You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'మా కుటుంబాన్ని నాశనం చేశారు', 9 మంది పోలీసులకు మరణశిక్ష కేసులో ఇంకా సమాధానాలు దొరకని ప్రశ్నలెన్నో..
- రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 7 నిమిషాలు
సాతాంకుళం కేసులో నిందితులకు కఠిన శిక్ష పడింది. అయితే, ఈ కేసు ప్రయాణంలో బాధితులకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. పోలీసులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుపై బాధితులు, కేసు కోసం పోరాడిన వారు ఏమంటున్నారు?
అసలేం జరిగింది సంక్షిప్తంగా..
తూత్తుకుడి జిల్లా సాతాంకుళానికి చెందిన వ్యాపారి జయరాజ్, ఆయన కుమారుడు బెనిక్స్‌ను 2020 జూన్ 19న కరోనా సమయంలో పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్రంగా హింసించారు. జూన్ 21న వారిద్దరినీ కోవిల్‌పట్టి సబ్ జైలుకు తరలించారు. జూన్ 22న రాత్రి 9 గంటల ప్రాంతంలో బెనిక్స్ మరణించగా, తండ్రి జయరాజ్ మరుసటి రోజు తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన పెద్దయెత్తున చర్చనీయం కావడంతో సీబీఐ విచారణకు ఆదేశాలిచ్చారు.
దీని ప్రకారం, ఈ కేసులో సాతాంకుళం పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న శ్రీధర్, సబ్ ఇన్‌స్పెక్టర్లు బాలకృష్ణన్, రఘు గణేష్, హెడ్ కానిస్టేబుల్ మురుగన్, కానిస్టేబుళ్లు సామిదురై, ముత్తురాజ్, చెల్లదురై, థామస్ ఫ్రాన్సిస్, వేలుముత్తు, పాల్‌దురై నిందితులుగా తేలారు. వీరిలో పాల్‌దురై 2020 ఆగస్టులో కరోనా కారణంగా మరణించారు. మిగిలిన వారిపై అభియోగాలు నమోదు చేసి విచారణ జరిపారు.
మదురై అదనపు సెషన్స్ కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. తొమ్మిది మంది పోలీసులను దోషులుగా నిర్ధరిస్తూ 2026 మార్చి 23న జడ్జి తీర్పు ఇచ్చారు.
ఏప్రిల్ 6న కోర్టు వీరికి శిక్షలను ఖరారు చేసింది. దీని ప్రకారం, దోషులందరికీ మరణశిక్ష, భారీ జరిమానాలు విధించారు.
బెనిక్స్ సోదరి ఏమన్నారంటే..
ఈ కేసు విచారణను ఆరు నెలల్లోపు ముగించాలని 2021 మార్చిలో మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. అయినప్పటికీ దర్యాప్తు నెమ్మదిగానే సాగింది. కేసును విచారిస్తున్న న్యాయమూర్తులు కూడా మారుతూ వచ్చారు. ఇవన్నీ తీవ్ర మానసిక వేదన కలిగించాయి. ఎట్టకేలకు విచారణ ముగిసింది, కోర్టు తీర్పు ఇచ్చింది.
తమకు న్యాయం జరిగిందని జయరాజ్ కుమార్తె, బెనిక్స్ సోదరి పెర్సీ బీబీసీతో చెప్పారు.
"మేం కేవలం కోర్టును మాత్రమే నమ్ముకున్నాం. వారు మాకు న్యాయం చేశారు. మధ్యలో న్యాయమూర్తిని నియమించకపోవడంతో విచారణ ఆలస్యమైంది, దీనివల్ల చాలా మనస్థాపానికి గురయ్యాం. . కానీ, సీబీఐ న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయవాది, మా తరపు న్యాయవాదులు అందరూ బాగా పనిచేశారు. అందరి మద్దతు ఉండటం వల్లే వీటన్నింటిని దాటుకుని వచ్చాం. వాళ్లు మా కుటుంబాన్ని నాశనం చేశారు. ఇకముందు ఇలా ఎవరికీ జరగకూడదు" అని పెర్సీ అన్నారు.
