మించారు. ఆమెకు నలుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. సుందరవదనన్, వినోదగన్, జయరామన్, దివాకరన్ సోదరులైతే సోదరి పేరు వనితామణి.
ఆమె పుట్టింది తిరుత్తరైపూండి అయినప్పటికీ, ఆమె పుట్టిన కొన్నేళ్ల తర్వాత కుటుంబం మన్నార్‌గుడి వెళ్లింది. శశికళ పదో తరగతి వరకు అక్కడే చదివారు.
మన్నార్‌గుడిలోని విలార్ గ్రామానికి చెందిన ఎం.నటరాజన్‌ను శశికళ పెళ్లాడారు. తంజావూరులో ప్రముఖ నాయకుడు మన్నై నారాయణ స్వామి నాయకత్వంలో 1973లో ఈ పెళ్లి జరిగింది.
ఈ పెళ్లికి నాటి ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి హాజరయ్యారు.
జయలలితతో సాన్నిహిత్యం
1984లో, జయలలిత అన్నాడీఎంకే ప్రచార కార్యదర్శిగా ఉన్న సమయంలో పరిచయమైన శశికళ ఆమె నమ్మకాన్ని సాధించారు. జయలలిత రాజ్యసభ సభ్యురాలైన తర్వాత ఆమెను కలిసేందుకు దిల్లీ వెళ్లేంత సాన్నిహిత్యం ఏర్పడింది.
అప్పటి ముఖ్యమంత్రి ఎంజీఆర్ మరణం తర్వాత వారి సాన్నిహిత్యం మరింత పెరిగింది.
శశికళ 1988 నుంచి పోయెస్ గార్డెన్‌లోని జయలలిత ఇంట్లోనే శాశ్వతంగా ఉంటూ వచ్చారు. ఆ సమయంలో జయలలిత శశికళ మీద ఎక్కువగా ఆధారపడేవారు.
ఎంజీఆర్ మరణం తరవాత పార్టీ రెండుగా చీలిపోయింది. 1988లో జయలలిత వర్గానికి చెందిన జనరల్ కమిటీ సమావేశమైనప్పుడు శశికళ దంపతులు విశ్వసించే వారినే పాలక కమిటీలోకి తీసుకున్నారు.
పోయెస్ గార్డెన్‌లో శశికళ ప్రభావం అంతగా పెరిగింది.
జయలలిత 1991లో తొలిసారి తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత శశికళ ఆమెకు సర్వస్వం అయ్యారు.
అప్పటి నుంచి పార్టీ కార్యకర్తలు జయలలితను 'అమ్మ' అని, శశికళను 'చిన్నమ్మ' అని పిలవడం మొదలైంది.
జయలలిత ఎక్కడకు వెళ్లినా శశికళ ఆమె వెంట ఉండేవారు. అంతకుముందే అన్నాడీఎంకేలో శశికళ భర్త నటరాజన్, ఆమె సోదరులు, వారి కుటుంబ సభ్యుల ప్రభావం పెరగడం మొదలైంది.
శశికళను జయలలిత ఏ స్థాయిలో నమ్మారంటే శశికళ మేనల్లుడు వీఎన్ సుధాకరన్‌ను1995లో దత్తత తీసుకున్నారు.
సుధాకరన్‌కు అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు జయలలిత. అందుకోసం భారీగా ఖర్చు చేశారు. ఆ పెళ్లి గిన్నిస్ రికార్డుల్లోకి కూడా ఎక్కింది.
అన్నాడీఎంకే నుంచి బహిష్కరణ
జయలలిత మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నాడీఎంకేలోని కొంతమంది సీనియర్ లీడర్లు పార్టీని వీడటం ప్రారంభించారు.
దీని వెనుక శశికళ ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. శశికళ బంధువులపై అక్రమారోపణలు కూడా సీనియర్ లీడర్లు పార్టీని వదిలి వెళ్లడానికి కారణం అని ప్రజల్లో చర్చ జరిగింది.
1996లో జయలలిత ప్రభుత్వం పడిపోయిన తర్వాత, శశికళ విషయంలో పార్టీలో తీవ్ర స్థాయిలో అసమ్మతి రేగింది. 1996 ఆగస్టులో శశికళ, వీఎన్ సుధాకరన్‌లను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు జయలలిత ప్రకటించారు.
అయితే, ఇది ఎక్కువ కాలం కొనసాగలేదు. 1997 ఆగస్టులో శశికళ తిరిగి పోయెస్ గార్డెన్‌లోకి అడుగుపెట్టారు.
2011లో జయలలిత తిరిగి ముఖ్యమంత్రి అయినప్పుడు శశికళ తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని భావించారు. దీంతో 2011 డిసెంబర్ 19న ఆమె శశికళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులను పార్టీ నుంచి బహిష్కరించారు.
