కేవలం 15 నిమిషాల్లోనే ఇంటిపనికి, వంటపనికి వర్కర్.. ఆన్‌లైన్ స్టార్టప్‌ల దూకుడు వర్కర్లకు భరోసానా, భారమా?

    • రచయిత, నికితా యాదవ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 6 నిమిషాలు

దిల్లీ సమీపంలోని నోయిడాలో ఒక మంగళవారం మధ్యాహ్నం, సీమ కుమారి అనే మహిళ ఊదా రంగు టీషర్ట్ ధరించి పనికి వచ్చారు. వంటగది, బాల్కనీ శుభ్రం చేయడం, మంచం సర్దడం, గచ్చు తుడవడం వంటి పనులన్నీ కేవలం 55 నిమిషాల్లోనే పూర్తయ్యాయి.

సీమ 'అర్బన్ కంపెనీ'లో పనిచేస్తున్నారు. ఈ యాప్ ద్వారా క్లీనింగ్ నుంచి బ్యూటీ సర్వీసెస్ వరకు కేవలం 15 నిమిషాల వ్యవధిలో బుక్ చేసుకోవచ్చు.

దేశంలో చాలాకాలంగా తెలిసిన వారి ద్వారానే ఇంటిపనిలో సహాయకులను వెతుక్కునేవారు. వారికి నగదు రూపంలో జీతాలు ఇస్తుండేవారు. ఇప్పుడు స్టార్టప్ కంపెనీలు ఈ సేవలను ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చాయి. నగరాల్లో చిన్నచిన్న పనుల కోసం 'ఆన్-డిమాండ్' బుకింగ్ సదుపాయం కల్పిస్తున్నాయి.

సుమారు 3 కోట్ల మంది ఇంటిపని సహాయకులు ఉన్న ఈ భారీ మార్కెట్‌లోకి కంపెనీలు అడుగుపెడుతున్నాయి. వీరిలో ఎక్కువ మంది ఇతర ఉపాధి అవకాశాలు లేని మహిళలే.

గతేడాది ప్రారంభమైన 'ప్రోంటో' సంస్థకు కేవలం 10 నెలల్లోనే రోజుకు 15,000 బుకింగ్‌లు వస్తున్నాయి. దిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో వీటికి ఆదరణ ఎక్కువగా ఉంది.

ఓవైపు ఆదాయం, మరోవైపు జరిమానాలు

భారత్‌లో ఇంటిపని అనేది తక్కువ వేతనం వచ్చే, రక్షణ లేని పని. వీటికి సంబంధించి సరైన నిబంధనలు లేవు.

అర్బన్ కంపెనీ, ప్రోంటో వంటి సంస్థలు శిక్షణ, అనువైన ధరలు, డిజిటల్ చెల్లింపుల ద్వారా ఈ రంగాన్ని క్రమబద్ధీకరించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇది వర్కర్లకు కొత్త అవకాశాలను ఇస్తున్నా, అదే సమయంలో ఒత్తిడిని, నియంత్రణను కూడా పెంచుతోంది.

ఈ ప్లాట్‌ఫామ్‌లో చేరకముందు సీమ ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో నెలకు 10,000 నుంచి 14,000 రూపాయల వరకు సంపాదించేవారు. అర్బన్ కంపెనీలో నియామకాలు జరుగుతున్నాయని తెలిసి, గత ఏడాది ఆ ఉద్యోగం మానేశారు.

"నేను ఇప్పుడు నెలకు సుమారు 20,000 రూపాయల వరకు సంపాదిస్తున్నా. ఈ ఆదాయం నా ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి సహాయపడుతోంది" అని సీమ అన్నారు.

అయితే, ఈ కొత్త విధానం ఆమెకు ముందెన్నడూ లేని కొత్త సవాళ్లను తెచ్చిపెట్టింది. ప్రతిసారీ పని పూర్తయ్యాక, మంచి రేటింగ్ ఇవ్వాలని ఆమె కస్టమర్‌ను కోరుతున్నారు. భవిష్యత్తులో పని రావాలంటే ఇది చాలా ముఖ్యం. తక్కువ రేటింగ్ వస్తే బుకింగ్‌లు తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆమె అంటున్నారు.

సాధారణ పనుల్లా కాకుండా, ఈ ప్లాట్‌ఫామ్ పనులు అల్గారిథమ్స్ ఆధారంగా నడుస్తాయి. ఇవి పనులను కేటాయించడం, పనితీరును గమనించడం, జరిమానాలు విధించడం వంటివి చేస్తాయి.

అయినప్పటికీ, పాత పద్ధతిలో ఇంటి పనులు చేయడం కూడా అంత సులభమేమీ కాదు. ఎక్కువ గంటలు పనిచేయాల్సి రావడం, ఏయే పనులు చేయాలనే స్పష్టత లేకపోవడం, జీతాలు ఆలస్యంగా ఇవ్వడం, వేధింపుల వంటివి ఎదురవుతుంటాయి. ఎలాంటి రక్షణ లేకపోవడం వల్ల వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారు.