'ఇదే న్యాయం'
ఈ కేసును మొదటి నుంచి నిశితంగా గమనిస్తున్న మదురైకి చెందిన మానవ హక్కుల కార్యకర్త, 'పీపుల్స్ వాచ్' సంస్థ ప్రతినిధి హెన్రీ తిఫేన్ స్పందిస్తూ.. నిందితులకు మరణశిక్ష విధించడం తనకు సమ్మతం కాకపోయినా, ఈ కేసు తీర్పు మాత్రం అత్యంత కీలకమని పేర్కొన్నారు.
"మరణశిక్షల వల్ల నేరాలు తగ్గుతాయని లేదా నేరస్థులు మారుతారని నాకు నమ్మకం లేదు. అయితే పోలీస్ స్టేషన్లలో జరిగే చిత్రహింసలను పరిగణనలోకి తీసుకుని, కోర్టు ఒక సమగ్ర తీర్పు వెలువరించడం ఈ కేసులోని ప్రధానాంశం. సామాన్యులు నేరం చేస్తే సాధారణ శిక్ష, అదే అధికారంలో ఉన్నవారు నేరం చేస్తే అదనపు శిక్ష విధించాలని కోర్టు ఈ స్పష్టం చేసింది" అన్నారు హెన్రీ .
"ఈ కేసుతో సంబంధం ఉన్న వారందరికీ వారు చేసిన నేర తీవ్రతతో సంబంధం లేకుండా సమానమైన శిక్ష పడాలని కోర్టు భావించింది. అందుకే అందరికీ ఒకే రకమైన శిక్షను ఖరారు చేసింది. ఇలాంటి కేసులు చివరి వరకు రావడం చాలా అరుదు అనే విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ తీర్పునిచ్చారు."
"వీటన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ కేసులో తీర్పు వెలువడే సమయంలో బాధితుల కుటుంబ సభ్యులు, అంటే జయరాజ్ భార్యతో సహా అందరూ కోర్టులో మొదటి వరుసలో కూర్చుని తీర్పును విన్నారు. ఇదే నిజమైన న్యాయం. ఇలా జరగడం చాలా అరుదు" అని హెన్రీ అన్నారు.
అయితే, కేవలం ఇలా శిక్షలు విధించడం మాత్రమే సరిపోదని ఆయన అంటున్నారు.
"ఈ కేసు ప్రారంభ దశలో హైకోర్టు మదురై బెంచ్ విచారణ సందర్భంగా.. పోలీసుల మానసిక పరిస్థితి మెరుగుపరిచే కార్యక్రమానికి ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని గుర్తించారు. కాబట్టి, పోలీసుల మానసిక స్థితిని మెరుగుపరచడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ కేసు విషయానికి వస్తే దోషులకు రెట్టింపు జీవిత ఖైదు విధించి ఉండవచ్చు. వారు జైలులో ఉన్న సమయంలో వారి మానసిక స్థితిని మార్చేలా కార్యక్రమాలు అమలు చేసి ఉండవచ్చు" అని హెన్రీ అన్నారు.
'పైకోర్టులో శిక్ష తగ్గే అవకాశం'
ఈ కేసులో కఠిన శిక్ష విధించారని తమిళనాడు పోలీస్ అకాడమీ మాజీ ప్రిన్సిపల్, రిటైర్డ్ పోలీస్ సూపరింటెండెంట్ సిద్ధన్నన్ అభిప్రాయపడ్డారు.
"ఇది ఒక పాపులర్ జడ్జిమెంట్. అంటే, ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు సమాజంలో పెద్దయెత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమైతే, అది న్యాయ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. అలాంటి సమయాల్లో గరిష్ట శిక్షలు విధించే అవకాశం ఉంటుంది. ఇలాంటి కఠిన శిక్షలు విధించడం వల్ల నేరాలు తగ్గుతాయని చెప్పలేం" అని సిద్ధన్నన్ అన్నారు.