ఇందులో భాగంగా శశికళను కూడా పోయెస్ గార్డెన్ నుంచి పంపించేశారు.
నటరాజన్, దివాకరన్, దినకరన్, భాస్కరన్, సుధాకరన్, డాక్టర్ వెంకటేష్, రామచంద్రన్, రావణ, మోహన్, ఇంకా అనేక మందితో పాటు శశికళ బంధువులందర్నీ అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు.
నటరాజన్, దివాకరన్, మోహన్ ఇంకా కొంతమందిని అరెస్ట్ చేశారు.
అయితే, ఈ విభేదాలు ఎక్కువ కాలం కొనసాగలేదు. ఈ సంఘటన జరిగిన మూడు నెలల తర్వాత 2012 మార్చి 28న శశికళ రాశారని చెప్పే లేఖ ఒకటి మీడియాలో వచ్చింది.
తనకు పార్టీ మీద ఎలాంటి ఆసక్తి లేదని, తాను ప్రజా ప్రతినిధి అవ్వాలని అనుకోవడం లేదని, అక్కకు నిజమైన చెల్లెలిగా ఉండాలనుకుంటున్నా అనేది ఆ లేఖ సారాంశం.
దీని తర్వాత మార్చి 31న జయలలిత శశికళను తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి వారి స్నేహం జయలలిత మరణం వరకు కొనసాగింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణ కేసులో 2014లో వాళ్లిద్దరూ జైలుకెళ్లారు.
పార్టీ నిర్ణయాల్లో కీలక పాత్ర
జయలలితకు తోడు నీడగా ఉన్నప్పటికీ ఆమె బతికి ఉన్నన్నాళ్లూ ఆమె ఎప్పడూ పార్టీలో ముందువరుసలో కనిపించలేదు. అయితే, పార్టీకి సంబంధించి కీలక సమయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు ఆమే తీసుకునే వారని అనేక మంది భావిస్తారు.
ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపికలో శశికళ ప్రభావం గురించి అన్నాడీఎంకేలో అందరికీ తెలుసు.
2002లో జయలలిత ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి వీలుకానప్పుడు, శశికళ సూచన మేరకు పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రిని చేశారు.
ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపికలో శశికళ కూడా కీలకపాత్ర పోషించేవారు. పార్టీలో ప్రతీ స్థాయిలోనూ అమె ప్రభావం ఉండేది.
2016లో అనారోగ్యంతో జయలలిత ఆసుపత్రిలో చేరినప్పుడు, ఆమెను చూసేందుకు శశికళ, ఆమె కుటుంబ సభ్యులు తప్ప ఇతరులు ఎవరినీ అనుమతించలేదనే ఆరోపణలు ఉన్నాయి.
అదే ఏడాది డిసెంబర్‌లో జయలలిత చనిపోయారు. శశికళ సూచనతో అర్థరాత్రి ఓ. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
జయలలిత చనిపోయిన తర్వాత ఆమె మృతదేహాన్ని రాజాజీ హాల్‌లో ఉంచారు. జయలలిత జీవించి ఉన్నప్పుడు బహిష్కరణ ఎదుర్కొన్న శశికళ బంధువులు జయలలిత మృతదేహం చుట్టూ నిలబడి ఉండటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
జయలలిత మరణానంతరం..
తర్వాత కొద్ది రోజులకే శశికళ అసలు ఆలోచనలు బయటకు రావడం మొదలైంది. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రైన తర్వాత మంత్రులందరూ ప్రతిరోజూ పోయెస్ గార్డెన్‌కు వెళ్లి పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని శశికళను కోరేవారు.
దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు మీడియాలో వచ్చేవి.
జయలలిత చనిపోయిన కొన్ని రోజుల తర్వాత 2016 డిసెంబర్ 10న తమిళ దినపత్రికల్లో ఒక ఫుల్ పేజ్ ప్రకటన వచ్చింది. అందులో "మృత్యువు తనను జయిస్తుందని విప్లవ నాయకి అమ్మకు తెలిసి ఉంటే, నా తర్వాత అంతా చిన్నమ్మే అని చెబుతూ దేవుడి వద్దకు వెళ్లి ఉండేది" అని ఉంది.
ఆ ప్రకటన కింద వ్యక్తులు, సంస్థలు, పార్టీల పేరు లేదు. 'విశ్వాసపాత్రుడైన సేవకుడి మనస్సాక్షి' అని రాసి ఉంది.
అదే రోజు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఒక ప్రకటన చేశారు.
"జయలలిత మాదిరిగా పార్టీని సైనిక వ్యవస్థ మాదిరిగా నడపేందుకున్న ఏకైక మార్గం శశికళ జనరల్ సెక్రటరీ కావడమే" అని ఆయన చెప్పారు.