సీమ నెలకు 25,000 రూపాయలు సంపాదిస్తున్నట్లు కాగితం మీద కనిపిస్తున్నా, బుకింగ్‌ల రద్దు, తక్కువ రేటింగ్స్, ఆలస్యం కారణంగా విధించే జరిమానాల వల్ల ఆమె చేతికి తక్కువ మొత్తమే అందుతోంది.

"నేను ఒక్కసారి మాత్రమే పూర్తి జీతం తీసుకున్నా. అది కూడా ఒక్క సెలవు కూడా తీసుకోకుండా, ప్రతిరోజూ కనీసం 8 గంటలు పనిచేసినప్పుడు" అని సీమ చెప్పారు.

తన నియంత్రణలో లేని కారణాల వల్ల జరిగే ఆలస్యం కూడా ఆమె ఆదాయంపై ప్రభావం చూపుతోంది.

"మేం తరచుగా ఒక చోటు నుంచి మరో చోటుకి నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. కొన్నిసార్లు సెక్యూరిటీ గార్డులు తనిఖీల పేరుతో గేటు వద్దే ఆపేస్తారు. దీనివల్ల మాకు ఆలస్యమవుతుంది. కేవలం ఐదు నిమిషాలు ఆలస్యమైనా మాకు జరిమానా విధిస్తారు" అన్నారు సీమ.

మౌలిక సదుపాయాల కొరత, ఆరోగ్య సమస్యలు

గురుగ్రామ్‌కు చెందిన ఒక వినియోగదారు తన అనుభవాన్ని పంచుకుంటూ.. ఇంటి పని కోసం వచ్చిన మహిళ కొంచెం ఆలస్యంగా రావడంతో సర్వీస్ ప్రొవైడర్ ఆమెకు 10 రూపాయల జరిమానా విధించినట్లు తెలిపారు. ఆ మహిళ తన యాప్‌లో జరిమానా వివరాలను చూపించినట్లు వినియోగదారు చెప్పారు.

బీబీసీ ఈ జరిమానాల గురించి అర్బన్ కంపెనీని సంప్రదించగా, వారు స్పందించలేదు. అయితే, 'ప్రోంటో' కంపెనీ మాత్రం, ఆలస్యంగా వచ్చినందుకు ఎలాంటి జరిమానాలు విధించడం లేదని పేర్కొంది.

వర్కర్లపై కస్టమర్ల రివ్యూలు అదనపు ఒత్తిడిని పెంచుతున్నాయి. ఒకసారి పొరపాటున కర్టెన్ రాడ్ విరిగింది.. "రేటింగ్ తగ్గించకండి, అది నాకు వచ్చే పనిని తగ్గించొచ్చు" అని సదరు వర్కర్ కస్టమర్‌ను బతిమిలాడారు.

సమయానికి సంబంధించిన ఇలాంటి కఠినమైన నిబంధనలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని కార్మిక హక్కుల కార్యకర్తలు వాదిస్తున్నారు.

'వారేం యంత్రాలు కాదు'

"ఎవరినైనా కేవలం 15 నిమిషాల్లో పిలవగానే రావాలని ఆశించడం అమానుషం. వాళ్లు మనుషులు.. యంత్రాలు కాదు" అని సామాజిక కార్యకర్త ఆకృతి భాటియా విమర్శించారు.

ఈ ఒత్తిడి కేవలం పని వేగం మీదనే కాకుండా వేతనాల మీద కూడా ప్రభావం చూపుతోంది.

ఈ ప్లాట్‌ఫామ్‌లు ఒక్కోసారి ఫిక్స్‌డ్ జీతం, మరికొన్నిసార్లు చేసే పనిని బట్టి ప్రోత్సాహకాలు ఇస్తుంటాయి. రేటింగ్స్, అల్గారిథమ్స్ కారణంగా వర్కర్లు ఆదాయం ఎప్పుడు ఎంత ఉంటుందో ఊహించడం కష్టంగా మారింది.

బ్యాంకు ఖాతాల్లో జీతాల జమ, ఆరోగ్యం, ప్రమాద బీమా వంటి సదుపాయాలు కల్పిస్తూ ఈ రంగాన్ని క్రమబద్ధీకరించడమే తమ స్టార్టప్ లక్ష్యమని ప్రోంటో వ్యవస్థాపకురాలు అంజలి సర్దానా అంటున్నారు.

అయితే, చెల్లింపులు క్రమబద్ధీకరించినప్పటికీ, వర్కర్లకు జీతంతో కూడిన సెలవులు, పెన్షన్ వంటి ప్రాథమిక హక్కులు లభించడం లేదని ఆకృతి భాటియా విమర్శించారు.

కార్మిక సంఘాలు లేకపోవడం వల్ల చాలామందికి యాజమాన్యంతో మాట్లాడి తమ సమస్యలను పరిష్కరించుకునే శక్తి ఉండటం లేదు.