"సాధారణంగా, ఒక హత్య జరిగితే దాని వెనుక ఏదైనా బలమైన ఉద్దేశం ఉండాలి. అలా కాకుండా కోపంలో కొట్టడం వల్ల ఎవరైనా చనిపోతే, దానిని 'మర్డర్ వితౌట్ కాజ్'గా వ్యవహరిస్తారు. దానికి గరిష్టంగా 10 ఏళ్ల శిక్ష పడుతుంది. ఈ కేసులో జరిమానా కూడా చాలా ఎక్కువగా ఉంది. తమిళనాడులోనే కాదు, దేశంలోనే ఇంత భారీ జరిమానా విధించడం అత్యంత అరుదైన విషయం."
"కాపాడాల్సిన వారే భక్షకులుగా మారారని, అందుకే తక్కువ శిక్ష వేయడం ఇష్టం లేదని ఈ కేసులో న్యాయమూర్తి పేర్కొన్నారు. తమకు హత్య చేసే ఉద్దేశం లేదన్న నిందితుల వాదనను ఆయన అంగీకరించలేదు. అందుకే గరిష్ట శిక్ష విధించారు.
ఈ కేసులో నిందితులు గత గత 5 ఏళ్ల 8 నెలలుగా జైలులోనే ఉన్నారు. వారికి అసలు బెయిల్ మంజూరు కాలేదు. అత్యంత ఘోరమైన నేరస్థులకు కూడా ఏడాది, రెండేళ్లలో బెయిల్ వస్తుంది. కానీ, వీరు అరెస్ట్ అయినప్పటి నుంచి జైలులోనే ఉన్నారు. వీరు పైకోర్టులో అప్పీలు చేస్తే శిక్ష తగ్గే అవకాశముంది. అయితే, విధించిన శిక్ష పదేళ్లకు పైగా ఉంటే బెయిల్ నిరాకరిస్తారు. మూడేళ్ల తర్వాతే అప్పీలుపై విచారణ మొదలవుతుంది. అప్పటి వరకు వీరు జైలులోనే ఉంటారు" అని సిద్ధన్నన్ వివరించారు.
'సమాధానం దొరకని ప్రశ్నలెన్నో..'
అయితే, ఈ కేసులో ఇంకా కొన్ని ప్రశ్నలు మిగిలి ఉన్నాయని హెన్రీ అంటున్నారు.
"మొదటగా, తీవ్రమైన గాయాలతో ఉన్న జయరాజ్, బెనిక్స్‌లను రిమాండ్‌కు పంపాలని ఉత్తర్వులు ఇచ్చిన జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతటి భయంకరమైన గాయాలతో ఉన్నవారిని రిమాండ్ చేయడానికి మేజిస్ట్రేట్ ఎలా అనుమతించారు? వారిని వెంటనే ఆసుపత్రికి పంపించి ఉంటే, వారు ఇప్పుడు ప్రాణాలతో ఉండేవారు. ఆ మేజిస్ట్రేట్‌పై చర్య తీసుకోవాలని హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు పంపిన ఫిర్యాదులపై ఎలాంటి స్పందనా లేదు.
తర్వాత, వీరికి మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చిన వైద్యుడు. ఆయన కూడా ఇంకా సర్వీసులోనే ఉన్నారు. ఆ తర్వాత కోవిల్‌పట్టి సబ్ జైలు సూపరింటెండెంట్. అంతటి గాయాలతో వచ్చిన వారిని ఆయన తన కస్టడీలోకి ఎలా అనుమతించారో అర్థం కావడం లేదు. ఇంతటి గాయాలతో ఉన్నవారిని మేం తీసుకోలేమని చెప్పి, వెంటనే ఆసుపత్రికి పంపించి ఉంటే వారు బతికేవారు. ఇలా తీవ్రంగా గాయపడి వచ్చిన వారిని ఆసుపత్రికి పంపి కాపాడే అవకాశాలన్నింటినీ ప్రతి ఒక్కరూ వృథా చేశారు" అన్నారు హెన్రీ.
"ఆ సమయంలో సాతాంకుళం డీఎస్పీగా ఉన్న అధికారి గురించి కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటన్నింటికీ మించి, ఈ కేసును విచారించి హైకోర్టుకు రిపోర్ట్ ఇవ్వడానికి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ భారతీదాసన్ సాతాంకుళం పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు ఇద్దరు పోలీస్ అధికారులు ఆయనను బెదిరించారు.