"నాకు పార్టీలో పెద్ద పదవులు చేపట్టాలని లేదా మంత్రి కావాలని, పాలనలో భాగస్వామ్యం కావాలనే కోరిక లేదు" అని జయలలితకు లేఖ రాసిన శశికళ.. డిసెంబర్ 29న జరిగిన అన్నాడీఎంకే జనరల్ కమిటీ సమావేశంలో జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు.
2017 ఫిబ్రవరి 5న పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. దీంతో గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిసిన శశికళ తనకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతుందని, తనను ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు ఆహ్వానించాలని కోరారు.
అయితే, గవర్నర్ తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఈ పరిస్థితుల్లో 2017 ఫిబ్రవరి 14న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కింది కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో శశికళతో పాటు ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్ జైలుకెళ్లాల్సి వచ్చింది.
సమాధిపై శపథం
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావిస్తున్న సమయంలో సుప్రీంకోర్టు తీర్పుతో ఆమె రాజకీయ జీవితం దాదాపు ముగిసింది.
ఆ తర్వాత ఎడప్పాడి పళని స్వామిని ముఖ్యమంత్రిని చేశారు శశికళ. జైలుకెళ్లడానికి ముందు జయలలిత సమాధి వద్దకు వెళ్లి.. సమాధిపై కొడుతూ శపథం చేశారు. ఆ తర్వాత ఆమెను బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలుకు తరలించారు.
ఆమె జైలులో ఉండగా తమిళ రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చాయి. టీటీవీ దినకరన్ సహా ఆమె బంధువులందర్నీ అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు. టీటీవీ దినకరన్ ఏఐఏడీఎంకే పేరుతో కొత్త పార్టీ ప్రారంభించారు. 2017 నవంబర్‌లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు శశికళ, ఆమె బంధువులకు సంబంధించిన 180 ప్రాంతాల్లో దాడులు చేసి కోట్ల రూపాయల ధనాన్ని సీజ్ చేశారు.
ఇదంతా కొనసాగుతూ ఉండగానే శశికళ భర్త నటరాజన్ అనారోగ్యం పాలయ్యారు. శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత కోలుకున్న నటరాజన్ శశికళను పెరోల్ మీద బయటకు తీసుకొస్తానని, ఆమె తమిళనాడు అంతటా పర్యటిస్తారని ప్రకటించారు.
అయితే, 2018 మార్చిలో ఆయన మరణించారు. ఆయన మరణంపై అన్నాడీఎంకే నుంచి చిన్న సంతాప సందేశం కూడా వెలువడలేదు.
జైలు శిక్ష పూర్తి కావడంతో శశికళ 2021 జనవరి 27న విడుదలయ్యారు.
ఆ తర్వాత ఆమెకు కరోనా సోకింది. ఆమె కర్ణాటకలోనే కొన్ని రోజులుండి చికిత్స చేయించుకుని తిరిగొచ్చారు.
ఫిబ్రవరి 8న బెంగళూరు సమీపంలోని దేవనహళ్లి వద్ద నుంచి బయల్దేరి వచ్చిన శశికళకు అన్నాడీఎంకే కార్యకర్తలు స్వాగతం పలికారు.
ఆమె కారుకు అన్నాడీఎంకే జెండా తగిలించుకుని రావడం చర్చకు దారితీసింది. వనియంబాడి దగ్గర తన కారు ఆపి "నన్ను అణచి వేయాలంటే లొంగిపోను" అని చెప్పారు.
రాజకీయాలకు దూరంగా.. దగ్గరగా..
తమిళనాడు తిరిగి వచ్చిన తర్వాత శశికళ రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో 2021 మార్చి 3న శశికళ తాను రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు.
"నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను. జయలలిత అధికారంలోకి రావాలని ప్రార్థిస్తాను" అని చెప్పారు.
2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయింది. దీని తర్వాత పార్టీలో నాయకత్వంపై పెద్దయెత్తున గందరగోళం చెలరేగింది.
ఈ సమయంలోనే శశికళ మరోసారి అన్నాడీఎంకే వైపు దృష్టి సారించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆడియోలు విడుదల చేయడం మొదలు పెట్టారు.
"అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ" పేరిట ప్రకటనలు జారీ చేశారు. అన్నాడీఎంకే కూటమి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత శశికళ ఒక ప్రకటన జారీ చేశారు.
"పార్టీని సంఘటితం చేసేందుకు నేను చాలా ప్రయత్నాలు చేశాను. కొంతమంది వ్యక్తుల ఇష్టాయిష్టాల కారణంగా పార్టీ నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోలేను. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. అందుకోసం మనం తక్షణం పని చేయడం మొదలుపెట్టాలి. తమిళనాడు కోసం, ప్రజలు, పార్టీ కోసం అందరూ కలిసి రావాలి. సమైక్యంగా పని చేయాలి" అని అందులో కోరారు.
ఆ తర్వాత ఆమె కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు. ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కొత్తపార్టీతో ముందుకొచ్చారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)