కార్మికుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థలు ఉన్నాయని, కస్టమర్ల నుంచి ఇబ్బందులు ఎదురైతే తక్షణమే సహకరిస్తామని ఈ సంస్థలు చెబుతున్నాయి. అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో పెద్దగా మార్పు రావడం లేదు.

పని సమయంలో నీళ్లు తాగడం తగ్గించానంటున్నారు హైదరాబాద్‌‌కు చెందిన అమృత. వరుస బుకింగ్‌ల మధ్యలో టాయిలెట్ సదుపాయం దొరుకుతుందో లేదో అన్న అనుమానంతో షిఫ్టుల సమయంలో నీళ్లు తాగడం మానేశానని ఆమె తెలిపారు.

దేశంలోని చాలా ఇళ్లలో పని మనుషులు తమ బాత్‌రూమ్‌లు వాడటాన్ని యజమానులు ఇష్టపడరు.

వర్కర్ల కోసం విశ్రాంతి గదులు, టాయిలెట్ సదుపాయాలతో కూడిన సర్వీస్ హబ్‌లు ఏర్పాటు చేసినట్లు కంపెనీలు చెబుతున్నా, పని చేసే వారికి ఆ విషయం తెలియడం లేదు. పనుల మధ్య దొరికే సమయంలో వీరు పార్కులు, మెట్లు లేదా బస్టాప్‌లలో వేచి చూస్తున్నారు.

ఒకప్పుడు దొరికే కాస్త విశ్రాంతి సమయం కూడా ఇప్పుడు కరువవుతోంది. గిరాకీ పెరగడంతో విరామ సమయాలు క్రమంగా తగ్గిపోతున్నాయని వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"కొన్నిసార్లు భోజనం చేయడానికి కూడా సమయం ఉండటం లేదు. అది నా ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది" అని సీమ తెలిపారు.

అనుకూలమైన పని గంటలు, పని ఒత్తిడి మధ్య జరిగే ఈ సంఘర్షణ కొత్తేమీ కాదు. దేశంలో ఉబెర్, జొమాటో వంటి సంస్థలు వచ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే కనిపించాయి.

"మనం ఇలాంటిది గతంలోనే చూశాం. ప్రారంభంలో వినియోగదారులను, వర్కర్లను ఆకర్షించడానికి ఈ ప్లాట్‌ఫామ్‌లు ఎక్కువ వేతనాలు, రాయితీలు ఇస్తాయి. కాలక్రమేణా ఆ పరిస్థితులు మారిపోతాయి" అని భాటియా పేర్కొన్నారు.

మారుతున్న సంబంధాలు

పట్టణాల్లో కొంతమంది యువ వినియోగదారులలో ఈ తక్షణ హోమ్ సర్వీసెస్ ప్రజాదరణ పొందుతున్నప్పటికీ, కొన్ని కుటుంబాలు మాత్రం వీటిని ఉపయోగించడానికి ఇంకా వెనకాడుతున్నాయి.

దిల్లీకి చెందిన సుష్మ తన అనుభవాన్ని పంచుకుంటూ.. తమ ఇంట్లో రోజూ పనిచేసే వ్యక్తి రాకపోవడంతో, తన పిల్లలు మొదటిసారి యాప్ ద్వారా క్లీనర్‌ను బుక్ చేశారని.. అయితే తనకు చాలా సందేహాలున్నాయని చెప్పారు.

"నాకు ఆ వ్యక్తి ఎవరో తెలియదు. అలాంటప్పుడు వారిని నా ఇంట్లోకి ఎలా రానివ్వగలను?" అని సుష్మ ప్రశ్నించారు.

అంతేకాకుండా, తన వద్ద రెగ్యులర్‌గా పనిచేసే వ్యక్తి ఈ విషయం తెలిసి ఏమనుకుంటారోనని కూడా ఆమె ఆందోళన చెందారు. ఇలాంటి ప్లాట్‌ఫామ్‌ల వల్ల యజమానులకు, ఇంటిపని సహాయకులకు మధ్య ఉండే దీర్ఘకాలపు సంబంధాలు దెబ్బతింటాయేమోనన్నది ఆమె భయం.

ఈ సేవలు విస్తరిస్తున్న కొద్దీ, అవి పనిని కేటాయించే విధానాన్నే కాకుండా.. యజమాని, సహాయకురాలు ఇద్దరి అనుభవాలను కూడా మార్చేస్తున్నాయి.

మరోవైపు నోయిడాలో సీమ తన ఫోన్‌ను చూసుకుంటుండగా మరో బుకింగ్ వచ్చింది.

"ఈ పని చాలా కష్టంగా ఉంది, నేను వేరే అవకాశాల కోసం వెతుకుతున్నా. కానీ, ప్రస్తుతానికి నా పిల్లలను పోషించుకోవడానికి ఇది సహాయపడుతోంది, అందుకే కొనసాగిస్తున్నాను" అని ఆమె ముగించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)