వారిపై కూడా ఎటువంటి చర్యలు లేవు. అయితే, కేసు విచారణ జరుగుతున్నప్పుడు మేం వీటి గురించి ప్రశ్నించలేదు. దానికి కారణం, ఆ సాకుతో ఈ కేసు విచారణ ఆగిపోకూడదని భావించాం" అని హెన్రీ అన్నారు.
'పోలీస్ స్టేషన్లలో తనిఖీలు అవసరం'
ఇలాంటి మరణాలను అరికట్టాలంటే మరికొన్ని చర్యలు చేపట్టాలని రిటైర్డ్ పోలీస్ సూపరింటెండెంట్ సిద్ధన్నన్ అభిప్రాయపడ్డారు.
"పోలీసులకు తగిన అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి. కేవలం తొమ్మిది సందర్భాల్లో మాత్రమే నిందితులపై కనీస స్థాయిలో బలాన్ని ప్రయోగించవచ్చని నిబంధనలు చెబుతున్నాయి. కానీ, 80 శాతం మంది పోలీసులకు ఈ విషయం తెలియదు" అన్నారు.
"ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా చాలా తక్కువగా ఉంది. గతంలో అధికారులు తరచుగా పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు చేసేవారు. నిందితులు అక్కడ ఎందుకు ఉన్నారు, వారిని కోర్టులో ఎందుకు హాజరుపరచలేదని ప్రశ్నించేవారు. ఇప్పుడు ఆ పర్యవేక్షణ తగ్గిపోయింది. అది కూడా ఒక కారణం" అని సిద్ధన్నన్ అభిప్రాయపడ్డారు.
మదురై ఎస్ఎస్ కాలనీ కేసు..
తమిళనాడులో లాకప్ డెత్ కేసుల్లో కొన్నిమాత్రమే విచారణ ముగిసి శిక్షలు పడ్డాయి.
అందులో 2019లో మదురై ఎస్ఎస్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో జరిగిన లాకప్ డెత్ కేసు చాలా ముఖ్యమైనది. ఈ కేసులో నలుగురు పోలీసులకు శిక్ష పడింది.
2019 జనవరిలో మదురై ఎస్.ఎస్. కాలనీ పోలీసులు ఒక 17 ఏళ్ల టీనేజర్‌ను నగలు దొంగిలించారనే ఆరోపణలతో విచారణ కోసం తీసుకెళ్లారు. మూడు రోజుల పాటు జరిగిన చిత్రహింసల తర్వాత, తీవ్రగాయాలతో ఉన్న యువకుడిని మదురై ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ టీనేజర్ మరణించారు. పోస్టుమార్టం చేయకుండానే మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించడంతో, మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు.
ఈ కేసును సీబీ-సీఐడీ విచారించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో వెలువడిన తీర్పులో ఇన్‌స్పెక్టర్ ఎస్.అలెక్స్‌రాజ్, స్పెషల్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆర్.రవిచంద్రన్, హెడ్ కానిస్టేబుల్ ఎస్.రవిచంద్రన్, కానిస్టేబుల్ సి.సతీష్ కుమార్‌లకు 11 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు.
ఆధారాలను చెరిపేయడానికి సహకరించినందుకు అప్పటి ఇన్‌స్పెక్టర్ ఎం.అరుణాచలం, రిటైర్డ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు పి.కణ్ణన్, కె.ప్రేమ్ చంద్రన్‌లను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చాలని న్యాయమూర్తి ఆదేశించారు. నిష్పక్షపాత విచారణ కోసం అరుణాచలంను సస్పెండ్ చేయాలని డీజీపీని ఆదేశించారు.
ఇవే కాకుండా, యువకుడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పేర్కొన్నందుకు డాక్టర్ ఎస్. జయకుమార్‌పై, పోస్టుమార్టం నిర్వహించకుండానే మృతదేహాన్ని పోలీసులకు అప్పగించినందుకు అప్పటి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ ఏ. శ్రీలతపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వైద్య విద్యా డైరెక్టర్‌ను కోర్టు ఆదేశించింది.
ఈ కేసులో పోలీస్ శాఖ, జువైనల్ జస్టిస్ బోర్డు, వైద్య శాఖ తమ బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమయ్యాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)